రోజురోజుకు మారుతున్న దేశ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చాలామంది భారతీయ పౌరులు విదేశాల బాటపడుతున్నారు. ఇందులో సంపన్న వర్గాలు, మేధావులు, నైపుణ్యతగల వ్యక్తులు ఎక్కువగా ఉండడం గమనార్హం. దేశంలో నెలకొన్న ఆర్ధిక, రాజకీయ, సామాజిక పరిస్థితులు, పన్నుల భారం ఈ బ్రెయిన్ డ్రైన్‌కు ముఖ్య కారణాలుగా కనిపిస్తున్నాయి.
దేశంలో జీవన ప్రమాణ స్థాయి తగ్గుతున్న నేపథ్యంలో అన్ని విధాలుగా తిరోగమిస్తున్న దేశపరిస్థితిని చూస్తూ దేశంలో ఉండలేక తమ పౌరసత్వాన్ని వదులుకొని విదేశాలకు తరలిపోతున్నారు.
గడచిన ఐదు సంవత్సరాలలోనే భారత పౌరసత్వాన్ని వదులుకున్న వారి సంఖ్య తొమ్మిది లక్షలుగా ఉన్నట్టు పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానంగా విదేశీ వ్యవహరాల శాఖ సహాయమంత్రి కీర్తి వర్థన్ సింగ్ తెలియజేశారు.
పర్యవసాన సమాప్తి..
భారత పౌరసత్వాన్ని వదులుకొని విదేశాలకు వెళ్లిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. దేశంలో ఏర్పడుతున్న పరిణామాలతో ఉక్కిరిబిక్కిరవుతూ ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో చివరకు దేశాన్నే వదిలి వెళ్లాలని పౌరులు నిర్ణయించుకుంటున్నారు.
ముఖ్యంగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు 25 లక్షల మంది పౌరసత్వాన్ని వదులుకొని విదేశాలకు వెళ్లిపోయినట్టు కేంద్ర గణాంకాలు తెలియజేస్తున్నాయి.
2011- 2019 మధ్య దేశం విడిచి లక్షా ముప్ఫైవేల మంది వెళ్లిపోగా; ఈ సంఖ్య 2024 వచ్చే సరికి 2,06,378కి చేరుకుంది.
ప్రతి ఏటా అత్యధికంగా లక్షాధికారులను కోల్పోతున్న టాప్ 5 దేశాలలో భారత దేశం కూడా కొనసాగుతుంది. ప్రపంచంలోనే అత్యధిక వార్షిక వలసదారుల సంఖ్య కలిగిన దేశంగా భారత దేశం గుర్తింపు పొందింది.
నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన మొదటి 11 సంవత్సరాలలో 17 లక్షల మంది; ఆ తర్వాత మొత్తం 14 ఏండ్లలో 20 లక్షల మంది పౌరసత్వాన్ని వదులుకున్నట్లు అధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి.
ఏటా పౌరసత్వాన్ని వదులుకొని వెళ్లిపోతున్న వారి సంఖ్య ఈ విధంగా ఉంది: 2014లో 1,29,328; 2015లో 1,31,498; 2016- 1,41,603; 2017- 1,33,049; 2018- 1,34,561; 2019- 1,44,017; 2020- 85,256; 2021- 1,63,370; 2022- 2,25,620; 2023- 2,16,219; 2024లో 2,06,378 మంది ఉన్నారు.
నైపుణ్యతగల వ్యక్తులు, మేధావులు, సంపన్నులు ఈ విధంగా విదేశాలబాట పట్టడం దేశ పరిస్థితిని ప్రతిబింబిస్తుంది. ఇది చాలా ఆందోళనకరమైన దుస్థితికి నిదర్శనంగా నిలుస్తుంది. బ్రెయిన్ డ్రెయిన్ ఇలానే కొనసాగితే భారతదేశం విలువైన మానవ వనరులను కోల్పోక తప్పదు. కేంద్ర ప్రభుత్వం భావోద్వేగపూరిత విషయాలకు ప్రాధాన్యతనిస్తూ అసలు సమస్యలను పట్టించుకోకపోవడమే దీనికి మరో కారణమని పలువురు సామాజిక విశ్లేషకులు భావిస్తున్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
