తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తామూ కీలకమవుతామనే సంకేతాలను పవన్ కళ్యాణ్ ఇస్తున్నారు. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన నాయకులు అంటున్నారు.
పోటీ చేయడాన్ని ఎవరూ అడ్డుకోరు, అభ్యంతరమూ చెప్పరు. సినిమా నటుడిగా ఆయనకు ఇక్కడ చాలా మంది అభిమానులున్నారు.
ఆయన రాజకీయ విధానాలతో విభేదించే వారూ ఉన్నారు. అంతకు మించి తెలంగాణ ఆత్మగౌరవం, అస్థిత్వాన్ని అవమానించారని ఆయనపై ఆగ్రహిస్తున్న వారూ ఉన్నారు.
ఇట్లా ఆగ్రహిస్తున్న వారి ప్రశ్నలకే పవన్ కళ్యాణ్ ఇప్పుడు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జనసేన తెలంగాణలో పోటీ చేస్తుందనే విషయం మీడియాలో రాగానే, తెలంగాణ ఉద్యమకారుల నుంచి అభ్యంతర స్వరాలు వినవస్తున్నాయి.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఉన్నది. ఆ కూటమి ఫార్మూలాను తెలంగాణలో రిపీట్ చేయజూస్తున్నారని చాలా మంది అనుకుంటున్నారు.
బీజేపీ నాయకులు మాత్రం ఈ సూత్రానికి ససేమిరా ఒప్పుకోబోమని చెప్తున్నట్టు మీడియాలో వార్తలొస్తున్నాయి.
కానీ కూటమిలోని భాగస్వామ్య పక్షాలు ఇక్కడ తమ ఉనికిని చాటుకోవాలని బలంగా ఆకాంక్షిస్తున్నాయి.
గమనంలో ఉంచుకోవాల్సిన విషయం
మనదేశంలో ఏ పార్టీ అయినా, ఎక్కడ నుంచైనా పోటీ చేయొచ్చు. ఆ అవకాశం మన రాజ్యంగం ఇచ్చింది. దీన్ని ఎవ్వరూ కాదనలేరు.
ఉత్తర భారతదేశానికి చెందిన పార్టీల రాష్ట్ర శాఖలు తెలంగాణలో ఉన్నాయి. బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాది పార్టీ, ఆర్ఎల్డీ వంటివి; ఈ పార్టీల విషయంలో వ్యక్తం కానీ అభ్యంతరాలు సీమాంధ్ర నాయకత్వ పార్టీలపై వ్యక్తం అవుతున్నాయి.
తెలంగాణ ఉద్యమ సందర్భంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నాటి కేంద్ర ప్రభుత్వం ప్రకటన తర్వాత సీమాంధ్ర నాయకత్వంలోని పార్టీలు మాట మార్చాయి.
అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా యూటర్న్ తీసుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా వ్యవహరించాయి.
ఈ విషయాన్నే ఇప్పుడు నాటి ఉద్యమకారులు గుర్తు చేసుకుంటున్నారు.
తెలుగుదేశం, ప్రజారాజ్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు సమైక్య వాదాన్ని ఎత్తుకున్నాయి. ఈ నిర్ణయం పట్ల తెలంగాణ సమాజం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆవేదనను వ్యక్తీకరించింది.
పదేపదే అక్కసు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల తాను ఏడ్చానని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల తీవ్రంగా కలత చెంది పదకొండు రోజులు పస్తులున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
ఒకవైపు తెలంగాణను తన ఆత్మ అంటూనే మరోవైపు జనసేన సభలలో, వారాహి యాత్రలలో ఏదో విధంగా తెలంగాణ మీద విషాన్ని పవన్ చిమ్ముతూనే ఉంటారని; తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానిస్తూ, వారి ఆకాంక్షలను గుర్తించ నిరాకరించే వారు, తెలంగాణ ప్రజల మీద విషాన్ని చిమ్మే వారు తమ రాష్ట్రంలో పోటీ ఎట్లా చేస్తారని ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారు.
ఈ మధ్య జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వారి దిష్టి తగిలి కోస్తాలో కొబ్బరి చెట్లు ఎండిపోయానని అన్నారు. ఇది ముమ్మాటికీ తెలంగాణ ప్రజలను అవమానించాడమే అవుతుందని చాలా మంది భావిస్తున్నారు.
“తెలంగాణ సమాజం మీద అమితమైన ప్రేమను చూపించినట్టే చూపిస్తూ ధృతరాష్ట్రుడిలా పవన్ కళ్యాణ్ ప్రవర్తిస్తారు. ధృతరాష్ట్ర కౌగిలిని గుర్తించలేనంత అమాయకులు తెలంగాణ ప్రజలు కాదు. అంతేకాకుండా, తెలంగాణలో కొండగట్టు అంజన్నకు మొక్కతారు. ఇక్కడి వారిని దారుణాతిదారుణంగా అవమానిస్తారు. ఇదేం వైఖరి?” అంటూ తెలంగాణ సమాజం నుంచి వ్యక్తమవుతున్న ప్రశ్న. దీనికి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తాను వీర తెలంగాణ గురించి గర్విస్తానని కూడా గతంలో అన్నారు. ఇక్కడి ప్రజల సమస్యలపై ఆయన ఎన్నడూ మాట్లాడలేదు. తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుంటారని కూడా అన్నారు. అంతటి స్ఫూర్తినిచ్చిన ప్రజల ఆత్మగౌరవాన్ని ఆయన ఏ మాత్రం గౌరవించడం లేదు.
ఏపీలో ఉన్న కూటమి పార్టీలకు తెలంగాణ ప్రజల ఆకాంక్షల పట్ల ఏ మాత్రం గౌరవం లేదని కూడా ఇక్కడి ప్రజలు అనుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై స్పందిస్తూ– తల్లి చనిపోయిందని, పిల్ల బతికిందని ప్రధాని మోదీ అన్నారు. ఒక ప్రధాన మంత్రి స్థానంలో ఉన్న వారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని నాటి ఉద్యమ సమాజం అస్సలు జీర్ణించుకోలేదు. పైగా తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి, మలి సాధారణ ఎన్నికల్లో ఈ విషయం రూడీ అయ్యింది.
దేశ ప్రయోజనాల దృష్ట్యా బీజేపీకి ఇక్కడి ప్రజలు మోగ్గు చూపించారు. కానీ అసెంబ్లీ ఎన్నికల సందర్బంలో తొలుత టీఆర్ఎస్, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. కానీ బీజేపీ వైపు మాత్రం మొగ్గుచూపలేదు.
బీజేపీ నాయకులకు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఈ ప్రాంత అస్థిత్వాలు, ప్రత్యేకతల పట్ల సరైన అవగాహన లేదని నాటి ఉద్యమకారులు అంటూ ఉంటారు.
తెలంగాణ ఉద్యమానికి బీజేపీ కూడా మద్దతునిచ్చింది. సుష్మాస్వరాజ్, రాజ్ నాథ్ సింగ్ వంటి వారు తెలంగాణ ఉద్యమాన్ని బలపర్చారు. తాము అండగా ఉంటామన్నారు, ఉన్నారు కూడా. కానీ, ఆ తర్వాత వచ్చిన అధినాయకత్వం చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల భావోద్వేగాలను గాయపర్చాయి. అందువల్లనే బీజేపీకి అనుకున్న స్థాయిలో ఓట్లు, సీట్లు రావడం లేదని రాజకీయ పండితుల విశ్లేషణ.
ప్రశ్నలు– డిమాండ్లు
ఏపీ రాజకీయాల్లోని ఎన్డీఏ కూటమిలో భాగస్వామైనా జనసేన తెలంగాణలో పోటీ చేస్తామని చెప్పిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌కు కొన్ని ప్రశ్నలు వేస్తోంది తెలంగాణ సమాజం.
తెలంగాణలో ఎవరి ప్రయోజనాల కోసం జనసేన ఇక్కడ పోటీ చేస్తుందో చెప్పాలని అడుగుతున్నారు. అంతేకాదు, ఇక్కడి ప్రజలను అవమానించినిందుకు క్షమాపణలు చెప్పాలనీ డిమాండ్ చేస్తున్నారు.
చంద్రబాబు నాయడు విషయంలో కూడా ఇదే తరహా ప్రశ్నలు ఇక్కడి నుంచి వస్తున్నాయి. కాబట్టి జనసేన, తెలుగుదేశం పార్టీలు తమ వైఖరులను స్పష్టం చేయాల్సి ఉందని ఉద్యమకారులు అడుగుతున్నారు.
తెలంగాణలో పోటీ చేయొచ్చు, రాజకీయ భావాజాలన్ని ప్రచారం చేసుకోవచ్చు. కానీ ఇక్కడి వారి ఆత్మగౌరవాన్ని, ఇక్కడి ప్రజల ప్రయోజాలను గౌరవిస్తామనే హామీని కూడా ఆశిస్తున్నామని తెలంగాణ ఉద్యమకారులు చెప్తున్న మాట. వేస్తున్న ప్రశ్న కూడా. వీటికి బదులు ఇవ్వాల్సిన బాధ్యత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైనే ఉన్నది. ఆయన ఎట్లా స్పందిస్తారో చూడాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
