
తెలంగాణలో రైతుల పరిస్థితి నేడు మళ్ళీ నాటి ఉద్యమాలను గుర్తు చేస్తోంది. పచ్చని పొలాల్లో పంటలు వాడిపోతూ ఉంటే, రైతులు మాత్రం యూరియా కోసం లైన్లలో నిలబడి లాఠీ దెబ్బలు తింటున్నారు. స్వతంత్ర దేశంలో, స్వీయ పాలన కలిగిన రాష్ట్రంలో రైతులు ఈ స్థితికి చేరడం ఎంత అవమానకరమో!
ఎన్నికల ముందు ప్రజల ఇళ్ల వద్దకు వచ్చి “మేమున్నాం రైతుల కోసం” అంటూ ప్రగాల్భాలు పలికిన నాయకులు నేడు ఎక్కడున్నారు? కుర్చీలెక్కిన తర్వాత ఈ రైతు బిడ్డల గోసలు కనపడవా? పల్లెల మట్టిని ముద్దాడిన రైతుల చెమట వాసన ఈ మంత్రులకు కనిపించడం లేదా?
జవాబుదారీతనం ఏది?
కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఉన్న ప్రభుత్వాలు జవాబు చెప్పాలి. రైతాంగం కేంద్రానికి జీఎస్టీ కడుతోంది, పన్నులు కడుతోంది. కానీ రైతుల కోసం అవసరమైన యూరియా ఎరువుల సరఫరా ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు రైతుల ఆవేదనను పట్టించుకోవడం లేదు? ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, రైతాంగానికి చేసిన న్యాయాన్ని త్రోసి వేయడం.
నాడు తెలంగాణ మలిదశ ఉద్యమంలో రైతులు ప్రాణాలపణంగా పెట్టి పోరాడారు. ఈ రోజు అదే రైతుల వారసులు, స్వతంత్ర తెలంగాణలో యూరియా కోసం బారులు తీరడం ఎంత దురదృష్టకరమో! నాడు కట్టుబడి పోరాడిన రైతు గడ్డ నేడు అవమానానికి గురవుతోంది.
ప్రభుత్వాలు రైతుల పేరిట సమీక్షలు నిర్వహిస్తాయి, సంబరాలు జరుపుతాయి, కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాయి. కానీ ఆడంబరాల వెనక రైతు గోసలు ఎందుకు కనబడవు? పచ్చటి పొలాల్లో పండిన పంటలకు అండగా ఉండాల్సిన పాలకులు ఎందుకు మౌనం వహిస్తున్నారు? రైతు చెబుతున్న ఈ ఆవేదన వినిపించకపోతే, చరిత్ర క్షమించదు.
రైతులు కేవలం పంటలు పండించే వారు కాదు. వారు ఈ దేశానికి అన్నదాతలు. ఎండ, వాన, ఉష్ణం తేడా లేకుండా పగలు, రాత్రి కష్టపడతారు. వారి చెమటతో ఈ దేశం నిలుస్తుంది. కానీ ఈ రోజు వారి కష్టానికి ఫలితం ఇలా అవమానంగా మారుతుంటే, రేపు ఈ గడ్డ తిరిగి చరిత్ర సృష్టిస్తుంది.
“మా బురదలోని మట్టి వాసన రేపు మీకు చెబుతుంది, మా పచ్చని చెట్లలో కమ్మటి గాలి మీ మీద ఉప్పెనలాగా పడుతుంది” – ఇది కేవలం కవిత కాదు, హెచ్చరిక. రైతులను పట్టించుకోని ప్రభుత్వానికి ఇది గుణపాఠం అవుతుంది.
ఇప్పటికైనా ఎరువుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. రైతులను కాపాడాలి. వారి కష్టానికి న్యాయం చేయాలి. లేదంటే రేపటి చరిత్ర ఈ ప్రభుత్వాలను ఎప్పటికీ క్షమించదు. తెలంగాణ రైతాంగం మళ్ళీ చరిత్ర సృష్టించడానికి వెనుకాడదు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.