గత మూడు దశాబ్దాలుగా విద్యారంగంలో వచ్చిన మార్పులు, వాటి పర్యవసనాల చేదు అనుభవాలు ప్రత్యేక తెలంగాణ ఉద్యమకాలంలో విద్యా సంస్కరణలపై చర్చకు దారితీశాయి. పుట్టుకతో, ఆర్థిక, సామాజిక స్థాయిలతో సంబంధం లేకుండా అందరికీ కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన సమానమైన విద్య అందించబడాలనే కోరిక బలంగా వ్యక్తీకరించబడింది. దానికి అనుగుణంగానే అప్పటి ఉద్యమనాయకులు స్పందించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఆశయ సాధన జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ, అది విఫలంకావడంతో విద్యారంగం ఇంకా అధ్వాన్న స్థితిలోకి మారింది.
తెలంగాణలో కుల, మత ప్రాతిపదికన విద్యా సంస్థల విభజన ఎక్కువయింది. యూనివర్సిటీల ప్రైవేటీకరణ విస్తరించింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వనరులు, విద్యా బడ్జెట్, పాఠశాల విద్యలో పర్యవేక్షణ పోస్టులు, ఉపాధ్యాయ విద్య, యూనివర్సిటీ విద్యలో టీచర్ల భర్తీ తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. విద్యా వ్యవస్థ మొత్తం సంక్షోభ స్థితిలోకి నెట్టబడింది.
ఈ నేపథ్యంలో 2024 సెప్టెంబర్‌లో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ విద్యా కమిషన్(టీఈసీ) ఏర్పాటు చేసినప్పుడు; రాష్ట్రంలో విద్యా సంస్కరణలకు కొత్త దారిని రూపొందించేందుకు ఇది ధైర్యవంతమైన గొప్ప చర్యగా భావించబడింది.
లక్ష్యం నెరవేరుతుందా..!
ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు నాణ్యమైన విద్య కోసం సమగ్ర రోడ్ మ్యాప్ రూపొందించాలన్న తెలంగాణ విద్యా కమిషన్ లక్ష్యం విస్తృత ఆశయాన్ని ప్రతిబింబించింది. కొత్త ఆశలు రెక్కలు తొడిగాయి, విద్యా కమిషన్ చాలా శ్రమకోర్చి పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి ప్లస్ టు స్థాయి వరకు శ్రేష్టమైన విద్యకోసం తీసుకురావాల్సిన మార్పులను సూచిస్తూ నివేదిక సమర్పించింది. ఫీజుల నియంత్రణకు సంబంధించి నివేదిక సమర్పించింది. అయిదేళ్ళ ప్రణాళికను ఖచ్చితమైన బడ్జెట్ అంచనాలతో నివేదికను రూపొందించింది. కానీ ప్రభుత్వం ఆ నివేదికతో సంబంధం లేకుండానే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ప్రారంభించింది.
విద్యా కమిషన్ ఇంకా ఉన్నత విద్య, ఒకేషనల్, టెక్నికల్ విద్యకు సంబందించిన అంశాలపై చర్చలు, నివేదికలు పూర్తి చేయలేదు. అన్ని విషయాలతో సమగ్ర నివేదిక కూడా తయారుకాలేదు. ఈ లోపే ప్రభుత్వం గత నెలలో తెలంగాణ విద్యా విధానం(టీఈపీ) రూపొందించడానికి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్‌ను రూపొందించారు
ఈ ప్రక్రియను అంతా పరిశీలించినప్పుడు, విద్యా కమిషన్‌లో నిర్మాణ సంబంధ లోపాలు, విద్యా విధాన రూపకల్పన ప్రక్రియకు సంబంధించిన లోపాలు స్పష్టంగా కనబడుతున్నాయి. దీంతో ఈ సంస్కరణల లక్ష్యం నెరవేరుతుందానే అనుమానం కలుగుతుంది.
స్థాయిని తగ్గించే చర్య..
విద్యా కమిషన్ విస్తృత పరిధిలో పనిచేయవలసి వచ్చినపుడు దాని ఏర్పాటు చాలా ఉపకమిటీలతో కూడుకొని ఉంటుంది. ఒక్కో అంశం మీద ఒక్కో ఉపకమిటీ పనిచేస్తుంది. అన్ని ఉపకమిటీలు చేసిన చర్చల సారాంశాన్ని క్రోడీకరించి సమగ్ర నివేదికను కమిషన్ నివేదిస్తుంది. ఈ కమిషన్ నివేదికలోని ప్రతిపాదనల ప్రాతిపదికగా విద్యా విధాన రూప కల్పన జరుగుతుంది. ఈ విధాన రూపకల్పనకు మళ్ళీ ప్రత్యేక కమిటీని నియమించవచ్చు. అయితే ఈ మొత్తం ప్రక్రియ విద్యా కమిషన్ పర్యవేక్షణలో జరగాలి. ఇది సాధారణంగా జరిగే పద్ధతి.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అకునూరి మురళి నేతృత్వంలో ఏర్పాటైన ప్రస్తుత తెలంగాణ విద్యా కమిషన్‌లో కేవలం ఒక చైర్మన్, ముగ్గురు సభ్యులు మాత్రమే ఉన్నారు. ఎటువంటి విద్యా రంగ- నిర్దిష్ట ఉపకమిటీలు లేవు. తెలంగాణ విద్యా విధాన(టీఈపీ) రూపకల్పనకు నియమించబడిన పాలసీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్, పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య, కళాశాల, సాంకేతిక, ఉన్నత విద్య కమిషనర్ల డైరెక్టర్ల నేతృత్వంలో పనిచేస్తుంది. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఈ కమీషన్లో కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఇందులో 11 ఫోకస్ గ్రూపులను ఏర్పాటు చేశారు. ఆశ్చర్యంగా విద్యా కమిషన్ కమిషన్ చైర్మన్‌ను ఒక ఫోకస్ గ్రూప్‌కు కన్వీనర్‌గా నియమించారు. ఇది కమిషన్ స్థాయిని తగ్గించే చర్య అవుతుంది.
ఈ విషయాలన్నీ జాతీయ లేదా రాష్ట్ర స్థాయిలో గతంలో నియమించబడిన విద్యా కమిషన్లకు భిన్నంగా ఉన్నాయి. కోఠారి కమిషన్(1964–66) 12 టాస్క్ ఫోర్సులు, 7 వర్కింగ్ గ్రూపులతో పనిచేసింది; కర్ణాటక విద్యా కమిషన్(2023) పాఠశాల, ఉన్నత & సాంకేతిక విద్యపై 30 థీమ్ ఆధారిత టాస్క్ ఫోర్సులను ఏర్పాటు చేసింది; తమిళనాడు విద్యా విధాన కమిటీ(2022) 12 మంది సభ్యులతో ఉన్నత స్థాయి ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. తెలంగాణ విద్యా కమిషన్ మాత్రం ముగ్గురు సభ్యులకే పరిమితమయింది.
విస్తృత స్థాయిలో ఉపకమిటీలు లేనప్పుడు విద్యా కమిషన్ పాత్ర మార్గదర్శనం చేసేదిగా కాకుండా కేవలం సలహాదారు పాత్రకే పరిమితమయ్యే ప్రమాదం ఉంటుంది. మధ్యాహ్న భోజనాలు, ప్రైవేట్ పాఠశాల ఫీజు నియంత్రణ, బోధనా మాధ్యమం, ఉపాధ్యాయ విద్య లాంటి కొన్ని థీమాటిక్ పేపర్లను మాత్రమే ఇప్పటివరకు టీఈసీ విడుదల చేసింది. సమగ్ర రిపోర్ట్ రూపొందించలేదు.
టీఈసీ సమగ్ర నివేదిక పూర్తికాకముందే, పాఠశాల విద్యా శాఖ 2025 అక్టోబరులో తెలంగాణ విద్యా విధానం(టీఈపీ) రూపొందించడానికి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్‌ను రూపొందించారు. దీని కింద 11 ఫోకస్ గ్రూపులను ఏర్పాటు చేయబడ్డాయి. ప్రతి గ్రూపుకు కన్వీనర్, కో కన్వీనర్, నలుగురు సభ్యులు, ఎన్జీఓ భాగస్వాములు ఉన్నారు. ఇరవైకి పైగా ఎన్జీఓలను భాగస్వాములను చేశారు. వీటిలో కొన్ని ఎన్జీఓల విద్యా సేవల గురించే మనం విని ఉన్నాము. మిగతా సంస్థల భాగస్వామ్యం గురించి పెద్దగా తెలియదు. కానీ పెద్ద సంఖ్యలో వీటికి భాగస్వామ్యం ఇచ్చారు.
లోపాలు- బలహీనతలు.. పరిష్కారం..
విద్యా పాలసీని రూపొందించడానికి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ నియామకానికి సంబంధించిన ప్రభుత్వ మెమో(No.3338/TEP/SCERT/TG/2025)లో విద్యా కమిషన్ పని గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. టీఈసీ, టీఈపీ మధ్య సమన్వయం గురించి, టైమ్‌లైన్ గురించి ప్రస్తావన లేదు. ఇది విధాన ప్రక్రియలోని లోపాన్ని సూచిస్తుంది. కమిషన్ నివేదిక ఫోకస్ గ్రూపులకు ఆధారంగా ఉండాలి. కానీ ఇక్కడ అలా జరుగుతున్నట్టు ఎలాంటి ఆధారాలు లేవు.
టీఈసీ చైర్మన్ అకునూరి మురళిని ‘ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆనందకరమైన విద్యా వాతావరణం’ ఫోకస్ గ్రూప్ కన్వీనర్‌గా నియమించడం గందరగోళాన్ని కలిగించింది. ఇది ఆయన నైపుణ్యాన్ని వినియోగించాలన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని ప్రతిబింబించినా; ఇది సంస్థల మధ్య సరిహద్దులను మసకబార్చి, విద్యా కమిషన్ స్వతంత్రతను తగ్గిస్తుంది. కమిషన్ చైర్మన్ ఒక వ్యూహాత్మక పర్యవేక్షకుడిగా వ్యవహరించాలి. కానీ ఇక్కడ ఆయన విద్యా పాలసీని రూపొందించడానికి ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిటుకు జవాబుదారీగా మారారు.
“సమర్థవంతమైన కమిషన్లకు సమగ్ర సభ్యత్వం, థీమాటిక్ విభజన, అమలు సంస్థల నుంచి సంపూర్ణ స్వతంత్రత అవసరం” అనిUNESCO హెచ్చరిస్తుంది. కానీ విద్యా కమిషన్ నిర్మాణ పరిమితులు, అది నిర్వహించవలసిన పాత్ర విషయంలో జరిగిన పొరపాట్లు విద్యా విధాన రూపకల్పన ప్రక్రియ బలహీనతను సూచిస్తున్నాయి
టీఈపీ ప్రక్రియను సవ్యంగా తీర్చిదిద్దేందుకు మూడు ప్రధాన దిశలలో మార్పులు అవసరము. మొదటగా, సంస్థల సమన్వయాన్ని మెరుగుపరచాలి. టీఈపీ ఫోకస్ గ్రూపులు టీఈసీ సిఫార్సులతో అనుసంధానించబడాలి. తెలంగాణ విద్యా కమిషన్ కు పూర్తి పర్యవేక్షణ అధికారాన్ని ఇవ్వాలి. రెండవది, తెలంగాణ విద్యా కమిషన్‌ను కొత్త రూపంలో తీర్చిదిద్ది, ఉన్నత విద్య, ఉపాధ్యాయ విద్య, వొకేషనల్, టెక్నికల్ విద్య, పాలన సంస్కరణలలాంటి అంశాలపై ప్రత్యేక ఉపకమిటీలు ఏర్పాటు చేయాలి.
చివరిగా, “తెలంగాణ విద్యా సంస్కరణపై గ్రీన్ పేపర్”ను ప్రచురించి, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, పౌర సమాజం నుంచి అభిప్రాయాలు కోరాలి. తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ తన లక్ష్యాన్ని నెరవేర్చాలంటే, అది తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిటుకు మార్గదర్శిగా ఉండాలి కానీ దానికి జవాబుదారిగా మారకూడదు.
(వ్యాస రచయిత హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ సొసైటీ ఫర్ ఛేంజ్ ఇన్ ఎడ్యుకేషన్ సంస్థకు ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్నారు.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
