అధికారం అందినదని సంబరాలు చేసుకోవడం కాదు- ఆ అధికారం ఎవరి కోసం, ఎందుకోసం వినియోగిస్తున్నారన్నదే అసలైన ప్రశ్న.
రాష్ట్రంలో ప్రస్తుతం కనిపిస్తున్నది ప్రజాస్వామ్య పాలన కాదు, ప్రజల కోసం కాకుండా ప్రజల మీద ప్రయోగంగా మారిన పాలన. “ప్రజాకర్షక వాగ్దానాల” మాటున సాగుతున్న “వంచన పర్వం”నే మనం చూస్తున్నాం.
గద్దెనెక్కక ముందు ఒకలా, గద్దెనెక్కాక మరొకలా ప్రవర్తించే నైజం చూస్తుంటే- ఇది రాజకీయం కాదని అర్థమవుతుంది.
ప్రజల ఆశలతో ఆడుకుంటున్న జూదమని స్పష్టమవుతోంది.
ఒక్కమాటలో “ఏం సాధించారని ఈ ఆర్బాటాలు?” అని పాలకులను ప్రశ్నిస్తే; సమాధానం శూన్యం, ప్రజలకు మిగిలింది విషాదమని తెలుస్తుంది.
గర్జనలకు మౌనం – వాగ్దానాల వైఫల్యం
కాంగ్రెస్ పార్టీకి వేసే ప్రశ్న ఏమంటే, అధికారం చేపట్టక ముందు వీధుల్లో- సభల్లో వినిపించిన కంఠశోష, తొడగొట్టి సవాల్ చేసిన ఆవేశం ఇప్పుడు ఏమయ్యింది? నాడు ఉవ్వెత్తున ఎగిసిన హామీల అలలు, నేడు అధికార తీరం చేరాక నీటి మూటలుగా మిగిలిపోయాయి.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ప్రణాళికలు, మేనిఫెస్టోలు కేవలం ఓట్ల వేటలో విసిరిన వలలే తప్ప, ఆచరణలో చిత్తశుద్ధి లేని చిత్తు కాగితాలని తేలిపోయింది.
“చేస్తాం.. చూస్తాం..” అనే దాటవేత ధోరణే తప్ప, క్షేత్రస్థాయిలో అమలవుతున్న దాఖలాలు లేవు.
అంకెల గారడీ– బడ్జెట్ బూటకం
లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అంకెలు వినడానికి గొప్పగా ఉన్నాయి. కానీ, ఆ సంపద సామాన్యుడికి చేరుతోందా? బడ్జెట్ పుస్తకాల్లో ఉన్న ఆడంబరం, ప్రజల బతుకుల్లో కనిపించడం లేదు.
కేటాయింపులు ఘనంగా ఉన్నా, విడుదల మాత్రం శూన్యం. ఇది ప్రజల కళ్లకు గంతలు కట్టి, అంకెలతో చేస్తున్న గారడీ తప్ప మరొకటి కాదు.
నిధులున్నాయి కానీ ప్రజలకు అందవు, పథకాలున్నాయి కానీ ప్రయోజనం ఉండదు. ఇదేకదా ఈ ప్రజా పాలన?
ప్రభుత్వమా లేక రియల్ ఎస్టేట్ బ్రోకరా?
ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తి. భూమి పోతే ప్రజలు పోతారు, ప్రజలు పోతే ప్రజాస్వామ్యం పోతుంది. కానీ, ప్రస్తుతం ప్రభుత్వమే అధికారికంగా భూకబ్జాలకు తెగబడుతున్న దారుణ స్థితి కనిపిస్తోంది. పేదల భూములను లాక్కొని, అభివృద్ధి ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం ఎంతవరకు సమంజసం? లక్షలాది ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు, బడా కార్పొరేట్లకు అడ్డికి పావుశేరు కింద కట్టబెడుతూ- అందులో మంత్రిమండలి వాటాలు పంచుకోవడం చూస్తుంటే, రాష్ట్రాన్ని పాలకులు పాలిస్తున్నారా లేక పంచుకు తింటున్నారా అనే అనుమానం కలుగుతుంది. ఇది ముమ్మాటికీ భూ దోపిడీనే.
విద్యా విధ్వంసం అవుతుంది – గురుకులాలు ఘోషిస్తున్నాయి
ఏ సమాజానికైనా విద్యే వెన్నముక. కానీ, ఈ రెండేళ్లలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారు.
దేశంలోనే అత్యధికంగా 2,000 ప్రభుత్వ పాఠశాలలు మూసివేత జాబితాలో తెలంగాణ ఉండటం సిగ్గుచేటు.
ఇది ముఖ్యమంత్రికి, విద్యాశాఖకు ఉన్న అంకితభావ లేమికి నిదర్శనం కాదా?
గురుకులాల్లో 100 మందికి పైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోతుంటే, ఆ మరణాలు పాలకుల గుండెలను కరిగించడం లేదు.
గురుకులాల నిర్వహణలో ప్రిన్సిపాళ్లు చేస్తున్న లక్షల రూపాయల అవినీతిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైంది.
ఈ విధానం విద్యార్థుల భవిష్యత్తును ఖూనీ చేయడమే.
నిరుద్యోగ నిట్టూర్పులు – ఉద్యోగుల వెతలు
నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు నీటి మీద రాతలే అయ్యాయి. నిరుద్యోగ భృతి లేనేలేదు.
అదే కాదు ఏ ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దయనీయం. పీఆర్సీ లేదు, డీఏ లేదు. హక్కుల కోసం అడిగితే అణచివేత తప్ప ఆదరణ లేదు.
ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను ఇంతలా నిర్లక్ష్యం చేయడం ప్రభుత్వ అహంకారానికి పరాకాష్ట.
సామాజిక న్యాయమా? సామాజిక వంచనా?
కుల వృత్తుల పేరుతో చేసిన వాగ్దానాలన్నీ వట్టి భూటకాలని తేలిపోయాయి.
చేతివృత్తుల వారిని ఓటు బ్యాంకుగానే చూశారు తప్ప, వారి బతుకుల్లో వెలుగులు నింపలేదు. ఇక మహిళా సాధికారత గురించి మాట్లాడే నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. సామాజిక, ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకోకుండా, ఎన్నికల ముందు చీరలు పంచి చేతులు దులుపుకోవడం మహిళలను అవమానించడమే.
రిజర్వేషన్ల రణరంగం – దగాపడ్డ బడుగులు
బీసీ, దళిత, మహిళా రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు “నమ్మించి గొంతు కోయడమే”.
స్థానిక సంస్థల్లో 42% మాట దేవుడెరుగు. కనీసం గతంలో ఉన్న 23% కూడా అమలు చేయకుండా, 17% విదిల్చి బీసీల రాజకీయ ఉనికిని దెబ్బతీశారు. సమస్యను పరిష్కరించాల్సింది పోయి, కమిటీల పేరుతో కాలయాపన చేయడం ద్రోహం.
పార్లమెంటులో తెలంగాణ ఎంపీలు, కాంగ్రెస్ నాయకులు బీసీల పట్ల అనుసరిస్తున్న వైఖరి వారి ద్వంద్వ నీతిని బయటపెట్టింది. జంతర్‌మంతర్ వద్ద ధర్నాలు చేయడం కాదు, చట్టసభల్లో గళమెత్తాలి. కానీ అక్కడ మౌనం, ఇక్కడ నాటకం.
ఇక ఎస్సీల వర్గీకరణ, క్రీమీలేయర్ విషయంలో సుప్రీంకోర్టు ద్వారా కేంద్రం పావులు కదుపుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపకపోవడం; అభివృద్ధి ఫలాలు అందని దళితుల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధిని శంకిస్తోంది.
పెట్టుబడుల పేరిట పరాధీనం– జల దోపిడీ
తెలంగాణ సంపదను, వనరులను విదేశీ పెట్టుబడిదారులకు ధారాదత్తం చేయడమే పనిగా పెట్టుకున్నారు. ‘సమ్మెట్’ల పేరుతో రాష్ట్ర స్వయం గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు. మరోవైపు, కృష్ణా, గోదావరి జలాలను ఆంధ్రా వలస పాలకులు, కాంట్రాక్టర్లు ఎత్తుకుపోతుంటే అడ్డుకునే నాథుడే లేడు. మన నీళ్లు పక్క రాష్ట్రానికి తరలిపోతుంటే చూస్తూ ఊరుకోవడం అసమర్థత కాదా?
రైతు భరోసా రెండేళ్లలో రెండు సార్లు మాత్రమే విదిల్చారు. సంపూర్ణ రుణమాఫీ చేస్తామని చెప్పి, అరకొర మాఫీతో సరిపెట్టారు. అన్నదాతను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రైతుకు కనీస మద్దతు ధరను కల్పించలేకపోయింది. రైతును రాజును చేస్తామన్న మాటలు కోటలు దాటుతున్నాయి కానీ, కనీసం పెట్టుబడి సాయం కూడా గడప దాటడం లేదు.
ఇది మౌనం కాదు – విప్లవానికి నాంది కావాలి
తెలంగాణ సమాజం ఇప్పుడు మౌనం వహించరాదు. ఇది విన్నవించుకునే సమయం కాదు, ఎదురుతిరగాల్సిన సమయం. ఈ దోపిడీకి వ్యతిరేకంగా సంఘటిత పోరాటం తప్ప ఇంకో మార్గం లేదు. ఒకటా రెండా, చెప్పుకుంటూ పోతే ఇది “శాట భారతమే”. పాలకులు వల్లించేవన్నీ “ఫోర్ ట్వంటీ” మాటలే.
ఈ పరిస్థితులను మౌనంగా భరించడం అంటే మన భవిష్యత్తును మనమే సమాధి చేసుకోవడం. ఇది కేవలం విమర్శ కాదు, ఇది ఒక హెచ్చరిక.
తెలంగాణ ప్రజలారా, ప్రశ్నించడం మన నెత్తురులో ఉంది. అధికారం ప్రజల సేవ కోసం తప్ప, పాలకుల భోగభాగ్యాల కోసం కాదు. మన హక్కుల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, ఈ అరాచక మోసపూరిత విధానాలపై పోరాటమే మన ఊపిరి, ప్రశ్నించడమే మన ఆయుధం. ఈ మాయాజాలాన్ని ఛేదించి, నిజమైన ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకునే వరకు విశ్రమించవద్దు.
పాపని నాగరాజు
సత్యశోధక మహాసభ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
