ఒకటి నుంచి ఎనిమిది తరగతుల వరకు బోధించే ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులంతా రెండేళ్లలోపు తప్పనిసరిగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఉత్తీర్ణులు కావాలని సుప్రీం కోర్టు తెలియజేసింది.
లేకపోతే ఉద్యోగ కొనసాగింపు లేదా పదోన్నతి లభించదని స్పష్టం చేసింది.
ఈ వ్యాఖ్యలు అంజుమన్ ఇషాత్-ఏ- తాలీమ్ ట్రస్ట్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు తీర్పు సమయంలో వెలువడ్డాయి.
ఈ తీర్పు విద్యకు సంబంధించిన పాత చర్చను మళ్లీ తెరపైకి తెచ్చింది. నాణ్యత నియంత్రణ చర్యగా ఈ తీర్పును కోర్టు సమర్థించుకుంది.
ఆర్టీఈ చట్టం- 2009లోని సెక్షన్ 23 ప్రకారం, టెట్ ఒక చట్టబద్ధమైన అర్హత అని వ్యాఖ్యానించింది.
చట్టపరంగా ఈ తీర్పు కొంత వరకు సమర్థనీయంగా కనిపిస్తోంది. అయినా- “ఉపాధ్యాయ నాణ్యత”ను ఎలా అర్థం చేసుకుంటున్నాం, ఎలా సాధించాలనుకుంటున్నామనే లోతైన ప్రశ్నలను లేవనెత్తుతుంది.
బోధన వంటి సంక్లిష్టమైన వృత్తి ప్రక్రియ నాణ్యతను ఒక ప్రామాణిక బహుళ ఎంపిక పరీక్షలో సాధనకు కుదించడమనేది సాంకేతికతకే అధిక ప్రాధాన్యమిచ్చే దృక్కోణాన్ని ప్రతిబింబిస్తుంది.
పలు విద్యా పరిశోధనలు ఈ దృక్కోణం సంకుచితత్వాన్ని ఇప్పటికే ప్రశ్నించాయి.
విస్తృతమైన తీర్పు ప్రభావం..
ఉపాధ్యాయ సంఘాల ప్రకారం, దేశ వ్యాప్తంగా యాభై లక్షలకు పైగా ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు నేరుగా ప్రభావితమవుతున్నారని తెలుస్తున్నది. ఇంత పెద్ద సంఖ్యలో ప్రభావాన్ని కలుగ జేస్తున్న టెట్ నిజంగా పాఠశాల విద్య ఎదుర్కొంటున్న లోతైన సవాళ్లను పరిష్కరించగలదా అనే విషయంపై లోతైన సమీక్ష అవసరమని సూచిస్తోంది.
టెట్ మినహాయిస్తున్న విషయాలు..
టెట్ సిద్ధాంత జ్ఞానాన్ని మాత్రమే పరీక్షిస్తుంది, అది కూడా ఆబ్జెక్టివ్ ప్రశ్నల ద్వారా. ఇది బోధనా సామర్థ్యం, తరగతి పరిస్థితులకు అనుగుణంగా మారే నైపుణ్యం, విభిన్న విద్యార్థులతో పరస్పర సంబంధం, సహానుభూతి, భావోద్వేగ మేధస్సు, ఆత్మపరిశీలన వంటి అంశాలను అస్సలు అంచనా వేయదు.
కానీ, సమర్థవంతమైన బోధనకు ఇవే ఆధారమైన లక్షణాలు, ఇవి ఒక్కసారి రాసే అర్హత పరీక్ష ద్వారా కాకుండా; సరైన ఎంపిక, సంస్థాగత శిక్షణ, మెంటరింగ్, నిరంతర వృత్తిపరమైన అనుభవం ద్వారా అభివృద్ధి చెందుతాయి.
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ విడుదల చేసిన స్టేట్ ఆఫ్ టీచర్స్, టీచింగ్ అండ్ టీచర్ ఎడ్యుకేషన్ రిపోర్ట్- 2023; దేశంలోని బోధనా వృత్తి, ఉపాధ్యాయ శిక్షణపై సమగ్ర విశ్లేషణను అందిస్తుంది.
ఈ నివేదిక ప్రకారం ఉపాధ్యాయుల ప్రభావశీలత, విద్యార్థుల అభ్యాస ఫలితాలు, ప్రవేశస్థాయి పరీక్షల కంటే; ప్రీ-సర్వీస్ శిక్షణ నాణ్యత, ఇన్-సర్వీస్ మద్దతు, అనుకూలమైన పని పరిస్థితులపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి.
జాతీయ స్థాయి డేటాను ఆధారంగా తీసుకుని, టెట్వంటి అర్హత పరీక్షలను వ్యవస్థాగత సంస్కరణలకు ప్రత్యామ్నాయాలుగా ఉపయోగించకూడదని SOTTTER స్పష్టంగా హెచ్చరిస్తుంది.
బదులుగా, ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు, వృత్తిపరమైన అభివృద్ధి వ్యవస్థలపై దీర్ఘకాలిక పెట్టుబడులు అవసరమని నొక్కి చెబుతుంది.
ఉపాధ్యాయ నైపుణ్యాన్ని ప్రభావితం చేసే నిర్మాణాత్మక,సంస్థాగత కారణాలు మారకుండా, ఉపాధ్యాయులందరూ టెట్ ఉత్తీర్ణులైనప్పటికీ పరిస్థితులు మారవు.
ఉపాధ్యాయ సామర్థ్యాభివృద్ధిపై పరిశోధనలు చేసిన విద్యావేత్త డా జీఎస్ కైంత్ (2025) ప్రకారం, స్థిరమైన బోధనా సామర్థ్యం అనేది- జ్ఞాపకశక్తిని కొలిచే పరీక్షలపై కాకుండా, ఆత్మపరిశీలన, సంస్థాగత విశ్వాసం, వృత్తిపరమైన స్వాతంత్ర్యంపై ఆధారపడి ఉంటుంది.
సంస్థాగత వైఫల్యం..
భారతదేశ ఉపాధ్యాయ శిక్షణ వ్యవస్థ పరిమితులు దశాబ్దాలుగా గుర్తించబడుతున్నాయి. జాతీయ విద్యా విధానానికి పునాది వేసిన సుబ్రమణియన్ కమిటీ(2016) నివేదిక ప్రకారం, అనేక రాష్ట్రాల్లో ఉపాధ్యాయ విద్య, వ్యాపారంగా మారిపోయింది.
వేల సంఖ్యలో నాసిరకం సంస్థలు కాగితాలపై మాత్రమే ఉన్నాయని ఆ కమిటీ పేర్కొంది. SOTTTER 2023 నివేదిక కూడా ఇదే విషయాన్ని ప్రతిధ్వనిస్తుంది.
ఉపాధ్యాయ శిక్షణ సంస్థల నాణ్యతలో చాలా వ్యత్యాసాలు, బలహీనమైన నియంత్రణ, బోధనాంశాలకు, తరగతి వాస్తవాలకు మధ్య గాఢమైన అంతరం ఉన్నాయని ఇది నమోదు చేసింది.
ముఖ్యంగా, వృత్తిపరంగా సంసిద్ధులను చేయడాని కంటే నియంత్రణకు, అనుసరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు ఇది సూచిస్తున్నది.
అయితే ఈ మౌలిక సమస్యలను పరిష్కరించడానికి, విద్యాసంస్కరణల దృష్టి, విశ్వవిద్యాలయాలనుబలోపేతం చేయడానికి; సరిగా పనిచేయని సంస్థల మూసివేతలాంటి చర్యలు తీసుకునే దిశగా ఉండాలి. కానీ అది టెట్వంటి అర్హత పరీక్షలపైనే కేంద్రీకృతమైంది. దీని వల్ల లక్షణాలను మాత్రమే చికిత్స చేసి, మూల కారణాలను వదిలేస్తున్న పరిస్థితి ఏర్పడుతున్నది.
వృత్తిపరమైన దృష్టి లోపించిన నియంత్రణ..
ఆర్టీఈ చట్టం సెక్షన్ 23(1) కింద అధికారాలు పొందిన జాతీయ ఉపాధ్యాయ శిక్షణ మండలి(ఎన్సీటీఈ) చారిత్రికంగా అర్హతలు, పరీక్షల ఆధారిత ప్రమాణాలనే నాణ్యతకు ప్రతీకలుగా భావించింది.
అయితే, జస్టిస్ జేఎస్ వర్మ కమిషన్(2012–13) ఈ విధానం నాసిరకం ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలు నియంత్రణల లోపంతో విస్తరించడానికి దోహదపడిందని హెచ్చరించింది. ఆ కమిషన్ పనిచేయని సంస్థలను మూసివేయడం, ఉపాధ్యాయ విద్యను విశ్వవిద్యాలయాలతో అనుసంధానం చేయడం, ఫీల్డ్-ఆధారిత అనుభవాత్మక అభ్యాసానికి ప్రాధాన్యం ఇవ్వడం, బలమైన వృత్తిపరమైన అభివృద్ధి వ్యవస్థలను నిర్మించడం వంటి సూచనలు చేసింది.
SOTTTER 2023 నివేదిక ప్రకారం, ఈ దిశగా పురోగతి అసమానంగా, పరిమితంగానే ఉంది. వృత్తిపరమైన అభివృద్ధి అవకాశాలు ఇప్పటికీ సమన్వయం లేకుండా, తక్కువ వనరులతో కొనసాగుతున్నాయి.
నాణ్యతపై సంకుచిత దృష్టి..
టెట్‌పై కోర్టు పెట్టిన దృష్టి, పరిష్కారం కాకుండా మిగిలిపోయిన మిగతా అంశాలను కూడా వెలుగులోకి తేవడానికి అవకాశాన్ని కలుగజేసింది. ఆర్టీఈ చట్టంలో విద్యా నాణ్యతను నేరుగా ప్రభావితం చేసే నిబంధనలు అనేకం ఉన్నాయి, అవి నిరంతరం ఉల్లంఘించబడుతున్నాయి.
సెక్షన్ 27, ఎన్నికలు, జనాభా గణన, ప్రకృతి వైపరీత్యాల సమయంలో పనులకు మినహాయించి, ఇతర బోధనేతర పనులకు ఉపాధ్యాయులను నియమించడాన్ని నిషేధించింది. కానీ మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ నుంచి ఇతర డేటా సేకరణ వరకు అనేక బాధ్యతలు ఉపాధ్యాయులపై మోపబడుతున్నాయి.
అలాగే, అనేక ప్రాంతాల్లో నిర్దేశిత విద్యార్థి–ఉపాధ్యాయ నిష్పత్తులు ఇప్పటికీ నెరవేరలేదు. ఇది కూడా SOTTTER నివేదికలో బోధనా నాణ్యతకు ప్రధాన అడ్డంకిగా గుర్తించబడింది.
సెక్షన్లు 8, 9ప్రకారం ఉపాధ్యాయులను క్రమం తప్పకుండా నియమించడం, వారికి సరైన విధంగా పోస్టింగ్‌లు ఇవ్వడం రాష్ట్ర- స్థానిక ప్రభుత్వాల బాధ్యత. వాస్తవంగా ఇంకా కాంట్రాక్టు, తాత్కాలిక ఉపాధ్యాయులపై ఆధారపడవలసి వస్తున్నది, దీనివల్ల ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రత తగ్గుతోంది. దీర్ఘకాలికంగా బోధనా నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలనే ఆసక్తి తగ్గిపోతోంది.
దీంతోపాటు ఉపాధ్యాయుల మధ్య పరస్పర సహకారం, కలిసి నేర్చుకునే అకాడమిక్ వాతావరణం కూడా బలహీనపడుతోంది.
సెక్షన్ 29, పిల్లల కేంద్రంగా ఉండే కార్యకలాపాల ద్వారా నేర్పే పాఠ్య విధానాన్ని సూచిస్తుంది. ఇది సక్రమంగా అమలవ్వాలంటే ఉపాధ్యాయులకు బోధనలో స్వేచ్ఛ, తమ బోధనపై సమీక్ష చేసుకునే అలవాటు, నిరంతరం నేర్చుకునే అవకాశం అవసరం.
కాగితాలపైనే మిగిలిపోయే అవకాశం..
DIETలు, SCERTలవంటి సంస్థల నుంచి నిరంతర అకడమిక్ సహాయం లేకపోతే, ఇవన్నీ ఆచరణలో కాకుండా కాగితాలపైనే మిగిలిపోతాయి.
మొత్తంగా చూస్తే, ఆర్టీఈ చట్టం ఉపాధ్యాయ నాణ్యతను పరీక్షలతో మాత్రమే కొలవదు- అది ఉద్యోగ పరిస్థితులు బాగుండటం, సంస్థాగత మద్దతు, బోధనలో స్వాతంత్ర్యం, ఉద్యోగ స్థిరత్వం గురించి కూడా చెబుతుంది.
వీటన్నింటితోనే ఉపాధ్యాయ నాణ్యత నిర్ణయించబడుతుంది. కానీ ప్రస్తుతం అర్హత పరీక్షలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ మిగతా వాటిని విస్మరించడం జరుగుతున్నది. దీని ద్వారా సంస్థాగత సామర్థ్య లోపాలను పరిష్కరించకుండా, బాధ్యతను మొత్తం ఉపాధ్యాయులపైకి నెట్టివేస్తున్నట్టు అవుతుంది.
అంతర్జాతీయ అనుభవం ఒక భిన్న దృక్కోణాన్ని అందిస్తుంది. ILO–UNESCO సంయుక్తంగా జారీ చేసిన ఉపాధ్యాయుల స్థితిగతులపై సిఫారసులు(1966) పరీక్షలను వృత్తిపరమైన ప్రతిభతో సమానం చేయవద్దని హెచ్చరిస్తాయి.
ఫిన్లాండ్ వంటి ఉన్నత పనితీరు కలిగిన విద్యా వ్యవస్థలు, పునరావృత అర్హత పరీక్షలకన్నా, కఠినమైన ప్రారంభ ఎంపిక, లోతైన శిక్షణ, నిరంతర మెంటరింగ్పై పెట్టుబడి పెడతాయి.
భారతదేశంలోని డీపీ చటోపాధ్యాయ నేతృత్వంలోని జాతీయ ఉపాధ్యాయ కమిషన్(1985) కూడా ఉపాధ్యాయ విద్యను నిరంతర ప్రక్రియగా, DIETలు- SCERTలు వంటి బలమైన సంస్థల మద్దతుతో ఊహించింది.
ప్రస్తుత ఆచరణ ఆ దృష్టికి ఎంత దూరంగా ఉందో SOTTTER 2023 నివేదిక ప్రకారం స్పష్టంగా కనిపిస్తుంది.
ఉపాధ్యాయ నాణ్యతను పరీక్ష ఫలితాలతో సమానంగా చూడటం విద్యా విధానాల పరిమితిని రుజువు చేస్తుంది. లోతైన నిర్మాణాత్మక సమస్యలను పైపైన కొలిచే సూచికలతో పరిష్కరించాలనే ప్రయత్నం ఇది.
కోర్టు ఆదేశం చట్టపరంగా సరైనదై ఉండవచ్చు; కానీ విద్యాపరంగా ఇది తీవ్రమైన సమస్యలను కలిగించేదిగా ఉంది. ఉపాధ్యాయ నాణ్యతను నిజంగా మెరుగుపరచాలంటే, ఉపాధ్యాయ శిక్షణ సంస్థల సంస్కరణలు, వృత్తిపరమైన అభివృద్ధి వ్యవస్థల బలోపేతం, ఆర్టీఈ చట్టంలోని పని భారం, సిబ్బంది నిబంధనల అమలు, ఉపాధ్యాయులపై వృత్తిపరమైన విశ్వాసం పునరుద్ధరణ అవసరం.
ఈ పునాదులు బలపడేవరకు, టెట్ ఒక పరిపాలనా ఆచారంగానే మిగిలి— పాలనా వైఫల్యాలను సరిదిద్దకుండా, వాటిని కప్పిపుచ్చే సాధనంగానే ఉండే ప్రమాదం ఉంది.
(వ్యాస రచయిత హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాల(స్వ) అధ్యాపకులు. తెలంగాణ సొసైటీ ఫర్ ఛేంజ్ ఇన్ ఎడ్యుకేషన్ ప్రధాన కార్యదర్శి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
