ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2024లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక టీబీ కేసులు భారతదేశంలో నమోదయ్యాయి. అదే సమయంలో, టీబీ కేసులలో 21% తగ్గుదల కూడా నమోదయ్యింది. 2015లో లక్ష జనాభాకు 237 కేసుల నుంచి తగ్గి, 2024లో లక్ష జనాభాకు 187 కేసులయ్యాయి.
న్యూఢిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నవంబర్ 13న విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2024లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక క్షయవ్యాధి కేసులు భారతదేశంలో నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్త కేసులతో పోల్చుకుంటే ఇది నాలుగోవ వంతు.
భారతదేశంలో టీబీ కేసులు కూడా 21% తగ్గాయి- 2015లో లక్ష జనాభాకు 237 కేసుల నుంచి తగ్గి, 2024లో 187 కేసులయ్యాయి. ఇది ప్రపంచక్షీణత(12%) కంటే దాదాపు రెట్టింపు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం కేసుల్లో 67% కేవలం ఎనిమిది దేశాలలోనే కేంద్రీకృతమై ఉన్నాయని గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్ 2025 పేర్కొంది. రిపోర్ట్ ప్రకారం, 25%తో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. తర్వాత స్థానాలలో ఇండోనేషియా 10%, ఫిలిప్పీన్స్ 6.8%, చైనా 6.5%, పాకిస్తాన్ 6.3% ఉన్నాయి. ఇతర దేశాలలో నైజీరియా 4.8%, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో 3.9%, బంగ్లాదేశ్ 3.6% ఉన్నాయి.
నివేదిక ప్రకారం, ప్రపంచ మొత్తంలో మొదటి ఐదు దేశాలు 55% వాటా కలిగి ఉన్నాయి.
అంతేకాకుండా, 2024 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఎండీఆర్/ఆర్ఆర్-టీబీతో బాధపడుతున్న వారిలో సగానికి పైగా నాలుగు దేశాలలో ఉన్నారు: భారతదేశం (32%), చైనా (7.1%), ఫిలిప్పీన్స్ (7.1%), రష్యన్ ఫెడరేషన్(6.7%).
భారతదేశంలో టీబీ కేసులలో తగ్గుదల..
ఈ నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా టీబీ కేసులలో అత్యంత వేగంగా తగ్గుదల నమోదు చేసిన దేశాలలో భారతదేశం ఒకటి. ఇది ఇతర అధిక ప్రభావ దేశాలలో నమోదైన తగ్గింపు రేటును అధిగమించింది.
“భారతదేశ వినూత్న కేస్-ఫైండింగ్ విధానం, కొత్త సాంకేతిక పరిజ్ఞానాల వేగవంతమైన విస్తరణ, సేవల వికేంద్రీకరణ- భారీ కమ్యూనిటీ సమీకరణ ద్వారా నడపబడుతుంది. 2024 నాటికి దేశంలో చికిత్స కవరేజీని 92%కి పైగా పెంచింది. ఇది 2015లో 53%గా ఉంది” అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన తెలిపింది.
2024లో 27 లక్షల అంచనా వేసిన కేసుల్లో 26.18 లక్షల మంది టీబీ రోగులు నిర్ధారించబడ్డారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రయత్నాలు ‘మిస్సింగ్ కేసుల’ సంఖ్యను తగ్గించడంలో సహాయపడ్డాయి. అంటే, టీబీ ఉన్నప్పటికీ నివేదించబడని వ్యక్తులు.
2015లో అంచనా వేసిన కేసుల సంఖ్య 1.5 మిలియన్లు కాగా, 2024 నాటికి అది లక్ష కంటే తక్కువకు పడిపోయింది. అంతేకాకుండా, దేశంలో ఎండీఆర్ టీబీ రోగుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల లేదు.
టీబీ-ఫ్రీ ఇండియా ప్రచారం కింద, చికిత్స విజయ రేటు 90%కి పెరిగిందని, ఇది ప్రపంచ సగటు 88% కంటే ఎక్కువ అని మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశంలో టీబీ మరణాల రేటు కూడా 2015లో లక్ష జనాభాకు 28 నుంచి 2024 నాటికి 21కి తగ్గిందని కూడా తెలిపింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
