
ఆయన అస్తమించారని
పత్రికలన్నీ ప్రధాన శీర్షికల ఉపరితలాన
ఎరుపెక్కిన పద విన్యాసాల
అక్షర ప్రవాహాలై ప్రతిధ్వనిస్తుంటే
నాకు ఆశ్చర్యమేసింది
సురవరం సార్
జన మనసుల విప్లవ గగనాన
సూర్యోదయపు స్ఫూర్తిగీతమై
ప్రజా హక్కుల పోరాటాన
గళమెత్తిన స్వర ప్రభంజనమై
జీవన తరంగాల
ప్రకాశమంతా కమ్యూ”నిజమై”
తనువంతా “గాంధీ ఆసుపత్రిలో”
పరిశోధనా నిమిత్తమై
ఆస్తి మొత్తం పేద పిల్లల
వైజ్ఞానిక విద్యా ప్రభావితమై
నవతరపు హృదయాల్లో
లౌకికతత్వపు అరుణారుణ వనమై
ఇలా ఇల అంతటా
ఓ సాహస ఉద్దీపశిఖరమై
ఉద్యమిస్తూనే ఉన్నారు
తెలంగాణ నినాదాల
వెలుగుల పద్య కిరణాల కవిత్వమై
అనునిత్యం సామాన్యుని
పక్షాన పోరాడే చైతన్య
తారల సమూహమై
వామపక్ష భావజాలతత్వపు నవ్య పథాన
దిక్సూచి యంత్రమై
విజయలక్ష్మి గుండె గుడిలో
కామ్రేడ్ సమరరథపు
ప్రేమ చిహ్నమై
సమానతపు కలల తీరాన
నిలువెత్తు నిగ్రహమై
విగ్రహమై నిలిచే ఉన్నారు
సుధాకర గాత్ర గాంభీర్యానికి
యువతరపు ప్రేరణ వందేమాతరానికి
అస్తమయ నీడలంటవు
మరణ జ్వాలలు మండవు
అనునిత్యం ఉదయిస్తూనే
మనందరి చిరునవ్వుల
ఇంద్రధనుస్సుగా విప్లవిస్తూనే
మళ్లీమళ్లీ పుడుతూనే ఉంటారు
మరణం లేకుండానే
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.