మతం మారితే కులం పోతుందా? కులానికి మతానికి ఆవినాభావన సంబంధం ఉందా? దళితులు ఎక్కడైనా దళితులే అయినప్పుడు- కొన్ని మతాల దళితులకే షెడ్యూల్డ్ కులాల గుర్తింపు ఎలా ఇస్తారు? ఇది మత ఆధారిత వివక్ష కాదా? దీనికి సామాజికంగా, రాజకీయంగా జవాబులు ఇవ్వవచ్చు. అయితే భారతీయ న్యాయ వ్యవస్థ ఈ ప్రశ్నలను ఎలా చూస్తోందనేదానిని తెలుసుకుందాం.
న్యాయ వ్యవస్థలో సామాజిక అవినాభావ సంబంధాలు తీసుకునే రూపాల మధ్య సారూప్యం, తేడాలు- వీటి విస్తృత సామాజిక అవగాహన, ఆ అవగాహన రాజకీయ ప్రభావాన్ని 2025 మే నెలలో కోర్టులు వెలువరించిన రెండు తీర్పుల ద్వారా గమనించవచ్చు. మొదటి తీర్పు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు, రెండవది మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం వెలువరించింది.
తన మీద అగ్రకుల వ్యక్తులు దాడి చేశారని ఒక దళిత పాస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా సదరు వ్యక్తుల మీద ఎస్సీ/ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దళిత వ్యక్తి క్రైస్తవ పాస్టర్ కాబట్టి; చట్టం ప్రకారం అతను షెడ్యూల్డ్ కులానికి చెందడని, ఈ చట్టాన్ని అన్వయించడం కుదరదని వాదిస్తూ సదరు నిందితులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. వారి వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ఆ ఎఫ్ఐఆర్ని కొట్టివేసింది.
ఇక మధురై హైకోర్టు కేసు విషయానికి వస్తే, అది ఎన్నికలకు సంబంధించిన పిటిషన్. షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేసిన పట్టణ పంచాయతీ ఛైర్పర్సన్ పదవికి ఒక క్రైస్తవ దళిత మహిళ ఎన్నికయ్యారు. ఓడిపోయిన అభ్యర్ధి ఆ ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ హైకోర్ట్ కూడా పైన పేర్కొన్న కారణాలే చెబుతూ, ఎన్నికను రద్దు చేసింది. ఈ రెండో కేసులో ఇచ్చిన తీర్పు మీద సుప్రీంకోర్టు కొన్ని రోజుల క్రితం స్టే విధించింది.
రెండిటిలోనూ ఉమ్మడి అంశం– మతం, కులం, షెడ్యూల్డ్ క్యాస్ట్..
రాజ్యాంగంలోని 341వ అధికరణ కింద షెడ్యూల్డ్ కులాలు ఆర్డర్‌ను 1950లో జారీ చేశారు. ఇందులో ఏ రాష్ట్రాలలో ఏ కులాలు షెడ్యూల్డ్ కులాల కిందికి వస్తాయో పేర్కొన్నారు. అయితే హైందవేతర కులాలకు ఈ ఆర్డర్ వర్తించదనే షరతును విధించారు. సిక్కు మతంలోని కొన్ని దళిత కులాలకు ఈ షరతు వర్తించదని ఇందులొనే తెలియజేశారు. ఈ ఉత్తర్వుకు మూలం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం-1935లో ఉంది. ఆ చట్టంలో మొదటిసారి షెడ్యూల్డ్ కులాలు అనే కేటగిరీని తీసుకొచ్చారు. ఆ చట్టం కింద 1936లో షెడ్యూల్డ్ కులాల జాబితా ఇస్తూ, ఇది‘భారతీయ క్రైస్తవుల’కు వర్తించదని పేర్కొన్నారు.
1956లో హిందువులతో పాటు సిక్కు మతస్తులను ఈ చట్టంలో కలిపారు. 1990లో బౌద్ధ మతస్తులను కూడా కలిపారు. అంటే జైన్, పార్సీలాంటి బహు అల్పసంఖ్యాక మతాలను పక్కన పెట్టగా, షెడ్యూల్డ్ కులాల స్థితి నుంచి మినహాయించింది క్రైస్తవ, ముస్లిం మతాల దళిత కులాలను. పైన పేర్కొన్న ఆంధ్ర- తమిళ హైకోర్టుల రెండు తీర్పులు కూడా ఈ ఉత్తర్వును ప్రామాణికంగా తీసుకొని వెలువరించినవే.
1936, 1950 ఉత్తర్వుల కంటే ముందు 1886లో అడ్మినిస్ట్రేటివ్ జనరల్ వర్సెస్ ఆనందాచారి కేసులో నాటి మద్రాస్ హైకోర్టు ఒక సూత్రీకరణ చేసింది. హైందవ మతం నుంచి ఇతర మతంలోకి మారినవారెవరైనా సరే, తిరిగి హైందవ మతంలోకి వస్తే, తాము తిరిగి హైందవ మతంలోకి వచ్చామని నిరూపించగలిగితే హైందవ మతంలో తమ కులాన్ని తిరిగి పొందవచ్చని చెప్పింది. ఇదే సూత్రీకరణ ఆ తరువాత కూడా కొనసాగింది. 1950 ఉత్తర్వు తరువాత కూడా ఇదే సూత్రీకరణ ఆధారంగా తీర్పులు రావటం జరిగింది, జరిగుతున్నది.
1950 ఉత్తర్వును వెనువెంటనే 1951లో సవాల్ చేశారు. ఎస్ మైకేల్ వర్సెస్ ఎస్ వెంకటేశ్వరన్(1951)కేసులో, ఈ సవాల్‌ను కొట్టివేస్తూ సుప్రీం కోర్టు “మతం(హైందవం) మారిన వారికి కులం వర్తించదు” అని పేర్కొన్నది. అప్పటి నుంచి ఈ తీర్పు కొనసాగుతున్నది.
1954లో చతుర్భుజ్ విఠల్ దాస్ జసానీ వర్సెస్ మొరేశ్వర్ పరుశరాం కేసులో, కులం- మతం మధ్య సంబంధానికి సుప్రీం కోర్టు కొత్త అర్థాన్ని ఇచ్చింది. మహారాష్ట్రలో దళిత కులమైన మహర్ కులానికి చెందిన గంగారాం తవారే అనే వ్యక్తి మహానుభావ అనే శాఖలోకి మారారు. దీంతో, అతను షెడ్యూల్డ్ కులం స్థితిని కోల్పోయారు కాబట్టి ఆయన ఎన్నిక చెల్లదని తన మీద ఎన్నికల పిటిషన్‌ను దాఖలు చేశారు.
ఈ తీర్పులో మహానుభావ శాఖకు సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలను చర్చిస్తూ, సుప్రీం కోర్టూ ఒక కీలకమైన సూత్రీకరణ చేసింది. “ఈ శాఖ శాస్త్రాలతో(తియోలజీ)తో మాకు పట్టింపు లేదు. సైద్ధాంతిక లేదా శాస్త్ర సంబంధం నేపథ్యం నుంచి కంటే కూడా ఇంగితజ్ఙానం, వ్యవహారిక పద్ధతిలో ఈ విషయాన్ని చూడవలసిన అవసరముందని మేము భావిస్తున్నాము” అని కోర్టు పేర్కొన్నది. అంతేకాకుండా మతం- కులం మధ్య సంబంధం గురించి మూడు విషయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది.
ఆ మూడు ఏంటంటే, మతం మారినప్పుడు కుల స్పందన, మతం మారిన వ్యక్తి ఉద్దేశాలు, కొత్త మతం నియమ నిబంధనలు.
ఒక వ్యక్తి మతం మారినప్పుడు తన కులం తనతో సంబంధాలు తెంచేసుకోని, పరాయి వ్యక్తిగా చూడకపోతే; కొత్త మతంలోకి మారడమనేది కేవలం వ్యక్తిగత విషయమని, తన కులంతో తనకు లభించే వివిధ చట్ట, రాజకీయ హక్కులను ఆ వ్యక్తి కోల్పోవాల్సిన అవసరం లేదని తెలిపింది. మహానుభావ శాఖలోకి మారినవారు తమ కులాన్ని వదిలిపెట్టిన దాఖలా లేదు. కాబట్టి, ఆ శాఖలోకి మారడం ద్వారా సదరు వ్యక్తి తన మహర్ కులాన్ని కోల్పోలేదని కోర్టు స్పష్టం చేసింది. మతం మారితే కులం పోతుందని 1951లో ఇచ్చిన తీర్పును ఇది ఒక రకంగా తిరగరాసినట్టే.
క్రైస్తవ, ఇస్లాం మతాలకు ఎందుకు అన్వయించకూడదు?
ఒక క్షేత్రస్థాయి పరిశీలన- పరిశోధన చేయకుండా క్రైస్తవ, ఇస్లాం మతాలలోకి మారితే కులం పోతుందనే ఒక ముందస్తు భావనను 1950 ఆర్డర్లో చొప్పించటం ఎంతవరకు భావ్యమైన విషయం? క్రైస్తవ, ఇస్లాం మతాలలో కులం లేదని ఆ మత పెద్దలు చెప్పవచ్చు. అయితే పైన పేర్కొన్న తీర్పు నేపథ్యంలో పరిశీలిస్తే, వాటి శాస్త్రాల ప్రకారం కన్నా కూడా వ్యావహారిక నేపథ్యంలో అది వాస్తవం కాదని అందరికీ అర్థమవుతుంది. అంతేకాకుండా కుల, మత భావాలు లేవని చెప్పిన మహానుభావ శాఖలోకి మారినా కూడా కులం కోల్పోవాల్సిన అవసరం లేదని ఈ తీర్పులో చెప్పారు. అటువంటి సమయంలో కులం మాకు లేదని క్రైస్తవం, ఇస్లాం మత పెద్దలు చెప్పినా కూడా ఇదే సూత్రీకరణ ఆ మతాలకు ఎందుకు అన్వయించకూడదు?
ఒక రకంగా ఈ ఉత్తర్వు గురించి రాజ్యాంగ పరిషత్తులో చర్చ నడిచినప్పుడు కూడా ఇదే జరిగింది. క్రైస్తవ, ఇస్లాం మత సభ్యులెవరూ ఈ ఉత్తర్వులోని మినహాయింపులను ప్రశ్నించలేదు. అయితే సిక్కు మత ప్రతినిధులు మాత్రం ప్రశ్నించి ఈ ఆర్డర్ నుండి సిక్కు మతంలోని కొన్ని దళిత కులాలకు మినహాయింపు తెచ్చుకోగలిగారు.
1967లో కొత్తపల్లి నరసయ్య వర్సెస్ జమ్మన జోగి కేసులో ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ ఇచ్చిన తీర్పును పైన పేర్కొన్న జసానీ కేసుకు కొనసాగింపు అనుకోవచ్చు. ఇది కూడా ఎన్నికల పిటిషనే.
ఆంధ్రప్రదేశ్‌లోని పాలకొండ శాసనసభ ఎన్నికలో గెలుపొందిన జమ్మన జోగి మాల కులానికి చెందినవారు. అయితే, క్రైస్తవ మతంలోకి తను మారడంతో షెడ్యూల్డ్ కులం కేటగిరి కిందికి రారని, కాబట్టి షెడ్యూల్డ్ కులం రిజర్వ్డ్ నియోజకవర్గమైన పాలకొండ నుంచి తన ఎన్నిక చెల్లదని, తన ఎన్నిక కొట్టివేయాలనేది పిటిషనర్ల వాదన.
జోగి కౌంటర్ చేస్తూ– తాను తిరిగి హైందవ మతాన్ని స్వీకరించానని, ఎన్నికల సమయానికి తాను హిందువునేనని తెలిపారు.
ఈ సందర్భంలోనే, “కులం అనేది మత ఆధారితంగానే ఏర్పడింది. అయినప్పటికీ అది మత వ్యవస్థ కాదు. మతం మారిన కూడా తోటి కులస్తులు సదరు వ్యక్తిని తమలో ఒకరిగా అంగీకరిస్తే, తన కులానికి మతం అడ్డురావాల్సిన అవసరం లేదు. సదరు వ్యక్తి తనంతటగా తాను తన కులాన్ని వదిలివేస్తే లేదా తన కులం తనని తమ కులస్తుడు కాదని ప్రకటిస్తే తప్ప మతం మారినంత మాత్రాన కులం పోదు”అని సుప్రీం కోర్టు పేర్కొన్నది.
కాబట్టి తిరిగి హిందూమతం స్వీకరించిన వారికి, తమ పూర్వపు కులం కొనసాగుతుందని తీర్పు ఇచ్చింది. ఈ కేసుకు ఒక నిర్దిష్ట నేపథ్యం ఉంది. అయితే ఆ నేపథ్యాన్ని దాటి ఈ తీర్పులో కోర్టు వెలుబుచ్చిన దాన్ని గమనిస్తే కులానికి మతానికి అవినాభావన సంబంధం ఉండవలసిన అవసరం లేదనేది స్పష్టమవుతోంది.
అదే విధంగా, 1975లో జీఎం ఆర్ముగం వర్సెస్ ఎస్ రాజగోపాల్ కేసులో సుప్రీంకోర్టు కొన్ని అభిప్రాయాలను వెలిబుచ్చింది.
“హైందవ సమాజంలో కులం అనేది ఒక విడదీయరాని అంశమే. కానీ, దానర్ధం ఒక వ్యక్తి తన మతం మార్చుకుంటే స్వతస్సిద్ధంగా తన కులాన్ని కోల్పోతారనేది తప్పనిసరి నియమం కాదు. ఆ వ్యక్తి తన కులానికి చెందుతారా లేదా అనేది ఆయా కులాల కట్టుబాట్లను బట్టి ఉంటుంది. ఫలానా కులంలో వివిధ మతాల వారు ఉంటే, మతం మారినా కులం కోల్పోవాల్సిన అవసరం లేదు” అని అభిప్రాయపడింది.
దక్షిణ భారతదేశంలో క్రైస్తవ మతం ఆచరిస్తున్నా కూడా తమ తోటి కులస్తులుగా వారిని పరిగణించడం అసాధారణమేమీ కాదని ఈ తీర్పులో పేర్కొన్నారు. గమనించాల్సిందేంటంటే, యాభై సంవత్సరాల క్రిందటే సుప్రీంకోర్టు ఈ వాస్తవాన్ని గుర్తించింది.
నరసయ్య లేదా అర్ముగం తీర్పులో కానీ కోర్ట్ అభిప్రాయాలు తీర్పులో భాగం కాలేదని గుర్తుపెట్టుకోవాలి.
వీటి తరువాత వచ్చిన ముఖ్యమైన తీర్పు: గుంటూరు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ వర్సెస్ వై మోహనరావు కేసు-1976. ఈ తీర్పును ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వెలువరించింది.
ఇందులో కూడా “ఒక వ్యక్తి ఒక కులానికి చెందినవారనే దానికి ప్రామాణికం ఆ కులంలోని ఇతర వ్యక్తుల అంగీకారం, ఆమోదం మాత్రమే”ని సుప్రీంకోర్టు తెలియజేసింది. అయితే, ఈ సూత్రీకరణను 1950 ఉత్తర్వుకు, హైందవ మత షెడ్యూల్డ్ కుల పరిమితికి లోబడి చేసింది. ఈ తీర్పులో అయితే ఈ పరిమితికి లోబడి చేసింది. కానీ ఈ సూత్రీకరణను విశ్వజనీనం చేయడానికి అడ్డంకులయితే ఏమీ లేవు.
ఇవే అభిప్రాయాలను, ఎస్ ఆన్బలగన్ వర్సెస్ బీ దేవరాజన్ కేసు– 1983కు సంబంధించిన సుప్రీం కోర్టు తీర్పులో కూడా చూడవచ్చు. “కులమనేది భారతీయ సమాజంలో లోతుగా వేళ్లునూరుకుంది. ఈ కారణంగా మతం మారినంత మాత్రాన కులం పోతున్న ఛాయలేమి కనపడటం లేదు”అని సుప్రీంకోర్టు అభిప్రాయబడుతూ, దక్షిణ భారతదేశంలో క్రైస్తవ కమ్మ, క్రైస్తవ రెడ్డి, క్రైస్తవ నాడార్, క్రైస్తవ ఆది-ఆంధ్ర, క్రైస్తవ ఆది-ద్రవిడ లాంటి క్రైస్తవ-కుల సమూహాలు చాలా సర్వసాధారణమని గుర్తుచేసింది. అర్ముగం కేసులో లెక్కనే నలభై ఏళ్ల క్రిందటే సుప్రీంకోర్టు సామాజిక వాస్తవాన్ని అంచనా వేసింది. అయితే ఈ కేసులో కూడా ఈ అభిప్రాయాలు తీర్పులో భాగం కాలేదు. భాగం అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇవేవి కూడా 1950 నాటి ఆర్డర్‌ను సవాలు చేసినవి కాదు.
కులం మతానికి పరిమతం కాదని చెప్పిన మరిన్ని కేసులు..
కేసీ వసంత కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక- 1985ను రిజర్వేషన్లకు సంబంధించిన ఒక ముఖ్యమైన కేసుగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంలోనే హైందవమతాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన శాఖలు, మతాలలో కూడా కులం అనేది ప్రస్తుతం విడదీయలేని భాగమయ్యిందని జస్టిస్ దేశాయ్ చెప్పారు. అంతేకాకుండా క్రైస్తవ కమ్మ, క్రైస్తవ రెడ్డి, క్రైస్తవ హరిజన(కోర్టు వాడిన పదం) ఉదాహరణలను ఇచ్చారు. అయితే, ఇది కేసుకి సంబంధించిన విషయం కాదు కాబట్టి ఇది కూడా కేవలం అభిప్రాయమే.
అదే విధంగా దేశవ్యాప్తంగా కేంద్ర విభాగాలలో, విద్యాసంస్థలలో ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించిన 1992 నాటి ఇందిరా సాహ్నే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా కులాన్ని గుర్తించని ఇస్లాం, క్రైస్తవ, సిక్కు మతాలలో కూడా కులం ఏదో ఒక రూపంలో కొనసాగుతున్నదని తెలిపారు.
1951 తరువాత, సూసై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 1950 ఆర్డర్‌ను మళ్ళీ సవాలు చేశారు. 1985లో సుప్రీం కోర్టు ఈ కేసులో తీర్పు ఇచ్చింది. మొదటిసారి కులాన్ని ఈ కేసులోనే సుప్రీం కోర్టు సెక్యులరైజ్ చేసింది. తమిళనాడుకు చెందిన సూసై అనే వ్యక్తి 1950 నాటి ఆర్డర్‌ను సవాలు చేస్తూ, ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.
ఈ సవాల్‌ను కోర్టు అయితే కొట్టివేసింది. కానీ ఒక సెక్యులర్ ప్రాతిపదికన కొట్టివేయడం ముఖ్యమైన విషయం. మతం మారినంత మాత్రాన కులం పోదని చెబితే సరిపోదు, మారిన మతంలో కూడా హైందవ మతంలోలానే అనేక సామాజిక- ఆర్థిక అవరోధాలు, అడ్డంకులు, ఇబ్బందులు, వెనుకబాటుతనం ఉన్నాయని నిరూపించాల్సిన బాధ్యత పిటిషనర్ మీద ఉంటుందని తీర్పులో పేర్కొన్నది. అప్పటివరకు వచ్చిన తీర్పులకు ఇది ఒక రకంగా భిన్నమైనది. కులాన్ని మతంతో ముడిపెట్టకుండా, హైందవ మతంలో ఉన్నప్పుడు ఉన్న ఇబ్బందులే క్రైస్తవ మతంలోనూ– లేదా ఇంకే మతమైనా- ఉన్నాయని ఒక వెనుకబాటుతనన్నీ ప్రాతిపదిక చేసుకుంది. ఇది ఒక రకంగా ఆహ్వానించదగిన పరిణామం.
ఇప్పుడు మరి అలా నిరూపించడానికి అవసరమైన వనరులు ఎవరి దగ్గర ఉంటాయి? కేవలం ఒకరో, ఇద్దరో ఆ పని చేయలేరు. ఆపాటి వనరులు, వ్యవస్థలు ఉండేది కేవలం ప్రభుత్వానికే. ఆ పనికి ప్రభుత్వమే పూనుకోవాలి. క్రైస్తవ, ఇస్లాం మతాలలో కులం, కుల వివక్ష గురించి పరిశోధన, ప్రైవేటు నివేదికలు చాలానే ఉన్నాయి. అయితే ప్రభుత్వం పూనుకుని, నిరూపించగలిగితే దానికి ఉండే సాధికారత వేరు. అలాగని ప్రభుత్వం అటువంటి ప్రయత్నం చేయలేదని కాదు.
హైందవేతర దళితులను కూడా షెడ్యూల్డ్ కేటగిరీలో చేర్చే విధంగా 1950 నాటి ఆర్డర్‌ను సవరించాలని 1980లో లోక్‌సభలో కేరళకు చెందిన పార్లమెంట్ సభ్యులు పీజే కురియన్ ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించి, చివరికి తనంతట తానే ఆ బిల్లును వెనక్కు తీసుకునేటట్టు చేశారు. 1996లో కాంగ్రెస్ ప్రభుత్వం చివరి రోజులలో కూడా ఇటువంటి బిల్లు ప్రవేశపెట్టే ప్రయత్నం చేసింది. కానీ అది కూడా సాధ్యపడలేదు.
1955 నాటి కాకా కాలేకర్ కమీషన్ తన నివేదికలో క్రైస్తవ, ఇస్లాం, సిక్కు మతాలలో కూడా కులవ్యవస్థ లాంటి వ్యవస్థలు ఉన్నాయని తెలిపింది. అదే విధంగా 1980 నాటి మండల్ కమీషన్ నివేదిక ఇదే విషయాన్ని చెప్పింది. 1983లో నాటి కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, మైనారిటీల స్థితుగతుల గురించి అశోక్ సింగ్ కమిటీని నియమించింది. ఈ వర్గాల అభ్యున్నతి కోసం వివిధ సూచనలు చేస్తూ, షెడ్యూల్డ్ క్యాస్ట్ కేటగిరీని మతం నుంచీ డీలింక్ చేయాలని, మతానితో సంబంధం లేకుండా షెడ్యూల్డ్ క్యాస్ట్ కేటగిరీని ఉంచాలని సూచించింది. అయితే ఈ నివేదికను ప్రభుత్వం ఆమోదించలేదు.
అదే విధంగా దళిత క్రైస్తవులు– ముస్లింలను షెడ్యూల్డ్ క్యాస్ట్‌గా గుర్తించాలని కోరుతూ సుప్రీంకోర్టులోనూ, వివిధ హైకోర్టులలోనూ పిటిషన్లు దాఖలయిన నేపథ్యంలో 1950 నాటి ఆర్డర్, మత ఆధారిత షెడ్యూల్డ్ క్యాస్ట్ కేటగిరీ గురించి 2004లో నాటి కేంద్ర ప్రభుత్వం మత, భాషాపరమైన మైనారిటీల స్థితిగతుల గురించి ఏర్పాటు చేసిన రంగనాథ్ మిశ్రా కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లో చేర్చారు.
2007లో ఈ కమిషన్ తన నివేదక సమర్పించింది. హైందవేతర దళితులు కూడా కులం కారణంగా తమతమ మతాలలో వివక్షకు గురవుతున్నారని, వారి సామాజిక-ఆర్థిక పరిస్థితి అధ్వానంగానే ఉందని చెబుతూ, మతంతో సంబంధం లేకుండా షెడ్యూల్డ్ క్యాస్ట్ కేటగిరీ ఉండాలని కమీషన్ చాలా స్పష్టంగా పేర్కొంది. అయితే ఈ సిఫార్సును ఈ కమిషన్ సభ్య- కార్యదర్శి, మాజీ కేంద్ర కార్యదర్శి ఆశా దాస్ వీటో చేశారు.
ఈ కమిషన్ నివేదికను కూడా ప్రభుత్వం ఆమోదించలేదు. ఈ నివేదికను తిరస్కరిస్తున్నామని ఎన్డీఏ ప్రభుత్వం 2021లో సుప్రీం కోర్టుకు తెలియచేసింది. హైందవేతర దళితుల షెడ్యూల్డ్ క్యాస్ట్ కేటగిరీ గురించి 2022లో కేజీ బాలకృష్ణన్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ నేటి వరకు నివేదిక అందజేయలేదు. సుప్రీంకోర్టులో దళిత క్రైస్తవ– ముస్లిం కేసులు అలాగే ఉన్నాయి. ఈ అన్యాయం అలాగే కొనసాగుతున్నది.
1950 నాటి ఆర్డర్‌ను సవరించి కులానికి, మతానికి ఉన్న లంకెను తొలగిస్తే హైందవ మత జనాభా తగ్గిపోవచ్చనే భయం తప్ప ఈ ఆర్డర్ ఇంకా అమలులో ఉండటానికి ఎటువంటి కారణం లేదు. ఆ భయానికి విరుగుడు మతాన్ని సంస్కరించుకోవడం కానీ ఇతర మతాల హక్కులకు అడ్డంకులు సృష్టించడం కాదు. ఈ ఆర్డర్ బలహీన పునాదిని బీజ రూమపంలోనైనా సరే న్యాయస్థానాలే ప్రశ్నించిన దాఖలాలు ఉన్నాయి. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వకూడదని బల్ల గుద్ది చెప్పే న్యాయస్థానాలు, మత ప్రాతిపదికన ఉన్న కేటగిరీని ఎందుకు
తొలగించట్లేదని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఈ విషయం ఏ రాజకీయ పార్టీకి కూడా ఎందుకు పట్టని విషయంగా ఉన్నదో కూడా ఆయా పార్టీలను ప్రశ్నించాలి.
(వ్యాసరచయిత మానవ హక్కుల వేదిక(హెచ్ఆర్ఎఫ్) సభ్యులు)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
