“కేంద్ర ప్రభుత్వం ఒక వ్యక్తి పౌరసత్వం గురించి తుది నిర్ణయం తీసుకోవడానికి ముందే, సదరు వ్యక్తిని ఓటర్ల జాబితా నుంచి స్థానిక ఓటరు నమోదు అధికారి తొలగించా వచ్చా”అని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి బాగ్చి ప్రశ్నించారు.
న్యూ ఢిల్లీ: “కేంద్ర ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ఓటరు జాబితా సవరణ కసరత్తు కొంతమందిని దేశం నుంచి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి వస్తుందా”అని సుప్రీంకోర్టు మంగళవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకుమార్, జోయ్ మాల్యా బాగ్చిల నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తోంది.
“విచారణ అనంతరం ఒక వ్యక్తిని ఓటరు జాబితా నుంచి ఓటర్ జాబితా సవరణ అధికారి తొలగిస్తే, అటువంటి వ్యక్తి ఈ దేశంలో నివసించే హక్కుకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం విచారణ మొదలు పెట్ట వచ్చా”అని ధర్మాసనం ప్రశ్నించింది.
“కేంద్ర ప్రభుత్వం ఒక వ్యక్తి పౌరసత్వాన్ని రద్దు చేయటానికి ముందే, ఓటరు జాబితా సవరణ అధికారి అతని ఓటు హక్కును రద్దు చేసే అధికారం కలిగి ఉంటారా”అని కూడా సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది.
తాజాగా అమలవుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కసరత్తులో భాగంగా తొమ్మిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆరున్నర కోట్ల మంది పౌరులను ఓటరు జాబితా నుంచి తొలగించినట్టు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
“(ఓటరు జాబితా సవరణ అధికారి)విచారణ చేయవచ్చు. కానీ ఒక సారి విచారణ చేసి తన నిర్ణయానికి సంబంధించిన కారణాలు నమోదు చేసిన తర్వాత- సదరు నిర్ణయాన్ని పౌరసత్వ చట్టం కింద కేంద్ర ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవటానికి సంబంధించిన దశల వారీ కసరత్తును చేపట్టాల్సి ఉంటుందా? సదరు వ్యక్తి పౌరసత్వం గురించి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందుగానే ఎన్నికల సంఘం అతనికి ఉన్న హక్కును లాగేసుకోవచ్చా?”అని జోయ్ మాల్యా బాగ్చి ప్రశ్నించారు.
కేంద్ర ఎన్నికల సంఘం తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది రాకేష్ ద్వివేది స్పందిస్తూ, అక్కడికక్కడే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
తన వాదనను వినిపిస్తూ “అలా కానీ పక్షంలో, ఫలానా వ్యక్తి ఓటరు కాదని ఓటరు జాబితా సవరణ అధికారి నిర్ధారించిన తర్వాత కూడా సదరు వ్యక్తి ఓటరు జాబితాలో కొనసాగుతారు. ఓటు వేస్తాడు. ఒక సారి ఒక వ్యక్తి పౌరసత్వం మీద అనుమానం వ్యక్తమైన తర్వాత- సదరు అనుమానాలు నిరాధారమైనవి, విచక్షణా పూరితమైనవి కాకపొతే అటువంటి వ్యక్తిని పక్క పెట్టాల్సిందే. ఏదీ సమగ్రం కాదు. కానీ సమగ్రత అనే ఎండామావి కోసం మనం పరిగెడుతూనే ఉండాలి”అని అన్నారు.
ఎస్ఐఆర్ కసరత్తులో ఓటు హక్కు కోల్పోయిన వారు- పైస్థాయి అధికారులకు అప్పీలు చేసుకునే హక్కు కలిగి ఉంటారని ద్వివేది స్పష్టం చేశారు.
ఒకరిద్దరి కోసం మొత్తం ఎన్నికల కసరత్తును నిలిపి వేయాల్సిన అవరం లేదని, దాని పని అది చేసుకుంటూ వెళ్లాల్సిందేననీ ఆయన గుర్తు చేశారు.
“కేంద్ర ప్రభుత్వం అంతిమ నిర్ణయం తీసుకునే వరకూ మేము ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఆ నిర్ణయం ఏదైనా కావచ్చు” అని ఎన్నికల సంఘం తరఫున వాదనలు వినిపించిన ద్వివేది వివరించారు.
ప్రధాన న్యాయ మూర్తి సూర్యకాంత్ జోక్యం చేసుకుంటూ “పౌరులు కానీ వారికి హక్కు లేదని చెప్తున్నారా?” అని ప్రశ్నించారు.
ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నకు బదులిస్తూ ద్వివేది ఒక వ్యక్తి ని ఓటరు జాబితాలో చేర్చటానికి ముందు ఎన్నికల సంఘం పౌరసత్వం తనిఖీ చేస్తుందని, అటువంటి వ్యక్తిని దేశంలో కొనసాగనీయాలా లేక దేశం నుంచి వెళ్ళగొట్టాలాన్నది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని ఆయన అన్నారు.
“ఎన్నికల సంఘం నిర్ణయించినంత మాత్రాన సదరు వ్యక్తిని దేశం నుంచి తరలించాలనే నిబంధనేమి లేదనీ, అది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం” అని అయన అన్నారు.
విచారణ జరుగున్నపుడు ద్వివేది రాజ్యాంగ పరిషత్ చర్చలను ప్రస్తావిస్తూ పౌరసత్వ చట్టం, నియోజకవర్గాల పునర్వ్యవస్తీకరణ ఎన్నికల క్రమానికి పునాది అన్నారు.
2005లో సుప్రీంకోర్టు సదానంద సోనోవాల్ కేసులో ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ పౌరసత్వ చట్టంలోని తొమ్మిదో సెక్షన్ రెండో ప్రోవిసో ప్రకారం– ఒక వ్యక్తి విదేశీ పౌరసత్వం తీసుకున్నపుడు కేంద్ర ప్రభుత్వం మాత్రమే చర్యలు తీసుకొవాల్సి ఉంటుందనీ, మిగిలిన అన్ని సందర్భాల్లో అధికారులు కానీ న్యాయస్థానాలు కానీ పౌరసత్వాన్ని తనిఖీ చేయటంపై ఎటువంటి ఆంక్షలూ లేవని ద్వివేది సుప్రీంకోర్టుకు విన్నవించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో భారత పౌరసత్వం తీసుకోవటం భారీ వ్యయ ప్రయాసలతో కూడిన కసరత్తు అయ్యిందని బాగ్చి వ్యాఖ్యానిస్తే, పౌరసత్వం తేలిగ్గా ఇవ్వరాదనీ రాజ్యాంగ పరిషత్తు అభిప్రాయపడినట్టు ద్వివేది గుర్తు చేశారు. “ప్రస్తుతం అమలవుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ, రాజ్యాంగ పరిషత్ అభిప్రాయాలకు అనుగుణంగా జరుగుతోంది”అని కూడా అయన అన్నారు.
“రాజ్యాంగం అప్పటికి రూపొందే క్రమంలో ఉన్నదనీ- రాజ్యాంగంలోని 6, 7 అధికరణాలు చర్చించే నాటికీ దేశ పౌరులు ఎక్కడ ఉండాలన్నది పూర్తిగా నిర్ణయం చేసుకోలేదని; పదో అధికరణంలో పౌరసత్వం గురించి చర్చించిన అంశాలు రాజ్యాంగ పరిషత్ పౌరసత్వంపై రూపొందించిన నిశ్శితాభిప్రాయం”అని సూర్యకాంత్ అన్నారు.
ఇంతకు ముందు జరిగిన వాదనలు
జనవరి 6న జరిగిన వాదనల్లో ఎన్నికల సంఘం సమాంతరంగా పౌరసత్వ జాబితాను తయారు చేస్తుందంటూ వచ్చిన విమర్శలకు స్పందిస్తూ తాజాగా అమలు జరుగుతున్నా ఓటరు జాబితా ప్రత్యేక సవరణను సమర్ధించుకొన్నది.
విదేశీయులు ఎవరూ భారత ఓటర్ల జాబితాలో స్థానం సంపాదించకుండా చూడాల్సిన గురుతర బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉన్నదని, కేంద్ర ఎన్నికల సంఘం సమాంతర పౌరసత్వ జాబితా తయారు చేస్తోందనే వాదన అర్ధరహితమని ద్వివేది కొట్టిపారేశారు.
ఎన్నికల సంఘం తన వాదనలు వినిపించే నాటికీ ఉత్తర ప్రదేశ్లో మొత్తం 15.44 కోట్ల జనాభాకు సంబంధించిన సవరించిన ఓటరు జాబితాను ప్రచురించారు.
ఇందులో సుమారు మూడు కోట్ల మంది ఓటర్లను తొలగించారు.
“రాజకీయ పార్టీల వాగాడంబరం గురించి పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు. వాళ్ళ వాదనలు ఒప్పు కావచ్చు తప్పు కావచ్చు. ఎన్నికల సంఘంగా విదేశీయులు ఎవరూ భారత ఓటర్ల జాబితాలో స్థానం సంపాదించకుండా చూడాల్సిన గురుతర బాధ్యత మా మీద ఉన్నది”అని ద్వివేది అన్నారు.
జాతీయ పౌరసత్వ జాబితాకు ఓటరు జాబితాకు మధ్య తేడా ఉన్నదనీ, పౌరసత్వ జాబితాలో పిల్లలతో సహా అందరూ లెక్కకు వస్తే- ఓటరు జాబితాలో 18 ఏళ్లు నిండిన వయోజనులు మాత్రమే లెక్కకు వస్తారని ఎన్నికల సంఘం వాదించింది.
కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ చట్టంలోని 14(ఎ) సెక్షన్ ద్వారా పౌరసత్వ జాబితాను రూపొందిస్తుందని, ఎన్నికల సంఘం మాత్రం రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం, ఓటరు జాబితా రూపొందించేటపుడు పౌరసత్వాన్ని తనిఖీ చేసే అధికారాన్ని సంతరించుకుంటుందన్నారు.
ఎన్నికల సంఘం తన వాదన వినిపిస్తూ, రాజ్యాంగం భారతీయ పౌరులకు సంబంధించినదనీ, ప్రజా ప్రతినిధులు మొదలు న్యాయమూర్తుల వరకూ భారతీయ పౌరులే అయి ఉండాలని గుర్తు చేశారు. తదుపరి వాదోపవాదాలు జనవరి 16న జరుగుతాయి.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
