
ది వైర్ సిబ్బంది, ఫౌండేషన్ ఫర్ ఇండిపెండెంట్ జర్నలిజం నిర్వాహకులు, కన్సల్టింగ్ ఎడిటర్లపై అస్సాం పోలీసులు ఎటువంటి చర్యలకు పాల్పడరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: ది వైర్ వ్యవస్థాపక సంపాదకులు సిద్ధార్థ వరదరాజన్‌కు, కన్సల్టింగ్ ఎడిటర్ కరణ్ థాపర్‌కు, వైర్లో పనిచేస్తున్న- కథనాలు రాస్తున్న సిబ్బందిపై అస్సాంలో దాఖలైన రెండవ ఎఫ్ఐఆర్ ఆధారంగా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోరాదని సుప్రీంకోర్టు ఆగస్టు 22వ తేదీ ఆదేశించింది. పై వ్యక్తులపై గువాహటీ క్రైం బ్రాంచ్ పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 152 కింద కేసు నమోదు చేశారు. గత మూడు నెలలో ది వైర్‌పై అస్సాం పోలీసులు నమోదు చేసిన రెండవ దేశద్రోహం కేసు ఇది.
ది వైర్ వార్తా సంస్థను ఫౌండేషన్ ఫర్ ఇండిపెండెంట్ జర్నలిజం తరఫున వ్యవస్థాపక సంపాదకులు సిద్ధార్థ వరదరాజన్, ఎంకే వేణు, సిద్ధార్థ భాటియాలు నిర్వహిస్తున్నారు. ఫౌండేషన్ తరఫున దాఖలైన ఒక రిట్‌పిటీషన్‌లో సీనియర్ న్యాయవాది నిత్యా రామకృష్ణన్ వాదనలు విన్న తర్వాత, సుప్రీంకోర్టు పై ఆదేశాలను జారీ చేసింది.
తన వాదనను వినిపిస్తూ నిత్యా రామకృష్ణన్, ఫౌండేషన్ తరఫున రిట్‌పిటీషన్ దాఖలైన ఆగస్టు 12న సుప్రీంకోర్టు అస్సాం పోలీసులు మే 9న దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ది వైర్ నిర్వాహకులు- సిబ్బందిపై ఎటువంటి చర్యలు తీసుకోరాదని ఆదేశించిన విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకు వచ్చారు. విచారణకు పూర్తిగా సహకరించడానికి ది వైర్ సిబ్బంది సంపాదకులు సిద్ధంగా ఉన్నప్పటికీ, పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నందున న్యాయస్థానం నుంచి రక్షణ కోరుతున్నామని రామకృష్ణన్ తెలియజేశారు.
“రెండవ పిటీషనరు, ఫౌండేషన్ సిబ్బందిలపై బీఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 152 కింద నమోదైన ఎఫ్ఐఆర్ 3/2025 ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోకూడదు. అయితే, ఆరోపితులు విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాల్సి ఉంది” అంటూ శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సెప్టెంబరు 15కు వాయిదా వేసింది.
“రెండవ ఎఫ్ఐఆర్ కింద సిద్ధార్థ వరదరాజన్, కరణ్ థాపర్లను విచారణకు హాజరు కావాల్సిందిగా అస్సాం పోలీసులు ఆదేశిస్తూ, సమన్లు జారీ చేశారు. అయినప్పటికీ ఎఫ్ఐఆర్ కాపీ, మరే విధమైన వివరాలు అందజేయలేదు. ఎఫ్ఐఆర్లో ఏం ఉందో సారాంశంగానైనా తెలియజేయలేదు. సుదీర్ఘ ప్రయత్నాల తర్వాత మాత్రమే ఎఫ్ఐఆర్ను ది వైర్ నిర్వాహకులు చూడగలిగార”ని నిత్యారామకృష్ణన్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ది వైర్ మీద వరుసగా దాఖలవుతున్న ఎఫ్ఐఆర్లను చూస్తే, కేవలం వైర్ యాజమాన్యాన్ని, సిబ్బందిని వేధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తుందని నిత్య రామకృష్ణన్ ఆందోళన వ్యక్తం చేశారు.
దీని మీద ధర్మాసన న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాలా బాగ్చీ స్పందించారు. జరగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నామని తెలియజేశారు. అస్సాం పోలీసులను ఉద్దేశిస్తూ, ఎంతటి వారైనా చట్టాన్ని అతిక్రమించరాదని న్యాయమూర్తులు గుర్తు చేశారు.
మాజీ జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్(ఈ మధ్యనే చనిపోయారు) పాకిస్తాన్‌లోని పంజాబ్ తాత్కాలిక ముఖ్యమంత్రి- సీనియర్ పాత్రికేయులు నజమ్ సేథీ, ది వైర్ హిందీ సంపాదకులు అసుతోష్ భరద్వాజ్‌లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
“రాజకీయ నాయకత్వం జోక్యం కారణంగా భారతవాయుసేనకు చెందిన యుద్ధవిమానాలను పాకిస్తాన్ కూల్చివేసింది- ఇండోనేషియా భారత రాయబార కార్యాలయ రక్షణ విభాగ అధికారి”అనే వార్తను ది వైర్ వెబ్సైట్లో ప్రచురించినందుకు గాను సిద్ధార్థ వరదరాజన్‌తో సహా ఇతర వైర్ సిబ్బందిపై జూలై 11న బీఎన్ఎస్లోని సెక్షన్ 152 కింద అస్సాం పోలీసులు(మారిగాం పోలీసు స్టేషను) కేసు నమోదు చేశారు.
ది వైర్ సిబ్బందికి తాత్కాలిక రక్షణ కల్పిస్తూ అగస్టు 12న కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అయితే, అదే రోజున గువాహటీ క్రైం బ్రాంచ్ పోలీసులు ఇదే సెక్షన్ కింద నమోదైన మరో కేసు విషయంలో సిద్ధార్థ వరదరాజన్‌కు సమన్లు జారీ చేశారు.
మీడియా విశ్లేషకులు, పరిశీలకులు, పాత్రికేయులు, ప్రతిపక్ష పార్టీలు స్పందిస్తూ ది వైర్ నిర్వాహకులు, సిబ్బందిపై నమోదవుతోన్న కేసులను గమనిస్తే జర్నలిజాన్ని నేరంగా పరిగణించే ధోరణి కనిపిస్తోందని, దాంతో పాటు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసేవారిని కీలకమైన అంశాలకు సంబంధించి ప్రజలకు అవగాహనను కల్పించేందుకు, సమాచారం ఇచ్చేందుకు ఆరోగ్యవంతమైన చర్చకు అవకాశం కల్పించేందుకు జరుగుతోన్న ప్రయత్నాలన్నింటినీ అడ్డుకునే ధోరణి కూడా ప్రభుత్వ స్పందనలో దాగి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు ఆగస్టు 21వ తేదీ ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న స్వతంత్ర పాత్రికేయులు అభిసార్ శర్మపై కూడా బీఎన్ఎస్లోని 152వ సెక్షన్‌తో పాటు పలు సెక్షన్ల కింద అస్సాం పోలీసులు కేసు నమోదు చేశారు.
అభిసార్ శర్మ ప్రసారం చేసిన ఒక వీడియోలో అస్సాంలోని ఆదివాసులకు చెందన భూములను ప్రైవేట్ కంపెనీలకు విచ్చలవిడిగా అప్పగించడంపై అస్సాం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ మెహ్దీ చేసిన పదునైన వ్యాఖ్యలను ప్రస్థావిస్తూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారనే కారణంతో గువాహటీకి చెందని అలోక్ బర్వా అనే వ్యక్తి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా, అభిసార్ శర్మపై కేసు నమోదయ్యింది.
ది వైర్‌పై ఎఫ్ఐఆర్ల పరంపర, వరుసక్రమం..
♦ మే 9- సిద్ధార్థ వరదరాజన్, కరణ్ థాపర్లపై అస్సాం క్రైం బ్రాంచ్ పోలీసలు ఎఫ్ఐఆర్ నెంబర్ 3/2025ను నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్లో ది వైర్లో ప్రచురించిన 14 వ్యాసాలు- ఇంటర్వ్యూలు దేశ సౌర్వభౌమత్వానికి భంగం కలిగించే విధంగా ఉన్నాయని ఆరోపించారు. అయితే, ఏఎస్ దౌలత్, అవినాశ్ మోహననే, ఎస్కే సూద్, అజయ్ శుక్లా, అలీ అహ్మద్, మనోజ్ జోషి, రాహుల్ బేడీ, అనంద్ సహాయ్, హరీష్ ఖరే, రోహిత్ కుమార్ వంటి విశ్లేషకుల పేర్లను ఎఫ్ఐఆర్లో ప్రస్థావించలేదు.
♦ మే 9- ఆగస్టు 12 వరకు ఈ ఎఫ్ఐఆర్ను తాత్కాలికంగా పక్కన పెట్టారు.
♦ జూలై 11 ఆపరేషన్ సిందూర్ గురించి ఇండోనేషియాలోని భారతరాయబార కార్యాలయ రక్షణ విభాగ అధికారి చేసిన వ్యాఖ్యలపై ప్రచురించిన వార్తపై మరిగాం పోలీసు స్టేషనులో మరో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది.
♦ ఆగస్టు 12- జూలై 11న నమోదైన ఎఫ్ఐఆర్ నేపథ్యంలో ది వైర్ నిర్వాహకులపై దూకుడుగా వ్యవహరించరాదని సుప్రీంకోర్టు ఆదేశం.
♦ ఆగస్టు 22 క్రైం బ్రాంచ్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్పై సిద్ధార్థ వరదరాజన్, కరణ్ థాపర్లకు సుప్రీంకోర్టు రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.