“ఖర్చుపై పరిమితులు”: రాజకీయ పార్టీల ధనబలాన్ని నియంత్రించాలన్న విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు ఎందుకు విచారణ జరపాలి?
రాజకీయ పార్టీలు హద్దు లేకుండా ధనబలాన్ని ఉపయోగించడం ప్రజాస్వామ్య ప్రక్రియ మూలాలను దెబ్బతీస్తుందని పిటిషనర్ తరఫున వాదిస్తున్న న్యాయవాది ప్రశాంత్ భూషణ్ విన్నవించారు.
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు చేస్తున్న నియంత్రించలేని ఎన్నికల ఖర్చును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, భారత ఎన్నికల సంఘం స్పందనలు కోరుతూ ఫిబ్రవరి 26న సుప్రీంకోర్టు నోటీసులను జారీ చేసింది.
‘కామన్ కాజ్’ అనే ప్రభుత్వేతర సంస్థ దాఖలు చేసిన ఈ ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై న్యాయమూర్తులు సూర్యకాంత్, జోయ్‌మాల్య బాగ్చి, విపుల్ ఎం పంచోలిలతో కూడిన ముగ్గురు సభ్యుల బెంచ్ ఈ నోటీసులను జారీ చేసింది.
క్లిష్టమైన రాజ్యాంగ ప్రశ్నలను ఈ అంశం లేవనెత్తుతోందని బెంచ్ వ్యాఖ్యానిస్తూ, ఆరు వారాల తర్వాత విచారణకు ఈ అంశాన్ని వాయిదా వేసింది.
ప్రజాస్వామ్య మూలాలపై ధనబలం ప్రభావం
రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా ధన బలాన్ని వాడటం వల్ల ప్రజాస్వామ్య ప్రక్రియ మూలాలకు ముప్పు వాటిల్లుతోందని పిటిషనర్ తరఫున వాదిస్తున్న న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఇతర దేశాల పరిధుల్లో ఖర్చు పరిమితుల గురించి విచారణ సందర్భంగా న్యాయమూర్తి బాగ్చి ప్రస్తావిస్తూ, ఇలాంటి నియంత్రణ చర్యల సమర్థతపై ప్రశ్నలు తలెత్తగలవని అన్నారు. “అమెరికాలో కూడా ఖర్చులపై పరిమితులున్నాయి, అయితే అభ్యర్థుల స్నేహితులు చేసే ఖర్చుల మాటేమిటి?” అని జస్టిస్ బాగ్చి పేర్కొన్నారు.
అంతేకాకుండా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) కింద ఉన్న భావప్రకటనా స్వేచ్ఛను ఈ ఖర్చుల నియంత్రణలు ఉల్లంఘిస్తున్నాయన్న ప్రశ్న తలెత్తితే, రాజ్యాంగపరమైన ఆందోళనలు వ్యక్తమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు.
ఎన్నికల బాండ్ల రద్దు తీర్పు నేపథ్యం
దీనిపై ప్రశాంత్ భూషణ్ స్పందిస్తూ, ఎన్నికల బాండ్ల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకించారు.
అదుపు లేని రాజకీయ విరాళాలు ప్రజాస్వామ్యంపై చూపే చెడు ప్రభావాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే గుర్తించిందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
రాజకీయ పార్టీల ఖర్చులపై పరిమితులు విధించాలని కోరుతూ ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్'(ఏడీఆర్) దాఖలు చేసిన ఇలాంటి మరో పిటిషన్‌ను, సుప్రీంకోర్టులో తాజా పిటిషన్ దాఖలు చేసేందుకు వీలుగా ఢిల్లీ హైకోర్టు నుంచి 2024 జనవరిలో ఉపసంహరించుకున్నారు.
అజ్ఞాత విరాళాలకు చెక్: సుప్రీం చారిత్రక తీర్పు
ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఎన్నికల బాండ్ల పథకాన్ని 2024 ఫిబ్రవరి 15న ఏకగ్రీవంగా రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.
ఈ నేపథ్యంలో ప్రస్తుత పిటిషన్ ప్రాముఖ్యతను సంతరించుకుంది.
రాజకీయ పార్టీలకు అజ్ఞాత విరాళాలను అనుమతించే ఈ పథకం, సమాచారాన్ని తెలుసుకునే పౌరుల హక్కును, భావప్రకటనా స్వేచ్ఛా హక్కులను ఉల్లంఘిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. ఆర్థిక చట్టం-2017 ద్వారా ఆదాయపు పన్ను చట్టం, ప్రజాప్రాతినిధ్య చట్టంలో ప్రవేశపెట్టిన సవరణలను కూడా కోర్టు కొట్టివేసింది.
ప్రజల సమాచారం కోసం 2019 ఏప్రిల్ నుంచి కొనుగోలు చేసిన, నగదుగా మార్చుకున్న అన్ని ఎన్నికల బాండ్ల వివరాలన్నింటినీ భారత ఎన్నికల సంఘంతో పంచుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కోర్టు ఆదేశించింది.
అలాంటి నిధులను జప్తు చేసి, ‘క్విడ్ ప్రో కో'(ప్రతిఫలాపేక్షతో కూడిన) ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరుతూ వేరొక పిటిషన్ ప్రస్తుతం కోర్టు ముందు పెండింగ్‌లో ఉంది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
