నిర్బంధ ఉత్తర్వులలో ఏవైనా చట్టపరమైన లోపాలు ఉంటే, వాటితో పాటు రాష్ట్రం, సలహా మండలి తదుపరి ఉత్తర్వులన్నింటినీ కొట్టివేయడం జరుగుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
న్యూఢిల్లీ: గత ఐదు నెలలుగా నిర్బంధంలో ఉంటున్న పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తన నిర్బంధం కొనసాగింపుపై “పునరాలోచించాలని” కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది.
లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించి, ఆరవ షెడ్యూల్లో చేర్చాలన్న దీర్ఘకాలిక డిమాండ్‌పై వాంగ్‌చుక్ చేపట్టిన నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారింది.
దీని తర్వాత, 2025 సెప్టెంబర్ 26న వాంగ్‌చుక్ అరెస్టును తన భార్య గీతాంజలి ఆంగ్మో సవాల్ చేశారు.
లేహ్‌లోని తన ఇంటి నుంచి దాదాపు 1,400 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో వాంగ్చుక్ను ఉంచారు.
తరచూ కడుపు నొప్పి వస్తుండటంతో వాంగ్చుక్కు స్పెషలిస్టు డాక్టర్ చేత పరీక్ష చేయించాలని కోరుతూ ఆంగ్మో దరఖాస్తు చేసుకున్నారు.
నెలవారీగా ఆరోగ్య నివేదికలు ఇవ్వాలని కూడా కోర్టుకు ఆమె విజ్ఞప్తి చేశారు.
దీంతో ప్రభుత్వ స్పెషలిస్టు డాక్టర్ చేత పరీక్ష చేయించే విధంగా చూడాలని జైలు అధికారులను గత వారం కోర్టు ఆదేశించింది.
“ప్రభుత్వానికి పునరాలోచించడానికి గల అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నిర్బంధ ఉత్తర్వులను సెప్టెంబర్ 26న జారీ చేశారు. ఇప్పటికి దాదాపు ఐదు మాసాలు అవుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిజంగా బాగాలేదు, వయస్సు సంబంధిత ఇతర కారణాలు కూడా ఉన్నాయి” అని న్యాయమూర్తులు జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ పీబీ వరాలెలతో కూడిన బెంచ్ పేర్కొంది.
ఫిబ్రవరి 4న విచారణ ముగింపులో ఈ ప్రశ్న తలెత్తింది.
ఇది ప్రభుత్వానికి కూడా ఆందోళన కలిగించే అంశమేనని, దీనిపై తాను ఆదేశాలు కోరతానని పరిస్థితిపై స్పందిస్తూ అదనపు సోలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ చెప్పారు.
లేహ్ జిల్లా మేజిస్ట్రేట్ జారీ చేసిన నిర్బంధ ఉత్తర్వులను సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, సలహా మండలి జారీ చేసిన తదుపరి ఉత్తర్వులను వాంగ్‌చుక్ సవాల్ చేయలేదని నటరాజ్ వాదించినట్లు ‘లైవ్ లా’ తెలియజేసింది.
ఒకసారి నిర్బంధ అధికారి ఉత్తర్వులను జారీ చేసిన వెంటనే నిర్బంధితుని పట్ల న్యాయంగా వ్యవహరించడానికి ఎన్ఎస్ఏ కింద వివిధ నిబంధనలు ఉన్నాయని తను చెప్పారు.
నిర్బంధ ఉత్తర్వులు ఏవైనా చట్టపరమైన బలహీనతలతో ఉంటే వాటిని కొట్టిపారేయవచ్చునని, వాటితో పాటు రాష్ట్రం, సలహా మండలి తదుపరి ఉత్తర్వులను కూడా కొట్టివేయవచ్చునని బెంచ్ వ్యాఖ్యానించింది.
ప్రభుత్వం చేస్తున్న వాదనలను తిరస్కరిస్తూ, ఇది “ప్రమాదకర పంథా”కు దారితీస్తుందని కోర్టు పేర్కొంది.
నిర్బంధం ఏదైనా ఒక చెల్లుబాటు అయ్యే కారణంపై నిలబడాలని నటరాజ్ వాదించగా; పోలీసుల సిఫార్సులను యధాతథంగా తీసుకోవడం తప్ప, ఎక్కడా విచక్షణ(మెదడును) ఉపయోగించలేదన్న విషయం ఆ ఉత్తర్వులను బట్టి అర్థమవుతోందని కపిల్ సిబల్ అన్నారు.
ఆరవ షెడ్యూల్లో చేర్చాలన్న లద్దాఖ్ డిమాండ్‌ను నిరాకరించినట్లయితే- నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో యువకుల నాయకత్వంలో సాగిన ఉద్యమాలను స్ఫూర్తిగా తీసుకోవాలని యువకులను వాంగ్‌చుక్ రెచ్చగొట్టారని అంతకుముందు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది.
అంతేకాకుండా ప్రభుత్వాన్ని “వారు”గా, లద్దాఖ్ ప్రజలను “మనం” అని వాంగ్‌చుక్ అనడం ఎన్ఎస్ఏ విధించడానికి సరిపోతుందని కూడా ప్రభుత్వం వాదించింది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
