
పల్నాడులోని పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లో నిలబడ్డ రాంబాబు పదే పదే ఫోన్ చూసుకుంటున్నాడు. గట్టిగా ఊదితే గాలికి ఎగిరిపోయేంత బక్కగా ఉన్నాడు. భోజనం చేసి ఎనాళ్ళయ్యిందో మొఖం పాలిపోయింది, బక్కచిక్కిపోయి ఉన్నాడు. ఫోన్ పేలో డబ్బులు పడ్డాయేమో చూసి చెప్పమని తన పక్కకు ఉన్న వక్తిని వేడుకున్నాడు.
శ్రీకాకుళం జిల్లా పలాస దగ్గరలోని మారుమూల గ్రామం బాతుపురం నుంచి పని వెతుక్కుంటూ పిడుగురాళ్ల చేరినట్టు అపరిచిత వ్యక్తికి రాంబాబుకు చెప్పాడు. వ్యవసాయం గిట్టుబాటు కాక మూలపడిన గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద కూలీల్లో ఒకడు రాంబాబు. పిడుగురాళ్లలో ఒక ఇనుపరాడ్లు అమ్మే కొట్లో పనికి చేరాడు. ఆ యజమాని నాలుగు రోజులు పని చేయించుకుని జీతం ఎగ్గొట్టాడు. చివరికి బ్రతకడానికి డబ్బులు లేక తిరిగి ఊరు వెళ్లిపోదామని నిర్ణయించుకుని జీతం డబ్బులు ఫోన్ పే చేయమని చెప్పి బయలుదేరాడు. ఉన్న ఊళ్ళో చితికిపోయి, సంపాదిద్దామని వచ్చిన ఊళ్ళో మోసపోయే అనేక మంది అభాగ్యుల్లో రాంబాబు ఒకడు.
అప్పుల ఊబిలో రైతులు..
పిడుగురాళ్లకు పడమటి దిక్కున వెల్దుర్తి మండలంలో శ్రీరాంపురం తండా ఉంది. అక్కడ జటావత్ బాలు నాయక్ అనే లంబాడా యువకుడు(33), రాంబాబులాగే మోసపోయాడు. ఉన్న అర ఎకరా పొలంతో పాటు 7- 8 ఎకరాలు కౌలుకు తీసుకుని పెట్టుబడి కోసం అప్పు చేశాడు. ఏ యేటికాయేడు పంట బాగా పండితే అప్పు తీర్చ వచ్చని ఆశతో వ్యవసాయం చేశాడు. వ్యవసాయం అనే ఊబిలో చిక్కుకుని పీకల్లోతు అప్పులో మునిగిపోయాడు. చివరికి అతనికి ఇంకో దారి లేనేలేదనిపించింది. పురుగుల మందు తాగి గత సంవత్సరం జనవరిలోప్రాణం తీసుకున్నాడు.
బాలు భార్య అంజలి బాయికి నిండా పాతికేళ్ళు ఉండవు. యవ్వనంలోకి కాలు పెట్టిందో లేదో జీవితం చేజారిపోయింది. ఇద్దరు చిన్న పిల్లలు, అప్పులూ ఆమెను అన్ని వైపులా నుంచి మేఘాలలా కమ్మేశాయి. కూలికి పోతేగాని రోజు గడవదు. మంచం కోళ్లకు చీరతో ఉయ్యాల కట్టి చంటి పిల్లాడిని అందులో వేసి ఇరుగుపొరుగుకు అప్పచెప్పి పనికి వెళ్ళింది. ఒకవేళ కింద పడినా దెబ్బ తగలదని ఆమె ఆశ. కానీ వాడికి ముందు ముందు ఎన్ని దెబ్బలు తగలాలో ఎవరికి తెలుసు.
పిడుగురాళ్ల రైల్వే స్టేషనులోనే మరొక యువకుడు ఒంటి మీద సోయి లేకుండా పడి ఉన్నాడు. లేపి అడిగితే తాగిన మత్తులో ఏదో గొణిగాడు. నెల రోజుల క్రితం కూలికి వచ్చినట్లు, ప్రస్తుతం డబ్బులు లేనట్లు చెప్పాడు. “మా ఊరు పోతున్నా, ట్రైన్ వచ్చినప్పుడు లేపండి” అని అడిగాడు. సంపాదించిందంతా తాగేశాడని అర్ధమయ్యింది. గ్రామాల నుంచి కూలి పనికి వలసపోతున్న యువకుల్లో చాలా మంది పరిస్థితి దాదాపు ఇదేనేమో. దిక్కు తెలియని జీవితాలు.
ఈ పాపం ఎవరిది?
అదే జిల్లా గురజాల మండలం మాడుగులలో గంటా గణేష్‌కు 33 సంవత్సరాలే వయసు. పులిపాడు గ్రామంలో కన్నెబోయిన శివగంగరాజు వయసు 29 మాత్రమే. సంసారాలు ఈదలేక చనిపోయే వయసులు కావు వారివి. నూతన దాంపత్యంలో మధురానుభూతులు పొందుతూ హాయిగా ఉండాల్సిన కాలం. భూమి కౌలుకు తీసుకుని నాలుగు డబ్బులు గడించాలని ఆశపడటం వారు చేసిన పొరపాటు. పల్నాడు రైతులను మింగుతున్న పత్తి, మిర్చి వ్యవసాయం వారిని కూడా మింగేసింది. ఇంకా జీవితం తెలియని ఇద్దరు లేత వయసు స్త్రీల మీద భారం మోపి వాళ్ళ దారిన వాళ్ళు పోయారు.
అక్కడే కోనసీమ ప్రాంతం నుంచి వచ్చిన ఒక యువకుల జట్టు స్టేషన్లో సీసీటీవీల వైర్ బిగించే పని చేస్తూ కనపడ్డారు. వాళ్ళు ఇంజనీరింగ్, డిగ్రీ చదివిన కుర్ర వాళ్ళట, పనులు లేక ఈ పనికి వచ్చారు. చదువుకున్న కుర్రవాళ్ళు లేబర్ పని కోసం ఎక్కడ నుంచి ఎక్కడికి వచ్చారో కదా..!

మానవ హక్కుల వేదిక, రైతు స్వరాజ్య వేదిక బృందం 2025 జూలై 29, 30నాడు పల్నాడులో చూసిన దృశ్యాలు ఇవి. బక్కచిక్కి పోయిన గ్రామీణ ప్రాంతాలు అంతటా ఇదే స్థితి. ఎటు చూసినా వేదన. వ్యవసాయాలు పాడుబడ్డాయి. పని లేదు, ఆదాయం లేదు. ప్రభుత్వ విధానాలు వ్యవసాయంపై మొహం చాటేశాయి. విత్తనాలు, ఎరువులు, మందులు అన్ని కార్పొరేట్ల హస్తగతం అయ్యాయి. కనీస మద్దతు ధరలు లేవు. పల్నాడు గుండా సాగర్ కుడి కాలువ పారుతూ ఉంటుంది. కానీ ఈ మండలాలకు నీరు లేదు. లక్షలు ఖర్చు పెట్టి వెయ్యి అడుగులు పైబడి బోర్లు వేస్తే నీరు పడుతుందన్న నమ్మకం లేదు. వీటన్నిటికి తోడు ప్రకృతి వికటిస్తే రైతులు అసలే కోలుకోలేరు.
పట్టించుకోని కూటమి ప్రభుత్వం..
రైతు ఆత్మహత్య జరిగినప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం జీఓ 43ను జారీ చేసింది. దాని ప్రకారం, ఆత్మహత్య జరిగిన వెంటనే త్రిసభ్య కమిటీ(తాహసీల్దార్, ఎస్ఐ, వ్యవసాయ అధికారి)ఆ కుటుంబాన్ని కలిసి, విచారణ జరిపి, ప్రాథమిక నివేదికను డివిజన్ స్థాయికి పంపాలి. ఆ తరువాత డివిజనల్ స్థాయి కమిటీ(అర్డీఓ, డీఎస్పీ, ఏడీఏ) కూడా కుటుంబాన్ని కలిసి ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేసి, వారం రోజుల్లోగా ఎక్స్ గ్రేషియా మంజూరు కోసం తుది సిఫార్సును అందజేయాలి. ప్రభుత్వం దీన్నంతటినీ గాలికి వదిలేసింది.
అంతే కాదు, చంద్రబాబు ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆత్మహత్యలను తక్కువ చేసి చూపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి 300కు పైగానే రైతు ఆత్మహత్యలు జరిగినట్టుగా రైతు సంఘాలు, నేర పరిశోధన విభాగం లెక్కలు చూపిస్తున్నాయి. ఈ సంస్థలు లెక్కలు చెప్తుంటే, 39 మంది మాత్రమె చనిపోయారని ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయ మంత్రి స్వంత జిల్లా కంచిలి మండలంలో బల్లెడ నరసింహ మూర్తి అనే కొబ్బరి రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఆయన చనిపోతే ఇంతవరకు ఏ కమిటీ అక్కడకి వెళ్ళిన దాఖలాలు లేవు. ఈ విషయం మీద విలేకర్లు మంత్రిని ప్రశ్నిస్తే, “నా దృష్టికే అసలు రాలేద”ని బుకాయించారు.
గ్రామీణ సంక్షోభం లోతులు..
మేము పల్నాడు జిల్లాలో మొత్తం 9 కుటుంబాలను కలిస్తే అందులో ఒక్కరికే ఎక్స్ గ్రేషియా అందినట్లు చెప్పారు. ఇంకా రెండు కుటుంబాలకు సంవత్సరం క్రితమే త్రిసభ్య కమిటీ సిఫారసు చేసినా దిక్కు లేదు. అన్ని కుటుంబాల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఒక పక్క పిల్లల భవిష్యత్తు కోసం, ఆహార భద్రత కోసం బాధితులు ఆరాట పడుతుంటే, ఇంకో పక్క అప్పుల వాళ్ళ వేధింపులు తట్టుకోలేక దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.
ఈ విషవలయంలో సాధారణంగా చిక్కుకునేది కౌలు రైతులే. పెద్ద రైతులు ఎవరూ వ్యవసాయం చెయ్యట్లేదు. ఏ కొద్దిపాటి పొలం ఉన్నా కౌలుకు ఇచ్చేస్తున్నారు. గతంలో వ్యవసాయ కూలీలుగా ఉన్న బహుజన కులాల వారే ఇప్పుడు పనులు లేక కౌలుకు తీసుకుంటున్నారు. కొంతమంది చిన్న రైతులు కూడా అదనంగా కొంత పొలం కౌలు చేస్తున్నారు. ప్రస్తుతం చనిపోయేదంతా ఈ వర్గాల వారే. పనుల కోసం వలసలు పోతుంది కూడా వీరే.
వలసలనేవి మానవాళికి కొత్తేమీ కాదు. పనుల కాలంలో వలస వెళ్ళటం, కరువు కాలంలో వలసలు ఎప్పుడూ ఉండేవే. వాటికొక ప్రత్యేక రూటు ప్రత్యేక ప్రదేశాలు ఉండేవి. ఇప్పుడు జరుగుతున్న వలసలకు కాలంతో పని లేదు. ఒక ప్రత్యేకమైన ప్రాంతం, రూటు లేవు. గాలి వాటంగా ఎక్కడ కుదిరితే అక్కడకి పోతున్నారు. కోనసీమ వాళ్లు పల్నాడు రావచ్చు. కృష్ణాజిల్లా వాళ్ళు నెల్లూరు పోవచ్చు. బీహార్, ఝార్ఖండ్‌ల నుంచి గ్రామీణ ప్రజానీకం దేశమంతటా లేబర్ పనులకు పోతూనే ఉన్నారు. పల్లెలు నిరంతర చలనంలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఇటువంటప్పుడే ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేయడం అగ్నికి ఆజ్యం పోయడమే. ఈ వలసలను అధ్యయనం చేస్తే గ్రామీణ సంక్షోభం లోతులు తెలుస్తాయి.
గత పదేళ్లలో ఏపీలో 400మంది రైతుల చనిపోయారు. దేశవ్యాప్తంగా రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉన్నట్టుగా నేషనల్ క్రైం రికార్డుల బ్యూరో(ఎన్సీఆర్బీ)-2020 నివేదిక తెలుపుతోంది. దేశంలో 60% మంది ప్రజలకు ఉపాధిని కల్పించే రంగాన్ని ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయి. వ్యవసాయంలో పెట్టుబడులు పెడితే ఉపాధి, ప్రగతి రెండూ బాగుపడతాయని ఎందరో ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. అయినా జిలుగు వెలుగుల అమరావతే మనకు ధ్యేయం. కార్పొరేట్ పెట్టుబడులే మన అభివృద్ధి. ఈ భ్రమలు తొలగిపోనంత కాలం గ్రామాల వేదన కొనసాగుతూనే ఉంటుంది. చనిపోవడం, వలసపోవడం, మోసపోవడం, చితికిపోతూ బ్రతకడం తప్పదు.
(వ్యాసరచయిత మానవ హక్కుల వేదిక కార్యకర్త)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.