2026 ఫిబ్రవరి 12న దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెకు ప్రభుత్వ అనుకూల సంస్థ భారతీయ మజ్దూర్ సంఘ్ మినహా మిగిలిన కేంద్ర కార్మిక సంఘాలు సన్నద్ధమైయ్యాయి.
సమ్మెను బలపరుస్తూ గ్రామీణ బందుకు వ్యవసాయ కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా సన్నద్ధమవుతున్నాయి.
కార్మికులు జరప తలపెట్టిన సమ్మెకు రైతులు, వ్యవసాయ కార్మికులు మద్దతుగా నిలబడడం భారత కార్మిక ఉద్యమ చరిత్రలో ఇది ఒక ముఖ్య ఘట్టంగా నిలవనుంది.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కార్మికులకు భద్రత కల్పించేలా కార్మిక చట్టాలలో మార్పులు చేయాలని చాలా కాలంగా కేంద్ర కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
దీనికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం పాక్షికంగా అయినా ఎంతోకొంత రక్షణలు కల్పించే 29 కార్మిక చట్టాలను రద్దుచేసి, వీటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చింది.
కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక పోయిన చందంగా ఈ లేబర్ కోడ్లు ఉన్నాయి.
ఉదాహరణకు కాంట్రాక్ట్, క్యాజువల్, టెంపరరీ వంటి ఎలాంటి భద్రతా లేని ఉద్యోగాల స్థానంలో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు జరపాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
అయితే గతం కంటే మరింత దుర్భరమైన ఫిక్స్డటర్మ్ ఉద్యోగాలకు, ఉద్యోగుల స్థానంలోనే అప్రెంటిసులుగా ఎంతమందినైనా, ఎంతకాలమైనా నియమించుకునేందుకు ప్రభుత్వం తాజా కోడ్లలో పారిశ్రామికవేత్తలకు అవకాశం కల్పించింది.
రాజ్యాంగబద్ధ హక్కుల నిర్వీర్యం..
గతంలో 100 మంది కంటే ఎక్కువ కార్మికులు పనిచేస్తున్న సంస్థలలో లే ఆఫ్, లాక్ ఔట్ విధించాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి.
కానీ ప్రస్తుత కోడ్లో 300 మంది కార్మికులలోపు ఉంటే ప్రభుత్వ అనుమతి అవసరం లేదు.
దేశంలో అత్యధిక సంస్థలలో పని చేసే కార్మికుల సంఖ్య సగటున 300 కంటే తక్కువే.
అంటే దేశంలోని 99 శాతం పరిశ్రమల్లో యజమానులు ఇష్టారాజ్యంగా కార్మికుల జీవితాలతో ఆడుకోవచ్చు.
గతంలో ఏడుగురు కార్మికులు సంఘం పెట్టుకోవాలని నిర్ణయించుకుంటే ట్రేడ్ యూనియన్ చట్టం-1926 ప్రకారం సంఘం ఏర్పాటు చేసుకోవచ్చు.
ప్రస్తుతం తెచ్చిన కోడ్లో ఒక కార్మిక సంఘం ఏర్పాటు చేయాలంటే ఆ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులలో 10 శాతం మంది లేదా 100 మంది సంతకాలు చేయాలి.
ఇది కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకునే రాజ్యాంగబద్ధ హక్కును నిర్వీర్యం చేయడమే అవుతుంది.
ఈ మార్పు లక్ష్యమేంటంటే?
పారిశ్రామిక వివాదాల చట్టం-1947, ప్రకారం అత్యవసర సర్వీసులలో మాత్రమే 14 రోజులు ముందు నోటీసు ఇచ్చి సమ్మెకు వెళ్లవచ్చు.
మిగిలిన పరిశ్రమల్లో కార్మికులు ఎప్పుడైనా తమ హక్కుల కోసం సమ్మెకు సిద్ధం కావచ్చు.
కానీ కొత్త కోడ్ ప్రకారం, అన్ని సర్వీసులలో కూడా ముందుగా సమ్మె నోటీస్ ఇవ్వాలి.
కార్మిక శాఖతో కన్సీలియేషన్ పూర్తయ్యేదాకా సమ్మెకు వెళ్లకూడదు.
ఒకవేళ వెళ్తే అది చట్ట వ్యతిరేకమైన సమ్మెగా పరిగణించి సమ్మెలో పాల్గొన్న వారికి, సమ్మెకు మద్దతునిచ్చిన వారికి కూడా జరిమానాలు విధించవచ్చు.
కార్మిక సంఘాలు యాజమాన్యాలకు దాసోహమనేలా చేయడమే ఈ మార్పు లక్ష్యం.
ప్రస్తుత చట్ట ప్రకారం ఎనిమిది గంటలకు మించి పని చేయకూడదు.
కొత్త లేబర్ కోడ్లో ఎనిమిది గంటలకు మించి పని చేయించుకునే దానికి అనుమతి ఇచ్చే విధంగా తెచ్చారు.
కార్మిక చట్టాలలో గతంలో ఉన్న కొద్దిపాటి ప్రయోజనాలను కూడా లేకుండా పూర్తిగా వెట్టి చాకిరి చేసే బానిసలుగా కార్మికులను తయారు చేయడమే ఈ కోడ్ ల లక్ష్యం.
ఇవన్నీ పరిశ్రమాధిపతుల అడ్డగోలు లాభాలు పెంచుకోవడానికి దారి సుగమనం చేయడమే ఈ కోడ్ల వెనక దాగి ఉన్న అసలు రహస్యం.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(వ్యాపారం సులభతరంగా చేసుకోవాలి) కోసమే ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను చట్టాలుగా తెచ్చింది.
నిస్సిగ్గుగా ప్రకటించిన వైనం..
ప్రభుత్వ రంగ పరిశ్రమలను ఆధునిక దేవాలయాలుగా భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రకటించారు.
కానీ ప్రభుత్వ రంగ పరిశ్రమలు పుట్టింది చావడానికి అని నిసిగ్గుగా నేటి ప్రధాని మోదీ ప్రకటించారు.
ప్రభుత్వం వ్యాపారం చేయడం, సంస్థలు నిర్వహించడం కానీ చేయకూడదని; అలా చేసేవారికి వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరణ చేస్తామని బహిరంగంగా పార్లమెంటు వేదికలోనే ఈ ప్రభుత్వం ప్రకటించి అడ్డగోలుగా అమలు జరుపుతున్నది.

నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేర ప్రజల ధనంతో నిర్మాణమైన ప్రభుత్వ మౌలిక సదుపాయాలైన జాతీయ రహదారులు, విద్యుత్తు, గ్యాస్ లైన్లు, విమానాశ్రయాలు, పోర్టులు, స్టేడియంలు అన్నింటిని ప్రైవేట్ వారికి దీర్ఘకాలిక లీజుకు ఇస్తున్నది. పేరుకే అది లీజు. అచరణలో అది ప్రజల సొమ్మును ధారాదత్తం చేయడమే. ఆ విధంగా మొత్తం ప్రజా ఆస్తులను కొద్దిమంది భారీ పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతున్నది.
ఒక్కొక్కటిగా ప్రైవేటుపరం చేస్తోన్న మోదీ ప్రభుత్వం
అనేక ఉద్యమాలు, ప్రాణత్యాగాలు, అనేకమంది శాసనసభ్యుల రాజీనామాల పోరాటంతో విశాఖ ఉక్కు కర్మాగారం సాధించబడింది. ఇది దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఉక్కును ఉత్పత్తి చేసే ప్రతిష్టాత్మక సంస్థగా ఎదిగింది. దీనిని ఇప్పుడు ప్రైవేటు వారికి అప్పగించడానికి ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా శత విధాల ప్రయత్నం చేస్తోంది. కానీ కార్మిక వర్గం ప్రజల అండతో అప్పటినుంచి చేస్తున్న నిరంతర ఆందోళన కారణంగా నేటికీ ప్రభుత్వం దానిని ప్రైవేటు వాళ్లకి అప్పగించలేకపోయింది. దొడ్డిదారిన నీరుగార్చే చర్యలు అమలు జరుపుతున్నవి.
బ్యాంకుల విలీనం పేరుతో ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్వీర్యం చేస్తున్నది. అత్యంత లాభాలు గడిస్తూ కేంద్ర ప్రభుత్వానికి నిధులు సమకూరుస్తున్న ఎల్ఐసీని కూడా ప్రైవేట్ వారికి ధారాధత్తం చేయబోతున్నది. అందులో భాగంగానే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తలుపులు తెరిచింది.
రైల్వేలోని అనేక విభాగాలు, పనులు ప్రైవేటువారికి అప్పగించారు. సాధారణ ప్రజల ఆర్డినరీ రైళ్ల రద్దు, జనరల్ బోగీల తగ్గింపు, స్లీపర్ కోచ్ ల తగ్గింపులాంటి చర్యలన్నీ అమలు చేస్తున్నారు. రైల్వే ఛార్జీల పెంపు ఇష్టానుసారంగా మారింది. వయోవృద్ధులకు ఉన్న ప్రయాణ రాయితీని కరోనా నేపంతో రద్దుచేసి నేటికీ పునరద్ధరించలేదు.
తిమింగలాల లాంటి సంస్థలకు అప్పగించే చర్యలు
ప్రత్యామ్నాయ ఇంధనం పేరుతో విద్యుత్ రంగాన్ని మొత్తంగా కార్పొరేట్ల స్వాధీనం చేయడానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈపాటికి పలు రాష్ట్రాలలో ప్రైవేటీకరణ అమలు జరుగుతున్నది. కొత్తగా స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజల నడ్డి విరగ్గొట్టేందుకు సిద్ధమైంది. విద్యుత్ బస్సుల ముసుగులో దేశంలోని ఆర్టీసీలను అన్నింటికి సమాధి కట్టే చర్యలు ప్రారంభమైయ్యాయి.
విద్యుత్ బస్సులు కొనేది నిర్వహించేది నడిపేది ప్రైవేటు యజమానులే. ఆ పేరిట వచ్చే వేల కోట్ల రాయితీలను కూడా సొంతం చేసుకుంటోంది ప్రైవేటు రంగమే. రానున్న కాలంలో బస్సు చార్జీలు అనూహ్యంగా పెరుగుతాయి. సుమారు పది కోట్ల మంది ప్రైవేట్ రవాణా రంగ కార్మికులకు సామాజిక భద్రతా చట్టం చేయాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుండగా, మొత్తం రవాణా రంగాన్ని ఉబర్, ఓలా, రాపిడోలాంటి జాతీయ, అంతర్జాతీయ తిమింగలాల లాంటి సంస్థలకు అప్పగించే చర్యలు చేపట్టింది.
కార్పొరేట్ల హస్తగతం చేసే ప్రయత్నం
ఇందు గలడందు లేడనే సందేహం వలదు, చక్రీ సర్వోపగతుండు ఎందెందు వెదికిన అందందే కలడు దానవాజ్ఞినిన్ అన్నట్లు- మొత్తం దేశ సంపదను ఎంపిక చేసిన కొద్దిమంది పారిశ్రామికవేత్తలు లూటీ చేయడానికి, ప్రజలపై విపరీతంగా భారాలు మోపడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల చర్యలు చేపడుతున్నది. అన్ని రంగాల్లో వారి ప్రత్యక్ష పరోక్ష దోపిడీకి యదేచ్ఛగా తలుపులు తెరిచింది.
వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ల హస్తగతం చేసి- పేద, మధ్యతరగతి రైతులను వ్యవసాయం నుంచి వెళ్ళగొట్టే చర్యలు చేపట్టింది. అందులో భాగంగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను యావత్తు రైతాంగం 13 నెలలు పోరాడి, 750 మంది ఆత్మతర్పణ చేసి చట్టాలను వెనక్కి నెట్టగలిగారు. అయినా నేటికి అన్ని పంటలకు గిట్టుబాటు ధరను ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరిస్తున్నది.
కార్పోరేట్లకు వ్యవసాయ రంగ అప్పగింత
2014 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక అందుకు నిరాకరిస్తున్నది. వ్యవసాయ ఖర్చులు విపరీతంగా పెరిగి, గిట్టుబాటు ధరలు రాక ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వేధింపులను తట్టుకోలేక పెద్ద సంఖ్యలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
వామపక్షాల బలం మీద ఆధారపడి ఏర్పడిన యూపీఏ ప్రభుత్వం “మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని” తెచ్చింది. ఇది పనులు, ఆదాయాలలేమితో ఆకలి చావులు లేకుండా ఉండడానికి; ఆత్మహత్యలకు పాల్పడకుండా ఉండడానికి వ్యవసాయ కార్మికులకు, గ్రామీణ పేదలకు ఎంతగానో తోడ్పడుతున్నది.
ఇప్పుడు ఈ చట్టం పేరు మార్చి పనిదినాలకు గ్యారెంటీ లేకుండా, అసలు పని ఉంటుందో లేదో తెలియకుండా కేంద్ర ప్రభుత్వ వాటా గణనీయంగా తగ్గించి రాష్ట్రాలపై భారాలు మోపింది. దీంతోపాటు చేసిన పనికి డబ్బులు చెల్లించకపోవడం, బయోమెట్రిక్ లాంటి పద్ధతులు అమలు చేసి మొత్తంగా గ్రామీణ పేదలను ఈ చట్టానికి దూరం చేస్తున్నది.
మహిళా సాధికారికత గురించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నానా యాగీ చేసి, అధికారానికి వచ్చిన 9 సంవత్సరాలకు నామమాత్రంగా చట్టం చేసి, అమలు మాత్రం దీర్ఘకాలం వాయిదా వేసింది. ఈ పదకొండేళ్ల కాలంలో మహిళలపై అత్యాచారాలు, గృహహింసలు నిత్యకృత్యం అయ్యాయి.
విద్యా, యువజన రంగాలపై దాడి..
నూతన విద్యా విధానం పేరుతో హరిజన, గిరిజన, వెనుకబడిన తరగతుల వారికి ఉన్నత విద్యని దూరం చేయడం, చదువు కొనలేనంత భారంగా తయారు చేయడం ఈ నూతన విద్యా విధానం లక్ష్యం.
మొత్తం ప్రపంచంలోనే యువకులు అత్యధికంగా ఉన్న దేశం మన భారతదేశం. ఈ యువకులకు సాలీన రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని 2014లో హామీ ఇచ్చి, నేడు ఉన్న ఉద్యోగాలు ఊడగోడుతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలలో, రైల్వేలో లక్షల సంఖ్యలో ఖాళీలు ఉన్నప్పటికీ ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదు. ఆ విధంగా యువతి, యువకులు ఉపాధి లేక పెడమార్గాలు పట్టడం, మాదక ద్రవ్యాలకి అలవాటు పడటంలాంటి అనేక దురలవాట్లకు లోనవుతున్నారు.
ప్రభుత్వ వైద్య రంగ నిర్వీర్యం
“వైద్యో నారాయనో హరి. ఆరోగ్యమే మహాభాగ్యం” వంటి సామెతలు తెలిసినవె. కానీ ప్రభుత్వం వైద్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీకి ఎర్ర తివాచీపరిచింది. నేడు ఆరోగ్యం అందని ద్రాక్ష పండుగ, భరించరాని భారంగా మారింది. కనీసం మధ్యతరగతి ఉద్యోగులు కూడా ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీకి తట్టుకోలేక ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఇక సాధారణ ప్రజల సంగతి చెప్పనలవి కాదు.
ఈ విధంగా 11 సంవత్సరాల నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా శత్రువుగా తయారైంది. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను భరిస్తూ తలవంచుకొని పోవడమా లేక ప్రభుత్వాన్ని నిలదీయడమనేవి నేడు ప్రజల ముందున్న సవాళ్లు. ఓట్లేసి అధికారాన్ని కట్టబెట్టిన అన్ని తరగతుల ప్రజలు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడమే పరిష్కారం.
అందుకే కేంద్ర కార్మిక సంఘాలు, వివిధ జాతీయ ఫెడరేషన్లు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు సంయుక్తంగా ఈ విధానాలని మార్చుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సిద్ధమైయ్యారు.
ఇది కేవలం కార్మికులు, ఉద్యోగులు రైతులుకు మాత్రమే పరిమితం కాదు. మొత్తం ప్రజల ప్రయోజనాల పరిరక్షణ కోసం జరుగుతున్నదే ఈ సమ్మె.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
