బీహర్ శాసనసభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ముగిసింది. అయినప్పటికీ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో చొరబాటుదారులున్నారని ప్రధానితో సహ కేంద్ర హోంమంత్రి, ఇతర బీజేపీ పెద్దలు ఇంకా ప్రచారం చేస్తూనే ఉన్నారు. కానీ అధికారిక సమాచారం దీనికి కొంత భిన్నంగా ఉంది. అసలు చొరబాటుదారులంటే ఎవరనేది మోడీ, అమిత్షా స్పష్టంగా నిర్వచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తమ సొంత దేశాన్ని విడిచి భారతదేశంలోకి చట్టవిరుద్ధంగా వచ్చేవారిని చొరబాటుదారులంటారా? లేక దేశంలోని ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వివిధ కారణాల వల్ల వెళ్లి అక్కడ స్థిరపడిన పౌరులను కూడా చొరబాటుదారులుగా గుర్తిస్తున్నారా? బీహార్లో ఇప్పటికే ఎస్ఐఆర్ను పూర్తిచేశారు. మరి చొరబాటుదారులెవరన్నది ఎన్నికల సంఘం ఇంకాను గుర్తించలేకపోయిందా?
ఇక అసలు విషయానికి వస్తే, పాస్పోర్టు- విదేశీయుల చట్టాల కింద 2023లో కేవలం 5గురుపై బీహారులో కేసులు నమోదయ్యాయి. 2022లో మూడు, 2021లో ఒక కేసు మాత్రమే ఈ చట్టాల కింద నమోదైందని నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో ఆలస్యంగా విడుదల చేసిన “క్రైమ్ ఇన్ ఇండియా నివేదిక- 2023”లో వెల్లడించింది.
దేశ పరిస్థతిని గమనిస్తే..
2023లో విదేశీయుల నమోదు చట్టం- 1939, విదేశీయుల చట్టం- 1946, పాస్పోర్టు చట్టం- 1967, ఇమ్మిగ్రేషన్ చట్టం- 1983, పౌరసత్వం చట్టం- 1955ల కింద 2,290 కేసులు నమోదయ్యాయని నివేదిక తెలిపింది. ఈ చట్టాల కింద ఎక్కువగా పశ్చిమ బెంగాల్లో 1050 కేసులు నమోదు కాగా త్రిపూరలో 277, మహారాష్ట్రలో 272, తమిళనాడులో 167, పంజాబ్లో 78 కేసులు నమోదైనట్లు పేర్కొన్నది.
“ప్రిజన్ స్టాటిక్టిస్స్ ఆఫ్ ఇండియా-2023”ని కూడా విడుదల చేశారు. ఈ వివరాల ప్రకారం జైళ్లలో ఖైదీలుగా ఉన్న విదేశీయుల సంఖ్య 2022లో 6,283 నుంచి 2023లో 6,956కు చేరుకుంది. అంటే 10.7% ఖైదీల సంఖ్య పెరిగింది. వీరిలో దోషులుగా నిర్ధారించబడి శిక్షను అనుభవిస్తున్న వారు 1,499; నేరారోపణలతో విచారణను ఎదుర్కొంటున్నవారు 5,167 మంది ఉన్నారు.
రాజ్యానికి వ్యతిరేకంగా 2022లో 5,610; 2023లో 4,873 అంటే 13.1% నేరాల కేసులు నమోదయ్యాయి. ఇవికాక పర్యావరణ సంభందిత కేసులు 2023లో 68,994; 2022లో 52,920 కేసులు నమోదయ్యాయాని నివేదిక వివరించింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
