ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)రాజకీయ మారణహోమమని ప్రముఖ ఆర్ధికవేత్త, రాజకీయ వ్యాఖ్యాత పరకాల ప్రభాకర్ అన్నారు. దీనిని ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
కర్నాటకలోని ధార్వాడ్‌లో ఎద్దేలు కర్నాటక సంస్థ, ఇతర సంఘాలు ఎస్ఐఆర్పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. ఈ కార్యక్రమంలో పరకాల ప్రభాకర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా సర్ గురించి వివరంగా, దాని విభిన్న కోణాల గురించి ఆయన తెలియజేశారు.
సజాతీయ సమాజాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్న ఒక వర్గానికి చెందిన వారు ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రవేశపెట్టారని ప్రభాకర్ అన్నారు. అంతేకాకుండా, “ప్రపంచవ్యాప్తంగా గతంలో జరిగిన ఇలాంటి ప్రయత్నాలను ఒకసారి గమనించాలి. ఆసియా, ఐరోపా, అమెరికావంటి దేశాలలో ఏమైంది? ఒకప్పుడు ఈ ప్రాంతాలలో వరుస హత్యలు జరిగాయి, మారణహోమం జరిగింది. కానీ కాలం మారింది, ప్రస్తుతం హత్యలలాంటివి ఏమీలేవు. ఇప్పుడు ఎవరినైనా హత్య చేయాలనుకుంటే, దాంతో సమానమైన ఓటరు జాబితా నుంచి పేరును తొలగించడం సరిపోతుంది. ఎలాంటి రక్తపు మరకలు లేకుండా ఇదో కొత్త రకం మారణహోమం”అని పేర్కొన్నారు.
“సర్ “రాజకీయ మారణహోమం”తప్పా మరొకటి కాదు. పౌరులు దీనిని చూస్తూ ఊరుకోరాదు. ఈ ప్రక్రియను బహిష్కరించాల్సిన అవసరం ఉంది”అని నొక్కి చెప్పారు.
“మన మధ్య ఏర్పడ్డ ఉదాసీనత కారణంగానే సర్ వచ్చిందన్న విషయాన్ని మర్చిపోకూడదు. భారత ప్రధాన న్యాయమూర్తిపై షూ విసిరేసిన సంఘటనకు లేదా, అనేక ప్రాంతాల్లో అల్లర్ల వల్ల అమాయకుల హత్యలు, మణిపూర్‌లో దహనంలాంటి చాలా సంఘటనలకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేసి ఉండుంటే అధికారంలో ఉన్న వారు సర్‌ను ప్రవేశపెట్టడానికి సాహసించేవారు కాదు”అని ప్రభాకర్ అన్నారు.
“తమ ఓటు హక్కు ద్వారా మైనారిటీలు, మహిళలు, నిరక్షరాస్యులు,పేదలు రాజకీయ అభిప్రాయాన్ని తెలియజేయకుండా ఉండేలా సర్ ఒక పరికరం లాంటిది. మన మధ్య విభేదాల వల్ల సర్ వచ్చిందనే వాస్తవాన్ని మరిచిపోకూడదు”అని చెప్పుకొచ్చారు.
“సర్ అనేది ప్రధానంగా ఒక పార్టీకి ఎన్నికల సమయంలో సహాయపడటం కోసం కాదు. దీని వెనుక అసలైన దీర్ఘకాల ఉద్దేశ్యం ఉంది. అదే రాజ్యాంగాన్ని మార్చివేయడం”అని హెచ్చరించారు.
“ఒక వ్యక్తి ఒక ఓటు సిద్ధాంతం ఆధారంగా రాజ్యాంగ హక్కులను, ఓటు హక్కును కల్పించడమైంది. ఈ హక్కులను సర్ కాలరాస్తుంది. ముందే ఓటు హక్కును కల్పించిన ప్రజాస్వామ్య దేశం మరొకటి లేదు. పాలకులు నెమ్మదిగా మహిళలు, మైనారటీలకు ఓటు హక్కును విస్తరించార”ని ప్రభాకర్ గుర్తుచేశారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
( www.pressreader.comలో ప్రచురితమైన ఈ వ్యాసం ది హిందు సౌజన్యంతో ది వైర్ తెలుగు పాఠకులకు అందిస్తున్నాం.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
