
“Strength does not come from physical capacity.It comes from an indomitable will” అంటారు గాంధీజీ. కొన్ని దశాబ్దాలుగా ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని, ఎన్నో ఆటుపోట్ల సంద్రాలను ఎదురీదుతూ, దాని పునాదులపైనే జీవన నివాసాన్ని నిర్మించుకొని, కార్ల్ మార్క్స్ కమ్యూనిస్టు సమానత్వపు సమాజాన్ని సంకల్పిస్తూ, దానికై ఆలోచిస్తూ, దాన్నే అక్షరీకరిస్తూ, బతకడమంటే మామూలు విషయం కాదు.
నమ్ముకున్న సిద్ధాంతం పట్ల సమాజంలో సానుకూల, ప్రతికూల అంశాలు ఉంటాయి. అయినప్పటికీ బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో మార్పే ధ్యేయంగా ముందుకు కదలడమంటే, సవాళ్ళను దాటుకుంటూ తమ ప్రయాణాన్ని ఆపకపోవడం అంటే అదో పెద్ద సమరపు సాహసమే అనాలి. ఉన్నం వెంకటేశ్వర్లు, ఉషలు ఇద్దరూ ఒక్కటై, ఒకే జీవిత సిందూరపు కవిత్వమై, మహాకవి శ్రీశ్రీ స్పూర్తితో మరో ప్రపంచం పిలిచిందంటూ ‘పెట్టుబడి’కి కవితల కట్టుబడితో ఉద్యమించారు.
“పనిచేసే వాళ్లు కష్టాల కొలిమిలో కాలుతుంటే చేయించుకునే వాళ్ళు ఆకాశానికి ఎగబాకుతున్నారు.ఎందుకిలా జరుగుతోంది?” అంటూ కొన్ని శతాబ్దాల పాటు నాగరికతలో నిగూఢమై ఉన్న ఈ ప్రశ్నను సంధిస్తూ తమదైన రీతిలో మనతో బలంగానే చర్చిస్తారు. ‘దాస్ కేపిటల్’ సారాంశంగా సాగిన ఈ రచన, మనల్ని ఓ శాస్త్రీయ ప్రపంచంలోకి తీసుకెళ్తూ ఆలోచింపజేస్తుంది.
“చదువు నేర్చి ఎదిగిన వాడే
సంపన్నుడూ జ్ఞానీ అన్నారు
అన్నీ సాధించాక తెలిసింది
అదీ ఒక అమ్మకపు సరుకని”
ఇలా ఆరంభంలోనే సమాజంలోని నగ్న సత్యాలను బహిరంగంగానే ఆవిష్కరించారు. చదువు “కొనడం”నేటి స్వాతంత్ర భారతంలో కామన్ మ్యాన్‌కు చాలా కష్టమైన విషయమే. కనీసం తమ బతుకుల్లా తమ పిల్లల బతుకులు కాకూడదనీ, స్థాయికి మించిన అప్పులు చేస్తూ, అప్పుల ఊబిలో ఈదుతూ ఎన్నో అవమానాలకు గురవుతూ, లక్షల్లో కార్పొరేట్ ఫీజులు కట్టి మరీ చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివిస్తున్నారు.
భూమి గుండ్రంగా ఉందని ప్రతిపాదించిన గెలీలియోను, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందన్నందుకు కోపర్నికస్‌ను ఆనాటి అనాగరిక, అజ్ఞాన సమాజం నిర్బంధాల చట్రంలో హింసించిన తీరును గుర్తు చేశారు.
“కుల మత కట్టడుల కుట్రలన్నీ
సొంత ఆస్తి కపట నాటక వేదికలే ”
అంటూ ఆనాదిగా చరిత్ర గుండెల్లో నిక్షిప్తమైన ఆవేదనా గేయాన్ని అక్షరావేశాల్లో వ్యక్తం చేశారు. ప్రైవేట్ పెట్టుబడిలో కరుడుగట్టిన రహస్యాన్ని, స్వేదం మిగిల్చిన ఆకలి పోరాటానికి లాభం లేపే తరగని ఆరాటంలోని వాదానికి, శ్రామిక వేదాన్ని కలగలిపి అద్భుతంగా వివరించారు.
ఆకలి మాపే అవసరం కోసం
అనంత విశ్వాన్ని శోధిస్తూ ఎదిగిన క్రమంలో సంపదంతా కొందరి సొంతమైతే, అందరికీ వాటాకై పోటాపోటీ పెనుగులాటలో “పిల్లులు సైతం పులులవుతాయి” అంటూ శతాబ్దాల రాపిడిలో శ్రమ విజయమే జ్ఞాన శాస్త్రమైందంటారు.
భూస్వామ్య వెట్టిని మట్టు పెట్టి
పట్టణ గట్టు పట్టి పాకినోడు
స్వతంత్ర పౌరుడయ్యాడు
కొత్త రెక్కల “స్వేచ్ఛా”వాదులు
వృత్తి సంస్థల అధిపతులయ్యారు.
ఏదీ లేనోళ్ళు రోజూ “రెక్కలమ్మే”
నిత్య దిన భత్య కార్మికులయ్యారు” అనడంలోనే
కాల పరిణామ క్రమంలో సామాన్యుని బతుకు చిత్రాన్ని సంపూర్ణంగా మన ఎదురుగా మన కళ్ళకు కనిపిస్తున్నట్లే చూపించారు. ఈ ఎలక్ట్రానిక్ ప్రపంచంలో కూడా పేదరికపు సంగ్రామంలో ఇంకా ఓడిపోతున్న కొన్ని కోట్ల కుటుంబాల చిరునామాల ఆనవాళ్లను తమ పుస్తకంలోని ఎన్నో కవితల ద్వారా మౌన జ్వలిత గీతాలై వినిపించారు.
ఇక పెట్టుబడి విన్యాసాలలో భాగంగా “కానరాని కథలన్నీ తవ్వి తీసి, తరతరాల చరిత్ర సారం వడకట్టి” రక్తపు మడుగుల్లో సంపద పెరిగిన విధానాన్ని “దాష్టీకపు దౌర్జన్యపు ప్రజాస్వామ్యం”గా చెప్పుకొచ్చారు. సంఘర్షణల రంగస్థలంలో మన దారేదో మనమే వెతుక్కుంటూ, పెట్టుబడి పెట్టే కష్టాలపై పోరాడాలంటే, ఉత్పత్తి సంపదల పంపిణీ తీరులో చెలరేగే ఘర్షణలపై గురి పెట్టి, మోసపు కట్టుబడి పంట సారాన్ని తెలుసుకోమంటున్నారు.
“చెప్పక దోచడం ‘చట్టబద్ధం’
చెప్పీ దాచడం ‘న్యాయబద్ధం’
కాదు కూడదంటే తప్పదు యుద్ధం
వర్గ న్యాయమే వర్ణధర్మం
సొంత ఆస్తే సొంత ధ్యేయం” అంటూ అసలు రాజ్యాధికారం ఎవరిదని ప్రశ్నిస్తూ, నిర్వచించని కొండంత ప్రశ్నను సంధించి నేటి ప్రజాస్వామ్యాన్ని విశ్లేషించమంటున్నారు.
“నిరుద్యోగ విపణి వీధిలో వెలిసిపోయిన ‘ఆమె’ వేతనం చట్టం”ఆడ” బ్రతుకునొక భ్రమ”వంటి ఎన్నో పంక్తులు పాఠకుల్ని కాసేపు నిశ్శబ్ద వాతావరణంలో బలంగా ఆలోచించేలా చేస్తాయి. స్వేచ్ఛా- బానిసత్వం, వంచక ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఒక పచ్చి అబద్ధంమంటూ practical existence గురించి మాట్లాడుతారు.
“మంచిని ఓడించైనా
మందిని ముంచేసైనా
సంపదనే గెలిపించే”
ఓ వర్గపు మనుషుల గురించి
విజ్ఞానపు విజయమా?
అజ్ఞానపు ఆధిక్యమా?
అంటూ ఘాటుగానే ప్రశ్నించారు.
ఆకలితో అలమటించే వాడికి వేదాంత బోధనలు ఎందుకు?
పట్టెడన్నం చాలంటారు వివేకానంద కూడా ఓ సందర్భంలో, ఇలాగే అన్నారు.
“కాలే కడుపులో
రగిలే ఆకలిని చల్లార్చేది
ఏ వేదం? ఏ నాదం?
శ్రమశక్తికి శ్రమ వాటా దక్కడం
ఒక్కటేగా చక్కటి పరిష్కారం” అంటూ రచయితలు తమ తీర్పును వెల్లడించారు.
సంపదకు ప్రాణం పోసే వాడికి కటిక దారిద్ర్యమే మిగులుతుంటే, దాన్ని పెట్టుబడిగా మింగేవాడికి
తరగని ఆస్తి ప్రాప్తిస్తున్న ప్రస్తుత ప్రజాస్వామ్య నాటకంలో, కష్టజీవి రక్తం పీల్చే కీటకం గురించే ఈ పుస్తకం మొత్తం అల్లుకు పోయింది.
“ఆలోచించి ఆచరించు.
అదునులో స్పందించకపోతే
నీలో పదునే దిగజారుతుంద”నే సందేశాన్నీ, మొత్తానికి బలమైన వామపక్ష భావజాలాన్నీ పాఠకులకు అందించారు రచయితలు.
ఈ పుస్తకంలోని అన్నీ ఆలోచనలతో మనం ఏకీభవించినా, ఏకీభవించకపోయినా, తెలుసుకోవడంలో మాత్రం తప్పు లేదనిపించింది. పుస్తకమంతా చదివాక ఏది ఎంతవరకు అన్వయించాలో లేదా ఇంకా శోధించాలో పాఠకులే నిర్దేశించుకోవాలి. ఈ విశ్వమంతా శూన్యంలో విభిన్న ఆలోచనల సంఘర్షణల తాలూకు అన్వేషణ ప్రయాణమే కదా! కాలం ఎప్పుడూ సత్యం వెంటనే ప్రయాణిస్తుంది.
ఏదేమైనా ఆదిమ మానవుల కాలం నుంచి, నేటి ఆధునిక సాంకేతిక యుగం వరకు మానవ పరిణామ కోణాన్ని ఒక దృక్పథంలో వివరించిన మరో మహా ప్రస్థానం ఈ పుస్తకం. ఒక్క మాటలో చెప్పాలంటే, “Workers of the world unite. you have nothing to lose but your chains” అని పలికిన కార్ల్ మార్క్స్ ప్రతి పాదంలో మనకు కనిపిస్తారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.