
1958లో శంకర్ విలాస్ ప్రాంతంలో నిర్మించిన రైల్ ఓవర్ బ్రిడ్జి గుంటూరు జిల్లా కేంద్రంగా ఉన్న గుంటూరు పట్టణంలో తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలను అనుసంధానిస్తూ దాదాపు ఆరున్నర దశాబ్ధాలు సేవలందించింది. రెండు నియోజజకవర్గాల మధ్య అనుసంధానం మాత్రమే కాక జిల్లాలో ప్రసిద్ధ పర్యాటక కేంద్రం అమరావతి, ఆ పైన కృష్ణా నది ఒడ్డు వరకూ ఉన్న గ్రామాలను చేరుకోవాలన్నా, మధ్యలో ఉన్న తాడికొండ చుట్టు ప్రక్కల ప్రాంతాలను చేరుకోవాలన్నా ఈ బ్రిడ్జి దాటి ప్రయాణం చేయటం అనివార్యం. ఈ విధంగా చూసుకున్నప్పుడు కేవలం నగరంలోని రెండు భాగాలను అనుసంధానించటంతో పాటు వందలాది గ్రామాలు, మండలాలు, కొన్ని నియోజకవర్గాలను కూడా అనుసంధానం చేసే వేదికగా ఈ బ్రిడ్జి పనిచేసింది. తాజాగా నగరం పశ్చిమానికి బాగా విస్తరించటంతో ఈ వైపు వెళ్లే వాహనాలు, ప్రయాణీకులకు(గుజ్జనగుండ్ల, పలకలూరు, ఆర్టీఓ ఆఫీసు వగైరా) కూడా ఈ బ్రిడ్జే ఆధారం.
గత రెండు మూడు దశాబ్దాల్లో నగరంలో పెరిగిన వాహనాల రద్దీ, ప్రత్యేకించి దశాబ్దం క్రితం అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించటంతో మార్కెట్ మొదలు అంబేడ్కర్ విగ్రహం వరకూ ఉమ్మడిగానూ, అంబేద్కర్ విగ్రహం నుంచి రెండుగానూ ఈ రహదారిని నాలుగు లైన్లు లేదా ఆరులైన్లు రహదారిగా విస్తరించాల్సిన తక్షణ అవసరం ముందుకు వచ్చింది. ఈవిధంగా మార్కెట్ నుండి అమరావతి రోడ్డు వరకు ఆరు లైన్లు లేదా నాలుగు లైన్ల రహదారి విస్తరణ, సర్వీసు రోడ్డుతో సహా పూర్తికావాలంటే బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న ఆసుపత్రులు, స్వయం ఉపాధి కేంద్రాలుగా ఉన్న చిరువ్యాపారులు, వాణిజ్య సముదాయాలను పెద్ద ఎత్తున తొలగించాల్సి వస్తోంది. ఈ నష్టం జరక్కుండా ఉండటానికి మిగిలిన అన్ని ప్రధాన నగరాల్లో ప్రణాళికలు రూపొందించిన విధంగానే గుంటూరు నగరంలో కూడా ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించటం తక్షణ అవసరంగా ముందుకొచ్చింది. కనీసం ఈ ఎలివేటెడ్ కారిడార్ అంబేద్కర్ విగ్రహం వద్ద మొదలవుతుందనుకున్నా హిందూ కాలేజి వరకు సుమారు 1.6 కిలోమీటర్ల నిడివిలో ఉంటుంది. ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం పూర్తి అయితే, ఈ వైపు వెళ్ళే వాహనాలు సునాయాసంగా తక్కువ సమయంలో తమ గమ్యాన్ని చేరటానికి ప్రధాన వనరుగా ఈ ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ పని చేస్తుంది. నిజానికి ఈ ఎలివేటెడ్ కారిడార్ గుంటూరు సెంట్రల్ బస్ స్టాండ్ మీదుగా ఆటోనగర్ వద్ద కలిస్తే, జాతీయ రహదారికి అనుసంధానం చేస్తూ దాదాపు అర్థచంద్రాకారంలో గుంటూరు నగరానికి అలంకారంగా నిలవటమే కాక ప్రస్తుతం ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్డులో పెరగనున్న ట్రాఫిక్ రద్దీని కూడా నియంత్రించటానికి ఉపకరిస్తుంది.
అటకెక్కిన ప్రతిపాదన..
2017లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీల సమక్షంలో రహదార్లు- భవంతుల మంత్రి శంకర్ విలాస్ రైల్ ఓవర్ బ్రిడ్జి ఆధునీకరణ/ ఎలివేటెడ్ కారిడార్ కోసం ఓ బృహత్ ప్రణాళికను ప్రకటించారు. ఈ ప్రణాళికలో భాగంగా సుమారు 167 కోట్ల బడ్జెట్ అంచనాలతో ప్రతిపాదనలు పెట్టారు. వంద అడుగులు రోడ్డుకు ఇరువైపులా రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణం, సింగిల్ పిల్లర్(ఒంటి స్థంభం) ఫ్లైఓవర్ నిర్మాణం ప్రతిపాదనలో ఉన్నాయి.
రైల్వే అండర్ బ్రిడ్జిలు ప్రధానంగా గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని, ఆవల ఉన్న గ్రామాలను నగరంతో అనుసంధానం చేస్తాయి. ప్రతిపాదిత సింగిల్ పిల్లర్ ఫ్లైఓవర్ నగరం నడిబొడ్డున పెరుగుతోన్న ట్రాఫిక్ రద్దీని తగ్గించటానికి ఉపకరిస్తుంది. అదనంగా శంకర్ విలాస్ కేంద్రంగా అభివృద్ధి అయిన వాణిజ్య కూడలికి కావల్సిన అదనపు పార్కింగ్ స్థలాలను కూడా అభివృద్ధి చేయవచ్చు.
అలాగే, ఈ ప్రతిపాదిత రైల్వే అండర్ బ్రిడ్జిలు ప్రధానంగా కలెక్టర్ కార్యాలయం మీదుగా కానీ, మార్కెట్ సెంటర్ నుంచి కానీ ప్రభుత్వ ఆసుపత్రి, సెంట్ జోసఫ్ ఆసుపత్రి, ఏసీ కళాశాల, వైద్య కళాశాలలకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అందుబాటులోకి తెస్తాయి. కానీ 2019లో ప్రభుత్వం మారటంతో ఈ ప్రతిపాదన అటకెక్కింది. మౌలిక రంగంలో ప్రభుత్వ ప్రతిపాదనలు, ప్రాధన్యతలు మారిపోయాయి.
పునరుద్ధరణ ప్రతిపాదనలు?
2024లో రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అధికారానికి వచ్చింది. వచ్చీరాగానే అమరావతే రాష్ట్ర రాజధాని అని ప్రకటించింది. దాంతో గుంటూరు జిల్లాలో పడావుగా పడి వున్న వసతుల ప్రాజెక్టులకు ప్రాణం వస్తుందని, నగరానికి నూతన శోభ వస్తుందని ఆశించారు. పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీగా గెలవటం, కేంద్రంలో మంత్రిపదవి పొందటం కూడా ఆ ఆశలకు కొత్త జీవం పోసింది. ఆయన అధికారంలోకి రాగానే ఆదుర్దాగా శంకర్ విలాస్ బ్రిడ్జి కోసం నిధులు సమకూర్చే ప్రయత్నం చేశారు. అయితే అనాలోచితంగా సేతు బంధన్ పథకం కింద 98 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపుల మీద పలు ప్రశ్నలు, ఆందోళనలు కూడా ఉన్నాయి. అందులో ఇంత వరకూ సవివరమైన ప్రాజెక్టు నివేదిక తయారు కాలేదు. ఈ ప్రాజెక్టు మన్నికైనదా కాదా అన్న విషయాన్ని కూడా పరిశీలించలేదు. ప్రాజెక్టు వల్ల కలిగే సామాజిక ప్రభావం గురించిన అధ్యయనం జరగలేదు. ఈ ప్రాజెక్టు పుట్టు పూర్వోత్తరాలు, ఎవరి యాజమాన్యంలో ఈ ప్రాజెక్టులు నడుస్తాయన్న విషయాలకు సంబంధించిన గందరగోళాలు ఉండనే ఉన్నాయి.
పరస్పరం విరుద్ధమైన వాదనలు..
రహదారులు- భవంతుల మంత్రిత్వ శాఖేమో ప్రస్తుతం ఐదున్నర మీటర్ల ఎత్తు ఉన్న ఆర్ఓబీ స్థానంలో ఏడు మీటర్ల ఎత్తున్న ఆర్ఓబీ నిర్మాణం జరగాలని రైల్వే శాఖ కోరింది అన్నారు. అలా జరగాలంటే రైల్వే కూడా ఈ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో కొంత భరించాలి.
జిల్లా కలెక్టరు, కార్పోరేషన్ అధికారులు మాత్రం ట్రాఫిక్ రద్దీని తగ్గించటానికే ఈ ప్రాజెక్టని చెప్తున్నారు. అంతేకాకుండా నాలుగు లైన్ల బ్రిడ్జి సరిపోదని, ఆరు లైన్ల కారిడార్‌లో బ్రిడ్జి నిర్మాణం కావాలని అంటున్నారు. అయితే, నిధుల కొరత వల్ల నాలుగు లైన్ల ప్రతిపాదనతోనే ముందుకు సాగాలన్నారు.
1. క్రొత్త బ్రిడ్జి పాత బ్రిడ్జి కంటే కొద్దిగా వెడల్పుగా ఉండటం తప్ప, ఈ ప్రతిపాదన వలన వచ్చే సౌకర్యం ఏమీ లేదు.
అ) ప్రస్తుతం ఉన్న బ్రిడ్జి ఎక్కడ ప్రారంభమైందో అక్కడే కాస్త అటూఇటుగా అదే రహదారిపైన ప్రారంభం కావాలి.
ఆ) వాహనాలు వచ్చి వెళ్ళే దారుల మధ్య విభజన లేకుండా ఇప్పుడున్నట్లు ఉండాలి. అంటే ప్రస్తుతం ఉన్న రద్దీ యధావిధిగా ఉండటం
ఇ) విశాలమైన సర్వీసు రోడ్డుకు అవకాశం లేకుండా, దీర్ఘకాలిక వ్యూహం లేకుండా పోవడం
2) ప్రస్తుతం ఉన్న ప్రతిపాదనల్లో మౌలికంగా తీవ్రమైన లోపాలు..
అ) రైల్వే అండర్ బ్రిడ్జిలు లేకుండా పాత నగరానికి, కొత్త నగరానికి మధ్య అనుసంధానం ఇబ్బంది
అవుతుంది.
ఆ) ఆసుపత్రులు, కళాశాలలు, కోర్టులు, రైల్పే స్టేషన్‌కు వెళ్ళటానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే డిజైన్ చాలీచాలని రోడ్లు
℘ ఇంత మార్కెట్ కూడలికి దారిచ్చే సర్వీసు రోడ్లు ఐదున్నర మీటర్లు మాత్రమే అంటే రెసిడెన్షియల్ కాలనీ స్థాయి కంటే తక్కువ. కనీసం 30 అడుగుల రోడ్డు ఉంటేనే కానీ గృహ నిర్మాణానికి అనుమతులు రాని తరుణంలో, 18 అడుగుల సర్వీస్ రోడ్డు స్థానికుల అవసరాలు తీర్చేవిగా ఉండవు.
℘ రెండు వైపులా రాళ్ళతో రిటైనింగ్వాల్స్ నిర్మాణం అంటే ట్రాఫిక్ మరింత రద్దీగా తయారవుతుంది.
℘ కనీసం 250 మీటర్ల పొడవునా రెండు వైపులా రాళ్ళగోడ అంటే వాహనాలు బ్రిడ్జి ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు బాగా రద్దీ పెరుగుతుంది.
℘ కీలకమైన ఆసుపత్రి ప్రాంతంలో అంబులెన్స్‌లు వంటి అత్యవసర సేవలు అందించే వాహనాలు నిలపి ఉంచేందుకు అవకాశం ఉండదు.
℘ భవిష్యత్తులో పెరిగే ట్రాఫిక్ గురించి శాస్త్రీయ అవగాహన లేకపోవటం, ప్రస్తుతం తయారు చేసిన బ్లూ ప్రింట్లో కేవలం రానున్న పదేళ్ళల్లో పెరిగే ట్రాఫిక్‌ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని తయారు చేసింది కావటం గమనార్హం.
℘ దీర్ఘకాలంలో పెరిగే పట్టణీకరణ ప్రభావం గురించి అంచనా కానీ, అవగాహన కానీ లేకపోవడం, ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదనను పూర్తిగా విస్మరించచటం ఎవరికి ప్రయోజనకరం?
ప్రస్తుతం ప్రతిపాదించిన శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ ప్రతిపాదన కేవలం కేంద్రం ఇచ్చే నిధులతో మాత్రమే పరిమితమై పూర్తి చేయాలన్న ఆలోచనతో ముందుకు సాగుతోంది. ఇది నగర అవసరాలకు కానీ భవిష్యత్తులో తలెత్తే సమస్యలు కానీ తీర్చటానికి ఉపయోగపడదు. దీర్ఘకాలిక వ్యూహం, సమగ్ర అధ్యయనం, ప్రజాభిప్రాయ సేకరణ లేకపోవడంతో ఈ ప్రాజెక్టు నగర పౌర జీవనానికి, ఆర్థిక జీవనానికి ఉపయోగపడేది కాకపోగా తీవ్రంగా నష్టం కలిగించేదిగా మారనున్నది.
ప్రస్తుత ప్రతిపాదన నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించకపోగా మరింత జఠిలం చేస్తుంది. ట్రాఫిక్ జామ్‌లు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వివిధ ప్రాంతాల మధ్య ఉన్న అనుసంధానాన్ని దెబ్బతీస్తాయి. ఈ ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలకు కుదించేస్తాయి. వాణిజ్య కూడలిగా ఉన్న ప్రాంతం దివాళా తీస్తుంది. అత్యవసర సేవలు సకాలంలో అందుకునే సదుపాయం నగరవాసులకు ఉండదు.
గుంటూరు నగరవాసులు మరింత మెరుగైన సేవలు అందుకునేందుకు అర్హత కలిగినవారే. ఇలా అత్తెసరు నిర్మాణాలతో తమ జీవితాలను మరింత సంక్లిష్టంగా మార్చుకోవడానికి సిద్ధంగా లేరు. భవిష్యత్తులో నగర విస్తరణను దృష్టిలో పెట్టుకుని కావాల్సిన మౌలిక వసతులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రతిపాదించిన నాలుగు లైన్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి నమూనా దీర్ఘకాలంలో చూపించే నష్టదాయక ప్రభావం గురించి అంచనా, అవగాహన కలిగిన పౌర సమాజం ఒక సంయుక్త కార్యాచరణ కమిటీగా ఏర్పడింది. లోపభూయిష్టమైన ప్రాజెక్టు గురించి అటు ప్రజల్లోనూ, ఇటు ప్రభుత్వ విభాగాల్లోనూ అవగాహన కల్పించేందుకు కృషి చేస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ఉన్న నమూనాతో ముందుకెళితే నగర సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక జీవనానికి జరిగే నష్టం గురించి ప్రజలకు అవగాహన కల్గించేందుకు ప్రయత్నిస్తోంది. అయినా ప్రభుత్వం పౌరసమాజం లేవనెత్తే అభ్యంతరాలను పెడచెవిన పెట్టి ముందుకెళ్ళడానికి సిద్ధమవుతోంది. అందువల్ల ఈ సంయుక్త కార్యాచరణ కమిటీ చొరవ తీసుకుని హైకోర్టులో ఓ రిట్ పిటీషన్ కూడా దాఖలు చేసింది. ప్రస్తుతం ఈ సమస్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిశీలనలో ఉంది.
బ్రాడీపేట, అరండల్ పేట కూడళ్లలో దశాబ్దాల పాటు ఆయా కుటుంబాలకు జీవనాధారంగా ఉన్న దుకాణాలను కూల్చేసి, ఆ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళటానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా శంకర్ విలాస్ ప్రాంతంలో ఉన్న యాభై దుకాణాల యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల జరిగే నష్టాన్ని మరో చోట భర్తీ చేయటానికి వీలుగా, గుంటూరు కార్పోరేషన్ ముందుకు తెచ్చిన బదిలీ చేయగల అభివృద్ధి హక్కుల(ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్) బాండ్లను తిరస్కరించారు. ఇదో కీలకమైన పరిణామం. ప్రాజెక్టులో ఉన్న లోపాల గురించి ప్రభుత్వం పునరాలోచన చేసేందుకు పురిగొల్పే పరిణామం. ఈ బాండ్లకు బదులుగా 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని దుకాణదార్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ న్యాయబద్ధమైనదేనని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ధృవీకరించింది. 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం లెక్కించి బాధితులకు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
హైకోర్టు ఆదేశించిన తర్వాత కూడా నేటి వరకూ ప్రభుత్వం భూసేకరణ చట్టం ప్రకారం చర్యలు ప్రారంభించలేదు. ఈ చట్టాన్ని అమలు చేయాలంటే సుమారు 70- 80 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాల్సి వస్తుంది. ఈ నాసిరకమైన ప్రణాళికతో హడావుడిగా ప్రాజెక్టు చేపట్టటం కంటే ఈ ప్రాజెక్టును 90 అడుగుల వెడల్పయిన ఆరులైన్ల ఫ్లై ఓవర్‌గా మార్చాలి. ఇప్పటికే ప్రస్తుతం నాలుగు లైన్ల ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం 98 కోట్లు కేటాయించింది. హైకోర్టు ఆదేశాలమేరకు నష్టపరిహారం ఇవ్వడానికి మరో 80 కోట్లు అవసరం అవుతాయి. వెరసి అత్తెసరు ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 180 కోట్ల రూపాయల వరకూ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. పౌర సమాజం ప్రతిపాదించే ఆరడుగల నిడివిగల బ్రిడ్జి నిర్మాణానికి కూడా అయ్యే ఖర్చు ఇంచుమించు అంతే. కాబట్టి అంతే ఖర్చుతో కనీసం మరో అర్ధశతాబ్ది అవసరాలు తీర్చే ఫ్లైఓవర్ ప్రాజెక్టును నిర్మించుకోవటం విజ్ఞుల లక్షణం.
పౌర సమాజం డిమాండ్ చేస్తున్న ప్రాజెక్ట్ మొదట్లో 2017లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపాదించినదే. అదే ప్రణాళికను యధాతథంగా అమలు చేస్తే, సింగిల్ పిల్లర్‌తో ఆరులైన్ల ఎలివేటెడ్ కారిడార్, అవసరమైన అండర్ బ్రిడ్జిలతో నిర్మిస్తే నగరానికి కనీసం యాభై నుంచి డెబ్బై సంవత్సరాలపాటు ఢోకా ఉండదు. ప్రభుత్వంపై అదనంగా పడే భారం ఏమీ ఉండదు. ఉన్న నగరాన్ని మరింత చీకటి కొట్టుగా మార్చే విధానాలు, ప్రతిపాదనల విషయంలో ప్రభుత్వం, అధికారులు పునరాలోచించాలి. నగర విస్తరణ, ట్రాఫిక్ వంటి దీర్ఘకాల సమస్యలకు, దీర్ఘకాల పరిష్కారాలు అందించేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలి. సంకుచిత తాత్కాలిక ప్రయోజనాల కోసం మొండితనం ప్రదర్శిస్తే పౌర సమాజ ప్రతిస్పందనను ఎదుర్కోక తప్పదు.
మొండిగా కేంద్రమంత్రి వ్యవహారం..
ఈ కథనం వ్రాయడం మొదలు పెట్టే సమయానికి బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. కేంద్ర మంత్రి, శాసన సభ్యులు పునరాలోచిస్తున్నారని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను, ఆశలను తల్లక్రిందులు చేస్తూ గత వారం నుంచి బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. బ్రిడ్జికి ఇరువైపులా పిల్లర్లు వేయడానికి గుంతలు తవ్వటం మొదలయ్యింది. ప్రజల అభ్యంతరాలు, ఆలోచనలు ఆందోళనలు నిర్ద్వందంగా తోసిపుచ్చిన కేంద్రమంత్రి, తన మొండివైఖరిని మరోసారి ప్రదర్శించారు. తాను అనుకున్నదే వేదం, తాను చేసింది ఎవరూ ప్రశ్నించటానికి వీలులేదన్నట్లు ఆయన అధికారుల మీద ఒత్తిడి తెచ్చి పనులు ప్రారంభమయ్యేలా చేసారనేది సుస్పష్టం.
ఈ మొండితనానికి మూల్యం ఎవరు చెల్లించాలి? ప్రజలా?
ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనాలను దారి మళ్ళించారు. వీటన్నింటిలో చూపిన అత్యుత్సాహం ప్రాజెక్టులో మొదటి అంశమైన 120 అడుగుల రోడ్డు విస్తరణకు ఎందుకు మొగ్గుచూపట్లేదు. రోడ్డు విస్తరణ చేయకుండానే బ్రిడ్జి నిర్మాణం చేపట్టి, దారులన్నీ మూసేసి ప్రజలని తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తారా? కనీసం ప్రాజెక్టు నమూనాలను డిజైను చేసి ఇచ్చిన సంస్థ సూచించినట్లుగా రైలు గేటు గాని ఆర్యూబీ(రైల్వే అండర్ బ్రిడ్జ్)లను కానీ నిర్మించకుండా అడ్డగోలుగా నిర్మాణం చేపట్టారు. రోడ్డు విస్తరణకు కావాల్సిన కార్యాచరణ ఏమీ లేకుండా, అడ్డంకులను తొలగించకుండా బ్రిడ్జి ఎలా నిర్మిస్తారు? భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించకుండా, భవనాలను తొలగించకుండా, కొన్ని చోట్ల 80 అడుగులు, కొన్ని చోట్ల 100 అడుగులు ఉన్న రోడ్డులో బ్రిడ్జి నిర్మాణంలో ఉపయోగించే పెద్ద ప్రొక్లైనర్లు, హెవీ వెహికల్స్‌తో శంకర్ విలాస్ సెంటరుని రెండేళ్ళపాటు మూసివేయదల్చుకున్నారా? ఒకవేళ నష్టపరిహారం చెల్లించటానికి(సుమారు 70 కోట్లు) డబ్బులు లేకపోతే, బ్రిడ్జిని మధ్యలో ఆపేస్తారా? పగలగొట్టిన గోడలు, తీసిన గుంతలు తిరిగి నిర్మిస్తారా? లేదా శంకర్ విలాస్ ఫ్లైఓవర్ సాధన సమితి మొదటి నుంచి కోరుకున్న విధంగా మీ ప్రభుత్వం గతంలో ప్రతిపాదించిన ఐకానిక్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి పూనుకుంటారా? ఎందుకంటే భవన యజమానులకు మీరివ్వాల్సిన 70 కోట్లు బ్రిడ్జి నిర్మాణానికి ఉపయోగిస్తే మీరనుకున్న ఒరిజినల్ ఫ్లై ఓవర్ వస్తుంది. అప్పుడు ఎవరికి నష్ట పరిహారం చెల్లించకుండానే, ప్రజలకు కావాల్సిన విధంగా బహుళ ప్రయోజనాలు కూర్చే ఫ్లై ఓవర్ వస్తుంది. కాబట్టి ఇప్పటికయినా కళ్ళు తెరిచి, మొండితనం వీడి, ప్రజాభీష్టం మేరకు నడుచుకుంటే గుంటూరు నగర ప్రజలు శాపగ్రస్తులుగా మారకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. అంతేకాకుండా వరప్రసాదులుగా మీరు, మీ శాసన సభ్యులు మిగలాలని అనుకుంటున్నారు. లేదు మేము ఇలాగే ముందుకు వెళ్తామంటే మీ ఇష్టం. ఇటువంటి నియంతృత్వానికి వ్యతిరేకంగా గత సంవత్సరమే ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. మీ భవిష్యత్తు కూడా వారి చేతుల్లోనే ఉందని మరువకండి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.