పెరూ దేశంలోని లిమాలో ఐక్యరాజ్యసమితి అనుబంధ ఆహార వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏఓ) 11వ పాలక మండలి సమావేశం నవంబర్ 24 నుంచి 29వ తేదీ వరకు జరగనున్నది. ఈ సమావేశంలో వర్కింగ్ గ్రూపు ప్రతిపాదించే అంతర్జాతీయ విత్తన ఒడంబడికకు సంబంధించిన సవరణ ముసాయిదాపై చర్చ జరపనున్నారు. అయితే ప్రపంచ రైతు కూటమి సంఘాలు ఈ సవరణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఒక దేశ వ్యవసాయ వారసత్వాన్ని లేదా జన్యుపరమైన వనరులను ఇతర దేశాలకు ఇచ్చిపుచ్చుకోవటానికి ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలో నిర్ణయించేందుకు అంతర్జాతీయ ఒడంబడికను 2002లో కుదిర్చింది. దాని పేరే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ట్రీటీ ప్లాంట్ జనటిక్ రిసోర్సెస్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్. ఈ ఒడంబడికపై భారత్ సహా 154 దేశాలు సంతకాలు చేశాయి. 2004 నుంచి ఈ ఒడంబడిక అమలవుతోంది. దీన్ని సభ్యదేశాలన్నీ విధిగా పాటించాలి.
వారసత్వ మేధా హక్కులపై దీని ప్రభావం గణనీయంగా ఉంటుంది. 64 రకాల విత్తనాలు, మొక్కలు, వంగడాలు దీని పరిధిలోకి వస్తాయి. ప్రపంచంలో ఈ పంటలకు సంబంధించిన 70 లక్షలకు పైగా విత్తనాల నమూనాలు అంతర్జాతీయ స్థాయిలో విత్తన నిధుల్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ విత్తనాలను ఉపయోగించుకుని సరికొత్త వంగడాల తయారీపై 28 వేలకు పైగా విత్తన సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. వీటిల్లో బేయర్, కోర్టెవా, సిజెంటా, బీఎఎస్ఎఫ్ కంపెనీలు విత్తన రంగంపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.
ప్రకృతి మనుగడకు, ఆహార భద్రతకు, వ్యవసాయానికి, రైతుల సాంప్రదాయ పారంపర్య హక్కులకు విత్తనం మూలాధారం. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ప్రత్యేక విత్తనాలు, వంగడాలు ఉన్నాయి. స్వతంత్రమైన దేశంలో అనాధిగా ఉన్న విత్తనాలు, మొక్కలు, వంగడాలు వాటి జన్య వనరులు ఆ దేశం సొత్తు. వేలాది సంవత్సరాలుగా వీటిని సాగు చేస్తూ, తమ పొలాల్లో సేద్యానికి, ఇతర రైతులతో పంచుకుంటూ జీవనం సాగిస్తున్న రైతాంగం సొత్తు ఈ విత్తనం.
పెట్టుబడిదారీ దేశాల ప్రయోజనాలకు అనుకూలంగా నిర్ణయాలు..
ఐక్యరాజ్యసమితిలో పెట్టుబడిదారీ దేశాల ఆధిపత్యమే కొనసాగుతున్నది. అమెరికా, యూరోపియన్ దేశాలు ఐక్యరాజ్యసమితిని శాసిస్తున్నాయి. ఫలితంగా అది తీసుకునే నిర్ణయాలు పెట్టుబడిదారీ దేశాల ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటున్నాయి. దాని నేతృత్వంలో కుదిరిన విత్తన ఒడంబడిక కూడా అందుకు మినహాయింపు కాదు.
ఈ ఒప్పందం పెట్టుబడిదారీ దేశాల బహుళజాతి విత్తన సంస్థల ఆధిపత్యాన్ని నెలకొల్పే విధంగా ఉంది.
వెనకబడిన దేశాల విత్తన జన్యువులను సేకరించి తమ వద్ద ఉన్న టెక్నాలజీతో అభివృద్ది చేసిన విత్తనంపై బహుళ జాతి సంస్థలు పేటెంట్ హక్కులు పొంది, వాటి అనుమతి లేకుండా ఏ దేశ రైతులు ఉపయోగించినా నేరంగా పేర్కొన్నాయి.
తమ విత్తన జన్యువుల ద్వారా తయారు చేసిన విత్తనాలను వెనుకబడిన దేశాలు ఉపయోగించుకునే హక్కును బహుళజాతి సంస్థల పేటెంట్ హక్కు హరిస్తుంది. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు ముందుకు తెచ్చిన ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాలు, విత్తనాలపై మేధో సంపత్తి అనే దాన్ని రక్షించడానికి అనేక నిబంధనలను కలిగి ఉన్నాయి. అటువంటి పెట్టుబడులను స్వాధీనం చేసుకుంటే లేదా జాతీయం చేస్తే లేదా వాటి నుంచి ఆశించిన లాభాలు ప్రమాదంలో పడితే అప్పుడు ఆ దేశాలకు చెందిన విత్తన సంస్థలు పెట్టుబడి ఉన్న దేశాలపై కోర్టులో దావా వేయవచ్చు. దీన్ని గమనిస్తే అంతర్జాతీయ విత్తన ఒడంబడిక బహుళజాతి సంస్థల ప్రయోజనాల కోసమే అన్న వాస్తవం వెల్లడయ్యింది. ఇంత ప్రమాదకరమైన బహుళజాతి సంస్థల విత్తన వ్యాపారాలకు భారతదేశ పాలకులతో పాటు అనేక దేశాల పాలకులు అనుమతించడం వారి రైతాంగ వ్యతిరేక విధానాలకు నిదర్శనం.
ఒడంబడిక జరిగి 20 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడు సవరణల ప్రతిపాదనలు జరుగుతున్నాయి. ఈ సవరణ ప్రతిపాదనలు రైతాంగ హక్కులకు భంగం కలిగించేవిగా ఉన్నాయని ప్రపంచవ్యాప్తంగా రైతు సంఘాలు, రైతాంగం వ్యతిరేకిస్తున్నాయి.
ప్రస్తుతం ఉన్న 64 విత్తనాలతో పాటు ఇతర మొక్కల జన్యువులను కూడా చేర్చాలన్న ప్రతిపాదన సవరణల ముసాయిదాలో ఉందని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. విత్తన ఒడంబడికలో ప్రతిపాదించిన సవరణ ప్రతిపాదనలు రైతుల హక్కులను, ఆయా దేశాల విత్తన సార్వభౌమత్వాన్ని హరించి, విత్తనాలపై పూర్తిగా బహుళజాతి సంస్థల ఆధిపత్యం ఏర్పడేందుకేనని రైతు సంఘాలు మండి పడుతున్నాయి. దేశాల సాంప్రదాయ విత్తనాలు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. బహుళజాతి సంస్థల విత్తనాలనే అధిక ధరలకు ప్రతి సంవత్సరం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. భారతదేశంలో పత్తి విత్తనాలను మోన్ శాంటో అధిక ధరలకు అమ్ముతున్న అనుభవం ఉంది.
విత్తన ఒడంబడికలో చేయనున్న సవరణ ప్రతిపాదనలు ఆమోదం పొందితే, వేలాది సంవత్సరాలుగా విత్తనాలపై సార్వభౌమాధికారం కలిగిన దేశాలు, రైతులు ఆ విత్తనాలపై హక్కును కోల్పోతారు. విత్తన పరాధీనత ఏర్పడుతుంది. రైతుల విత్తన హక్కులను హరించే అంతర్జాతీయ విత్తన ఒడంబడికను, దానికి తలపెట్టిన సవరణలను ఉపసంహరించాలని అన్ని దేశాల రైతాంగం ఉద్యమించటమే తక్షణ కర్తవ్యం.
బొల్లిముంత సాంబశివరావు
రైతు కూలీ సంఘం(ఆంప్ర)రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
సెల్ నెంబర్:9885983526
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
