
షాంగై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశాలు 2025 ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనాలోని టియాంజిన్ అనే నగరంలో జరిగాయి. ఈ సమావేశాలకు 20 దేశాలకు చెందిన నాయకులు 10 అంతర్జాతీయ సంస్థలు, పరిశీలన దేశాలు, చర్చల భాగస్వాములు, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్, అంతర్జాతీయ సంస్థల నాయకులు పాల్గొన్నారు.
ఎస్సీఓ 2001లో చైనాలోని హువాంగ్పు నది ఒడ్డున ఏర్పడింది. నిజమైన బహుళ ధృవ ప్రపంచం, సరిహద్దు భద్రత సమస్యల పరిష్కారం, పరస్పర విశ్వాసం, పరస్పర ప్రయోజనం, సమానత్వం సంప్రదింపులు, విభిన్న నాగరికతల వైవిధ్యం పట్ల గౌరవం, ఉమ్మడి అభివృద్ధి సాధన అనే షాంగై స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించింది.
ఎస్సీఓ ఆరు సభ్య దేశాల నుంచి పది దేశాలు, రెండు పరిశీలక దేశాలు, 14 సంభాషణ భాగస్వామ్య దేశాలతో ఒక పెద్ద ప్రాంతీయ అంతర్జాతీయ, భూ భౌగోళిక, భారీ జనాభా కలిగిన నేటి ప్రపంచంలో పెద్ద కుటుంబంగా ఏర్పడింది.
ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుకు ఎస్సీఓ కృషి చేస్తుంది. నేటికీ కొన్ని పాశ్చాత్య దేశాలు ఉద్దేశపూర్వకంగా బహు పాక్షిక యంత్రాంగాలను, దేశాలను అణగదొక్కుతున్నాయి. దానికి భిన్నంగా ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుకు కృషి ఎస్సీఓ చేస్తుంది.
ఈ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశం, రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ దురాక్రమణకు వ్యతిరేకంగా చైనా ప్రజల ప్రతిఘటన యుద్ధం, ప్రపంచ ఫాసిస్టు వ్యతిరేక యుద్ధం 80వ వార్షికోత్సవం ఒకే చారిత్రాత్మక క్షణంలో జరుగుతున్నాయి.
ఎస్సీఓ బహుళ ధ్రువ ప్రపంచ క్రమానికి వారసత్వంగా, పశ్చిమ దేశాల తరహా ఆధిపత్య క్రమాన్ని అభివృద్ధి చేయడం కాకుండా, కొత్త పరిస్థితులలో నేటి బహుముఖ దేశీయ ప్రపంచ ప్రజల అవసరాలకు అనుగుణంగా పునర్నిర్మాణం లక్ష్యంగా, ఎస్సీఓ ఒక బలమైన రక్షకుడిగా, నిజమైన బహుళ ధ్రువ ప్రపంచ ప్రజల ప్రయోజనాలే గీటురాయిగా పనిచేస్తుంది.
ఉగ్రవాదం, వేర్పాటువాదం, భద్రత, ఆర్థిక సహకారం, వాణిజ్యం పెట్టుబడులు, ఎనర్జీ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, ఆధునిక వ్యవసాయం, పర్యావరణహిత అభివృద్ధి, నిజమైన ఉమ్మడి దేశాల ప్రయోజనం, వాటి అనుసంధానం, దేశాల మధ్య భాగస్వామ్య భవిష్యత్తు లక్ష్యంగా ఎస్సీఓ పని చేస్తుంది.
నేటి అత్యంత సంఘర్షణతో కూడిన సంక్లిష్ట ప్రపంచంలో, ఈ సుదీర్ఘ క్రమంలో ఎస్సీఓ సభ్య దేశాల మధ్య అద్భుతమైన యంత్రాంగం ఏర్పడింది. స్థిరమైన అభివృద్ధిని, సమృద్ధిగా సహకార అవకాశాలను సృష్టించింది.
ఎస్సీఓ సభ్య, పరిశీలక, సంభాషణ భాగస్వామ్య దేశాల మధ్య వాణిజ్యం 890.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది చైనా మొత్తం విదేశీ వాణిజ్యంలో 14.4 శాతానికి సమానం. కజకిస్తాన్‌లో మూడు అత్యాధునిక వర్క్ షాప్‌లు ప్రారంభించబడ్డాయి. అత్యాధునిక వ్యవసాయ అభివృద్ధి పథకాలను కూడా ప్రారంభించారు.
అనేక దేశాల మధ్య పరస్పర శ్రేయస్సు, సంఘీభావం, సహకారమే నేటి తీవ్ర సంఘర్షణ, సంక్లిష్టతలతో కూడిన ప్రపంచ సవాళ్లకు సరైన సమాధానమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పేర్కొన్నారు.
నేడు ఏకధ్రువ నియంతృత్వ ఆధిపత్యం, రక్షణవాద ధోరణులు తీవ్రంగా పెరుగుతున్నాయి. శాంతి అభివృద్ధి, ప్రజాహిత పరిపాలన పూర్తిగా లోపిస్తున్నాయి. ఎస్సీఓ దేశాలు సగం ప్రపంచ జనాభాను కలిగి ఉన్నాయి. అంతేకాకుండా, నాలుగింట్లో ఒక వంతు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నాయి. వీరి మధ్య ఐక్యత సహకారాన్ని బలోపేతం చేయాలి. భాగస్వామ్య భవిష్యత్తు, మరింత సన్నిహితంగా ఉండే సమాజాన్ని ప్రోత్సహించాలి. ఇది వారి సొంత అభివృద్ధికి ప్రాంతీయ భద్రతకు ప్రయోజనం చేకూర్చడంతో పాటు ప్రపంచ స్థిరత్వానికి దోహదం చేస్తుంది.
భారత్‌పై ట్రంప్ చేస్తున్న తీవ్రమైన అమెరికా స్వప్రయోజన వాణిజ్య యుద్ధం, భారత ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తుంది. ఈ నేపథ్యంలో భారత్‌కు తాము తోడుగా ఉన్నామని, ఈ చర్యను ఖండించింది చైనా- రష్యాలు మాత్రమే. ఈ క్రమంలో పశ్చిమ యూరోప్‌లోని అనేక దేశాలు, నాటో సెక్రటరీ జనరల్, అమెరికాలాగే భారత్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నాయి.
చైనా- ఇండియాల మధ్య సంబంధాలు పరస్పర ప్రయోజనాలు, ఆర్థికంగా ద్వైపాక్షిక వాణిజ్యం క్రమంగా పెరుగుతుంది. స్వభావికంగా అనేక విషయాల్లో దగ్గరి పోలికలు ఉన్న చైనా- భారత్‌ల మధ్య సంఘర్షణ కంటే, సహకారానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఈ రెండు అతి పెద్ద ఆర్థిక శక్తులు దగ్గర కావడం ఇష్టం లేని పశ్చిమ దేశాలు- అమెరికాకు తీవ్ర కడుపుమంటే.
ప్రతిఘటన- ప్రపంచ ఫాసిస్టు వ్యతిరేక యుద్ధ విజయోత్సవ వార్షికోత్సవం..
ఎస్సీఓ సమ్మిట్ , దాన్ని అనుసరిస్తూ- జపాన్ ఫాసిస్ట్ దురాక్రమణ వ్యతిరేక, చైనా ప్రజల ప్రతిఘటన- ప్రపంచ ఫాసిస్టు వ్యతిరేక యుద్ధం విజయోత్సవ 80వ వార్షికోత్సవం జరిగింది. వారికోత్సవం సందర్భంగా చైనా నిర్వహించిన సైనిక కవాతులో అనేక దేశాలు పాల్గొన్నాయి. ముఖ్యంగా చైనా జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ పక్క పక్కనే పాల్గొనడం కీలకమైన విషయం. ఈ మూడు శక్తివంతమైన న్యూక్లియర్ పవర్స్. అమెరికా, పశ్చిమ దేశాలకు ప్రత్యామ్నాయంగా ఒక శక్తివంతమైన కూటమి ఏర్పాటైంది.
కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మాట్లాడారు. “నేడు ప్రపంచ మానవాళి యుద్ధం- శాంతి మధ్య, సంఘర్షణ సంభాషణల మధ్య, పరస్పర సహకారం, ఒకరు గెలిచి, మరొకరు ఓడిపోయే పరిస్థితికి బదులుగా, అందరికీ ప్రయోజనం చేకూరే పరిస్థితుల్లో ప్రపంచం ఉందన్నారు. చైనా శాంతియుత అభివృద్ధి వైపు దృఢంగా నిలబడుతుంది. ప్రపంచ ప్రజల ఉమ్మడి భవిష్యత్తుకు చైనా తీవ్రంగా కృషి చేస్తుంద”ని సందేశం ఇచ్చారు.
“మానవజాతి గమ్యం ఒకదానితో ఒకటి ముడిపడి ఉందని చరిత్ర మనల్ని హెచ్చరిస్తోంది. దేశాలు, ప్రజలు ఒకరినొకరు సమానంగా చూసుకుని, సామరస్యంగా కలిసి జీవిస్తూ, ఒకరినొకరు ఆదరించుకున్నప్పుడు మాత్రమే మనం ఉమ్మడి భద్రతను కాపాడుకోగలము, యుద్ధానికి మూలకారణాన్ని తొలగించగలము. చరిత్రలోని విషాదాలు పునరావృతం కావడానికి మనం అనుమతించకూడదు. నేడు మానవాళినీ మరోసారి శాంతి- యుద్ధం రెండింటిలో ఏది కావాలో తేల్చుకోమంటుంది” జిన్‌పింగ్ పేర్కొన్నారు.
చైనా నిర్వహించిన సైనిక కవాతును “అందమైన వేడుక” అని ట్రంప్ వ్యంగ్యంగా అభివర్ణిస్తూనే, ఆ ముగ్గురు నాయకులు అమెరికాపై కుట్ర పన్నారని ట్రంప్ ఆరోపించారు.
ప్రపంచం ముందు మొదటిసారిగా, ముఖ్యంగా అమెరికా, పశ్చిమ దేశాలను తలదన్నే అత్యాధునిక ఆయుధాలను చైనా ప్రదర్శించింది.
జిన్‌పింగ్, పుతిన్, కిమ్ ముగ్గురు నాయకులు కలిసి ఒకే వేదికపై ప్రపంచ ఫాసిజాన్ని ఓడించిన సైనిక కవాతులో కనిపించడం వల్ల ప్రపంచ ప్రజల నిజమైన ప్రత్యామ్నాయం ఆవిష్కృతం అయిందా అన్నట్లుగా ఉంది. అమెరికా, పశ్చిమ దేశాల ప్రపంచ ఆధిపత్యానికి భిన్నంగా నిజమైన బహుళ ధ్రువ ప్రపంచం ఏర్పడుతుందని స్పష్టంగా అర్థమవుతోంది.
డోనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియాలో చాలా వ్యంగ్యంగా పోస్ట్ చేస్తూ, “మనం భారతదేశం, రష్యాలను లోతైన, చీకటి చైనా చేతిలో కోల్పోయినట్లు కనిపిస్తోంది. వారందరికీ సుదీర్ఘమైన, సంపన్నమైన భవిష్యత్తు ఉంటుందా?” అని అన్నారు.
అత్యంత సంక్లిష్టమైన, అంతర్లీన సంబంధాలతో ప్రపంచం పెనవేసుకుంది. శాస్త్ర సాంకేతిక రంగంలో విప్లవాత్మక పరిణామాలు, ఎనర్జీ రంగంలో అనేక పునర్వ్యవస్థీకరణలు చోటు చేసుకుంటున్నాయి. పశ్చిమ దేశాల ఆధిపత్యానికి, ఎస్ఈఓ, బ్రిక్స్లు ప్రపంచ ప్రత్యామ్నాయాలుగా మారాయి. ఈ సంస్థల్లోని దేశాలు డీడాలరైజేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నాయి.
ట్రంప్ సుంకాలను ఉమ్మడిగా ఎదుర్కొందాం..
“ప్రపంచం తీవ్రమైన గందరగోళంలో ఉంది. ప్రపంచ క్రమం కొత్త పరివర్తనలోకి వెళుతుంది. ప్రపంచ పరిపాలన క్రమం కొత్త కూడలికి చేరుకుంది. ఈ సమయంలో చైనా అత్యాధునిక ఆయుధ వ్యవస్థలతో కూడిన సైనిక కవాతు మానవాళి భవిష్యత్తుకు గొప్ప ప్రాముఖ్యతనిస్తుంది. చైనా ప్రజలు మానవ నాగరికత ప్రగతి సరైన దిశ వైపు దృఢంగా నిలబడతారు. మేము తిరిగి శాంతియుత అభివృద్ధికి పునరంకితమౌతాం. మానవాళి ఉమ్మడి భవిష్యత్తు కొరకు ప్రపంచ ప్రజలతో మేము చేతులు కలుపుతాం” అని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారు.
చైనా కమ్యూనిస్టు పార్టీ లేనిదే ఆధునిక చైనా లేదు. చైనా ప్రజలు మానవ నాగరికత పురోగతి చరిత్రకు సరైన వైపు నిలబడతారు. చైనా శాంతిని ప్రేమించే ప్రపంచ ప్రజలతో కలిసి ప్రపంచశాంతి, అభివృద్ధికై పాటుపడుతుందనీ జిన్‌పింగ్ పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కొందామని బ్రిక్స్ దేశాలకు జిన్‌పింగ్ పిలుపు ఇచ్చారు. ట్రంప్ ప్రకటించిన సంకాల యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసిందని, అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను పూర్తిగా విస్మరించిందని చెప్పారు.
బ్రిక్స్ నేతల సదస్సు సెప్టెంబర్ 8న సోమవారం వీడియో కాన్ఫరెన్స్ రూపంలో జరిగింది. దీనిని బ్రెజిల్ అధ్యక్షుడు లూనా డిసిల్వా నిర్వహించారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్ ప్రసంగిస్తూ, ఆధిపత్యవాదం, ఏకపక్షవాదం, రక్షణ వాదం రోజురోజుకు పెరుగుతున్నాయని ఇది వాణిజ్య యుద్ధాలకు దారితీస్తున్నాయని పేర్కొన్నారు. అమెరికా ప్రాభల్యానికి వ్యతిరేకంగా ఆయన గ్లోబల్ గవర్నెన్స్ ఇనిషియేటివ్(జీజీఐ)ని ప్రతిపాదించారు. ఈ సదస్సులో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొన్నారు.
(వ్యాసరచయిత సామాజిక విశ్లేషకులు)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.