భారత ప్రభుత్వ డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మూడు ముఖ్యమైన సైన్స్ అకాడెమీలకు నిధులు సమకూరుస్తుంది. అవి- ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడెమీ, నేషనల్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా, ఇండియన్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ ఈ మూడూ స్వయంప్రతిపత్తి గల సంస్థలు. ఈ దేశ ప్రజలకు ఉపయోగకరమైన పరిశోధనలు చేయడం వీటి ధ్యేయం.
అంతేకాదు దేశంలో ఉత్తమ పరిశోధనలు చేస్తూ, సమాజానికి మేలు చేస్తున్న శాస్త్రజ్ఞుల్ని గుర్తించడం; వారికి అవార్డులు ప్రకటించి ప్రోత్సహించడం వీటి ఉద్దేశం. ఇందులో మూడవదైన ఇండియన్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ అవార్డులను ప్రకటించదు. కానీ మొదటి రెండు దేశ వ్యాప్తంగా శాస్త్ర, సాంకేతిక, విద్య, ఆరోగ్య రంగాలలో కొన్ని వందల సంఖ్యలో ప్రతి యేటా అవార్డులను ప్రకటిస్తున్నాయి.
పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాల సిలబస్‌లోంచి వైజ్ఞానిక విషయాలు, చారిత్రక అంశాలు తొలగించి తమ హిందుత్వ ఎజెండాను అమలు పరచాలనుకుంటున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్యం “విజ్ఞాన్ ప్రసార్”లాంటి గొప్ప వైఙ్ఞానిక సంస్థను కూడా మూసేసింది. అంటే వైజ్ఞానిక స్పృహకు దేశంలో తలుపులు మూసేసింది.
వైజ్ఞానిక స్పృహతో వీటన్నింటిని ప్రారంభించి, ప్రోత్సహించింది. భారత తొలి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రు గనక, ఆయనపై ఉన్న వ్యక్తిగత కక్ష కారణంగానే వైజ్ఞానిక సంస్థలు మూసివేయడం, వాటికి ప్రతియేటా ఇవ్వాల్సిన నిధులు అందివ్వక పోవడం చేస్తున్నారేమో.
ఇటీవల జవహర్ లాల్ నెహ్రూ మ్యూజియం పేరు మార్చి- పీఎం మ్యూజియం అని ప్రకటించడం మనకు తెలుసు. ఎలాగైనా సరే ఎక్కడ నెహ్రూ పేరు వినిపించకుండా చేయాలని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టుగా ఉంది. ఇంతటితో ఆగకుండా ప్రతియేటా శాస్త్రవేత్తలకు ఇచ్చే అవార్డులను కూడా రద్దు చేసింది.
2022లో సుమారు 300 సైన్స్ అవార్డులను రద్దు చేసిన శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ, ఈ సంవత్సరం మరో ముందడుగు వేస్తే, 92 సైన్స్ అవార్డుల్ని రద్దు చేసింది. ఇలాంటి విషయాలకు పత్రికలు, మీడియా విస్తృత ప్రచారమివ్వవు . అందువల్ల సామాన్య జనానికి విషయాలు తెలియవు.
కేంద్ర ప్రభుత్వ నిధులు అందుకుంటున్న అకాడెమీలు ఇచ్చే అవార్డులు ఇక పై కొనసాగించరాదని ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రభుత్వం భావించింది.
యువ శాస్త్రవేత్తలు, సైన్సు టీచర్లు, లెక్చరర్లు, జాతీయ అంతర్జాతీయ స్థాయి కలిగిన సైంటిస్ట్‌ల కోసం వివిధ స్థాయిల్లో ఇస్తున్న పలురకాల అవార్డులన్నీ ఇప్పుడు రద్దయిపోయాయి.
తమకు దక్కాల్సిన గుర్తింపుల్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినందుకు వివిధ పరిశోధనాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో పని చేసే శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, పరిశోధక విద్యార్థులు అందరూ ఆందోళన పడడం, పెద్ద ఎత్తున తమ నిరసనలు తెలియజేయడం మామూలే.
అయితే ఈ కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడు ఏ విషయంలో చీమ కుట్టింది గనుకా? గతంలో పద్మశ్రీలు, పద్మభూషణ్‌లు, సాహిత్య అకాడెమీ అవార్డుల్ని(అవార్డు వాపసీ) ప్రస్తుత ప్రభుత్వానికి తిప్పి కొట్టినప్పుడే ఈ ప్రభుత్వం సిగ్గు పడలేదు. ఇక ఇప్పుడు పడాలని ఎందుకు అనుకుంటుందీ?
ఆ చట్టం కూడా రావొచ్చు..
ఇక మిగిలింది ఒక్క టే, ఈ దేశంలో విజ్ఞాన శాస్త్రం ఎవరూ చదవగూడదని చట్టం తీసుకురావడమే. ఇంత చేసిన వారు ఇక ముందు అది కూడా చేయరని నమ్మకమేమిటీ?
మన కేంద్ర ప్రభుత్వంపై మనకు తప్పకుండా నమ్మకముండాలి. కాబట్టి వారు సులభంగానే ఈ కింది చట్టాలు తేస్తారు .
1. దేశంలో ప్రశ్న బతికి ఉండకూడదు
2. దేశంలో వైజ్ఞానిక స్పృహ ఉండకూడదు
3. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరెత్తితే ఇకపై కఠిన శిక్షలు.
4. గత జ్ఞాపకాలు ఎవరికీ ఉండకూడదు. ఎవరూ గత చరిత్రను తవ్వి తీయగూడదు.
5. ప్రభుత్వం వారి ‘మన్ కి బాత్’ మాత్రమే విని చెవులు ఊపుతూ ఉండాలి.
6. దేశంలో మేం ప్రజాస్వామ్యాన్ని గొప్పగా బతికనిస్తున్నామని మన దేశ నాయకులు విదేశాల్లో చెప్పి వస్తుంటారు. వాటిని విని నోరుమెదపకూడదు. గమ్మున కూర్చోవాలి.
7. మైనార్టీలను స్వంత బిడ్డల్లా చూసుకుంటున్నామని అంతర్జాతీయ వేదికల మీద మన నాయకులు ప్రసంగించి వస్తారు. మనమికడ చప్పట్లు చరుస్తుండాలి.
8. బేటీ బచావో బేటీ పడావో- నినాదాన్ని ప్రతి ఊర్లో సందుగొందుల్లో గొంతెత్తి నినదించాలి.
9. దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున మహిళా క్రీడాకారుల మీద చేశారని తెలిసినా నోరు విప్పగూడదు.
10. అమెరికా పర్యటనలో వైట్ హౌజ్‌లో జరిగిన ప్రెస్ మీట్లో- భారత దేశంలో జరుగుతున్న హిందుత్వ అఘాయిత్యాల మీద, గుజరాత్ మానవ హననం మీద, జాతి వివక్ష మీద, అసమర్థ పాలన మీద విలేకరులు సంధించిన కేవలం రెండు ప్రశ్నలకు కూడా సమాధానమివ్వకుండా “ప్రజాస్వామ్యం మా డీఎన్ఏలో ఉంద”ని మన ప్రధాన నాయకుడు పిట్ట కథ చెప్పి వచ్చిన అంశాన్ని ఎక్కడా ప్రస్తావించగూడదు.
11. వాషింగ్టన్ డీసీ ప్రధాన వీధుల్లో భారత దేశంలోని కేంద్ర ప్రభుత్వం మీద అక్కడి జనం విమర్శలు గుప్పిస్తుంటే మన ప్రధాన నాయకుడు నోరు మెదపకుండా నవ్వుతూ ఏడుపు మొహం వేసుకుని రాలేదా?
12. భారత దేశంలో ప్రస్థుత హోంమంత్రి ఒక జడ్జిని చంపించిన క్రిమినలని వాషింగ్టన్ వీధుల్లో తమ అధ్యక్షుడు బైడెన్‌కు వినపడేంతగా- మైకులు పగిలేట్లు వక్తలు ఉద్రేకంతో ఉపన్యసిస్తుంటే- దేశం వెలిగి పోతోందని, మనమిక్కడ మన్నుదిన్న పాముల్లా పడి ఉండాలా? వద్దా ? ఉండాల్సిందే కదా?
13. మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఒక ఇంటర్వ్యూలో భారత ప్రధానిని ఉద్దేశించి సంధించిన ప్రశ్నలు వినిపించినా వినపడనట్టే నవ్వుతూ చెయ్యి ఊపుతూ ఆయన గారు అక్కడ తిరగలేదా? అంత పెద్ద స్థాయిలో ఉన్న వాడికి లేని సిగ్గు- సామాన్య మానవులం మనకు ఎందుకబ్బా? పట్టించుకో వద్దు కదా? మన ఆరోగ్యం మనం కాపాడు కోవాలి. మన చర్మాన్ని మనమే మందంగా తయారు చేసుకోవాలి. తప్పదు మరి.
ఆగ్రహాన్ని వెలిబుచ్చిన అమెరికా సెనెటర్లు..
భారత ప్రధాని పర్యటనపై స్పందిస్తూ ముగ్గురు ప్రతిభావంతులైన ప్రముఖ అమెరికా సెనెటర్లు చెప్పిన విషయాలు:
ఇందులో మొదటి ఇద్దరు మహిళలు చాలా తీవ్రమైన పదజాలంతో నేటి భారత ప్రభుత్వం పట్ల తమ అసహనాన్ని, ఆగ్రహాన్ని వెలిబుచ్చారు.
మానవ హకులకు విఘాతం కలిగిస్తూ, జర్నలిస్టులను హింసిస్తూ ప్రజాస్వామ్యాన్ని అభాసుపాలు చేసిన ఘనమైన చరిత్ర ప్రస్థుత భారత ప్రధానిది
– కోరి బుష్
మానవ హక్కులకు తీవ్ర విఘాతం కలిగించిన వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ మనం గౌరవించకూడదు.
– ఒకాసియో-కోర్టెజ్
ప్రధాని మోదీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను, స్వేచ్ఛాలోచనను ధ్వంసం చేసింది. ప్రతిపక్ష సభ్యుల మీద నేరాలు మోపింది. జైలు పాలు చేసింది. పౌర సంఘాల స్వేచ్ఛను హరించింది. తనను కలిసినప్పుడు అమెరికా అధ్యక్షుడు జైడెన్, తప్పక ఈ సమస్యల్ని భారత ప్రధానికి ఎత్తి చూపాలి, ప్రశ్నించాలి.
– బెర్ని సాండర్స్
జన చైతన్యానికి సమాయత్తం కావాలి..
దేశంలో ఇన్ని ఘోరాలు జరుగుతున్నా, అమెరికా అధ్యక్షుడు ఎందుకంత ఘనంగా భారత ప్రధానిని ఆహ్వానించాడూ? అందులో ఉన్న రహస్య మేమిటీ- అంటే ఇరు దేశాల మధ్య ఉన్న లావాదేవీలు ముఖ్య కారణం- అంతకు మించి అక్కడ భారత ప్రధానికి వ్యక్తిగతంగా లభించిన గౌరవమేమీ లేదు .
1. భారత దేశం మంచి కొనుగోలు దారు. ఆయుధాలు అమ్మడంలో అమెరికాది అగ్రస్థానం. కొనుగోలు చేయడంలో ప్రపంచ దేశాల్లో భారత దేశానిది అగ్రస్థానం. మంచి కొనుగోలుదారుణ్ణి ఏ అమ్మకందారుడూ వదులుకోడు కదా?
2. భారత్‌లో జరుగుతున్న అంతర్గత విషయాలను విమర్శిస్తూ- వ్యాపారపరంగా వచ్చే లాభాల్ని చెడ గొట్టుకోవడం ఎందుకూ? అది అట్లాడి ప్రభుత్వానికి నచ్చదు కదా?
3. అమెరికాలో భారత సంతతి వారు ఎక్కువ. పైగా అక్కడ ముఖ్య భూమిక పోషిస్తున్న వారు కూడా ఎక్కువే. భారత ప్రధాని పట్ల బైడెన్ ప్రభుత్వం గౌరవంగా వ్యవహరించినట్లయితే భారత సంతతికి చెందిన అమెరికా పౌరుల నుంచి బైడెన్ ప్రభుత్వానికి మద్దతు బలంగా ఉంటుంది కదా?
4. అమెరికా అధ్యక్షుని నివాస భవనంలో అక్కడి విలేకరులు అడిగిన రెండే రెండు ప్రశ్నలకు భారత ప్రధాని నేరుగా సమాధానం చెప్పకపోయినా కూడా అక్కడి విలేకారులు విరుచుకు పడలేదు. కారణం ఆధ్యక్ష భవనంలోని ప్రొటో కాల్.
అయితే ‘టెలివిజన్లలో ప్రత్యక్షంగా చూసిన ప్రపంచ పారులంతా భారత ప్రధాని మేధో సంపత్తిని బేరోజు వేసుకునే ఉంటారు.
5. దేశంలో అవార్డులు రద్దు చేసి, తగుదునమ్మాని ఈజిప్టు వారిచ్చిన అవార్డు పుచ్చుకుని రావచ్చా? అలాంటి వారికి ఆ అర్హత ఉంటుందా? ఈ దేశ ప్రజలు ఆలోచించాలి. ఇటీవలి కర్నాటక ఎన్నికల్లో ప్రజాసంఘాలు నిర్వహించిన పాత్ర గుర్తు తెచ్చుకుని, మతం అన్న వాణ్ణి మట్టి కరిపించాలి- అనే ధ్యేయంతో- దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రజా సంఘాలు ఏర్పడాలి.
2024 జనవరిలో జరగాల్సిన సైన్స్ కాంగ్రెస్‌కు అన్ని రకాల వనరుల సాయం నిలిపివేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం వారి డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకటించింది .
ఈ రకంగా కూడా భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ మీద నేటి మోదీ ప్రభుత్వం ఉక్రోషం వెళ్ళగక్కుకుంది . ఆ రకంగా దేశాన్ని వెనక్కి నడిపించడంలో విజయవంతంగా మరో ముందడుగు వేసింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
