డిసెంబర్ 16న, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక వలస కార్మికుడిని బంగ్లాదేశీయుడనే ఆరోపణలతో ఒక గుంపు కొట్టి చంపింది. కేరళ మంత్రి ఎంబీ రాజేష్ మాట్లాడుతూ, సంఘ్ పరివార్ ద్వేషపూరిత రాజకీయాలకు ఆ వ్యక్తి బాధితుడని, దాడి చేసిన వారిలో గతంలో క్రిమినల్ కేసులున్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా ఉన్నారని అన్నారు.
న్యూఢిల్లీ: గత వారం పాలక్కాడ్‌లో ఓ గుంపు కొట్టి చంపిన ఛత్తీస్‌గఢ్ వలస కార్మికుడి కుటుంబానికి కనీసం రూ 10 లక్షల పరిహారం అందిస్తామని కేరళ ప్రభుత్వం హామీ ఇచ్చింది.
డిసెంబర్ 16న, ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి జిల్లాకు చెందిన 31 ఏళ్ల రామ్‌నారాయణ్ బాఘేల్‌ను బంగ్లాదేశ్ పౌరుడని అనుమానించిన ఒక గుంపు కిరాతకంగా కొట్టి చంపింది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలో, దాడి చేసిన వారిలో ఒకరు “మీరు బంగ్లాదేశీయుడాని”బాఘేల్‌ను అడగడం వినవచ్చు.
కేరళ స్థానిక స్వపరిపాలన మంత్రి ఎంబీ రాజేష్ మాట్లాడుతూ, “సంఘ్ పరివార్ ద్వేషపూరిత రాజకీయాల బాధితుడు- బాఘేల్ “అని అన్నారు. తనపై దాడి చేసిన వారిలో గతంలో క్రిమినల్ కేసులు నమోదైన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా ఉన్నారు.
ఈ సంఘటన కేవలం మూక హత్యాకాండ కాదని, విదేశీయులపై వ్యతిరేకత- జాతి వివక్షతకు సంబంధించినదని ఆయన అన్నారు . “ఒకరిని బంగ్లాదేశీయుడని పిలవడం విదేశీయుల పట్ల వ్యతిరేకత, జాతి రాజకీయాల ఫలితం”అని రాజేష్ పేర్కొన్నారు.
“బంగ్లాదేశీయుడని నిందించిన తర్వాత తనపై దాడి జరిగింది. దాడి చేసిన వారిలో గతంలో నేరారోపణలున్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. ఉపాధి కోసం వచ్చిన ఈ వలస కార్మికుడిని బంగ్లాదేశీయుడని ఆరోపించి చుట్టుముట్టి కొట్టారు. దేశంలో సంఘ్‌పరివార్ వ్యాప్తి చేస్తున్న జాతివిద్వేషానికి తను బాధితుడయ్యాడు”అని ఆయన చెప్పుకొచ్చారు.
తన మరణానికి నాలుగు రోజుల ముందు రామనారాయణ్ బాఘేల్ ఉపాధి కోసం పాలక్కాడ్ చేరుకున్నాడు. తను వెలియార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అట్టపల్లం సమీపంలో తన బంధువులతో నివసిస్తున్నాడు. డిసెంబర్ 16న, గ్రామంలో దారి తప్పిపోయాడని, ఆ తర్వాత స్థానికులు తనపై దొంగతనం చేసినట్లు అనుమానించారు.
అంతర్గత గాయాల కారణంగా అధిక రక్తస్రావం జరిగి తను మరణించాడని పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. బాఘేల్ కుటుంబం మొదట మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరించింది.
బాధిత కుటుంబానికి “కనీసం 10 లక్షల రూపాయల పరిహారం” అందుతుందని కేరళ రెవెన్యూ మంత్రి హామీ ఇచ్చారు. తదుపరి మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారు. కేరళ ప్రభుత్వం బాఘేల్ మృతదేహాన్ని విమానంలో ఛత్తీస్‌గఢ్‌కు కూడా పంపుతుంది.
ఈ కేసును దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఐదుగురిని అరెస్టు చేశామని, మరికొంతమంది ప్రమేయం ఉందానే దానిపై దర్యాప్తు కొనసాగుతోందని పాలక్కాడ్ పోలీసు సూపరింటెండెంట్ అజిత్ కుమార్ తెలిపారు.
“జిల్లా క్రైమ్ బ్రాంచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు 10 మంది సభ్యుల బృందానికి నాయకత్వం వహిస్తారు. బాధితుడి కులం నిర్ధారించబడిన తర్వాత, నిందితుడిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కూడా అభియోగాలు మోపబడతాయి” అని ఆయన అన్నారు.
ఇంతలో, ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా బాఘేల్ కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ సంఘటనను ఆమోదయోగ్యం కాదని, ఇలాంటి సంఘటనలు కేరళ ప్రగతిశీల ప్రతిష్టను దెబ్బతీస్తాయని, పునరావృతం కాకుండా ఉండాలంటే అప్రమత్తత అవసరమని ముఖ్యమంత్రి అన్నారు. రిమాండ్ నివేదికలోని వివరాలు దాడి భయానకతను వెల్లడించడంతో ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
రిమాండ్ నివేదిక ప్రకారం, బాఘేల్‌ను చంపాలనే స్పష్టమైన ఉద్దేశ్యంతోనే నిందితులు దాడి చేసి, చాలా గంటలుగా హింసకు పాల్పడ్డారు. ప్రీ-మార్టం వైద్య పరీక్షలో అతని శరీరంపై 40కి పైగా గాయాలు బయటపడ్డాయి. తలకు బలమైన గాయాలు, అధిక రక్తస్రావం, తీవ్రమైన శారీరక గాయాలు మరణానికి కారణమని నిర్ధారించారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
