భారతదేశంలో పెరుగుతున్న హిందూ జాతీయవాదం, ముస్లింల అస్తిత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడం; జర్నలిస్టులు- రచయితలపై ఒత్తిడి గురించి ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ బ్లూమ్‌బెర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆందోళన వ్యక్తం చేశారు. దశాబ్దాల క్రితమే ఈ ప్రమాదాల సంకేతాలను తాను చూశానని, అవి ప్రస్తుతం ధృవీకరించబడుతున్నాయని ఆయన అన్నారు.
న్యూఢిల్లీ: భావప్రకటనా స్వేచ్ఛపై దాడులు, ప్రధాని మోడీ హయాంలో భారతదేశంలో పెరుగుతున్న హిందూ జాతీయవాదంపై ప్రఖ్యాత రచయిత సల్మాన్ రష్దీ ఆందోళనవ్యక్తం చేశారు.
ముస్లింల ఉనికి, భారతీయ రచయితలు, జర్నలిస్టులు- విద్యావేత్తలపై పెరుగుతున్న ఒత్తిడి దృష్ట్యా తీవ్రంగా ఆందోళన చెందుతున్నానని బ్లూమ్‌బెర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్దీ పేర్కొన్నారు.
“ఈ విషయంలో నేను చాలా ఆందోళన చెందుతున్నాను. నాకు భారతదేశంలో చాలా మంది స్నేహితులు ఉన్నారు. జర్నలిస్టులు, రచయితలు, మేధావులు, ప్రొఫెసర్లు మొదలైన వారి స్వేచ్ఛపై జరుగుతున్న దాడులకు సంబంధించి ప్రతీ ఒక్కరూ తీవ్ర ఆందోళనలో ఉన్నారు”అని రష్దీ ఇంటర్వ్యూలో చెప్పారు.
దేశ గుర్తింపును తిరిగి ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తోందని ఆయన అన్నారు.
దేశ చరిత్రను తిరిగి వ్రాయాలనే కోరిక ఉన్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా హిందువులు మంచివారు. ముస్లింలు చెడ్డవారని చెప్పడం. ఒకప్పుడు “గాయపడిన నాగరికత”అని వీఎస్ నైపాల్ అన్నారు. భారతదేశం ముస్లింల రాకతో దెబ్బతిన్న హిందూ నాగరికత అనే ఆలోచన చాలా ఎక్కువ మద్దతుతో వ్యాప్తి పొందుతోంది.
దశాబ్దాల క్రితం తాను చేసిన హెచ్చరిక ప్రకటనల గురించి మాట్లాడుతూ, ‘మీరు రచయిత అయితే, మీరు శ్రద్ధగా పరిశీలిస్తే, కొన్నిసార్లు భవిష్యత్తులో జరగబోయే విషయాలు మీకు కనబడతాయి. నేను అదే చేస్తున్నాని అనుకుంటున్నాను, నేను శ్రద్ధగా పరిశీలిస్తున్నాను’ అని అన్నారు.
భారతదేశంలో పెరుగుతున్న మతోన్మాదం, ద్వేషం, స్వేచ్ఛపై దాడులను చాలా దశాబ్దాల క్రితమే రష్దీ గ్రహించారు.
2022లో రష్దీపై దాడి..
1988లో ది సాటానిక్ వెర్సెస్ ప్రచురితమైన తర్వాత నుంచి ఇరాన్ జారీ చేసిన ఫత్వా నీడలో రష్దీ జీవిస్తున్నారు. 2022 ఆగస్టులో పశ్చిమ న్యూయార్క్‌లో ఒక ఉపన్యాసానికి ముందు ఆయనపై దాడి జరిగి గాయపడినప్పుడు ఈ బెదిరింపు హింసాత్మక రూపంలో మళ్లీ బయటపడింది. దాడి నుంచి కోలుకున్న తర్వాత, రచయిత ఒక కంటి చూపును కోల్పోయారు. అంతేకాకుండా తన ఒక చేయిని ఉపయోగించలేకపోతున్నారు.
దాడి చేసిన వ్యక్తి, 27 ఏళ్ల హది మతర్కు 25 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది.
ఇండియా & ది సాటానిక్ వెర్సెస్
గమనించాల్సిన విషయమేంటంటే, 1988 అక్టోబర్‌లో రష్దీ నవల ‘ది సాటానిక్ వెర్సెస్’ దిగుమతిని భారతదేశం నిషేధించింది. రాజీవ్ గాంధీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన కస్టమ్స్ నోటీసు కింద ఈ ఉత్తర్వులు అమలు చేయబడ్డాయి. ఈ పుస్తకం మతపరమైన భావాలకు హానికరంగా ఉందని భావించిన ముస్లిం సమాజం దీనికి తీవ్రంగా స్పందించవచ్చని ప్రభుత్వం పేర్కొన్నది.
37 ఏళ్ల నాటి ఈ దిగుమతి నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టు 2024 నవంబర్ 5న ఎత్తివేసింది.
రష్దీ 1947లో ముంబైలో జన్మించారు. ఆయన ఇంగ్లాండ్‌లోని బోర్డింగ్ స్కూల్లో చదివి, ఆ తర్వాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ఆయన సాహిత్య సేవలకుగాను 2007లో నైట్‌గా సత్కరించబడ్డారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
