అమెరికాలో తన ప్రభావాన్ని పెంచుకోవడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ఒక లాబీయింగ్ ఏజెన్సీని నియమించుకుంది. అమెరికన్ వెబ్సైట్ ప్రిజం నివేదిక ప్రకారం, తన ఇమేజ్ను మెరుగుపరచడానికి, యూఎస్ కాంగ్రెస్- విధాన రూపకర్తలు సంస్థ ఎజెండాను సానుకూలంగా చూసేలా చేయడానికి ఆ ఏజెన్సీకి కోట్లాది రూపాయలను ఆర్ఎస్ఎస్ చెల్లించింది.
న్యూఢిల్లీ: ఈ సంవత్సరం ప్రారంభంలో తొలిసారిగా, భారతదేశ మితవాద సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కోసం అమెరికాలోని అగ్రశ్రేణి లాబీయింగ్ సంస్థ స్క్వైర్ పాటన్ బోగ్స్(Squire Patton Boggs) అమెరికా పార్లమెంటులో లాబీయింగ్ రిజిస్టర్ చేసింది.
అమెరికన్ వెబ్సైట్ ప్రిజం నివేదిక ప్రకారం, 2025 మొదటి మూడు త్రైమాసికాలలో ఈ సంస్థకు $3,30,000(సుమారు రూ 2.75 కోట్లు) చెల్లించబడ్డాయి.
అమెరికాలో లాబీయింగ్ ఏజెన్సీని ఆర్ఎస్ఎస్ యమించుకోవడం ఇదే మొదటిసారి.
“అమెరికా- భారత ద్వైపాక్షిక సంబంధాల”కు సంబంధించిన అంశాలపై ఆ సంస్థ పనిచేసిందని లాబీయింగ్ పత్రాలలో పేర్కొనబడింది. అయితే ఈ చర్య యూఎస్ “ఫారిన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్(ఎఫ్ఏఆర్ఏ)” పరిధిలోకి రావాల్సి ఉండేదని నిపుణులు తెలియజేశారు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఒక విదేశీ (భారతీయ) సంస్థ. కానీ, స్క్వైర్ పాటన్ బోగ్స్ లేదా ఎఫ్ఏఆర్ఏ కింద స్వయంగా ఆర్ఎస్ఎస్ నమోదు చేసుకోలేదు.
ఆ లాబీయింగ్ సంస్థ ఆర్ఎస్ఎస్ తరపున యూఎస్ పార్లమెంటేరియన్, విధాన రూపకర్తలను సంప్రదించి; దాని చరిత్ర, “లక్ష్యం” గురించి సమాచారాన్ని అందించడానికి ప్రయత్నించిందని నివేదిక పేర్కొంది. అమెరికన్ ప్రొఫెసర్ ఆడ్రీ ట్రష్కేను లాబీయిస్ట్ బ్రాడ్ఫోర్డ్ ఎల్లిసన్ సంప్రదిస్తూ, “ఆర్ఎస్ఎస్ లక్ష్యం, ప్రభావం” గురించి చట్టసభ సభ్యులకు అవగాహన కల్పించాలనుకుంటున్నట్టుగా పేర్కొన్నారు.
ప్రిజంకు లభించిన సమాచారం ప్రకారం, ఈ సంవత్సరం నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం, శిక్షణా శిబిరాన్ని కూడా లాబీయింగ్ సంస్థ ప్రతినిధులు సందర్శించారు. ఈ సందర్శనను “భారతదేశం-అమెరికా పౌర సమాజ సంభాషణలో కీలకమైన క్షణం”గా ఆర్ఎస్ఎస్ పత్రిక అభివర్ణించింది.
ఈ లాబీయింగ్‌లో భాగస్వామ్యమైనవారిలో మాజీ రిపబ్లికన్ యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు బిల్ షుస్టర్, అతని సోదరుడు బాబ్ షుస్టర్(వన్+ స్ట్రాటజీస్ అనే సంస్థను నడుపుతున్నాడు) అనేక మంది మాజీ కాంగ్రెస్ సహాయకులు ఉన్నారని కూడా నివేదిక పేర్కొంది. లాబీయింగ్ దాఖలు బోస్టన్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ వ్యాపారవేత్త వివేక్ శర్మ పేరును కూడా పేర్కొంది. అతను $5,000 కంటే ఎక్కువ విరాళం ఇచ్చాడు. అంతేకాకుండా లాబీయింగ్ కార్యకలాపాలలో పాల్గొన్నాడు.
ఆర్ఎస్ఎస్కు భారతదేశ పాలక పార్టీ బీజేపీతో గాఢమైన సంబంధాలు ఉన్నందున, దానిని ‘విదేశీ రాజకీయ సంస్థ’గా పరిగణించి; లాబీయింగ్ డిస్క్లోజర్ యాక్ట్(ఎల్డీఏ)కింద కాకుండా, ఎఫ్ఏఆర్ఏ కింద నమోదు చేసి ఉండాలని నిపుణులు పేర్కొన్నారు.
2020లో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ- యూఎస్ఏ(OFBJP-USA) కూడా అమెరికా ఎన్నికల సమయంలో బీజేపీ ప్రచారంలో పాల్గొన్నప్పుడు విదేశీ ఏజెంట్‌గా నమోదు చేసుకోవాల్సి వచ్చిందని నివేదిక పేర్కొన్నది.
ప్రిజం నివేదిక ప్రకారం, ఆర్ఎస్ఎస్ చేస్తున్న ఈ లాబీయింగ్ అమెరికన్ విధాన రూపకర్తలలో దాని ఇమేజ్ను మెరుగుపరుచుకునే ప్రయత్నం.
అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఆర్గనైజ్డ్ హేట్ డైరెక్టర్ రకీబ్ హమీద్ నాయక్ మాట్లాడుతూ, “భారతదేశంలో ఆర్ఎస్ఎస్ ఇప్పుడు ప్రధాన స్రవంతి శక్తిగా మారింది, కానీ ప్రపంచవ్యాప్తంగా దీనిని ఇప్పటికీ ‘ఫాసిస్ట్ పారామిలిటరీ సంస్థ’గానే చూస్తున్నారు. వారు ఈ ఇమేజ్ను మార్చడానికి ప్రయత్నిస్తున్నారు.”
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
