ఢిల్లీలో ఇద్దరు కార్మిక హక్కుల కార్యకర్తలు, ఇద్దరు నిర్వాసితుల హక్కుల కార్యకర్తలు, అలాగే ఆరుగురు విద్యార్థులను “అధికారులు” తీసుకువెళ్లారని; ఇప్పటికీ వారి ఆచూకీ తెలియడం లేదని క్యాంపెయిన్ అగైన్స్ట్ స్టేట్ రిప్రెషన్(సీఏఎస్‌ఆర్) ఆరోపించింది.
వారి ఆచూకీ, భద్రతకు సంబంధించిన వివరాలను వెల్లడించాలని, వారికి న్యాయపరమైన సహాయం అందేలా చూడాలని ఆ సంస్థ డిమాండ్ చేసింది.
న్యూఢిల్లీ: ఇద్దరు కార్మిక హక్కుల కార్యకర్తలు, ఇద్దరు నిర్వాసితుల హక్కుల కార్యకర్తలు, ఆరుగురు విద్యార్థులు సహా పలువురిని “అధికారులు” అపహరించారని; వారు ఇప్పటికీ కనిపించడం లేదని క్యాంపెయిన్ అగైన్స్ట్ స్టేట్ రిప్రెషన్ అనే ఐక్య వేదిక ఆరోపించింది.
అదృశ్యమైన వారిలో ఎవరూ కూడా ఇప్పటివరకు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా సహోద్యోగులను సంప్రదించలేదని తెలిపింది.
ఈ వ్యక్తుల ఆచూకీ గురించి తక్షణమే సమాచారం ఇవ్వాలని, వారి భద్రతకు హామీ కల్పించాలని, వారికి న్యాయ సహాయం అందేలా చూడాలని, అలాగే ఈ విషయంలో అధికారుల జవాబుదారీతనం ఉండాలని సీఏఎస్‌ఆర్ తన ప్రకటనలో డిమాండ్ చేసింది.
మార్చి 12న ఇలక్కియా, శివ కుమార్ల అదృశ్యం
సీఏఎస్‌ఆర్ పత్రికా ప్రకటన ప్రకారం- ఢిల్లీ విశ్వవిద్యాలయంలో సైకాలజీలో మాస్టర్స్ చేస్తున్న విద్యార్థిని ఇలక్కియా, కార్మిక హక్కుల కార్యకర్త శివ కుమార్‌లు మార్చి 12న అపహరణకు గురయ్యారు.
‘సామ్రాజ్యవాద వ్యతిరేక వారం’ కార్యక్రమాల గురించి చర్చించడానికి వారు దయానంద్ సింగ్ కళాశాలకు వెళ్లారు.
అక్కడ ఢిల్లీ విశ్వవిద్యాలయ ఉపాధ్యాయ సంఘం(డీయూటీఏ) మాజీ కార్యనిర్వాహక సభ్యుడు, అకడమిక్ కౌన్సిల్ సభ్యుడు, అలాగే కామన్ టీచర్స్ ఫోరమ్‌లో భాగమైన ఫ్యాకల్టీ సభ్యుడు సచిన్ ఎన్ను వారు కలవాల్సి ఉంది.
ఆ బృందం తెలిపిన వివరాల ప్రకారం, వారు మధ్యాహ్నం 12 గంటలకు క్యాంపస్‌కు చేరుకున్నారు.
ఫ్యాకల్టీ సభ్యుడు రావడం కాస్త ఆలస్యం కావడంతో వారు కళాశాల క్యాంటీన్లోనే భోజనం చేశారు.
జేఎల్ఎన్ మెట్రో స్టేషన్ సమీపంలోని కళాశాల గేటు వెలుపల మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో ఈ అపహరణ జరిగినట్టు తెలుస్తోంది.
ఒక మహిళా ఏజెంట్, అలాగే సివిల్ డ్రెస్‌లో ఉన్న ముగ్గురు లేదా నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఇలక్కియాను బలవంతంగా వీఐపీ లైట్లు ఉన్న వాహనంలోకి ఎక్కించారని అక్కడి దుకాణదారులు చెప్పినట్లు ప్రెస్ నోట్ ఉటంకించింది.
ఇలక్కియా కేకలు వేయడానికి ప్రయత్నించినప్పటికీ, ఆ సంఘటన చాలా వేగంగా జరిగిపోవడంతో ఆమెకు అవకాశం లభించలేదని; ఆ సమయానికే శివ కుమార్ కూడా అదే వాహనంలో ఉన్నట్టు సమాచారం.
ఆ ప్రకటన ప్రకారం, ఇలక్కియా మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో సదరు ఫ్యాకల్టీ సభ్యుడికి మెసేజ్ చేసి, ఆయన రావడానికి ఇంకా ఎంత సమయం పడుతుందని అడిగింది.
ఆయన మధ్యాహ్నం 1:30 గంటలకు తిరిగి కాల్ చేసినప్పుడు, ఆమె మొబైల్ అప్పటికే స్విచ్ ఆఫ్‌లో ఉంది.
స్థానిక దుకాణదారులు ఈ సంఘటనను ఆ ప్రాంత బీట్ పోలీసు అధికారి దృష్టికి తీసుకెళ్లారని సంస్థ తెలిపింది.
మరో కార్యకర్త మంజీత్ ఆచూకీ గల్లంతు
మార్చి 13 నుంచి మరో కార్యకర్త మంజీత్ కూడా కనిపించకుండా పోయాడని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
భీమా కోరేగావ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆ రోజు జరిగిన సీఏఎస్‌ఆర్ కార్యక్రమానికి మంజీత్ హాజరయ్యారు.
విజయ్ నగర్లో మరో ఏడుగురు..
దీంతో పాటు, మార్చి 13న రాత్రి 8 గంటలకు ఢిల్లీ విశ్వవిద్యాలయం నార్త్ క్యాంపస్ సమీపంలోని విజయ్ నగర్లో ఉన్న భగత్ సింగ్ ఛత్ర ఏక్తా మంచ్ కార్యాలయం నుంచి ఢిల్లీ పోలీసులు మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారని స్థానిక నివాసితులు చెప్పినట్టు ప్రెస్ నోట్ పేర్కొంది.
గతంలోనూ అరెస్టులు, వేధింపులు
సింఘు సరిహద్దులో జరిగిన రైతుల నిరసన సమయంలో శివ కుమార్‌ను కార్మిక హక్కుల కార్యకర్త నవదీప్ కౌర్‌తో పాటు గతంలో అరెస్టు చేశారని హక్కుల సంఘం గుర్తుచేసింది.
సోనిపట్‌లోని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కార్యాలయంలో నిర్బంధంలో ఉన్న సమయంలో తనను చిత్రహింసలకు గురిచేశారనే ఆరోపణలు ఉన్నాయి.
పోలీసు రిమాండ్‌లో జరిగిన ఈ ఘటనలకు సంబంధించిన కేసు ప్రస్తుతం పంజాబ్, హర్యానా హైకోర్టులో పెండింగ్‌లో ఉంది.
శివ కుమార్‌ను జనవరి 16 నుంచి జనవరి 23 వరకు అక్రమ నిర్బంధంలో ఉంచారని జస్టిస్ దీపక్ గుప్తా గతంలో చెప్పినట్టు సీఏఎస్‌ఆర్ తన ప్రెస్ నోట్లో తెలిపింది.
అధికారికంగా అరెస్టు చూపిన దాదాపు నెల రోజుల తర్వాత ఆయనకు జీఎంసీహెచ్-32లో వైద్య పరీక్షలు నిర్వహించారు(గతంలో ఐదుసార్లు పరీక్షలు నిర్వహించినట్లు రికార్డులు చెబుతున్నాయి).
హైకోర్టు ఆదేశాలతో జరిగిన విచారణలో, శివ కుమార్ గాయాలకు ఇన్స్పెక్టర్ రవీందర్ బాధ్యుడని తేలింది.
అయితే, కుమార్‌ను అసలు ఆ కేంద్రానికి తీసుకురాలేదని చెబుతూ సదరు అధికారి ఆ ఆరోపణలను ఖండించారు.
పోలీసుల హింస కారణంగా జరిగిన ఆ గాయాల నుంచి శివ కుమార్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని, ఈ నేపథ్యంలో తాజా పరిణామం ఆయన ప్రస్తుత భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఆ ప్రకటన పేర్కొంది.
గత ఏడాది నవంబర్‌లో ఇండియా గేట్ వద్ద వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన ఘటనలో ఇలక్కియా, కిరణ్, అక్షయ్లను నెల రోజుల పాటు తీహార్ జైలులో ఉంచారని సీఏఎస్‌ఆర్ తెలిపింది.
దీంతో పాటు, ఎనిమిది నెలల క్రితం ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ ఎహ్తెమామ్, బాదల్, గౌరవ్‌లను వారం రోజుల పైగా అక్రమ కస్టడీలో ఉంచి, చిత్రహింసలకు గురిచేసిందని కూడా ఆ ప్రకటనలో ఆరోపించారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
