మాటలే అన్నింటికీ మందు కాదు. అలంకారిక వచనాలు ఓట్లు రాల్చవు. ప్రాసలతో కూడిన పంచులు అన్ని వేళలా పనిచేయవు. కానీ, మాటల మాయాజలంపైనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధారపడుతున్నారనే భావన చాలామందిలో ఉన్నది.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలుకుంటే, నిన్నటి కేసీఆర్ ప్రెస్‌మీట్ అనంతరం వరకు అవే డైలాగ్‌లను కొనసాగిస్తున్నారు.
ఉదాహరణకు కొన్ని “కాళేశ్వరంలో లక్ష కోట్ల దోపిడి, కేసీఆర్‌కు గతం తప్ప భవిష్యత్తు లేదు, 2029 వరకు అధికారం కాంగ్రెస్‌దే, నేను రాజకీయాలలో ఉన్నంత వరకు బీఆర్ఎస్ను అధికారంలోకి రానివ్వను, బిల్లా- రంగాలు, కల్వకుంట్ల కుటుంబం, ఆ నలుగురిదే అధికారం” తదితర డైలాగులను ఈ రెండేళ్ల కాలంలో రేవంత్ రెడ్డి విరివిగా వాడారు.
అయితే, ఎన్నికల సందర్భంలో ఇందులోని కొన్ని డైలాగులు బాగా పనిచేశాయి. ఓట్లను కూడా రాల్చాయి. రేవంత్‌రెడ్డికి అధికారాన్ని అప్పగించాయి.
ప్రస్తుత వాస్తవం..
గతంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రోద్యమం భావోద్వేగ సన్నివేశం. ఓ పదిహేనేళ్ల పాటు కేసీఆర్ ఏం మాట్లాడిన, ఎట్లా మాట్లాడిన తెలంగాణ సమాజం ఆమోదించింది, కొన్నిసార్లు అంగీకరించింది. మరికొన్నిసార్లు అయిష్టంగానైనా సమర్థించింది. అది ఆనాటి రాజకీయ స్థితి.
అనంతరం, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత డైలాగులను రిపీట్ చేయడం వలన నష్టమే తప్పా ప్రయోజనం లేకుండా పోయింది. వాస్తవానికి కేసీఆర్ మాటల్లో తెలంగాణ, దాని భవిష్యత్తు, గత పాలకుల వైఖరి ప్రధానంశాలు. దానికి తోడు 1969 ఉద్యమ అనుభవాలు ఉన్నాయి. వెరసి, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచాయి. మారిన స్థితిని కేసీఆర్ గమనంలోకి బహుశా తీసుకోనట్టుంది. ఆమేరకు ఫలితాన్ని చవిచూడాల్సి వచ్చింది.
రేవంత్‌రెడ్డి డైలాగులు..
“కనుగుడ్లు పీకి గోటీలాడుతా, పేగులు తీసి మెడలో వేసుకుంటా, పండవెట్టి తొక్కుతా” ఈ తరహా మాటలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ ఇద్దరి నాయకుల మాటలను తెలంగాణ సమాజం గమనిస్తూనే ఉన్నది.
కేసీఆర్‌కు ముందు ఒక ముఖ్యమంత్రిగా ఇంతలా జనం భాషను మాట్లాడిన వారు మరొకరు లేరు. అదే సందర్భంలో ప్రత్యర్ధులపై, తన వ్యతిరేకులపైనా ఈ స్థాయిలో మాటలు సంధించినవాళ్లూ లేరు. కేసీఆర్ అనంతరం, ముఖ్యమంత్రయిన రేవంత్‌రెడ్డి ఉపయోగిస్తున్న పదజాలంపైనా వ్యతిరేకత వస్తున్నది. అన్ని సందర్భాల్లో ఈలలు, చప్పట్లు కొట్టించే డైలాగులు ఓట్లు రాల్చవు. పైగా వ్యతిరేక ఫలితాన్ని ఇస్తాయి. సహజంగా ఈ తరహా విషయాలను రాజకీయ నాయకులు గుర్తించనిరాకరిస్తారు. అప్పుడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్‌రెడ్డి ఈ కోవలోకే వస్తారా?
వ్యూహం- తొందరపాటు
గత ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి ఇద్దరికిద్దరూ జనం నాడీ తెలిసినవారే. ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే సమర్థులే. ఇది గడిచిన కొన్నాళ్ల అనుభవం ద్వారా రూడీ అవుతున్న విషయం.
తెలంగాణ ప్రజల భావోద్వేగాన్ని ఒకతీరులో కేసీఆర్ పట్టుకుంటే, కొత్తతరం భావోద్వేగాన్ని సోషల్ మీడియా ప్రభంజనాన్ని తనకు అనుకూలంగా రేవంత్ మల్చుకున్నారు. వీరిద్దరి ఆలోచనలు భిన్నమైనవే. ఏ విధంగానైనా సరే లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదలలో వీరిద్దరు ఒక్కటే..!
కేసీఆర్ లోతైన అవగాహనతో అన్ని విధాల ఆలోచించి తన వ్యూహాన్ని అమలు చేస్తారు. రేవంత్‌రెడ్డిలో తొందరపాటు ఉంటుందనే భావన చాలామందిలో ఉన్నది.
రాజకీయ నాయకులు పార్టీ ప్రయోజనం కోసమో, తామే అధికారంలో ఉండాలనే ఆలోచనతో మాట్లాడుతూ ఉంటారు. ఏ గాంభీర్యమూ, గాఢతా లేని చంద్రబాబును ఓటర్లు అర్థం చేసుకున్నారు. ఒకే ధోరణితో మాట్లాడే జగన్‌ను ప్రజలు గెలిపించుకున్నారు. పాండిత్యంతో కూడిన తెలంగాణ నుడికారాన్ని పలకరించే కేసీఆర్‌ను గెలిపించారు. తాజాగా తనదైన శైలిలో మాట్లడే రేవంత్‌రెడ్డిని గెలిపించారు.
నిజానిజాలు తెలుసుకోని వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు స్పందిస్తారు. ఆయా పరిస్థితులే ఆయా నాయకుల గెలుపోటములకు కారణాలు. పని గట్టుకోని చేసే ఆరోపణలు, ప్రతీకార రాజకీయాలు ప్రజల ప్రేమాభిమానాలను చురగొనలేవు. గతం చెప్తున్న సత్యమిది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
