గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో వార్డులను 150 నుంచి 300కు పెంచుతున్నామని ప్రభుత్వం ప్రకటించిన తీరు- పైకి ప్రజాస్వామ్య విస్తరణగా కనిపించినా, లోతుగా చూస్తే అది రాజకీయ అధికారాన్ని తిరిగి పంచుకునే కుట్రాత్మక వ్యాయామంలా కనిపిస్తోంది. ఇది పరిపాలనా సంస్కరణ కాదు. ఇది అధిపత్య కుల రాజకీయాలకు కొత్త మ్యాప్ గీసే ప్రయత్నం.
వార్డు విభజన అనేది సంఖ్యల ఆట కాదు. అది ఎవరు గెలవాలి, ఎవరు ఓడిపోవాలి, ఎవరు రాజకీయంగా ఎదగాలి, ఎవరు శాశ్వతంగా పక్కకు నెట్టబడాలన్నది నిర్ణయించే ప్రమాదకర ఆయుధం. అలాంటి ఆయుధాన్ని శాస్త్రీయ ప్రమాణాలు, జనాభా నిష్పత్తి, సామాజిక న్యాయం పక్కనబెట్టి వాడితే అది ప్రజాస్వామ్యంపై నేరమే.
ప్రస్తుతం జరుగుతున్న విభజనపై కార్పొరేషన్ సమావేశాల్లో వెల్లువెత్తుతున్న ఆవేదన యాదృచ్ఛికం కాదు. ఇది దళిత-బహుజన వర్గాల్లో, ముఖ్యంగా మూడో తరం రాజకీయ నాయకత్వం ఎదగకుండా అడ్డుకునే వ్యూహంపై కలిగిన న్యాయమైన భయం. రెడ్డి, వెలమ, ఆంధ్ర సెటిలర్లుగా గుర్తింపుపొందిన కమ్మ, కాపు కులాలకు రాజకీయ అధికారాన్ని కట్టబెట్టేలా గీతలు గీస్తున్నారన్న అనుమానం బలంగా ఉంది- ఇది ఊహ కాదు, గత అనుభవాల నుంచి వచ్చిన అనుమానం.
రిజర్వేషన్లు- కాగితాల్లో న్యాయం, గీతల్లో ద్రోహం
300 వార్డుల విభజనలో రిజర్వేషన్ల ప్రశ్న అత్యంత కీలకమైనది. కానీ ఇక్కడే ప్రభుత్వ అసలు ముఖం బయటపడే ప్రమాదం ఉంది. ఎస్సీ, ఎస్టీలకు 22.5 శాతం రిజర్వేషన్లను యాంత్రికంగా కొనసాగిస్తూ, బీసీలకు మాత్రం జనాభాకు అసమానంగా 23 శాతం వరకే పరిమితం చేసిన చరిత్ర మన ముందుంది. ఇది న్యాయం కాదు, ఇది రాజకీయ లెక్క.
అదే సమయంలో ముస్లింలకు కేటాయించిన సీట్లను బీసీ కోటాలో చూపించడం ద్వారా వాస్తవానికి బీసీలకు నష్టం జరిగింది. మైనార్టీలకు వారి జనాభాకు తగిన ప్రాతినిధ్యం దక్కింది- కానీ ఇది అసలు విషయం కాదు. దీనికి మూల్యం చెల్లించింది బీసీలు. ఈ అసమానతను సరిచేయకుండా, ఇప్పుడు కొత్త వార్డుల పేరుతో అదే ద్రోహాన్ని మళ్ళీ పునరావృతం చేయబోతున్నారానే సందేహం కలుగుతుంది.
వార్డు విభజన తర్వాత రెడ్డి, వెలమ, కమ్మ, కాపు కులాలకు ఇవ్వాల్సినదానికంటే ఎక్కువే దక్కే అవకాశం ఉందన్న అంచనా రాజకీయ వాస్తవాల మీద ఆధారపడినది. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ ప్రాతినిధ్యం అంటూ చేసిన బోగస్ హామీలు చివరకు 17.5 శాతానికే కుదిరిపోయిన ద్రోహ చరిత్ర ఇప్పటికీ బహిరంగమే. అదే స్క్రిప్ట్ జీహెచ్ఎంసీలో తిరిగి రాయబడితే- బీసీల రాజకీయ భవిష్యత్తుకు అది ఘోర ప్రమాదం.
జనరల్ సీట్లు గెలిచినా ప్రమాదం తొలగలేదు
ఇప్పటివరకు బీసీలు జనరల్ స్థానాల్లో పోటీ చేసి- ఇది పూర్తి స్థాయిలో కాదు కానీ గెలవగలిగారు. అది వారి సామాజిక శక్తికి నిదర్శనం. కానీ ఆ అవకాశాలనే వ్యవస్థాపకంగా మూసివేయాలనే ప్రయత్నమే ఈ వార్డు విభజన. ‘‘మీరు గెలుస్తున్నారు కదా, రిజర్వేషన్లు ఎందుకు?’’ అన్న వాదన వెనుక దాగిన ఉద్దేశం ఇదే. పోటీని నియంత్రించడం, గెలుపును పరిమితం చేయడం. ఈ పరిస్థితిలో ‘‘ఇప్పుడేమీ జరగదు’’ అన్న నిర్లక్ష్యం బీసీలకు ప్రాణాంతకం. రాజకీయంగా అప్రమత్తంగా లేకపోతే, ఈ నగరంలో బీసీలు ఓటర్లుగానే మిగిలిపోతారు, నాయకులుగా కాదు.
మాటలకే పరిమితం కాకుండా ఉద్యమం తప్పనిసరి
కాబట్టి బీసీలు ఇక ప్రెస్మీట్లకే, ఇందిరాపార్క్ ధర్నాలకే పరిమితం కావడం సరిపోదు. 300 వార్డుల్లో కనీసం సగం సీట్లకు న్యాయమైన ప్రాతినిధ్యం కోసం ఉద్యమించాలి. అది వార్డు స్థాయిలో జరగాలి. ప్రతి గీతను ప్రశ్నించాలి. ప్రతి మ్యాప్‌ను బహిర్గతం చేయాలి.
ఈ రోజు ఆ వార్టులలో అన్యాయం జరిగిందని రాజకీయ పార్టీలు ఎలా రోడ్లెక్కాయో అదే తీవ్రతతో, అదే పట్టుదలతో బీసీలు తమ హక్కుల కోసం నిలదీయాలి. ఎందుకంటే ఇది సీట్ల పోరు కాదు, ఇది రాజకీయ ఉనికికి సంబంధించిన పోరు ఆయా పార్టీలలో ఉన్న బీసీల కర్తవ్యం కూడ.
ప్రజాస్వామ్యమా? లేక ఆధిపత్యపు పునర్వ్యవస్థాపనా?
ఈ వార్డు విభజన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందా? లేదా ఆధిపత్య కులాల అధికారాన్ని మరోసారి పునర్వ్యవస్థాపన చేస్తుందా?
ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. కానీ అంతకంటే ముందు ప్రజలు, ముఖ్యంగా బీసీలు, ఈ దగుల్బాజీని గుర్తించి అప్రమత్తంగా నిలబడాల్సిందే. ఎందుకంటే, మౌనం ఎప్పుడూ తటస్థం కాదు. ఇలాంటి వేళ మౌనం కూడా ద్రోహమే.
పాపని నాగరాజు
సత్యశోధక మహాసభ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
