అన్ని కులాల, వర్గాల, ప్రాంతాల, దేశాల వాళ్లూ మనుషులే! బేధాలు, వర్గీకరణలను మరచి మానవజాతి అంతా ఒకటేనన్న విశాలత్వంలోకి ఎదగాల్సింది పోయి- ఒక కులం వారు మరో కులాన్ని ఎద్దేవా చేయడం; ఒక ప్రాంతం వారు మరో ప్రాంతం వారిని అవహేళన చేయడం వల్ల సాధించేదేముంది? వైషమ్యాలు, కక్షలు, కార్పణ్యాలు తప్ప?
మామూలు మనుషులంటే పరిపక్వత లేని వాళ్లని అనుకుందాం. సర్వసంగ పరిత్యాగులమని ప్రకటించుకొని- ఎవరికి వారు చిన్నచిన్న “ఆధ్యాత్మిక సామ్రాజ్యాల”ను నిర్మించుకున్న వారికి సహనం ఉండాలి కదా? జ్ఞానబోధ ఎలా చేస్తారూ?
రాగద్వేషాలకు అతీతంగా, ఓపిగ్గా సగటు మనిషికంటే ఎన్నో రెట్లు ఎదిగి కదా జ్ఞానబోధ చేయాలి? సగటు మనిషి కంటే అధ్వాన్నంగా తైతక్కలాడుతూ ఆక్రోషం వెళ్లగక్కితే ఇంక వాళ్లేం సాదువులూ? వాళ్లేం స్వామిజీలు?
ప్రభుత్వాలు కార్పోరేట్ సంస్కృతిని ప్రోత్సహిస్తూ, బాబాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు- మరి ఎవరి మీద బాధ్యత ఉంటుంది? సామాన్య జనం మీదే కదా ఉండేదీ? అందువల్ల సామాన్య జనమే తెలివి పెంచుకోవాలి.
మూఢత్వంలో కొట్టుకుపోతూ, ఎవరి చుట్టో తిరగకుండా, హేతుబద్ధంగా నిలబడడం నేర్చుకోవాలి. ఎందుకంటే జన బాహుళ్యం ముందు ఎంతటి వారైనా దిగదుడుపే- స్వామిజీ/ బాబా/ రాజ్యాధినేత ఎవరైనా సరే! వైజ్ఞానిక స్పృహ పెరగాలని అంటున్నది ఇందుకే.
ఈ దేశంలో మతాలు ఏం చేశాయో? భక్తి ఉద్యమాలు ఎందుకొచ్చాయో ఒక్కసారి గతంలోకి వెళ్లి చూద్దాం.
భక్త కవులు- జ్ఞానబోధ..
సాధారణ శకం(సీఈ) 1117లో జన్మించారని భావించబడుతూ ఉన్న రామానుజాచార్యుని మతాన్ని రామానందుడూ; తన శిష్యులైన కబీరు, గురు రవిదాసు మొదలైన పన్నెండు మంది భక్త కవులు ఉత్తర- మధ్య భారతదేశంలో విస్త్రృతంగా భక్తి ఉద్యమాలను నిర్వహించారు.
ఈ పన్నెండు మంది భక్త కవులలో ఎనిమిది మంది చేనేత, జాట్, చమార్వంటి శూద్ర కులాలలో పుట్టినవారు.
కబీరు చేనేత కులంలో పుడితే, గురు రవిదాస్ చమార్(మాదిగ) కులంలో పుట్టాడు. కృష్ణ భక్తురాలైన మీరాబాయికి గురువు ఈ గురు రవిదాస్.
సాధారణ శకం(సీఈ) 1276లో ఢిల్లీ పాలకుడు సికిందర్ లోడి కాశికి వెళ్లి, గురు రవిదాస్ వద్ద జ్ఞానబోధ పొందాడు. అందుకు గుర్తుగా లోడి కాశిలో జ్ఞానవాపి మస్జీదును నిర్మించాడు.
ఇలా భక్త కవులను రాజులు, ప్రజలు అమితంగా గౌరవించేవారు. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేమంటే శూద్ర భక్త కవులను కూడా గౌరవించేవారు.
వర్ణవాద బ్రాహ్మణులు నిరంతరం వీరిని వ్యతిరేకిస్తూనే వచ్చారు. ఎన్నో కష్టనష్టాలకు గురి చేస్తూ వచ్చారు. భక్త తుకారం మహారాష్ట్రలో బ్రాహ్మణులతో ఎన్నో అవమానాలు ఎదుర్కున్నాడని, కష్టాల పాలయ్యాడని మనకు తెలుసు.
వైష్ణవాలయంగా బౌద్ధరామం
ఒక సందర్భంలో, జైన మతస్తుడైన మైసూరు రాజు వెల్లాల రాయని కూతురు ఆరోగ్యాన్ని రామానుజాచార్యులు బాగు చేస్తాడు. దీనికి ప్రతిఫలంగా రాజు వైష్ణవ దీక్షను తీసుకోవాలని కోరతాడు.
జైన మతం యుద్ధాలకు వ్యతిరేకం కాబట్టి, వెల్లాల రాయుడు వైష్ణవ దీక్ష తీసుకుని దండయాత్రలు చేస్తాడు. రాజ్యాన్ని విస్తరించుకుంటాడు. అప్పటి వరకూ బౌద్ధరామమైన తిరుపతి ఆలయాన్ని స్వాధీనం చేసుకోని, దాన్ని వైష్ణవాలయంగా మార్చాడు. ఆ తర్వాత అది బాలాజీ గుడిగా, వెంకటేశ్వరాలయంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
వీరశైవ రాజ్య విస్తరణ
ఇకపోతే వీరశైవం, వీర వైష్ణవం గురించి చరిత్రలో చాలా వివరాలున్నాయి. బిజ్జలుడనే రాజు దగ్గర బసవడు మహామంత్రిగా ఉండేవాడు. రాజు వద్ద బసవడు నమ్మకంగా ఉంటూనే చివరికి హత్య చేస్తాడు. కారణం రాజ్యకాంక్షే!
బిజ్జలుని రాజ్యాన్ని కైవసం చేసుకుని, తనను తాను రాజుగా ప్రకటించుకుంటాడు. వీరశైవమనే మతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన తర్వాత దాన్ని అడ్డంపెట్టుకోని, బౌద్ధులను- జైనులను హింసించి, చంపి వారి ఆలయాలను శివాలయాలుగా మార్చేశాడు.
రాజ్య విస్తరణ, రాజకీయ ప్రయోజనాల కోసమే “వీర శైవం” అనే పేరు పెట్టుకుని పరిపాలన సాగించాడు.
తన ప్రాభవాన్ని పెంచుకోవడానికి ఇస్లాం మతంలోని “మాల్-ఎ-గనీమత్” అనే అంశాన్ని స్వీకరించి, తన పరిపాలనలో ప్రవేశపెట్టాడు. “మాల్-ఎ-గనీమత్” అంటే దాడి/ యుద్ధంలో దొరికిన సంపదలో సైనికులకు వాటాలివ్వడం. అలా ఇవ్వడం వల్ల సైనికులు అత్యుత్సాహం ప్రదర్శించి ఎక్కువ సంపదను కొల్లగొట్టుకొస్తారని ఆశ.
ముస్లిం రాజులు అనుసరించిన అంశాన్ని స్వీకరించడమే కాదు, ఇంకా మరో నాలుగడుగులు ముందుకు పోయి- దోపిడీ దార్లను, గుండాలను, వ్యభిచారులను కూడా తన సైన్యంలో బసవడు భాగస్వాములను చేసుకున్నాడు.
మతం పేరిటి దురాచారల ప్రవేశం
గుళ్లలో దేవదాసీ వ్యవస్థను, బసివిని వ్యవస్థను, జోగిని వ్యవస్థను మతం పేరిట ప్రవేశ పెట్టాడు. అంటే, మతం ముసుగులో స్త్రీల జీవితాన్ని దుర్భరం చేశాడన్న మాట! తన రాజ్య కాంక్షకు, రాజకీయ సిద్ధాంతానికి మతం రంగు పులిమి జనాన్ని కట్టి పడేశాడు.

ఇది ఇలా ఉంటే, “వీర వైష్ణవం” కూడా ఏం తక్కువ తినలేదు. “వీరశైవానికి” దీటుగా పనిచేసింది. గుళ్లలో “దేవదాసి” వ్యవస్థను ప్రవేశపెట్టి, “కృష్ణ- మురళి” అనే పేర్లతో పేద కులాల స్త్రీలను వ్యభిచారంలోకి లాగారు- దుర్మార్గంగా కొనసాగించారు. ఈ వ్యవస్థలు శతాబ్దాలుగా కొనసాగుతూ రావడం కూడా మనం గమనిస్తూనే ఉన్నాం.
ఇలా గుళ్లను ఆర్థిక వనరులుగా, సమాచార కేంద్రాలుగా, వ్యభిచార కేంద్రాలుగా మార్చుకున్న అగ్రవర్ణాలు- వీరశైవం, వీర వైష్ణవం పేర్లతో సమాజాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. ప్రజలకు కావల్సిన విద్య, వైద్యం పట్ల వీరు శ్రద్ధ పెట్టలేదు. కేవలం వారి మత ప్రచారానికి కావాల్సిన కళలను- ముఖ్యంగా సాహిత్యాన్ని, సంగీతాన్ని, నృత్యాన్ని మాత్రమే ప్రోత్సహించారు.
ఆలయాల ద్వారా వచ్చిన ఆదాయం ప్రజల కోసం ఎప్పుడూ ఖర్చు చేయలేదు. మళ్లీ ఆ డబ్బు మత ప్రచారానికే ఉపయోగించారు. ఒక్కోసారి భోగభాగ్యాలకు, అక్రమ లైంగిక సంబంధాల కోసం పూజారి వర్గం ఉపయోగించుకున్నది.
ఆలయాల ఆదాయం ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలకు ఉపయోగిస్తే, ఆలయాల నేల మాళిగల్లో గుప్త నిధులు పేరుకుపోయేవి కాదు కదా?
మానవతా భావాల వ్యాప్తి..
ప్రేమ, కరుణ, శాంతియుత సహజీవనం గురించి ఈ దేశంలో మొదటి సారి మాట్లాడింది బౌద్ధులు, జైనులు.
ద్వేషాన్ని విడనాడాలని, నిర్మలమైన మనసుతో, సహనంతో, సానుభూతితో జీవనం సాగించాలని చెప్పినవి అవే! రాజ్యకాంక్షకు, రాజకీయ కుతంత్రాలకు ఇవి అడ్డుపడేవిగా ఉన్నాయని కొంతమంది రాజులు, అగ్రవర్ణ మనువాదులూ మండిపడ్డారు. జైనులను, బౌద్ధులను చిత్రహింసలు పెట్టారు. వారి విహారాలను, ఆరామాలను కొల్లగొట్టి శివాలయాలుగా, వైష్ణవాలయాలుగా మార్చేశారు.
బౌద్ధం- జైనం యుద్ధానికి వ్యతిరేకం కాబట్టి వాటిని అణచి పెట్టడానికి- వీరశైవం, వీర వైష్ణవం ఉద్యమాలకు ఊపిర్లూదారు. లోతుగా ఆలోచిస్తే మత దౌర్జన్యాలు, మతదాడులు, మత యుద్ధాలు ఏవీ మతం కోసం కాదు. అంతిమంగా అధికారం సాధించడం కోసమేనని అర్థమౌతూ ఉంది.
మతవ్యాప్తి పరమావధి కాదు, అధికారమే పరమావధి
మతాన్ని ఒక మెట్టుగా, ఒక నిచ్చెనగా ఉపయోగించుకుని గద్దెనెక్కడం. గతంలో ఉంది. ప్రస్తుతంలోనూ కనిపిస్తోంది. జనాన్ని వివశులుగా చేసే మతం, జనాన్ని మౌఢ్యంలోకి తోసే మతం- ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో ఇంకా అవసరమా?
ప్రాణం లేకపోతే మనిషి బతకడు. కులం లేక పోతేనో, వర్గం, వర్ణం, ప్రాంతీయత లేకపోతేనో మనిషి బతుకుతాడా? బతకడా? మనిషి ప్రాణంతో ఉండడానికి ఇవి ఎంత అవసరం? వైజ్ఞానికంగా ఇంత అభివృద్ధి సాధించిన తర్వాత కూడా ఆలోచించుకోకపోతే ఎలా?
ఇతర మతాల కంటే భిన్నంగా బౌద్ధం విద్య మీద దృష్టి పెట్టింది. నలందాలాంటి ఆనాటి విశ్వవిద్యాలయాలు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయని మనకు తెలుసు. బ్రిటీషు పాలనా కాలంలో భారత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున క్రిస్టియన్ మిషనరీ పాఠశాలలు- ఆసుపత్రులు వెలిశాయి. ఇవి విద్య, వైద్యంతో పాటు మత ప్రచారం కూడా చేశాయి. పెద్దెత్తున మత మార్పిడులను ప్రోత్సహించాయి. తమ ప్రాభవం, తమ అధికారం సుస్థిరంగా ఉంచుకోవడం కోసమే!
నాడూ నేడూ అదే ధోరణి
బ్రిటీషు పాలకులు నాణాల మీద శ్రీరామ చంద్రుని పట్టాభిషేకాన్ని ముద్రించారు. ఎందుకూ? ఈ దేశంలో హిందువుల జనాభా ఎక్కువ- వీరి ఆరాధ్య దైవం రాముడు గనక. ఆ రామ పట్టాభిషేకంతో తమని తాము గుర్తించుకుంటారు గనక. ఆ విధంగా జనం మన్ననలు పొందడానికి నాటి బ్రిటీషు ప్రభుత్వం ఆ పని చేసింది.
బ్రిటీషు వారికి రాముడు దేవుడు కాకపోయినా, రాముడి పట్ల వారికి భక్తిభావం లేకపోయినా- ప్రజల మన్నన పొందడానికి వారి మతాన్ని, దేవుణ్ణి ఉపయోగించుకున్నారన్న మాట! అదే ఆలోచనా విధానాన్ని నేటి మన పాలకులు కూడా పాటిస్తున్నారు.
జనాన్ని ఆకట్టుకోవడానికి లేదా వారి విశ్వాసాన్ని పొందడానికి, చివరికి ఓటర్ల ఓట్లు రాబట్టడానికి వారి నమ్మకాలతో మమేకమై పోతుంటారు. బోనాలెత్తుకుంటూ ఉంటారు. పుష్కర స్నానాల పేరుతో మురికిలో మునుగుతారు. స్వాములూ, బాబాల కాళ్ల మీద పడతారు. జన బాహుళ్యంలో ఉన్న మూఢ నమ్మకాలని పెంచి పోషిస్తారు. జనం వివేకవంతులై. అలాంటి వారిని ఎన్నికల్లో గెలిపించకుండా ఉంటే సమాజం బాగుపడుతుంది.
ఒక్క విషయం ఒప్పుకుని తీరాలి. ఈ దేశంలో మతకలహాలు లోగడ జరిగాయి. ఇప్పుడూ జరుగుతున్నాయి. అయితే అవన్నీ మతం పేరుతో ఆధిపత్యం- అధికారం కోసం జరిగిన పోరాటాలే కానీ, వాటిలో ఏవీ కేవలం మతం కోసం జరిగినవి కావు. మతాన్ని ఉపయోగించుకున్నవి మాత్రమే.
రొహింగ్యా ముస్లిం జాతిని సమూలంగా నాశనం చేయాలని ప్రస్తుతం మయన్మార్‌గా పిలవబడుతున్న బర్మాలో ఆ మధ్య తీవ్ర ప్రయత్నాలు జరిగాయి కదా? మానవ హక్కులు కాలరాయబడ్డాయి కదా? దాని వెనక రాజకీయ, ఆర్థిక, నైతిక, దౌత్య కారణాలెన్నో ఉన్నాయి. కేవలం మతమొక్కటే కాదు. లేకపోతే శాంతి కాముకులని అనుకుంటున్న బౌద్ధ భిక్షువులు చెలరేగడమేంటీ?
కాషాయ వర్ణం కసాయితనానికి చిహ్నమౌతోందా?
మన దేశంలోనూ ఎన్ని అఘాయిత్యాలు జరగలేదూ? హైదరాబాదులోని మక్కా మసీదులో ముస్లింలను హిందువులు చంపారు. మాలెగావ్‌లో బాంబులు పేల్చి ముస్లింలను హిందువులు చంపారు. అజ్మీరు దర్గాలో బాంబులు పేల్చి ముస్లింలను చంపారు. ఢిల్లీ నుంచి లాహోర్ వెళ్లే రైల్లో బాంబులు పెట్టిన కాషాయ ఉగ్రవాదులు ముస్లింలను చంపారు. లక్షల మంది బౌద్ధులను ఈ హిందూ ఉగ్రవాదులే నరికేశారు. దేశంలో గుజరాత్ గాయాన్ని ఎవరు మరిచిపోగలరూ?
దక్షిణాదిన ఉన్న ఒక ముస్లిం రాజకీయ పార్టీ, ఉత్తరాది ఎలక్షన్లో తమ అభ్యర్థుల్ని నిలబెడుతుంది. ఎందుకంటే, అక్కడున్న తమ మత విశ్వాసకుల సహాయంతో గెలిచి రాజకీయంగా బలపడేందుకు! అంతేకాని మతాన్ని బలోపేతం చేయడానికి కాదు.
వానపామును గాలానికి గుచ్చి చేపలు పట్టినట్టు- మతాన్ని చూపించి అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే ఎవరు చేసినా- ఇది అన్ని మతాలకు వర్తిస్తుంది.
మత పెద్దలందరూ ఒకేలా ప్రవర్తిస్తారు. బూర్జువా రాజకీయ నాయకులంతా ఒకేలా ఆలోచిస్తారు. ఈ లింకు తెగాలి. మతానికీ రాజకీయానికీ లంకె తెగిపోతే కానీ సామాన్యుడికి ఊపిరాడదు. దేశంలో స్వేచ్ఛాలోచనలు సాగవు. మానవత్వాన్ని మంటగలిపే ప్రయత్నంలో ఏ ఏ మతమూ వెనుకంజ వేయలేదని గత చరిత్ర చెపుతోంది. నడుస్తున్న చరిత్రా చూపెడుతోంది!
వ్యాస రచయిత కేంద్ర సాహిత్య అకాడమీ, కవిరాజు త్రిపురనేని రామస్వామి పురస్కార గ్రహీత.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
