“ప్రజలెప్పుడైతే తమ హక్కుల కోసం గొంతెత్తుతారో, తమ అధికారం కోసం నిలదీస్తారో- అప్పుడే వారిని మత పిచ్చిలోకి తోసెయ్యాలి”
– నెపోలియన్
ఎప్పుడెప్పుడు ధార్మికత రాజనీతితో జతకూడుతుందో, అప్పుడప్పుడు ద్వేషం గొప్ప మెజారిటీతో అధికారంలోకి వస్తుంది.
దేశంలో అంధభక్తులు ఎలా తయారయ్యారంటే- ఏదైనా మంచి విషయం జరిగినప్పుడు మీరు వారికి “కాంగ్రేచులేషన్స్” చెప్పారనుకోండి.
అది వారికి అర్థం కాదు, పైగా కోపం తెచ్చుకుని- “బాజ్పాలేషన్స్” చెప్పాలంటారు. కాంగ్రేచు- అంటే ఆ పదం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందని అనుకుంటారు.
గత పదకొండేళ్లలో పేడ అనేది ఒక ఆల్‌రౌండర్ పదార్థమైపోయింది. పొలంలో వేస్తే ఎరువవుతుంది. పొయ్యిలో వేస్తే పొయ్యిని మండిస్తుంది. అదే గనక మెదడ్లో వేసుకుంటేనా ఇంకేముంది? ఎంచక్కా అంధభక్తులు కావొచ్చు, సనాతనాన్ని నిలబెట్టొచ్చు.
మరింకోవైపు ఈ దేశంలో ధర్మం ఒక వ్యాపారమైపోయింది. ఆశ్చర్యపోవాల్సిన విషయం అదికాదు- చదువుకున్న వాళ్లంతా విదేశాలకు వలసపోతుంటే- ఇక్కడ మిగిలిపోయిన వారిలో కొందరు చెవిటివాళ్లూ, గుడ్డివాళ్లూ అయిపోతున్నారు. ఇంకా మిగిలిపోయిన ఏ కొందరు మాత్రమే బాధ్యతగా తమ మెదళ్లను ఉపయోగిస్తున్నారు.
చాలా విచారించవల్సిన విషయం మరొకటుంది. ప్రపంచ దేశాలలో ఎక్కడా జరగనిది ఇక్కడే జరుగుతోంది. ఉదాహరణకు గాడిదకు పుట్టింది గాడిదే అవుతుంది. పందికి పుట్టింది పందే అవుతుంది. గొర్రెకు పుట్టింది గొర్రే అవుతుంది. కానీ విచిత్రం, మనిషికి పుట్టిన వాడు ఈ దేశంలో మనిషి కావడం లేదు. హిందూ, ముస్లిం, సిక్కు, ఇసాయీ అవుతున్నాడు. “మనిషి” మాత్రం కాలేకపోతున్నాడు. దీనికి ముగింపు ఎప్పుడు?
“రాజకీయం అంటే సమస్యలను వెతికే కళ. అది ప్రతి చోటా ప్రతి విషయంలోనూ సమస్యలని వెతగకలదు. వాటిని తప్పుగా అర్థం చేసుకుని, తప్పుగా అన్వయించి చెపుతూ, తప్పుడు పరిష్కారాలు చూపగలదు. ఆ సత్తా కేవలం రాజకీయాలకే ఉంది.”
– అమెరికా హాస్య నటుడు గ్రౌచో మార్క్స్
ఇది మన దేశంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి సరిగా సరిపోతుంది.
విద్య- సంస్కారం ప్రతి ఒక్కరికీ అవసరమైనవి. ఎందుకంటే విద్య తలవంచనీయదు. సంస్కారం- వ్యక్తిత్వాన్ని దిగజారనివ్వదు. విద్యా- సంస్కారం రెండూ లేని వారికి అధికారం కట్టబెడితే ఎలాం ఉంటుందీ? ఇదిగో ఇలా భారతదేశం ఇప్పుడున్నట్లు ఉంటుంది.
ఈ మధ్య మనుషులు కూడా షేర్ మార్కెట్‌లాగా అయిపోయారు. ఎప్పుడు ఎవడు ఎంతగా దిగజారుతాడో తెలియకుండా పోయింది.
పేపర్ లీక్ అయితే, పరిక్ష రద్దవుతుందని మనకు తెలుసు. కానీ, ఈ దేశంలో ఇరవై లక్షల- “ఈవియం”లు కనపడకపోయినా; నమోదైన ఓటర్ల సంఖ్య కంటే, అధిక సంఖ్యలో ఓట్లు పోలయినా- ఎన్నికలు ఏ మాత్రం రద్దు కావు. పైగా- సిగ్గు విడిచి, ప్రజాస్వామ్యాన్ని మేమే సాకుతున్నామని డప్పు కొట్టుకుంటారు.
ధరలు పెరగడం, జీవనం దుర్భరం కావడం అందరితో పాటు ఆరెస్సెస్- బీజేపీ వారికి కూడా అనుభవంలోకి వస్తోంది. అయితే, వారు ఆ విషయం మనలాగా బయటకి చెప్పుకోలేరు. గుప్తరోగాలుంటే ఎవరికీ చెప్పకోకుండా, పెదవి విప్పకుండా లోలోన కుళ్లిపోతూ దాచిపెట్టుకుంటారు కదా? అలాగన్నమాట.
రైతుల జీవితానికి, సైనికుల ప్రాణానికి, స్త్రీల మానానికి ఈ దేశంలో విలువే లేదు. ఇక మిగతా వాటి ధరలన్నీ ఆకాశమెక్కి కూర్చున్నాయి. ఒక మహిళ వ్యక్తిత్వం, ఒక దళితుడి ప్రతిభ, ఒక ముస్లిం దేశభక్తి- ఈ దేశంలో ఎప్పటికీ ప్రశ్నార్థకమే!
ప్రణాళిక అలా ఉంటుంది..
అబద్ధం- రోజుకు ఐదారు డ్రెస్‌లు మార్చుకున్నా భయంభయంగానరే తిరుగుతుంది. విలేకరుల సమావేశం ఒక్కటి కూడా నిర్వహించదు. ఎదురుగా ప్రాంప్టర్ లేకపోతే పెదవి కదపదు. నిజం- నిజాయితీ ఒకే ఒక్క తెల్లటి టీ- షర్ట్‌తో భయం లేకుండా, ప్రజల పక్షాన మాట్లాడటానికి ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు సిద్ధంగా ఉంటుంది.
దేశంలో నోట్ల రద్దు జరిగినప్పుడు గుజరాత్‌కు చెందిన మహేష్ షా అరెస్టయ్యారు. అది పదమూడు వేల ఎనిమిది వందల అరవై కోట్లకు సంబంధించిన పెద్ద కేసు. ఇన్వెస్టిగేషన్లో అమిత్ షా పేరు రాగానే కేసు ఎక్కడికక్కడ గప్‌చుప్ అయిపోయింది. ఏమయ్యిందో ఎవరికీ తెలియదు.
జస్టిస్ లోయా హత్య కేసు గురించి దేశంలో అందిరికీ తెలుసు. కానీ, ఎవరేమి చేయగలరూ? అధికార పార్టీ వారి నిజాయితీ అలా ఉంటుంది. పెద్ద నోరేసుకుని అరుస్తారు తప్ప, చిన్న విషయం కూడా బయటికి పొక్కనీయరు.
అబద్ధానికి పెరిగిన గౌరవం..
ఒక రాజకీయ విశ్లేషకుడు మోదీ ఉపన్యాసాలన్నీ శ్రద్ధగా విని ఆయన మాట్లాడే దాంట్లో ఏ ఏ విషయాలుంటాయన్నది లోతుగా తరచి చూసి, తన పరిశీలనల్ని ఈ విధంగా ప్రకటించాడు:
మోదీ ఉపన్యాసాలలో 60 శాతం హిందూ- ముస్లిం, మందిర్- మస్జిద్లు ఉంటాయి. 30 శాతం దేశభక్తిపై దొంగ ప్రేమ. 9.99 శాతం నెహ్రూ- గాంధీ కుటుంబాల విషయాలు. 0.01 శాతం మాత్రమే ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం, వికాసంవంటి విషయాటుంటాయని ఆ విశ్లేషకుడు పేర్కొన్నాడు.
గత పదేళ్లలో దేశంలో ముప్పయ్యారు కోట్లున్న పేదల సంఖ్యను ఈ ప్రభుత్వం ఎనభై కోట్లకు పెంచింది. సబ్కా సాత్ సబ్ క వినాశ్- దేశ ప్రజల బ్రెయిన్ వాష్- అంటే ఏమిటో అర్థమయ్యింది కదా?
అబద్ధాలు చెప్పే వారికే ఈ మధ్య కాలంలో ఎక్కువ గౌరవం లభిస్తోంది. ఎందుకంటే, నిజాలు వినే ఓపిక ఏ కొద్దిమందిలో గానీ ఉండడం లేదు.
టైటానిక్ సినిమా చివరి సన్నివేశం గుర్తుంది కదా? ఓడ మునిగి పోతుంటే కొందరు మూర్ఖులు సంగీత వాయిద్యాలు వాయిస్తూ ఆనందిస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా అలాంటి పరిస్థితే ఉంది. దేశం పూర్తిగా నాశనమౌతూ ఉన్నా, కళ్లు మూసుకుని అంధభక్తులు తమ నాయకుణ్ణి పొగడుతూ ఉన్నారు. హరహర మహదేవ్లాగా- “హరహర మోదీ అనీ, హర్ ఘర్ మోదీ” అనీ భజనలు చేస్తున్నారు. ఇది సబబేనా?ఆలోచించే పని లేదా?
అయినా మురికి కాలువలో పైప్వేసి, గ్యాస్‌తో చాయ్ చేయగల నైపుణ్యం ఉన్నవాడున్న ఈ దేశంలో- గ్యాస్ ధర నానాటికీ ఎందుకు పెరుగుతూ పోతోంది?
మన కేంద్ర ప్రభుత్వం “హాజ్‌మోలా” పేరు మార్చాలని తీవ్రంగా కృషి చేస్తోందట. ఎందుకంటే, ఆ పేరులో “హజ్” ఉంది. పైగా “మౌలా” కూడా ఉంది. ఈ రెండూ ముస్లిం మతానికి సంబంధించినవి. ఆ పేరు మార్చి “దీన్ దయాల్ డకార్ గోలా”అని వారు పెడతారని వినికిడి.
టిప్పు సుల్తాన్ శ్రీరంగ పట్నం పేరు మార్చి ఒక ఇస్లామిక్ పేరు పెట్టి ఉండొచ్చు కదా? ఎందుకు పెట్టలేదూ? అంటే, వివేచన గల ధైర్యవంతుడు సమాజ స్వరూపాన్ని మార్చుదామని తహతహలాడతాడు. అంతేగాని, పట్టణాల పేర్లు మార్చుతూ కూర్చోడు. అలా చేసే వారు ఎవరో ఇప్పుడు అందరికీ తెలసు.
సమాజం పట్ల ఏ మాత్రం బాధ్యత వహించని వాళ్లు పేర్లు మారుస్తూ- గొప్ప అభివృద్ధి సాధించామని తమ వీపు తామే చరుచుకుంటూ ఉంటారు. రైతు యాభై రూపాయలకు లీటర్ ఆవు పాలు అమ్మలేడు. కానీ, పతంజలి రామ్‌దేవ్ బాబా, ఆవు మూత్రం లీటర్ తొంభై రూపాయలకు అమ్ముకోగలడు. “మేరా భారత్ మహాన్” అంటే ఇదేనా? ఒక తరం మూర్ఖత్వం తరువాత తరాలకు సంప్రదాయమవుతుంది.
పుణ్య స్థలాలలో దేవుణ్ణి ఎందుకు వెతుకుతావ్? నువ్వ తప్పు చేస్తున్న చోట కూడా దేవుడున్నాడు. నీ విశ్వాసం ప్రకారమే “ఇందుగలడందులేడని” కదా చెపుతున్నావ్. దేవుడు చూస్తున్నాడన్న భయం ఉన్నవాడు తన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి కదా? దగా, మోసం చేస్తూ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం, దిగజారిపోయి- మళ్లీ దేవుణ్ణి గుర్తు చేసుకోవడమెందుకూ? మీ తప్పుడు పనులన్నిటికీ ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని భావిస్తున్నారా?
క్యా కాబా, క్యా కాశీ, ఔర్ గంగాకీ ధార్
జబ్ మన హీ మైల్ భరా, తో హువా క్యా ఉద్ధార్
“మనసే మలినమై ఉంటే- కాబా, కాశీ, గంగ ధార ఏం చేస్తుంది? మోక్షం ఎలా లభిస్తుంది?” అని తన దోహా ద్వారా కబీర్ తెలియజేశాడు.
అయితే, ఆయన దోహాను అర్థం చేసుకునే స్థాయి ఉండాలి కదా ఈ మనుషులకు?
ముఖాన్ని చూసి ప్రశంసలు గుప్పించడం కాదు, వ్యక్తిత్వాన్ని చూసి, చరిత్రను చూసి మాట్లాడాలని చెపుతారు విజ్ఞులు. ముఖానికి మేకప్ వేసుకుని, అందంగా తీర్చి దిద్దుకోవడానికి కొద్ది సమయమే పడుతుంది. చరిత్ర సృష్టించాలంటేనే ఒక జీవితకాలం పడుతుంది.
గతంలో మనుషులు చచ్చిపోయే వారు. వారి ఆత్మలు తప్పిపోయి తిరుగుతూ ఉండేవి. ఇప్పుడు చూడండి మనుషులు బతికి ఉండగానే వారి ఆత్మలు చచ్చిపోతున్నాయి. ఆత్మల్లేని మనుషులేమో తప్పిపోయి తిరుగుతున్నారు- విచిత్రం.
ఇది నమ్మక ద్రోహుల యుగం మహాశయా, మీకు మనుషుల దగ్గర విశ్వాసం ఎక్కడ దొరుకుతుందీ- విశ్వాసమే కావాలంటే తమరు కుక్కలు పెంచుకోవడం మంచిది.
పత్రికలను కూడా చూడండి ఎలా తయారయ్యాయో? గతంలో పత్రికలు ప్రచురింపబడ్డాక అమ్ముడయ్యేవి. ఇప్పుడేమిటీ? ఈ విచిత్రం?
ఈ బీజేపీ పాలనలో మొదట అమ్ముడైపోయి, తర్వాత వార్తలు ప్రచురిస్తున్నాయీ? కేవలం పత్రికలే కాదు, అన్ని రకాల మీడియా సంస్థలూ అలాగే తయారయ్యాయి.
ధార్మిక మూర్ఖత్వం సమాజాన్ని నిలువునా ముంచేస్తోంది. పురోహితులను, ముల్లాలను, ఫాదర్లను దూరం పెట్టండి. వారి బోధనలు వినిపించుకోకండి, ఆ అవసంర లేదు- మనుషులు కండి. మానవత్వాన్ని నిలిపే పనిలో నిమగ్నమై- మనిషి కేంద్రంగా పని చేయండి.
మంచి మనిషి కావడం ముఖ్యం. ఎవరు ఏ మతానికి, ఏ కులానికీ చెందిన వారన్నది అనవసరం. మానవ శ్రేయస్సు కోసం పని చేస్తున్నారా? లేదా? అనేదే ముఖ్యం! కుల మతాలకూ, వారి ధార్మిక విశ్వాసాలకూ విలువే లేదు.
మిమ్మల్ని మీరు సజీవులుగా చెప్పుకోవాలంటే- ఎక్కడ ఏ తప్పు జరిగినా, గొంతెత్తి చెపుతూ ఉంఉండి. నిశ్శబ్దంగా ప్రవాహంలో కొట్టుకుపోయేవి కేవలం శవాలు మాత్రమే.
వ్యాస రచయిత త్రిపురనేని రామస్వామి జాతీయ పురస్కార తొలిగ్రహీత
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
