భారత ఉన్నత విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చేస్తుందంటూ పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు- 2025, వాస్తవానికి సంస్కరణ కాదనే సందేహాన్ని లేవనెత్తుతుంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ), నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్సీటీఈ) వంటి మూడు ప్రధాన నియంత్రణ సంస్థలను రద్దు చేసి; ఒకే నియంత్రణలోకి తెచ్చే సంస్థకు రూపమిస్తున్న ఈ బిల్లు- వ్యవస్థను సరళీకరిస్తుందా? లేక విశ్వవిద్యాలయాల మెడపై మరో ఉక్కుపాదం మోపుతుందానే ప్రశ్నలకు కారణమవుతూ దేశవ్యాప్తంగా ఆందోళనను రేకిత్తిస్తుంది.
ప్రస్తుత బిల్లు ప్రకారం, వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ అనే అత్యున్నత సంస్థ ఏర్పడుతుంది. దీని కింద మూడు స్వతంత్ర కౌన్సిల్స్– నియంత్రణ కౌన్సిల్, అక్రిడిటేషన్ కౌన్సిల్, ప్రమాణాల కౌన్సిల్ ఉంటాయి. సంస్థలో కేంద్ర ప్రభుత్వం నియమించిన చైర్‌పర్సన్‌తో సహా 12 మంది సభ్యులు ఉంటారు. వీరితోపాటు రాష్ట్రాల ప్రతినిధులు ఉన్నప్పటికీ, వారి పాత్ర నామమాత్రంగానే ఉంటుంది. ఫలితంగా పాఠ్యాంశాలు, గుర్తింపు, నాణ్యత తనిఖీలు, ఫీజులు వంటవన్నీ ఢిల్లీ నిర్ణయాలకు లోబడి ఉంటాయి.
ప్రభుత్వం ఈ మార్పును సంస్కరణగా చూపిస్తోంది, ప్రస్తుత వ్యవస్థలో అనేక సంస్థలు ఉండటంతో గందరగోళం ఏర్పడుతోందని వాదిస్తోంది.
ఫెడరేలిజంపై ప్రశ్నలు- విద్యా కేంద్రీకరణ
రాజ్యాంగంలో “విద్యా” సమ్మిళిత జాబితాలో ఉంది. కేంద్రం, రాష్ట్రాలు- రెండూ ఇందులో భాగస్వాములు కావాలి. కానీ ఈ బిల్లు కేంద్రీకరణకు మార్గం సుగమం చేస్తుందని తెలుస్తోంది. 1976లో 42వ సవరణ ద్వారా రాష్ట్ర జాబితా నుంచి సమ్మిళిత జాబితాకు మార్చినప్పుడు సహకార స్ఫూర్తినే దృష్టిలో పెట్టుకున్నారు. పాఠ్యాంశాలు, భాషా విధానాలు, ఫీజు నిర్ణయాలు వంటి అంశాల్లో రాష్ట్రాలకు స్వతంత్రాన్ని దాదాపు లేకుండా ప్రస్తుత బిల్లు చేస్తుంది.
ఈ చర్య భారత సమాఖ్య వ్యవస్థకు పెద్ద దెబ్బ; ప్రాంతీయ భాషలు, సాంస్కృతిక వైవిధ్యం ప్రతిబింబించే విద్యా విధానాలు పక్కనపడే ప్రమాదం ఉంది.
కేంద్ర- రాష్ట్రాలు చట్టాలు చేయగల సమ్మిళిత జాబితాలో విద్యా రంగం ఉన్నప్పటికీ, ప్రతిపాదిత నిర్మాణం వల్ల రాష్ట్రాల శాసన పాలనా స్థలాన్ని కుదించేలా ఉందనే విమర్శ విస్తృతమవుతుంది.
కమిషన్‌లో రాష్ట్ర ప్రాతినిధిత్వం ఉన్నదనే ప్రభుత్వ వాదన ఉన్నా- అసలు నిర్ణయాధికారాలు, ప్రమాణాల రూపకల్పన, అక్రిడిటేషన్ నిబంధనలపై తుది మాట మాత్రం కేంద్రానిదేనని ఈ బిల్లు సూచిస్తోంది.
గ్రాంట్ల నుంచి అప్పుల వైపు – విద్యా వ్యాపారీకరణ
ఈ బిల్లులో అత్యంత కీలకమైన మలుపేంటంటే యూజీసీ గ్రాంట్ల అధికారాన్ని తొలగిస్తోంది. బదులుగా హయ్యర్ ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ ఏజెన్సీ(హెచ్ఈఎఫ్ఏ) వంటి అప్పు ఆధారిత విధానాలను ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు స్వయం భరణ చేసుకోవాల్సి వస్తుంది. ఫలితంగా ఫీజులు పెరుగుతాయి, పేద విద్యార్థులకు విద్య దూరమవుతుంది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పాఠ్యక్రమాలు మారతాయి.
భాషలు, కళలు, సామాజిక శాస్త్రాలు వంటి రంగాలు నిధుల కొరతతో దెబ్బతింటాయి. ఇది ఉన్నత విద్యను నాశనం చేసే దిశగా అడుగులు వేసి, సమాన అవకాశాలు తగ్గి, స్వయంభరణ కోర్సుల పెంపు, ఉద్యోగ అవకాశాలు స్పష్టంగా లేని పేద–మధ్యతరగతి విద్యార్థులపై విద్యా రుణాల బానిసత్వం పెరిగి, విద్య వాణిజ్య వస్తువుగా మారుతుంది.
కోటరి కమిషన్- 1968 ప్రకారం విద్యా కోసం జీడీపీలో 6% నిధులు కేటాయించాలనే ప్రతిపాదన ఇప్పటివరకు వాస్తవరూపం దాల్చలేదు. ఇలాంటి పరిస్థితిలో గ్రాంట్ల కంటే అప్పులకు ప్రాధాన్యమిచ్చే విధానం, రాజ్యాంగమున్న “సమాన అవకాశాలతో కూడిన విద్య”ను నేలమట్టం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను కూడా మార్కెట్లో పోటీ పడే కార్పొరేట్ సంస్థల్లా ప్రవర్తించేలా నెడుతుంది.
విద్యా కాషాయీకరణ వైపు
2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి విద్యా వ్యవస్థలో ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని చొప్పించే క్రమంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎన్సీఈఆర్టీ)పాఠ్యపుస్తకాల్లో పెద్ద ఎత్తున మార్పులు చేయబడ్డాయి.
చరిత్ర పాఠాల్లో మొఘల్ యుగాన్ని తొలగించే ప్రయత్నం, స్వాతంత్ర్య పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్రను జత చేయడం, వీర్ సావర్కర్ వంటి వ్యక్తులను ప్రధానంగా చూపడం వంటివి జరిగాయి. ఇవి హిందూ జాతీయవాద దృక్పథాన్ని ప్రోత్సహించడం ద్వారా విద్యను ఒకే మత ఆధారిత జాతీయత భావజాలం వైపు మళ్ళిస్తూ; ఎవల్యూషన్ థియరీ, గాంధీ హత్య, ముస్లిం పాలకుల చరిత్ర వంటి భాగాలను తొలగించడం కూడా జరిగింది.
విద్యార్థులకు ఇది సమగ్ర చారిత్రక దృష్టిని తగ్గించి, రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా మారుస్తుందని ఆందోళనలు ఉన్నాయి.
నిజమైన సంస్కరణ అంటే జీడీపీలో విద్యపై 6 శాతం ఖర్చు పెంచడం, అధ్యాపకుల స్థిర ఉద్యోగాలు, పరిశోధన మద్దతు, విద్యలో శాస్త్రీయ భావాలు, వాస్తవాలు, స్వేచ్ఛను పెంచడం. కానీ ఈ బిల్లు నియంత్రణను బలోపేతం చేస్తోంది తప్ప సమస్యలను పరిష్కరించడం లేదు. విద్య దేశ ప్రజాస్వామ్య సమాజానికి పునాది. అది విముక్తి కోసం, పౌరుల అభివృద్ధికి ఉపయోగపడాలి, రాజకీయ సాధనంగా మారకూడదు.
ఎస్ అక్బర్
న్యాయ విద్యార్థి, ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా అధ్యక్షులు.
సెల్: 8179492515
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
