ముఖ్యమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయాల మధ్య నెలకొన్న అధికార పోరాటాన్ని ఈ అంశం మరోసారి బహిర్గతం చేసింది.
శ్రీనగర్: ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అభ్యంతరం తెలియజేసినప్పటికీ, కశ్మీర్ అడ్మినిస్ట్రేటీవ్ సర్వీసు(జేకేఏఎస్)లో చేరేందుకు- ఉద్యోగ ఆశావహులకు పబ్లిక్ సర్వీసు కమిషన్(పీఎస్సీ) డిసెంబర్ 7న ఉమ్మడి పోటీపరీక్ష(సీసీఈ)ను నిర్వహించింది.
కొన్ని విద్యార్ధి సంఘాలు వయోపరిమితిని సడలించాలని చేస్తున్న డిమాండ్ అపరిష్కృతంగా ఉండటం; ఇండిగో ఎయిర్ లైన్స్ సృష్టించిన అయోమయ పరిస్థితుల నేపథ్యంలో- పోటీ పరీక్షలను వాయిదా వేయాలని అబ్దుల్లా సూచించారు. ఈ సూచనను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలోని కమిషన్ తిరస్కరించింది.
జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంత పరిపాలన వ్యవస్థలో లోపాలను ఈ అంశం మరోసారి బహిర్గతం చేసింది. గడిచిన ఏడాది అక్టోబర్‌లో ప్రజా ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన నాటి నుంచి ముఖ్యమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయాలు అధికార పోరాటంలో తలమునకలయ్యాయి.
వయోపరిమితి సడలింపు, విమానాల అంతరాయం వంటి అంశాలు ఉద్యోగ ఆశావాహులకు తీవ్ర మానసిక ఒత్తిడిని కలగజేస్తాయని పేర్కొంటూ పరీక్షకు ఒక్క రోజు ముందు పీఎస్సీ చైర్మన్ అరుణ్ కుమార్ చౌధరికు ముఖ్యమంత్రి లేఖ రాశారు.
“ఆసక్తి గల వారందరికి న్యాయంగా సమాన అవకాశం కల్పించాలనే ఆలోచనను దృష్టిలో పెట్టుకొని; ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకొని పూర్తిగా అభ్యర్ధుల శ్రేయస్సు దృష్ట్యా పరీక్షలను వాయిదా వేసే విషయాన్ని పరిశీలించాలి”అని లేఖలో ప్రస్థావించారు.
ఓపెన్ మెరిట్ అభ్యర్ధులకు 32 సంవత్సరాల వయోపరిమితి; రిజర్వ్ చేయబడిన, ఇన్ సర్వీసు అభ్యర్దులకు 34 ఏళ్లు; దివ్యాంగులకు 35 సంవత్సరాల వయోపరిమితిని కమిషన్ నిర్ణయించింది. అయితే అబ్దుల్లా నేతృత్వంలోని ప్రభుత్వం 35, 37, 38 సంవత్సరాలుగా నిర్ణయంచాలని కోరింది.
సీసీఈకు హాజరవుతున్న అభ్యర్థులు జమ్మూకశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో నిరసనలు తెలియజేశారు. దీంతో అబ్దుల్లా ప్రభుత్వం వయోపరిమితి సడలింపు అంశంపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హా కార్యాలయానికి డిసెంబరు 2న లేఖ రాసింది.
“గరిష్ఠ వయోపరిమితిని సడలించాలని ప్రభుత్వం కోరుతుంది. లోక్‌భవన్‌కు దీనికి సంబంధించిన ఫైల్‌ను కూడా పంపించాము. ఈ ప్రక్రియ పూర్తి చేసే వరకు జేకేపీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలి”అని ముఖ్యమంత్రి సలహాదారులు నాసిర్ అస్లం వాని కోరారు.
“వయోపరిమితి సడలింపుకు సంబంధించిన ఫైల్‌ను” అదే రోజు ప్రభుత్వానికి తిరిగి పంపించినట్టుగా సిన్హా సామాజిక మధ్యమం ఎక్స్ ద్వారా తెలిపారు. “చివరి దశలో మార్పులు చేర్పులు, సవరణలు చేయడం సాధ్యమవుతుందా”అని ప్రశ్నించారు.
“నాలుగు రోజుల సమయం గడిచినప్పటికీ, లోక్ భవన్‌కు ఎలాంటి సమాచారం రాలేదు. యువ ఆశావాహులకు తన సంఘీభావాన్ని తెలియచేస్తున్నాను. పరీక్ష కోసం 2025 ఆగస్టు 22న జమ్మూ కశ్మీర్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఉత్తర్వును విడుదల చేసింది. పరీక్షను 2025 డిసెంబర్ 7న నిర్వహిస్తామని 2025 నవంబర్ 6న నోటీసు ద్వారా తెలియజేశారు”అని సిన్హా కార్యాలయం తెలిపింది.
ఫైల్‌ను తిరిగి జనరల్ అడ్మినిస్ట్రేటీవ్ డిపార్ట్మెంట్(జీఏడీ)పంపించగా “దానిపై వారి అభిప్రాయాన్ని కోరుతూ పబ్లిక్ సర్వీస్ కమీషన్‌కు అందజేయడం జరిగింది”అని వాని చెప్పారు.
జేకే పునర్విభజన చట్టం- 2019 ప్రకారం, లెఫ్టినెంట్ గవర్నర్ నియంత్రణలోని ఒక ఐఏఎస్ స్థాయి అధికారి ఎం రాజు నేతృత్వంలో జీఏడీ పనిచేస్తుంది.
గరిష్ఠ వయోపరిమితి మార్పులపై నిర్ణయం తీసుకోవడంలో లెఫ్టనెంట్ గవర్నర్ జాప్యం చేశారని కూడా ముఖ్యమంత్రి కార్యాలయం ఆరోపించింది. ప్రభుత్వం గరిష్ఠ వయోపరిమితిని పెంచిందని “గతంలో అనేక సార్లు ” తెలియజేసినట్టుగా పీఎస్సీ ఛీఫ్‌కు రాసిన లేఖలో అబ్దుల్లా తెలిపారు.
ఈ అంశం జమ్మూకశ్మీర్‌లో దుమారాన్ని లేపింది. ఇందులో జోక్యం చేసుకునే విషయంలో అధికార నేషనల్ కాన్ఫరెన్స్ జాప్యం చేస్తూ ఉద్యోగార్థుల భవిష్యత్తును అస్తవ్యస్తంగా మారుస్తుందని ప్రతిపక్ష పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) విమర్శించింది.
సీసీఈ పరీక్ష నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసిన మూడు నెలల తర్వాత ప్రభుత్వం వయోపరిమితి సడలింపు ఫైల్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి పంపించిందని పీడీపీ అధికార ప్రతినిధి ఒకరన్నారు. ఆగస్టు 22న పరీక్షకు సంబంధించిన నోటిపికేషన్‌ను పీఎస్సీ జారీ చేసింది.
పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వ అధికారులను గుర్తించాలని కోరుతు డిసెంబరు 3న కమిషన్ ఉత్తర్వులను జారీ చేసింది. కశ్మీర్ వ్యాలీ మొత్తం మీద చలి పరిస్థితుల నేపథ్యంలో ఉదయం 10 గంటలకు పరీక్ష మొదలవుతుందని కమిషన్ పేర్కొన్నది.
జమ్మూకశ్మీర్‌లో వయోపరిమితి సడలింపు అంశంపై రెండు ఉన్నత స్థాయి కార్యాలయాల మధ్య కొనసాగుతున్న అధికార పోరాటంలో పురోగతి లభిస్తుందని సీసీఈ ఆశావాహులు వరకు ఎదురుచూశారు. తమ డిమాండ్‌పై ఒత్తిడి పెంచడానికి కొంతమంది ఆశావాహులు నిరాహరదీక్షను కూడా చేపట్టారు.
“విమాన ప్రయాణం అంతరాయం వల్ల ఢిల్లీ మొదటి రైలులో బయలుదేరి; ఆ తర్వాత ప్రైవేటు క్యాబ్ ద్వారా శ్రీనగర్‌లో పరీక్షరాయడానికి వచ్చేసరికి 24 గంటలకు పైగా సమయం పట్టింది. ఎక్కడ కూడా ఆగకుండా ప్రయాణం చేయవలసి వచ్చంది”అని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాలపై డాక్టరేట్ చేస్తున్న ఒక కశ్మీరీ స్కాలర్ మీర్ ముజీబ్ అన్నారు.
“నేను ఏదోరకంగా పరీక్ష కేంద్రానికి చేరుకున్నాను. గడిచిన 24 గంటలుగా నిద్రలేదు. పరీక్షలో పాల్గొంటున్న వేలాది మంది ఆశావాహుల పరిస్థితి ఇలానే ఉంది. ఈ సంక్షోభానికి జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న అధికారపోరాటమే దీనికి కారణమ”ని విద్యార్ధి నాయకుడు ముజీబ్ నిందించారు.
గతంలో కూడా అబ్దుల్లా నేతృత్వంలోని కేంద్ర పాలిత ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం పలు అంశాలపై ఘర్షణకు తలపడ్డాయి. ఎన్నికైన ప్రభుత్వానికి, జేకే అడ్వకేట్ జనరల్ ఇతరు- నియమకాలు చేసే అధికారమున్నది. కానీ జేకేఏఎస్ అధికారులను లోక్ భవన్(పూర్వపు రాజ్‌భవన్)కు బదిలీ చేసింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
