రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తమకు అవమానాలు తప్పడం లేదని తెలంగాణవారు భావిస్తూనే ఉన్నారు. ఎందుకూ? ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను గత ప్రభుత్వమూ, ప్రస్తుత ప్రభుత్వమూ పరిపూర్తి చేయడం లేదనే భావన ప్రజలలో ఉన్నది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి శతవిధాలా ప్రయత్నించిన వారికి రాచమార్యదలు చేసింది. ఆ చర్యలు చాలా మంది తెలంగాణ ప్రజలను బాధించాయి. రాజ్యసభ లోపలా, బయట రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోజూసిన వారి విషయంలో నాటి టీఆర్ఎస్ సానుకూల వైఖరి తీసుకున్నది. బంగారు తెలంగాణ పేరుతో రాజకీయ పునరేకీకరణ పదబంధాన్ని సృష్టించింది. ఆచరించింది. ఈ చర్యల వలన గత ప్రభుత్వం మొన్నటి ఎన్నికల్లో తత్ఫలితాన్ని చవి చూసింది.
వాస్తవానికి 65 ఏళ్ల ఉమ్మడి పాలనకంటే పదేళ్ల బీఆర్ఎస్ పాలన అద్భుతమనే మార్పుకు కారణభూతమైంది. తిరుగు వలసలు, పచ్చటి పొలాలు తెలంగాణ ప్రజల అనుభవంలోకి వచ్చాయి. ఈ దృష్యానుభూతిఖ్యాతి ముమ్మాటికి కేసీఆర్‌దే. ఉద్యమ నాయకుడిగా ఆయన పట్ల ప్రజలకు నేటికి అభిమానమున్నది. తమ మనోభావాలను గుర్తించలేదనే వేదనా ఉన్నది. అందుకే ఎంత చేసినా వారు విపక్షానికి పరిమితంకాక తప్పలేదు.
కలత చెందుతున్న ప్రజలు..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీమాంధ్ర నాయకుల విగ్రహాలను తెలంగాణ రాజధానిలో ఏర్పాటుకు చొరవ చూపుతున్నదనే ఆరోపణలను ఎదుర్కొంటున్నది.
ఇటీవలికాలంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహాన్ని లక్డీకపూల్ చౌరస్తాలో ప్రతిష్టించారు. రాష్ట్ర విభజన సందర్భంలో రోశయ్య పోషించిన పాత్ర విషయంలో తెలంగాణ ప్రజలకు సదభిప్రాయం లేదు. అంతేకాదు, రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల సందర్భంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు సినిమాను తలపించేలా ఉన్నాయని చాలా మంది భావించారు. తెలంగాణ అస్తిత్వం, ఉనికి వాటిలో మచ్చుకు కూడా లేదని వేదన చెందినవారూ ఉన్నారు.
2009 డిసెంబరు 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తొలి ప్రకటన, అదే నెల 23న మరో ప్రకటన చేసి కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు దూరమైంది. అధికారంలోకి వచ్చిన తర్వాత జనహృదయాలను గెలుచుకుంటుందానే అనుమానాలను నేటికి నివృత్తి చేయలేకపోతున్నది.
అస్తిత్వ స్పృహలేమి..
ఈ ప్రభుత్వంలో ఉన్న ఒకరిద్దరు మినహా ఇస్తే, నాటి తెలంగాణ ఉద్యమంలో తిరోగమన పాత్ర పోషించినవారేనని చాలామంది భావం. వీరికి తెలంగాణ అస్తిత్వపు స్పృహ లేదని చాలామంది ఉద్యమకారులు అనుకుంటున్నారు. ఈ ప్రభుత్వ వ్యవహారశైలి కూడా అట్లాగే ఉన్నది. గద్దర్ అవార్డుల కమిటీ న్యాయనిర్ణేతల విషయం, తెలంగాణ రాష్ట్ర గీతం స్వరపరిచిన సంగీత దర్శకుడు విషయంలోనూ తెలంగాణ ప్రజలు ఇప్పటికీ అసంతృప్తితోనే ఉన్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆత్మను ఉండడం లేదని ఎక్కువమంది భావిస్తున్నారు.
ఇదే సందర్భంలో గత ప్రభుత్వం విస్మరించిన కొన్ని విషయాలను అద్భుతంగా ఈ ప్రభుత్వం అమలు చేసి పలువురి ప్రశంసలను అందుకున్నది. కొన్ని మినహాయింపులు ఉన్నప్పటికీ రేవంత్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తిస్తున్నదనే భావన కల్పిస్తున్నది. విస్తృత తెలంగాణ ప్రజా ప్రయోజనలను పరిగణలోకి తీసుకున్నప్పుడు ఈ ప్రభుత్వం ఆ అంచనాకు చాలా దూరంలో ఉన్నది.
పవన్ కళ్యాణ్ అక్కసు..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధినేతల ఆలోచనా ప్రభావం తెలంగాణపై ఉంటుందని విపక్షం ఆరోపిస్తున్నది.
తెలంగాణవారిని చిన్నచూపు చూస్తున్న సీమాంధ్ర నేతల వైఖరిని ధీటుగా ఈ ప్రభుత్వం ఖండించడం లేదని కొందరనుకుంటున్నారు. ఒకరిద్దరు మంత్రులు మీడియా ముందు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలను ఖండించినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేదనేది జనాభిప్రాయం. తెలంగాణ ప్రజల దిష్టి తగిలి కోనసీమలో కొబ్బరి పంట దెబ్బతిన్నదని డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నట్టువంటి పవన్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం విస్పష్ట వైఖరి తీసుకోవాల్సి ఉండే. ఆయన సినిమాల విడుదల విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఏందో చెప్పాల్సి ఉండే అదీ చెప్పలేదు.
అస్తిరమైన మనస్తత్వం కలిగిన పవన్ కళ్యాణ్ తెలంగాణ విషయంలో స్థిరమైన వ్యతిరేకతను కొనసాగించడం తెలంగాణ ప్రజలకు వేదనను కలిగిస్తున్నది. మరోసారి తెలంగాణవారిని అవమానించకుండా ఉండాలంటే పవన్బాబుకు తగు జవాబు ఇచ్చేవిధంగా ప్రభుత్వ కార్యాచరణ ఉండాలని తెలంగాణ ప్రజల మనోగతం.
మరోవైపు సినీ నేపథ్య గాయకుడు బాలసుబ్రమణ్యం విగ్రహం ఏర్పాటుయత్నాలు జరుగుతున్నాయి. కొందరు తెలంగాణవాదులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. దీనికి కారణమూ లేకపోలేదు. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రికార్డింగ్ చేయాలని బాలును అడిగినప్పుడు ఆయన తిరస్కరించారట. తమ ఉనికిని, అస్తిత్వాన్ని గౌరవించని ఆ గాయకుడి విగ్రహాన్ని ఇక్కడ ఎందుకు ప్రతిష్ఠించాలని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరి తెలియాల్సి ఉన్నది. తాము తెలంగాణ ప్రజల భావోద్వేగాల మేళవింపుతో పాలిస్తున్నామని అధికారపార్టీ చెప్పుకుంటున్నది. ఆచరణలో చూపించాలని తెలంగాణ సమాజం డిమాండ్ చేస్తున్నది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
