లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ తన పనితీరును బాగా మెరుగుపరుచుకున్నారనే అభిప్రాయాన్ని పార్టీ శ్రేణులు, బయటివారు భావిస్తున్నారు.
లోక్‌సభలో ఆయన మాట్లాడిన తీరు, ప్రస్తావించిన అంశాల తీవ్రత ఈ అభిప్రాయానికి కారణం.
2014- 2026 మధ్య కాలంలో సాధారణ ఎంపీగా, పార్టీ కీలక నేతగా కొన్ని అనుభవాలను నేర్చుకున్నట్టు తన ప్రస్తుత పనితీరు చెప్తున్నది.
భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ తనను తాను పరిణతి గల నాయకుడిగా ఎదిగించుకునేందుకు పునాది వేసుకున్నారు.
అంతేకాదు, గత లోక్‌సభ ఎన్నికల్లో సామాజిక అంశాన్ని ప్రధాన ఎజెండాగా చేయగలిగారు.
దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ సంప్రదాయపు డైలాగ్‌లకు ఫుల్స్టాప్ పెట్టారు.
తమ పార్టీ గతంలో చేసిన తప్పిదాలను అంగీకరించారు.
ఎవరెంతో వారికంత అనే ప్రజాస్వామిక సూత్రాన్ని 2019 లోక్‌సభ ఎన్నికల ఎజెండాగా చేయగలిగారు. వెరసి బలమైన ప్రతిపక్ష నాయకుడిగా ఎదిగారు.
నరేంద్ర మోదీ మూడవ సారి ప్రధానమంత్రి అయిన తర్వాత విధానపరమైన నిర్ణయాలలో కాస్త తడబాటు కనిపిస్తున్నది.
దీనిని రాహుల్ గాంధీ తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు.
లోక్‌సభ కేంద్రంగా బడ్జెట్‌పై ప్రసంగిస్తూ ఆయన లేవనెత్తిన అంశాలు ఇందుకు మంచి ఉదాహరణలు.
రాహుల్ రాజకీయ పరిపక్వత..
మిత్ర పక్షాల మద్దతుతో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఆయన తీసుకువచ్చిన కుల, రాజకీయ అవకాశాల సమస్య ఎన్డీఏను వెనక్కి నెట్టివేసింది. ప్రాంతీయ పార్టీల మద్దతును అనివార్యం చేసింది.
నాలుగువందల స్థానాలను గెలుస్తామన్న మోదీ సర్కార్‌ను కనీస మెజారిటీకి చాలా దూరం నిలబెట్టారు. రాహుల్ గాంధీ ప్రాపగండ కారణంగానే తమకు స్థానాలు తగ్గాయని బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నది.
బీజేపీ ఆధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లోనే లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తారుమారైయ్యాయి.
రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లను ఎత్తివేస్తారని రాహుల్ గాంధీ చేసిన ప్రచార ప్రభావం ఉత్తర- దక్షిణ భారతదేశంలో విపరీత ప్రభావం చూపించింది.
రాహుల్ వేసిన మరొక ఎత్తుగడ తానూ హిందువునని బలంగా చెప్పుకున్నారు. దేవాలయాలలో అర్చనలు చేయించుకున్నారు.
గతంలో కంటే, మైనారిటీ వాదాన్ని కాస్త పక్కకు పెట్టారు. దేశంలోనే చాతుర్వర్ణ వ్యవస్థను ప్రశ్నించారు.
కొన్ని కులాల చేతిలో సంపద, అధికారం కేంద్రీకృతమైందని దేశ ప్రజల ముందు వ్యక్తం చేశారు.
వీటి ఫలితంగా కులగణనకు వ్యతిరేకమని చెప్పిన బీజేపీ వెనక్కి తగ్గక తప్పలేదు. బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ ఇలాంటి అనుభవమే బీజేపీకి ఎదురయ్యింది.
బలమైన విపక్ష నేత..
రెండు విడతలుగా అధికారంలో ఉన్న మోదీ నాయకత్వానికి సెగ తగిలేలా రాహుల్ గాంధీ తన మాట తీరును, ఆలోచనను, ఆచరణను మార్పు చేసుకున్నారని రాజకీయ పండితుల విశ్లేషణ.
2014 ఎన్నికల ముందు రాహుల్ గాంధీని, ఆయన పనితీరును సోషల్ మీడియా కేంద్రంగా మోదీ అభిమానులు, బీజేపీ శ్రేణులు తూర్పార పట్టాయి.
ఇదే వరవడి 2019 సాధారణ ఎన్నికల వరకు కొనసాగింది.
మొన్నటి లోక్‌సభ ఎన్నికల ఎజెండాను రాహుల్ గాంధే నిర్దేశించారని ఒక భావన జనంలో ఉన్నది.
అయితే నరేంద్ర మోదీ మాట తీరు, ఆయనపై అవినీతి మరక లేకపోవడమనే అంశాలు బీజేపీకి బాగా కలిసి వచ్చాయి. దీనికి తోడు హిందూ జాతీయవాదం మోదీ హయాంలోనే బలపడిందనే భావన, కులాలకు అతీతంగా హిందువులలో బలమైన భావన ఉన్నది.
ఆర్టికల్ 370 రద్దు, రామ్ మందిర్ నిర్మాణంవంటి అంశాలు మోదీకి మెజారిటీ సీట్లు తెప్పించాయి. రాహుల్ గాంధీ సామాజిక అంశాన్ని తెరపైకి తేవడం వల్ల బీజేపీ స్వైర విహారానికి అడ్డకట్ట పడింది.
అయోధ్య లోక్‌సభ పరిధిలో బీజేపేతర అభర్థి గెలుపొందడమే రాహుల్ ఎజెండా సెట్టింగ్‌కు ఒక సింబాలిజమనొచ్చు. ఈ ఇద్దరి నాయకుల వ్యూహ- ప్రతివ్యూహాలలో ఇప్పటి వరకైతే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీదే పై చేయి.
ఇదే సందర్భంలో బలమైన విపక్ష నేతగా ఇప్పుడు రాహుల్ గాంధీ నిలబడుతున్న దృశ్యం వర్తమాన రాజకీయాలలో కనబడుతున్నది.
ప్రేమ దుకాణం
కాంగ్రెస్ పార్టీలో ఉద్దండ పిండాలు, పదవులను అనుభవించినవారు ఎవరూ లేనప్పటికీ రాహుల్ గాంధీ ఒక్కరే అన్నీ తానై పార్టీని కాపాడుకుంటున్నారు.
విపక్షం వ్యక్తిగతంగా రాహుల్ గాంధీపై ఎన్ని విమర్శలు చేసినా పార్టీ నాయకులు వాటిని ధీటుగా ఎదుర్కోలేకపోయారు. కొందరు మౌనం దాల్చారు. మరికొందరు చూసిచూడనట్టు ఊరుకున్నారు. ఇంకొందరు తమకెందుకులే అని ఊరుకున్నారు.
ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ భారతదేశాన్ని కాలినడకన చుట్టి వచ్చారు. దేశ ప్రజలకు కరచాలనం చేశారు. ఆడంభరాలకు తాను చాలా దూరమనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారు.
దేశ ప్రజల మధ్య ప్రేమానురాగాలను, సోదరభావాన్ని పెంపొందించాలని అదే తన ప్రయత్నమని చెప్పుకున్నారు. ఈ పరిణామాల తర్వాత గతంలో మాదిరిగా బీజేపీ నాయకులు, మోదీ అభిమానులు రాహుల్ గాంధీపై విమర్శలు చేయడం లేదు. యువరాజు అనే పాత డైలాగ్‌ను అప్పుడప్పుడు ఉచ్ఛరించడం తప్పా గతకాలపు నిందారోపణలు లేవు.
విపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ సాధించుకున్న ఒకానొక సక్సెస్. దాని ప్రతిఫలం రాహుల్ గాంధీ అధ్యయన ఫలితం, ఆయన వ్యవహార తీరు నేటి ఆయన నాయకత్వ పనితీరుకు నిదర్శనాలుగా ఉన్నాయని చాలా మంది భావిస్తున్నారు.
భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు కానీ, ఇప్పటికైతే రాహుల్ గాంధీ బలమైన విపక్ష నాయకుడిగా బలమైన స్వరాన్ని వినిపించే యత్నం చేస్తున్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.



