
భారత్ జోడో యాత్ర సందర్భంగా భారత సైన్యంపై “అవమానకరమైన” వ్యాఖ్యలు చేశారనే కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి లక్నో ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2022 డిసెంబర్లో జరిగిన యాత్ర సందర్భంగా, అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా సైన్యం భారత సైనికులను “కొట్టడం” గురించి భారత మీడియా ప్రశ్నలు అడగలేదని రాహుల్ గాంధీ అవమానకరమైన రీతిలో పునరుద్ఘాటించారని ఫిర్యాదులో ఆరోపించారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా భారత సైన్యంపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గాంధీ “అవమానకరమైన” వ్యాఖ్యలు చేశారని ఆయన మీద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి లక్నోలోని ఎంపీ-ఎమ్మెల్యే ప్రత్యేక మేజిస్ట్రేట్ కోర్టు మంగళవారం(జూలై 15) ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
లైవ్ లా నివేదిక ప్రకారం, అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అలోక్ వర్మ ముందు లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు గాంధీ స్వయంగా హాజరై, బెయిల్ కోసం లొంగిపోయారు. అయితే, ఈ కేసులో గత ఐదు విచారణల సమయంలో ఆయన హాజరు కాలేదు.
న్యాయవాదులు ప్రాన్షు అగర్వాల్, మహ్మద్ యాసిర్ అబ్బాసి, మహ్మద్ సమర్ అన్సారీ గాంధీ తరఫున వాదించారు. గాంధీ నిర్దోషి అని, ఎటువంటి నేరం చేయలేదని వారు కోర్టు ముందు పేర్కొన్నారు.
కాంగ్రెస్ నాయకుడు భారత సైన్యం గౌరవాన్ని దెబ్బతీశారని, అంతేకాకుండా సైన్యం మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారని, కాబట్టి ఆయనకు బెయిల్ మంజూరు చేయకుడదని ఫిర్యాదుదారుడి న్యాయవాది వాదించారు.
అయితే, కోర్టు కాంగ్రెస్ నాయకుడికి రూ 20,000 వ్యక్తిగత బాండ్, అదే మొత్తానికి ఇద్దరు పూచీకత్తులను సమర్పించాలనే షరతుపై బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 13న జరుగబోతుంది.
2025 ఫిబ్రవరిలో లక్నోలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు సమన్లను జారీ చేసింది. దీంతో పాటు పరువు నష్టం కేసును సవాలు చేస్తూ గాంధీ మే నెలలో అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు.
అలహాబాద్ హైకోర్టు ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చింది. వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ సహేతుకమైన పరిమితులకు లోబడి ఉంటాయని, ఏ వ్యక్తిని లేదా భారత సైన్యాన్ని కించపరిచే ప్రకటనలు చేసే స్వేచ్ఛ ఇందులో చేర్చబడదని పేర్కొంది.
“భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) వాక్, భావ ప్రకటనా స్వేచ్ఛకు హామీ ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు, ఈ స్వేచ్ఛ సహేతుకమైన పరిమితులకు లోబడి ఉంటుంది. అంతేకాకుండా, ఏ వ్యక్తిని లేదా భారత సైన్యాన్ని కించపరిచే ప్రకటనలు చేసే స్వేచ్ఛ ఇందులో లేదు” అని జస్టిస్ సుభాష్ విద్యార్థితో కూడిన ధర్మాసనం పేర్కొంది.
2022 డిసెంబర్ 16న తన భారత్ జోడో యాత్ర సందర్భంగా, అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా సైన్యం భారత సైనికులను “కొట్టడం” గురించి భారత మీడియా ప్రశ్నలు అడగలేదని, గాంధీ చాలా అవమానకరమైన రీతిలో ఈ విషయాన్ని పునరుద్ఘాటించారని ఆరోపిస్తూ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ) మాజీ డైరెక్టర్ ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ ఈ ఫిర్యాదును దాఖలు చేశారు.
దేశవ్యాప్తంగా గాంధీపై అనేక ఫిర్యాదులు, పిటిషన్లను రాజకీయ ప్రత్యర్థులు దాఖలు చేశారు. జనవరిలో, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను హత్య నిందితుడిగా పేర్కొన్నారు. దీని మీద స్పందించిన సుప్రీంకోర్టు, కాంగ్రెస్ నాయకుడిపై క్రిమినల్ పరువు నష్టం చర్యలను నిలిపివేసింది.
అనువాదం: వంశీకృష్ణ చౌదరి
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.