ప్రభుత్వ రంగ పరిశ్రమలు దేశానికి నష్టకరమని, వీటిని అమ్మేయడమే దేశానికి శ్రేయస్కరమని మోడీ ప్రభుత్వం ఒక విధానాన్నే ప్రకటించింది. దీనికి వత్తాసు పలుకుతూ జేపీ, చక్రవర్తివంటి కార్పొరేటు అనుకూల మేధావులు- ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రభుత్వానికి గుదిబండలుగా మారాయని, నష్టాలు వస్తున్నాయి కాబట్టి వీటిని వదిలించుకోవడమే మంచిదని దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
వాస్తవంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలు సమర్థవంతంగా నడుస్తున్నాయా లేదా, ప్రైవేట్ రంగ సంస్థలు సమర్థవంతంగా నడుస్తున్నాయన్నది పరిశీలించవలసిన విషయమే. ఇక్కడ సమర్థవంతంగా నడవడమంటే ఏంటనేది అసలు ప్రశ్న.
ఈ సమర్ధతకు కొన్ని గీటు రాళ్లు ఉంటాయి. ఒకటి ప్రజల జీవన ప్రమాణాలు పెంచే ఉపాధి, రెండు దేశ ఆర్థిక అభివృద్ధికి సహకరించేలా అభివృద్ధి, మూడు సామాజిక న్యాయం పాటించడం, నాలుగు సామాజిక బాధ్యత నిర్వర్తించడం, ఐదు ప్రభుత్వానికి ఇవ్వవలసిన పన్నులన్నీ ఎగ్గొట్టకుండా సకాలంలో చెల్లించడం. ఈ రీతిన చూస్తే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఏవి సమర్థవంతంగా పనిచేస్తున్నాయన్నది సులువుగానే అర్థమవుతుంది.
ఇక్కడ గమనించవలసిన రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ప్రపంచవ్యాప్తంగా అమెరికాతో సహా అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుండగా; చైనాతోపాటు మరికొన్ని దేశాలు ఆ సంక్షోభ భారాలు తమ మీద పడకుండా చూసుకుంటూ అభివృద్ధి దిశలో ముందుకు సాగుతున్నాయి.
అమెరికా చైనా మధ్య వ్యత్యాసం
బాగా అభివృద్ధి చెందిన అమెరికా కూడా సాధించలేని ఆర్థికాభివృద్ధిని ప్రతి ఏటా చైనా ఎందుకు సాధిస్తుందన్నదో పరిశీలిస్తే, ఒక్క విషయం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అదేంటంటే, చైనాలో పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోనే పరిశ్రమల స్థాపన జరుగుతుంది. ప్రభుత్వ రంగం బలంగా ఉంటుంది. ప్రైవేటు రంగంలోని పరిశ్రమలు కూడా ప్రభుత్వ నియంత్రణతోనే పనిచేస్తాయి. అందువల్ల అక్కడ స్థిరమైన ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతోంది.
దీనికి భిన్నంగా సర్వం ప్రైవేటు రంగమన్న అమెరికాతో సహా అభివృద్ధి చెందిన యూరోపియన్ దేశాలన్నింటిలోనూ సంక్షోభ భారాలు పడుతూనే ఉన్నాయి. మన దేశం కొద్దిగానైనా తట్టుకుని నిలబడగలిగిందీ అంటే దానికి ప్రధాన కారణం ప్రభుత్వరంగ పరిశ్రమలే. ఇంత చిన్న విషయం కూడా ఈ మేధావులనే వారికి అర్ధం కాకపోవడం విడ్డూరమే అవుతుంది.
ప్రజల సొమ్ముతోనే ప్రైవేటు సంస్థల ఏర్పాటు
ఈ ప్రైవేటు రంగంలోని పరిశ్రమలు కూడా ఏమైనా వారి స్వంత పెట్టుబడులతో పరిశ్రమలు స్థాపిస్తున్నాయా అంటే అదీ కాదు. ఈరోజు అంబానీ, ఆదానిలాంటి భారతదేశ బడా కార్పొరేటు కంపెనీలు కూడా భారతీయ బ్యాంకుల నుంచి రుణాల రూపంలో పెద్ద ఎత్తున నిధులు తీసుకునే స్థాపిస్తున్నాయి.
ప్రైవేటు రంగంలోని పరిశ్రమలన్నీ ప్రజల పొదుపు సొమ్మైన బ్యాంకు నిధులతోనే స్థాపించబడుతున్నాయన్నది వాస్తవం. ఉదాహరణకు విశాఖపట్నంలోని గంగవరం పోర్టు యజమాన్యం, నాడు బ్యాంకుల నుంచి 2040 కోట్ల రూపాయలు బ్యాంకు కన్సార్టియం నుంచి లోన్లు తీసుకుని పోర్టును స్థాపించింది. తన సొంత డబ్బును రూపాయి కూడా వెచ్చించలేదు. నేడు వేల కోట్ల రూపాయలు విలువైన 2,852 ఎకరాల భూమితో సహా సర్వం హస్తగతం చేసుకుంది.
ఈ ప్రైవేటు పరిశ్రమకు ఇంత పెద్ద ఎత్తున ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినట్టు? రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా, కేవలం ప్రభుత్వ విధానాల వల్ల మాత్రమే సాధ్యమైంది.
ప్రైవేటురంగ పనితనానికి సాక్ష్యం
తర్వాత మరో వాదన ఏమిటంటే ప్రభుత్వ రంగం కంటే ప్రైవేటు రంగం బాగా పనిచేస్తుందని; ఈ ప్రైవేటురంగం ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో విమానయాన రంగమే ప్రత్యక్ష ఉదాహరణ. నేడు దేశంలో ఇండిగో ప్రైవేటు సంస్థ ఎలా పని చేస్తోందో చూస్తూనే ఉన్నాం. వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు చేసి, లక్షల మంది ప్రజలను ఇబ్బంది పాలు చేసిన సమర్ధత వీరిది.
అంతకుముందే కింగ్ ఫిషర్, ఎయిర్ ఏషియా, గో ఎయిర్ వంటి అనేక ప్రైవేటు విమానాల సంస్థలు దివాళా తీసేశాయి. మరి ప్రైవేటు రంగం అంత సమర్థవంతంగా పని చేస్తే ఈ సంస్థలన్నీ ఎందుకు దివాళా తీసి చేతులెత్తేసినట్టు?
మరోపక్క ప్రభుత్వరంగ ఇండియన్ ఎయిర్ లైన్స్ మాత్రం ప్రయాణికులకు అనేక సౌకర్యాలతో నడిచేది అన్నది కూడా మన కళ్ల ముందరి వాస్తవం.
ప్రైవేటు రంగంలో లేని మరొక గొప్ప విషయం ప్రభుత్వ రంగంలో ఉంది. అదేమిటంటే, రిజర్వేషన్ల ద్వారా సామాజిక న్యాయాన్ని పాటించడం.
దేశంలో ఆర్ధికాభివృద్ధి, సామాజిక న్యాయం, ప్రభుత్వానికి పన్నులు చెల్లించడం, సామాజిక భాధ్యత నెరవేర్చడం వంటన్ని అంశాల్లోనూ ప్రభుత్వ రంగం చాలా విశేషమైన పాత్ర పోషిస్తోంది.
ప్రభుత్వరంగ పనితీరు
వాస్తవంగా ప్రైవేటు రంగంతో పోలిస్తే ప్రభుత్వ రంగ పరిశ్రమల చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాయన్నదానికి ప్రత్యక్ష ఉదాహరణ ప్రభుత్వ రంగ పరిశ్రమల పని తీరు.
ఉదాహరణకు 2024 మార్చి 31 నాటికి మన దేశంలోని 272 ప్రభుత్వంగ పరిశ్రమల నికర లాభం 3 లక్షల 43వేల కోట్ల రూపాయలు. ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమల వద్ద రిజర్వులు, సర్ ప్లస్‌లు కలిపి 15 లక్షల 4 వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ సంస్థలు 19 లక్షల 95 వేల కోట్ల రూపాయల నికర సంపదను కలిగి ఉన్నాయి. విదేశీ కరెన్సీ ఆదాయం లక్ష 43 వేల కోట్ల రూపాయలన అర్జించాయి. గత ఒక్క సంవత్సరమే కేంద్ర ప్రభుత్వానికి 4లక్షల 85 వేల కోట్ల రూపాయలు డివిడెంట్లు, పన్నుల రూపంలో చెల్లించాయి.
ఒకపక్క ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఇంత పెద్ద మొత్తంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తే, ఈ స్థాయిలో చెల్లించిన ప్రైవేటు పరిశ్రమలు ఏమైనా ఉన్నాయా అంటే లేవు సరి కదా తిరిగి ఈ ప్రైవేటు రంగ పరిశ్రమలే ప్రభుత్వమిచ్చే అనేక రాయితీలు పొందుతున్నాయి. ఉదాహరణకు మోడీ ప్రభుత్వం గత 11 ఏళ్ల కాలంలో ఈ కార్పొరేటు కంపెనీలకు ఇచ్చిన సుమారు 16 వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను మాఫీ చేసేసింది. కార్పొరేటు పన్నును భారీగా తగ్గించి వేసింది. ఇదంతా ప్రజల సోమ్మే కదా! దీనిపై నోరెత్తని కొంతమంది మేధావులు ప్రభుత్వ రంగంపై బురడజల్లడానికి పూనుకోవడం సిగ్గుచేటు.
ప్రజల సొమ్ము కార్పొరేటు సంస్థలకు ధారాదత్తం చేస్తూ, మరోపక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంటుకు 11 వేల కోట్ల రూపాయలిస్తే ఏదో కొంపలు మునిగిపోయినట్టు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు గుదిబండలుగా మారిపోయినట్టుగా మేధావులుగా చెప్పుకుంటున్న వారు ప్రచారం చేస్తున్నారు.
ప్రభుత్వ రంగ పరిశ్రమలు లాభాలు గడిస్తున్నా, బాగా నడుస్తున్నా వాటిని ఎలాగైనా మూసివేయాలనే దురుద్దేశంతోనే ప్రభుత్వ అనుకూల మీడియా, అధికార పార్టీలకు కార్యకర్తలలా వ్యవహరిస్తున్న మేధావి వర్గం వాటిపై బురదజల్లే విష ప్రచారం చేస్తున్నాయి. ఇంకా విచిత్రంగా పారదర్శకంగా అమ్మాలని ఉచిత సలహా ఇస్తున్నాయి. ఇదెలా ఉందంటే, ఊరి తీస్తే తీశారు కానీ, మెత్తని తాడుతో తీయమన్నట్టుగా.
రక్షకులే భక్షకులు
“Government has no business in doing business” అన్నది మోడీ ప్రభుత్వ విధానం.
రక్షణ రంగం, ఇన్స్యూరెన్సు, బ్యాంకులతో సహా సర్వం కార్పొరేట్ పరం చేయాలనేది వారి లక్ష్యం. ఇందులో భాగంగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ఎలాగైనా అమ్మేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. దీనికి ఆంధ్ర రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోంది.
చంద్రబాబు మరో అడుగు ముందుకు వేసి, కార్మికులపై లేనిపోని అభాండాలు కూడా వేస్తున్నారు. ప్యాకేజీ ఇచ్చేసామని, ఏదో చేసేశామనే భ్రమలు కల్పిస్తున్నారు.
అయితే, ఆచరణలో మాత్రం స్టీల్ ప్లాంట్‌ను అన్ని రకాలుగా పీక నులిమేసే చర్యలు చేబడుతున్నారు. గనులు కేటాయించకుండా, ముడి సరుకు ఇవ్వకుండా, రైల్వే రేకులు ఇవ్వకుండా, కావాలనే నాసిరకం ముడి సరుకులు వాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రతిష్ట దిగజారేలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఈ పనులను సమర్ధవంతంగా చేసేలా తమకు అనుకూల ఉన్నతాధికారులను కూడా నియమించుకుంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఎటువంటి కుట్రలూ పన్నకుండా, గనులు కేటాయించి, స్టీల్ ప్లాంటును దాని మానాన దాన్ని వదిలేస్తే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా లాభాల్లోనే నడుస్తుంది. ఇంకా సమర్థవంతంగా పనిచేస్తుంది. అందువల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంటు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు మనుగడ కొనసాగాలంటే కేంద్రప్రభుత్వం ఈ కుట్రలను అర్థం చేసుకొని వాటిని సమర్థవంతంగా తిప్పి కొట్టడమే ఏకైక మార్గం.
(వ్యాస రచయిత ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
