
2015- 16 నుంచి 2024- 25 మధ్య ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ 12.08 లక్షల కోట్ల విలువైన రుణాలను రద్దు చేశాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలియజేశారు. గణంకాల ప్రకారం, గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లోనే 2020-21 నుంచి 2024- 25 వరకు రూ 5.82 లక్షల కోట్లకు పైగా రుణాలు రద్దు చేయబడ్డాయి.
న్యూఢిల్లీ: భారతదేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు 2015- 16 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరాల మధ్య రూ 12 లక్షల కోట్లకు పైగా రుణాలను రద్దు చేశాయి . ఈ సమాచారాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ జూలై 22న రాజ్యసభకు అందించింది.
ప్రభుత్వ రంగ బ్యాంకులు మొత్తం రూ 12,08,828 కోట్ల రుణాన్ని రద్దు చేశాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా తెలిపారు. గణంకాల ప్రకారం, కేవలం గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో(2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి 2024-25 వరకు) రూ 5.82 లక్షల కోట్లకు పైగా రుణాలను రద్దు చేశారు.
అయితే, “రైట్-ఆఫ్”(రుణాల రద్దు) అనేది ఒక సాంకేతిక అకౌంటింగ్ విధానమని, రుణగ్రహీత రుణం మాఫీ చేయబడిందని దీని అర్థం కాదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
పంకజ్ చౌదరి మాట్లాడుతూ:
ఈ విధంగా రుణాలను రద్దు చేయడం వల్ల రుణగ్రహీత బాధ్యత తొలగిపోదు. కాబట్టి ఇది రుణగ్రహీతకు ఎటువంటి ప్రయోజనాన్ని అందించదు. రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన బాధ్యత రుణగ్రహీతలపైనే ఉంటుంది. అంతేకాకుండా బ్యాంకులు ఈ ఖాతాలలో రికవరీ చర్యలు తీసుకుంటూనే ఉంటాయి.

ఈ ప్రక్రియ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంది. దీని ప్రకారం, రికవరీ అవకాశాలు ముగిసిన రుణాన్ని రద్దు చేయడానికి బ్యాంక్ సిద్ధమవుతుంది. అటువంటి రుణాలు సాధారణంగా నాలుగు సంవత్సరాల తర్వాత బ్యాలెన్స్ షీట్ నుంచి తొలగించబడతాయి.
ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులను కూడా మంత్రి ప్రస్తావించారు. 2025 మార్చి 31 నాటికి, రూ 1.62 లక్షల కోట్లకు పైగా రుణాలు కలిగినవారు మొత్తం 1,629 మంది రుణగ్రహీతలు ఉన్నారు. వారిని ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులుగా ప్రకటించారు.
సెక్యూరిటైజేషన్ ఆర్థిక ఆస్తుల పునర్నిర్మాణం- భద్రతా వడ్డీ అమలు చట్టం, దివాలా చట్టం- 2016 నిబంధనల ప్రకారం వారిపై రికవరీ ప్రక్రియ జరుగుతోంది.
అంతేకాకుండా, మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద రూ 15,000 కోట్లకు పైగా విలువైన ఆస్తులను జప్తు చేశారు.
గత ఐదు సంవత్సరాలలో 12లో నుంచి 10 ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా చేయబడిన రుణాల రద్దులో తరుగుదల ఉన్నట్టుగా గణంకాలు చూపిస్తున్నాయి. అయిన్నప్పటికీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), కెనరా బ్యాంక్ ఇదే సమయంలో, ముఖ్యంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రుణాల రద్దులో పెరుగుదల నమోదైట్లు నివేదించాయి.
గత ఐదు సంవత్సరాలలో ప్రభుత్వ రంగ బ్యాంకులు సుమారు 1.5 లక్షల మంది ఉద్యోగులను నియమించుకున్నాయని, ప్రస్తుతం మరో 48,570 పోస్టులకు నియామక ప్రక్రియ జరుగుతోందని మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక ప్రశ్నకు సమాధానంగా తెలిపింది.
అనువాదం: వంశీకృష్ణ చౌదరి
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.