ఉత్తర్ప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్రలలో అధిక మొత్తంలో జరిమానాలను వసూలు చేశాయి. ఆ తర్వాత అధిక మొత్తంలో వసూలు చేసిన జాబితాలో కర్ణాటక, బీహార్వంటి ఇతర రాష్ట్రాలు ఉన్నాయి.
న్యూఢిల్లీ: దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కనీస బ్యాలెన్స్ నిర్వహించనందుకు ఖాతాదారుల నుంచి జరిమానా కింద 2020-21, 2024-25 మధ్య కాలంలో రూ 8,621.12 కోట్లు వసూలు చేసినట్టు లోక్సభ పిటీషన్స్ కమిటీ ముందు ఉంచిన డేటా తెలియజేసినట్లు డెక్కన్ హెరాల్డ్ కథనం వెల్లడించింది.
ఖాతాదారులు కనీస బ్యాలెన్స్ మెయింటేన్ చేయనందుకు బ్యాంకులు జరిమానా విధించే పద్ధతికి స్వస్తి చెప్పాలని పార్లమెంటరీ స్థాయి సంఘం వాదిస్తోంది.
డేటా ప్రకారం ఉత్తర్ప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర అధిక సంఖ్యలోని బ్యాంకులు జరిమానాలు వసూలు చేయగా; ఆ తర్వాత కర్ణాటక, బీహార్ వంటి ఇతర రాష్ట్రాలున్నాయి.
గడచిన ఐదు ఆర్థిక సంవత్సరాలలో రూ 1,233.97 కోట్లు జరిమానా వసూలు చేసి- జాబితాలో మొదటి స్థానంలో ఉత్తర్ ప్రదేశ్ ఉండగా; తర్వాత తమిళనాడు రూ 1,121.38 కోట్లు; మహారాష్ట్ర రూ 1,088.18 కోట్ల జరిమానా వసూళ్లతో మూడవ స్థానంలో ఉంది.
పెరుగుదల- తగ్గుదల..
కర్ణాటక, బీహార్లలో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులు వరుసగా రూ 529.20 కోట్లు; రూ 464.24 కోట్లను వసూలు చేశాయి.
డెక్కన్ హెరాల్డ్ కథనం ప్రకారం, జరిమానా వసూళ్లు 2020-21, 2023-24 మధ్య పెరిగినప్పటికీ; 2024-25లో తగ్గుముఖం పట్టాయి.
భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లపై జరిమానాలను 2020 మార్చిలో ఉపసంహరించుకున్న విషయాన్ని గమనించాలి.
అయినా జరిమానాలు 2020-21 నుంచి రూ 1,148.71 కోట్ల నుంచి రూ 1,415.65 కోట్లకు పెరిగాయి.
ఆ తర్వాత వచ్చే మూడు ఆర్థిక సంవత్సరాలలో రూ 1,785.90 కోట్లు, రూ 2,225.10 కోట్లు కాగా ఈ లెక్కలు 2024-25లో జరిమానాల అంచనాలతో దాదాపు రూ 2,045.74 కోట్లకు తగ్గాయి.
రాష్ట్రాల వారిగా చూసుకుంటే..
జాతీయ స్థాయిలో 2024-25లో జరిమానాలు తగ్గినప్పటికీ, 2023-24తో పోలిస్తే ఆరు రాష్ట్రాలు- మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో పెరిగినట్లు నమోదైంది.
తమిళనాడు అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. అంటే 2023-24లో రూ 233.12 కోట్ల నుంచి 2024-25లో రూ 276.34 కోట్లకు(రూ. 43.22 కోట్ల పెరుగుదల) చేరిందని డెక్కన్ హెరాల్డ్ కథనం పేర్కొంది.
జరిమానాల వసూళ్ల విషయంలో కర్ణాటకను మినహాయిస్తే అన్ని దక్షిణ భారత రాష్ట్రాల్లో వసూళ్లు పెరగగా, ఉత్తర్ప్రదేశ్ రూ 51.84 కోట్లతో అతిపెద్ద తగ్గుదలను నమోదు చేసుకుంది. అక్కడ 2023-24లో రూ. 339.10 కోట్ల నుంచి 2024-25లో రూ 287.26 కోట్లకు తగ్గింది.
వాటాదారులందరి శ్రేయస్సు దృష్ట్యా కనీస బ్యాలెన్స్ నిర్వహించలేని సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలపై జరిమానాలు రద్దు చేయాలని కొన్ని బ్యాంకులు నిర్ణయించాయని పార్లమెంటరీ స్థాయి సంఘం అభిప్రాయపడింది.
కరెంట్ అకౌంట్లను నిర్వహించే చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్వయం ఉపాధి పొందే వారు, చిరు వ్యాపారుల పట్ల ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు సానుకూలతతో చూడాలని, అంతేకానీ కనీస బ్యాలెన్స్ నిర్వహించనందుకు తరచూ జరిమానాలతో వారిని ఇబ్బంది పెట్టకూడదని పార్లమెంటరీ స్థాయి సంఘం కోరింది.
(డెక్కన్ హెరాల్డ్ సౌజన్యంతో ప్రచురితం)
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
