
బీహార్ ఎస్ఐఆర్ ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలిగించబడిన పేర్లను వెబ్సైట్లో ప్రచురించాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతోపాటు, తొలగించడానికి కారణాలను కూడా అందులో పొందుపర్చాలని పేర్కొన్నది. అంతేకాకుండా, ఈ ప్రక్రియ కోసం ఆమోదించబడిన పత్రాలలో ఆధార్‌ను కూడా చేర్చాలని ఆదేశించింది.
న్యూఢిల్లీ: బీహార్ ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)పై పలు రిట్పిటీషన్లు దాఖలైయ్యాయి. వీటిపై పిటీషన్‌దారులు, కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాదులు మధ్య, ఎస్ఐఆర్లోపాలపై వాదోపవాదాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌కు పలు సూచనలు చేస్తూ, ఆదేశాలను సుప్రీంకోర్టు జారీ చేసింది.
ఎస్ఐఆర్ తర్వాత ఎన్నికల సంఘం ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించింది. ఈ జాబితాలో లక్షలాదిమంది ఓటర్ల పేర్లు మాయమయ్యాయి. ఈ పరిస్థితికి గల కారణాలు న్యాయస్థానానికి నివేదించడంతో పాటు, ఆ పేర్ల జాబితాను ఎన్నికల సంఘం వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
లైవ్‌లా వైబ్‌సైట్ కథనం ప్రకారం, ఈ ప్రక్రియలో భాగంగా ఓటర్లు సమర్పించాల్సిన పత్రాల జాబితాలో ఆధార్‌ను కూడా చేర్చాలని ఎన్నికల సంఘానికి కోర్టు సూచించింది.
అన్ని పక్షాల సుదీర్ఘ విచారణ తర్వాత జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం గురువారం(ఆగస్టు 14) ఈ ఉత్తర్వును జారీ చేసింది.
2025 ఓటరు జాబితాలో పేర్లు ఉండి, ముసాయిదా జాబితాలో చేర్చబడని దాదాపు 65 లక్షల మంది ఓటర్ల జాబితాను, జిల్లా ఎన్నికల అధికారుల వెబ్సైట్లో(జిల్లా వారీగా) ప్రచురించాలని కోర్టు సూచించింది. ఈ సమాచారం బూత్ వారీగా ఉంటుంది, దీనిని ఓటరు ఈపీఐసీ నంబర్‌తో పోల్చి చూసుకోవచ్చు.
ఈ విషయంలో ఓటర్లకు అవగాహన కల్పించాలంటే, ఈ జాబితాలో పేరు ఎందుకు చేర్చలేదో, దానికి గల కారణాన్ని కూడా తెలియజేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
విస్తృతంగా ప్రచారం చేయండి..
దీంతో పాటు, బీహార్‌లో ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న వార్తాపత్రికల ద్వారా, ఎస్ఐఆర్లో భాగంగా రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ గురించి విస్తృతంగా తెలియజేయాలని ఎన్నికల సంఘాన్ని కోర్టు కోరింది. అంతేకాకుండా, “ఈ జాబితాను దూరదర్శన్, రేడియో ఛానెళ్లలో కూడా ప్రసారం చేయాలి. ఏదైనా జిల్లా ఎన్నికల అధికారికి సోషల్ మీడియా పేజీ ఉంటే, అక్కడ పబ్లిక్ నోటీసు కూడా ఉంచాలి” అని వివరించింది.
బాధిత వ్యక్తి తన క్లెయిమ్‌తో పాటు ఆధార్ కార్డు కాపీని సమర్పించవచ్చని పబ్లిక్ నోటీసులో స్పష్టంగా వ్రాయాలని సుప్రీంకోర్టు తెలియజేసింది.
ప్రతి బూత్ స్థాయి అధికారి పంచాయతీ కార్యాలయంలోని నోటీసు బోర్డుపై బూత్ వారీ జాబితాను అతికించాలని, పేర్ల తొలగింపుకు గల కారణాలను సాధారణ ప్రజలు చూసేలా అందుబాటులో ఉంచాలని కూడా కోర్టు ఆదేశించింది.
విచారణ సందర్భంగా, “చనిపోయిన, బదిలీ చేయబడిన లేదా నకిలీ ఓటర్ల పేర్లను వెబ్సైట్లో మీరు ఎందుకు ఉంచడం లేదు? మేము మిమ్మల్ని విమర్శించడం లేదు. కానీ పారదర్శకత ఓటర్ల విశ్వాసాన్ని పెంచుతుంది. ప్రజలు తప్పులను సరిదిద్దుకునేలా, మీరు ఒక అడుగు ముందుకు వేసి, కారణాలతో సహా ఈ జాబితాను వెబ్సైట్లో ఎందుకు ఉంచకూడదు?” అని జస్టిస్ బాగ్చి ప్రశ్నించారు.
దీనికంటేముందు, బుధవారం(ఆగస్టు 13) జరిగిన విచారణ సందర్భంగా న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పలు కీలక ప్రశ్నలను అడిగారు.
“ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం జరిగిన ఒక రోజు తర్వాత, ఎన్నికల సంఘం తన వెబ్సైట్ నుంచి ముసాయిదాలో జాబితా సెర్చ్ ఆప్షన్‌ను ఎందుకు తొలగించింద”ని ప్రశాంత్ భూషణ్ ప్రశ్నించారు.
జనన ధృవీకరణ పత్రంతో సహా ఓటరు జాబితాలో పేరు చేర్చడానికి ఎన్నికల సంఘం 11 పత్రాలను నిర్ణయించింది. కానీ అందులో ఆధార్ కార్డు, ఓటరు ఐడి లేదా రేషన్ కార్డు లేదు.
విచారణ ప్రారంభ రోజుల్లో ఈ పత్రాలను ఆమోదించాలని సుప్రీంకోర్టు సూచించింది. కానీ, కమిషన్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడం ద్వారా తన వైఖరికి కట్టుబడి ఉంటుందని తెలిపింది.
అనువాదం: కృష్ణ నాయుడు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.