ఆరెస్సెస్ ముఖ్య నాయకుల్లో ఒకరైన రామ్ మాధవ్ రాసిన కొత్త పుస్తకం “ది న్యూవరల్డ్”ను విశ్లేషిస్తూ, ప్రముఖ చరిత్రకారులు జాఫ్రెలాట్ రాసిన సుదీర్ఘ వ్యాసాన్ని భాగాలుగా అందిస్తున్నాము. మొదటి భాగం కోసం ఇక్కడ క్లిక్చేయండి
భారతదేశం నిజంగానే ఎదుగుతోందా?
రామ్ మాధవ్ అభిప్రాయం ప్రకారం, భారతదేశం శక్తివంతమైన దేశంగా ఎదగాలంటే కొత్త పాతల కలయికతో కూడిన నిరంకుశత్వానికి తిరిగి వెళ్లాలి. దానికోసం కొత్తపాతల కలయితో దేశం ఆధునిక శక్తిగా ఎదగాలి. ఈ విధంగా ఆధునిక అగ్రరాజ్యంగా భారతదేశం ఎదగటానికి కావల్సిన రోడ్ మ్యాప్‌ను వివరించటానికి రామ్ మాధవ్ ఈ పుస్తకంలో రెండో భాగాన్ని కేటాయించారు. అయితే ఈ కోణాలు చర్చించేటపుడు రామ్ మాధవ్ ఓ మేర జాగ్రత్తలు పాటించటమే కాక, కాస్తంత నిరాశావాదం కూడా మనకు అందిస్తున్నారు.
మోడీ భారతం నెహ్రూ అనుసరించిన ఆదర్శవంతమైన ప్రపంచ సంబంధాలతో తెగతెంపులు చేసుకున్నదనటంలో సందేహం లేదు. మరి ఈ పదేళ్లలో దౌత్య రంగంలో మోడీ నేతృత్వంలోని భారతం సాధించింది ఏమిటి?
ఈ పుస్తకం రెండో భాగంలో కాస్తంత ఆడంబరంతో పాటు, కనిపించీ కనిపించని స్థాయిలో విమర్శనాత్మక దృక్ఫథం కూడా ఇమిడి ఉంది. ఈ ధోరణి లేదా అవగాహన పదేపదే ముందుకొస్తున్న వైరుధ్యాలను గుర్తు చేస్తోంది. ఓ వైపు కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానాలను ఘాటుగా విమర్శిస్తూనే నెహ్రూ, ఆయన వారసులు దౌత్యరంగంలో సాధించిన విజయాలను రామ్ మాధవ్ ఏకరువు పెడుతూ వచ్చారు. ఇరుగు పొరుగు దేశాలతో నెరుపుతున్న సంబంధాలు, ఐఐటీల ఏర్పాటు వంటి అనేకవిషయాలను ప్రస్తావించారు.
ఈ చివరి ఉదాహరణ గురించి కాస్తంత లోతుగా పరిశీలించాలి. రామ్ మాధవ్, ‘‘నేపాల్‌లో రాజవంశం నుంచి త్రిభువన్ వీర్ విక్రమ్ సింగ్ నేతృత్వంలో రాజ్యాంగబద్దమైన రాచరికానికి అధికారాన్ని బదిలీ చేయించంలో నెహ్రూ కీలక పాత్ర పోషించారు’’ అని అంగీకరిస్తారు.
శ్రీలంక విషయంలో కూడా ఇది వాస్తవం..
‘‘1948లో శ్రీలంక బ్రిటిష్ వలస పాలన నుంచి స్వాతంత్య్రం పొందిన తర్వాత భారతదేశం సంబంధాలు స్నేహపూర్వకంగానే మొదలయ్యాయి. స్వాతంత్య్రానంతరం ఎస్డబ్ల్యూఆర్డీ బండారు నాయకె నేతృత్వంలో శ్రీలంక కూడా అలీనోద్యమంలో భాగస్వామి అయ్యింది.
గోవా, దమన్ దియులను భారతదేశంలో విలీనం చేయటం వంటి దేశీయ ప్రాధాన్యత కలిగిన విషయాల మొదల, సూయజ్ కాలువ వివాదం వంటి అంతర్జాతీయ విషయాల వరకూ శ్రీలంక తొలినాళ్లల్లో భారతదేశంతో కలిసిమెలిసి నడిచింది. నెహ్రూ మరణించిన రోజున జాతీయ సెలవు దినంగా కూడా ప్రకటించారు(పేజీ.288).
తర్వాతి భాగంలో దక్షిణాసియా పరిణామాలను మాధవ్ పరిశీలిస్తూ, నెహ్రూ దౌత్యరంగంలో సాగించిన విశేష కృషిని ప్రశంసిస్తారు.
‘‘మయన్మార్ స్వాతంత్య్రానంతరం, ఆ దేశం కూడా భారతదేశంతో సుహృద్భావ సంబంధాలను నెలకొల్పుకుంది. ఆ దేశ ప్రధాని యూనుతో నెహ్రూ మంచి వ్యక్తిగత సంబంధాలు కలిగి ఉన్నారు. 1951లో రెండు దేశాలు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. ”
‘‘1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధం చివరి దశలోకి ప్రవేశించినప్పుడు ముక్తివాహిని సేనలకు భారత్ సైన్యం బాసటగా నిలవటంతో బంగ్లాదేశ్ విముక్తి విజయానికి అండగా నిలిచిన ఇందిరాగాంధీకి ఆ దేశం రుణపడి ఉంది’’ అంటూ నెహ్రూ విజయాలను గుర్తిస్తారు.
నెహ్రూ- గాంధీ కుటుంబం తర్వాత దౌత్య రంగంలో విజయాలు సాధించిన ప్రధానుల్లో ఒకరిగా పీవీ నర్సింహారావు నిలుస్తారు.
‘‘1992లో పీవీ నర్సింహారావు లుక్‌ఈస్ట్(భారత దేశం అనుసరించే దౌత్య వ్యూహంలో హిందూ మహా సముద్ర తీర దేశాలకు ప్రాధాన్యత ఇచ్చే) విధానం అనుసరించనారంభించారు’’(పేజీ 299).
చివరకు మోడీ చే తులనాడబడిన మన్మోహన్ సింగ్‌ను కూడా రామ్ మాధవ్ ప్రశంసిస్తారు:
‘‘2008లో మన్మోహన్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం హిందూ మహాసముద్రం తీర దేశాలతో నావికాదళ సమ్మేళనానికి తెరతీసింది. హిందూమహాసముద్రతీర దేశాల నావికా దళాలను ఓ చోటికి చేర్చే తొలి ప్రయత్నం ఇది. పదేళ్ల తర్వాత ఈ కార్యక్రమంలో 35 దేశాలకు చెందిన నావికాదళాలు పాల్గొన్నాయి(301).’’
ఇరుగు పొరుగుదేశాలతో భారతదేశం ఈ మధ్యకాలంలో నెరుపుతున్న దౌత్య సంబంధాల విషయంలోనే రామ్ మాధవ్ తన అంచనాలకు పూర్తిగా భిన్నమైన వాదనలను ముందుకు తెస్తారు. ఓవైపున భారతదేశాన్ని అగ్రరాజ్యంగా చూపించాలన్న తపన, మరోవైపు తన(పరివార్)చేస్తున్న అసత్య ప్రచారాలను తానే నమ్మలేని స్థితి మనకు ఈ రచనలో కనిపిస్తుంది. సత్యాలను పరికించి చూసేందుకు సిద్ధపడ్డ పరిస్థితి కూడా వెల్లడవుతుంది. ఈ క్రింది పేరగ్రాఫ్ చూస్తే రాం మాధవ్లోని సంశయాత్మకత వ్యక్తమవుతుంది.
‘‘సార్క్, బిమ్స్టెక్ వంటి కూటమల ఏర్పాటు, ఆ కూటములు తరతమ స్థాయిలో విజయవంతం కావటం వంటి రిణామాల నేపథ్యంలో భారతదేశం ప్రాంతీయ నాయకురాలిగా ఎదిగింది. హిందూ మహాసముద్ర తీర దేశాలతో భారతదేశానికి ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాల రీత్యా ఆయా దేశాల్లో భారతదేశం పట్ల ప్రత్యేకమైన గుర్తింపు గౌరవాలున్నాయి. ఒకప్పుడు అలీనోద్యమ నాయకురాలిగా ఉన్న దేశం ప్రస్తుతం దక్షిణార్ధగోళ దేశాల ప్రయోజనాల సాధన కోసం అంకితమై పని చేస్తూ ఆసియా, ఆఫ్రికా దేశాల మన్ననలు అందుకొంటోంది’’(పే. 113`114) అంటూనే మరోవైపు..
‘‘సార్క్, బిమ్స్టెక్ కూటములు సమగ్రమైన ప్రాంతీయ కూటములుగా ఎదగటంలో విఫలమయ్యాయి. సీఐఎస్ దేశాల్లోనూ, ఆసియా, యూరోపియన్ యూనియన్ కూటములు ఈ విషయంలో మెరుగ్గా ఉన్నాయి. భారత్- పాకిస్తాన్ వైషమ్యాలకు సార్క్ కూటమి బలి అయ్యింది. దాదాపు దశాబ్దకాలంగా నిద్రాణంగా ఉంది. సార్క్ దేశాధినేతల చివరి సమావేశం 2014లో జరిగింది. అప్పటి నుండీ ఈ వేదిక నిద్రాణంగా ఉండిపోయింది. బిమ్స్టెక్ ఒప్పందానికి భారతదేశం వ్యూహాత్మక ప్రాధాన్యత ఇచ్చినా దీని పురోగమనం నత్తనడక నడుస్తోంది’’ (పే. 287)అన్నారు.
అంటే, మోడీ అనుసరించిన ఇరుగు పొరుగు దేశాలదే ప్రథమ ప్రాధాన్యత అన్న విధానం విఫలం అయ్యిందని చెప్పదల్చుకున్నారా రామ్ మాధవ్?
మోడీ ప్రభుత్వంపై కురిపించిన విమర్శలు కేవలం ప్రాంతీయ దేశాలతో దౌత్యం విషయానికే పరిమితం కాలేదు. మోడీ విజయాల గురించి చెప్పాలని ప్రయత్నించినా ఏమీ కనిపించలేదు. రాజకీయంగా తనను తాను మార్కెటింగ్ చేసుకోవటం, ఏవో కొన్ని స్మృతులు, జ్ఞాపకాలు మినహా ఏమీ దొరకటం లేదు:
‘‘భారతదేశం తనను తాను ఒక ప్రాంతీయ కూటమి నాయకురాలిగా ప్రపంచం ముందు ఆవిష్కృతం గావించుకోవటం ప్రాధాన్యతను ప్రధాని మోడీ బాగా అర్థం చేసుకున్నారు.(వక్కాణింపు నాది). ఇరుగు పొరుగు దేశాల విశ్వాసం, మన్ననలు చూరగొన్న దేశంగా ఎదగాల్సిన ప్రాధాన్యత గురించి అర్థం చేసుకున్నారు’’ అని రాశారు.
నెహ్రూ అనుసరించిన అలీనోద్యమ పంథాకు, మోడీ అనుసరిస్తున్న వ్యూహాత్మక తటస్థతకు మధ్య బోల్డెంత వ్యత్యాసం ఉంది. ఈ తేడా గాజాపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో భారతదేశపు స్పందనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. (ఈ అంశం ఐక్యరాజ్యసమితిలో చర్చకు వచ్చినప్పుడల్లా భారతదేశం ఉద్దేశ్యపూర్వకంగానే సమావేశాలకు హాజరు కాలేదు. చివరకు కాల్పుల విరమణ తీర్మానం చర్చకొచ్చినప్పుడు కూడా). ఈ ధోరణిని రామ్ మాధవ్ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అని పిలుస్తున్నారు. అదేమిటో అంతుబట్టని విషయం. అప్పట్లో ఫ్రెంచి అధ్యక్షుడు డీగాల్ సైనికావసరాలకు విదేశీ శక్తులపై ఆధారపడకుండా ఉండే పరిస్థితిని వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి అని పిలిచారు. మరి రామ్ మాధవ్ చెప్తున్న దానికి అర్థం ఏమిటో.
‘‘ఉక్రెయిన్లోనూ, గాజాలో జరుగుతున్న సాయుధ ఘర్షణల విషయంలో భారతదేశం అనుసరిస్తున్న వైఖరి వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి నిదర్శనం. రెండు సందర్భాల్లోనూ భారతదేశం ఎవరితోనూ కొమ్ము కాయకుండా ఉండిపోయింది. సానుకూల తటస్తతను పాటిస్తోంది. ఘర్షణల్లో భాగస్వామిగా అందరితోనూ సమాంతర సంబంధాలు కొనసాగిస్తోంది. బారతదేశంతో పాటు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో 32 దేశాలున్నాయి. 2023 ఫిబ్రవరిలో ఐరాస సర్వసభ్య సమావేశం ఆమోదించిన తీర్మానంలో చైనా కూడా సంతకం చేయలేదు. ఈ తీర్మానం ఉక్రెయిన్ నుంచి రష్యా తక్షణమే తన సేనలు బేషరతుగా సంపూర్ణంగా ఉపసంహరించుకోవాలని ప్రతిపాదిస్తోంది.(పే. 258).
అయితే, అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయం మరోటి ఉంది: శక్తివంతమైన పారిశ్రామిక పునాది, అధునాతన ఆర్థిక- శాస్త్ర సాంకేతిక, సాయుధ రంగాల అభివృద్ధి విషయాల్లో భారతదేశం పురోగతి గురించి రామ్ రాధవ్ విమర్శనాత్మక దృక్ఫథంతో వ్యవహరించారు. ఈ రంగాల్లో అంతా సాధించాల్సిన లక్ష్యాలే. సాధించింది అల్పమే కావటంతో రచయిత విచారం వ్యక్తం చేస్తున్నారు.
పుస్తకం చివరి వంద పేజీల్లో ‘దురదృష్టవశాత్తూ’ అన్న పదం కనీసం పదిసార్లు కనిపిస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి విషయంలో భారతదేశం పరిస్థితి సంక్లిష్టంగా ఉంది.
ఎందుకంటే,‘‘క్వాంటం ఫిజిక్స్ వంటి రంగాల్లో తగిన ప్రావీణ్యం లేకపోవటం, తగినన్ని నిధులు లేకపోవడం, మౌలికసదుపాయాల కల్పనలో వెనకబాటు, పరిశోధనారంగం, పారిశ్రామిక రంగం మధ్య సమన్వయ లోపం వంటి సమ్యలు ఎదుర్కొంటోంది. సాంకేతిక రంగంలో ఈ వెనుకంజను తక్షణమే అధిగమించేందుకు భారతదేశం ప్రయత్నించాల్సి ఉంది. విద్యా రంగాన్ని, పరిశోధన సదుపాయాలను తక్షణమే ఆధునీకరించాల్సి ఉంది. సృజనాత్మకత, ఆధునిక పరిజ్ఞానాల ఉత్పత్తి, తయారీలో భారతదేశం పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది. పరిశోధన, అభివృద్ధి రంగాల్లో పురోగమించటానికి సాకేంతిక రంగ సామర్ధ్యాన్ని పెంపొందించటానికి వీలుగా సమన్వయం పెరగాలి గతంలో అణుఛేదనం, అంతరిక్షం వంటి రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించాము. భారత అణు విజ్ఞాన పరిశోదన రంగం అద్భుతమైన పురోగతి సాధిస్తోంది’’ (పే. 268).
కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సాధించిన పురోగతిని సాధిస్తోంది. నెహ్రూ హయాంలోనే కంప్యూటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సూపర్ కంప్యూటర్ 6600 కూడా తయారైంది. మోడీ ప్రభుత్వం కూడా ఈ దిశగా కొన్ని చర్యలు తీసుకున్నా అవి అసమగ్రంగానూ, అసంపూర్ణంగానూ ఉన్నట్లు రచయితకు అనిపిస్తోంది. (చివరి భాగం రేపు)