
ప్రభుత్వరంగ కళాశాలలుగా ప్రారంభమైన తర్వాత వాటిని ప్రైవేట్ చేతుల్లో పెట్టిన సందర్భలు దేశవ్యాప్తంగా ఎక్కడా లేవు. ఇలా ఒకేసారి పది కళాశాలలను పీపీపీ మోడల్లోకి మార్చడాన్ని చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారి ప్రయత్నిస్తోంది. దీని మీద స్పందించిన ప్రతిపక్ష వైసీపీ ఈ నిర్ణయం చాలా ప్రమాదకరమైనదని, దీని ఫలితాలు రాష్ట్ర వైద్య విద్యా వ్యవస్థకే కాకుండా ఆరోగ్యరంగానికి కూడా తీవ్రంగా పరిణమిస్తాయని హెచ్చరిస్తోంది.
ప్రజా డబ్బుతో నిర్మాణం ప్రారంభమైన పది ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ మేనేజ్మెంట్కు అప్పగిస్తూ, పబ్లిక్– ప్రైవేట్ పార్టనర్షిప్(పీపీపీ) మోడల్లో నడపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల నుంచి వైద్య నిపుణుల వరకు అందరిలోనూ ఈ నిర్ణయం ఆందోళన రేపుతోంది.
ఈ అడుగును- తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రం ఉండడం వల్ల తీసుకోవాల్సిన “ప్రయోజనకరమైన సంస్కరణ”గా అధికారపక్షం పేర్కొంటోంది. ప్రతిపక్ష వైసీపీ మాత్రం దీన్ని “ప్రజల ఆస్తులను ప్రైవేటు చేతుల్లో పెట్టి సామాన్యులకు వైద్య విద్యను, ఆరోగ్య సేవలను అందని ద్రాక్షగా మార్చే ద్రోహాత్మక చర్య”గా విమర్శిస్తోంది.
జగన్ హామీ: ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల..
2019లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తీసుకున్న ముఖ్య నిర్ణయాల్లో ఒకటి ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం. ఆ జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నీ కలిపే ఒక హబ్‌గా పనిచేయాలనే ప్రతిపాదన. 2020 నుంచి 2022 మధ్యలో మొత్తం ఈ మేరకు 17 కొత్త మెడికల్ కళాశాలలకు శంకుస్థాపనలు జరిగాయి.
కరోనా మహమ్మారి కారణంగా జాప్యం జరిగినా 2023 నాటికి ఏడు కళాశాలలు పూర్తయ్యాయి. వీటిలో ఐదు కళాశాలలు విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల 2023–24 విద్యా సంవత్సరంలో విద్యార్థులను చేర్చుకున్నాయి. పాడేరు, పులివెందుల కళాశాలలు కూడా 2024 నాటికి సిద్ధమయ్యాయి. ఈ కాలంలోనే రాష్ట్రానికి 2,550 కొత్త ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి.
గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు ఉన్నప్పటికీ ఒక కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాల కూడా రాలేదని వైసీపీ ఆరోపిస్తోంది. అదే జగన్ ప్రభుత్వం కేవలం రెండేళ్లలో 2024 నాటికి దాదాపు రూ 3,000 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ 8,480 కోట్లుగా అంచనా వేసింది.
చంద్రబాబు తీసుకున్న విరుద్ధ నిర్ణయం..
2024లో చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చాక, జగన్ ప్రభుత్వం ప్రారంభించిన కొత్త మెడికల్ కళాశాలల పనులను సమీక్షించాలని నిర్ణయించారు. ఆ సమీక్ష తర్వాత కొన్ని నెలల్లోనే, పూర్తి కాని కళాశాలల పనులు నిలిపివేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు జారీ అయ్యాయి. 2024 సెప్టెంబర్ 3న కర్నూలు ఏపీఎంఎస్ఐడీసీసీ సూపరింటెండింగ్ ఇంజనీర్ జారీ చేసిన మెమోలో, అదోని, పెనుకొండ మెడికల్ కళాశాలల్లో జరుగుతున్న అన్ని పనులను తక్షణమే ఆపేయాలని స్పష్టమైన సూచనలు ఇచ్చారు.చీఫ్ ఇంజనీర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు ఆ మెమోలో పేర్కొన్నారు.
మెమో ప్రకారం, ఇప్పటికే స్టీల్ ఫాబ్రికేషన్ పూర్తి కాకపోవడం వల్ల పెండింగ్‌లో ఉన్న రూఫ్ స్లాబ్ కాస్టింగ్ పనులు మాత్రమే పూర్తిచేయాలని, మిగతా అన్ని పనులు నిలిపివేయాలని సూచించారు. అలాగే, నిలిచిపోయిన కాలమ్స్‌లో రస్టింగ్(తుప్పు) రాకుండా ఉండేందుకు “ఆంటీ కరప్షన్ పెయింటింగ్” చేయాలని కూడా ఆదేశించారు. ఈ ఆదేశాలతో ఆ కళాశాలల నిర్మాణ పనులు “సేఫ్ స్టేజ్” వద్దే నిలిచిపోయాయి.
పనులు కావాలని ఆపివేయడం, తర్వాత ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లడం ప్రభుత్వ అసలు ఉద్దేశ్యాన్ని బయటపెడుతుందని వైసీపీ విమర్శిస్తోంది. ప్రభుత్వం అక్కడితో ఆగకుండా 2025 సెప్టెంబరులో పది కళాశాలలను ప్రైవేట్ మేనేజ్మెంట్కి అప్పగించాలని నిర్ణయించింది. వీటిలో పులివెందుల, అదోని, మార్కాపురం, అమలాపురం, బాపట్ల, పాలకొల్లు, పర్వతీపురం, నర్సీపట్నం, మదనపల్లె, పెనుకొండ ఉన్నాయి. ఈ నిర్ణయంతో ప్రభుత్వం ప్రారంభమైన మెడికల్ కళాశాలలను పీపీపీ మోడల్లో ప్రైవేట్ చేతుల్లోకి ఇచ్చిన రాష్ట్రంగా నిలిచింది.
ప్రభుత్వం చెప్పే కారణం..
చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూపించి సమర్థిస్తోంది.
“గత కొన్నేళ్లలో ఆంధ్రప్రదేశ్ భారీ అప్పుల్లో కూరుకుపోయింది. ప్రతి సంవత్సరం వడ్డీ చెల్లింపులు, ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాల వ్యయం బడ్జెట్లో చాలా పెద్ద భాగాన్ని ఆక్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం 17 మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నిర్మించి నడపడం అసాధ్యం” అని ముఖ్యమంత్రి వాదిస్తున్నారు.
నిర్మాణ ఖర్చు మాత్రమే కాకుండా, ఒకసారి కళాశాల ప్రారంభమైతే ప్రతి సంవత్సరం జీతాలు, ఆసుపత్రుల నిర్వహణ, బోధన సౌకర్యాలు, పరికరాల సంరక్షణ వంటి ఖర్చులు వందల కోట్లు అవుతాయని, ఇవన్నీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై మరింత భారమవుతాయని ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది. ఇక ఈ వాదనకు తోడు ప్రభుత్వం జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) 2023లో తీసుకొచ్చిన కొత్త నిబంధనలను కూడా ప్రస్తావిస్తోంది.
పాత నిబంధనల ప్రకారం, ఒక మెడికల్ కళాశాల ప్రారంభించడానికి కనీసం 300 పడకల ఆసుపత్రి మూడు సంవత్సరాలు నడవాలి, కనీసం 20 ఎకరాల భూమి ఉండాలి. కానీ ఇప్పుడు ఈ షరతులు పూర్తిగా సడలించబడ్డాయి.
కొత్త నిబంధనల ప్రకారం, కేవలం 220 పడకల ఆసుపత్రి ఉంటే 50 ఎంబీబీఎస్ సీట్లు పొందవచ్చు. 420 పడకలుంటే 100 సీట్లు, 605 పడకలుంటే 150 సీట్లు అనుమతిస్తారు. అలాగే భూమి అవసరం షరతు పూర్తిగా తొలగించబడింది. ఫ్యాకల్టీ నియామకాల విషయంలో కూడా పెద్ద సడలింపులు ఇచ్చారు.
ముందు “ఒక విద్యార్థికి ఒక ఫ్యాకల్టీ తప్పనిసరి కాగా, ఇప్పుడు 100 సీట్లకు 85 ఫ్యాకల్టీ చాలు, 50 సీట్లకు 59 ఫ్యాకల్టీ చాలు” అని కొత్త మార్గదర్శకాలు చెబుతున్నాయి. ఈ సడలింపులు ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి అనువుగా మారాయని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే నిర్మాణం ఆగిపోయిన కళాశాలలను పూర్తి చేయడానికి, పరికరాలు తెచ్చుకోవడానికి, సిబ్బంది నియామకాల కోసం ప్రైవేట్ మేనేజ్మెంట్ ముందుకు వస్తే, రాష్ట్రానికి ఆర్థిక భారం తక్కువ అవుతుందని నాయుడు వాదిస్తున్నారు.
పీపీపీ మోడల్ అనేది పూర్తిస్థాయి ప్రైవేటీకరణ కాదని, ప్రభుత్వం పర్యవేక్షణ కొనసాగుతుందని, భూమి, భవనాలు ప్రభుత్వ సొత్తుగానే ఉంటాయని ఆయన చెబుతున్నారు. అయితే నిర్వహణ, పెట్టుబడులు, సదుపాయాల అభివృద్ధి బాధ్యత ప్రైవేట్ సంస్థలు తీసుకుంటాయని స్పష్టంగా చెబుతున్నారు చంద్రబాబు.
ప్రతిపక్ష వైసీపీ ఆరోపణ..
వైసీపీ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ “ప్రజల ఆస్తులు ప్రైవేటు చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. ఇది ప్రజల విశ్వాసానికి ద్రోహం” అని ఆరోపిస్తోంది. ప్రభుత్వమే నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాలలను ప్రైవేట్ మేనేజ్మెంట్కు అప్పగించిన ఉదాహరణ దేశంలో ఎక్కడా లేదని, ఉత్తరాఖండ్‌లో హరిద్వార్ మెడికల్ కళాశాల, గోవాలో జిల్లా ఆసుపత్రిని పీపీపీ మోడల్లోకి మార్చే ప్రయత్నాలు ప్రజల నిరసనలతో విఫలమయ్యాయని ఉదాహరణలు ప్రస్తావిస్తోంది.
విద్యార్థులపై ఆర్థిక భారం పడుతుందని, జగన్ హయాంలో కొత్త కళాశాలల్లో ఎన్ఆర్ఐ కోటా ఫీజు రూ 20 లక్షలుగా ఉండగా, ప్రస్తుత ప్రభుత్వం దాన్ని రూ 37.5 లక్షలకు పెంచిందని, ఇలాగే ఇతర చార్జీలు కూడా పెరిగే అవకాశం ఉందని, ఇది మధ్యతరగతి, పేద విద్యార్థులకు మెడికల్ విద్యను అందని ద్రాక్షగా మారుస్తుందని వైసీపీ చెబుతోంది.
ఇప్పటికే వేలాది మంది విద్యార్థులు సీట్లు లేక లేదా ఫీజులు ఎక్కువ కావడంతో ఉక్రెయిన్, జార్జియా, ఫిలిప్పీన్స్‌లకు వెళ్లి చదువుతున్నారని, ఇప్పుడు ప్రభుత్వ కళాశాలలే ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తే ఈ పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరిస్తోంది. అలాగే ఈ కళాశాలలకు అనుబంధ ఆసుపత్రుల్లో చికిత్స ఖర్చులు భారీగా పెరిగి పేదలకు అందని స్థితి వస్తుందని, ప్రజా డబ్బుతో సేకరించిన భూములు, నిర్మించిన భవనాలు అన్నీ ప్రైవేటు చేతుల్లోకి వెళ్తున్నాయని, దీని వెనుక కార్పొరేట్ ప్రయోజనాలు ఉన్నాయని వైసీపీ ఆరోపిస్తోంది.
ఇతర రాష్ట్రాల అనుభవం..
ఇతర రాష్ట్రాల అనుభవం చూస్తే ఆంధ్రప్రదేశ్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంత వివాదాస్పదమో స్పష్టమవుతుంది. గోవాలో జిల్లా ఆసుపత్రిని ప్రైవేట్ మేనేజ్మెంట్కు అప్పగించి మెడికల్ కళాశాలగా మార్చాలని ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ ప్రణాళికను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అలాగే ఉత్తరాఖండ్‌లో 2023లో హరిద్వార్‌లోని కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాలను పీపీపీ మోడల్లోకి మార్చాలని నిర్ణయించగా విద్యార్థులు, స్థానిక ప్రజలు విపరీతంగా నిరసించడంతో చివరికి ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని రద్దు చేసింది. కర్ణాటకలో విజయపురలో కొత్త మెడికల్ కళాశాలను పీపీపీ మోడల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినా, అక్కడ కూడా బలమైన ప్రతిఘటనతో అది ప్రారంభ దశలోనే ఆగిపోయింది.
మరోవైపు ప్రభుత్వ వైద్య విద్యా రంగంలో ముందున్న తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా ప్రైవేట్ చేతుల్లోకి ఇవ్వలేదు. పొరుగు రాష్ట్రం తెలంగాణ కూడా గత ఐదేళ్లలో పూర్తిగా కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాలలే ప్రారంభించింది. కానీ ప్రైవేట్ భాగస్వామ్యం తీసుకురాలేదు. గుజరాత్లో కొన్నింటి ఆసుపత్రులు పీపీపీ మోడల్లో నడుస్తున్నా, ప్రభుత్వం స్థాపించిన మెడికల్ కళాశాలలు మాత్రం ఎప్పుడూ ప్రైవేట్ మేనేజ్మెంట్కు అప్పగించబడలేదు.
ఈ ఉదాహరణలు ప్రభుత్వరంగ కళాశాలలుగా ప్రారంభమైన తర్వాత వాటిని ప్రైవేట్ చేతుల్లో పెట్టిన సందర్భలు దేశవ్యాప్తంగా ఎక్కడా లేవు. ఇలా ఒకేసారి పది కళాశాలలను పీపీపీ మోడల్లోకి మార్చడాన్ని చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారి ప్రయత్నిస్తోంది. దీని మీద స్పందించిన ప్రతిపక్ష వైసీపీ ఈ నిర్ణయం చాలా ప్రమాదకరమైనదని, దీని ఫలితాలు రాష్ట్ర వైద్య విద్యా వ్యవస్థకే కాకుండా ఆరోగ్యరంగానికి కూడా తీవ్రంగా పరిణమిస్తాయని హెచ్చరిస్తోంది.
విద్యార్థుల ఆందోళన..
ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ చదవాలనుకునే విద్యార్థులకు ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితి తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వ మెడికల్ సీట్లు పరిమితంగా ఉన్నాయి. దీంతో ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, జార్జియా, రష్యా, చైనా వంటి దేశాలకు వెళ్లి ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఈ పరిస్థితి కుటుంబాలకు భారీ ఆర్థిక భారం మోపుతోంది. విద్యార్థులు అనుకోని సమస్యలు, యుద్ధాలు, అనిశ్చిత పరిస్థితుల్లో చిక్కుకుంటున్నారు.
ఇప్పటివరకు ప్రజలకు కొంత భరోసా కలిగించిన కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కూడా ప్రైవేట్ మేనేజ్మెంట్కి వెళ్ళి ఫీజులు పెరిగితే, ఈ “విద్యార్థుల వలస” మరింత పెరిగి ఆంధ్రప్రదేశ్ నుంచి వైద్య విద్య కోసం బయలుదేరే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇప్పటికే కొన్ని కళాశాలలో ఎన్ఆర్ఐ కోటా ఫీజులు రూ 20 లక్షల నుంచి రూ 37.5 లక్షలకు పెరిగిన దృష్ట్యా, భవిష్యత్తులో మధ్య తరగతి, బీద కుటుంబాల పిల్లలు మెడికల్ సీటు కలను నెరవేర్చుకోలేని పరిస్థితి రావచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ క్రమంలో విద్యార్థి సంఘాలు ముందుకొచ్చి, ఫీజులపై కఠిన నియంత్రణ, అడ్మిషన్లలో పూర్తి పారదర్శకత, ప్రైవేట్ మేనేజ్మెంట్ వల్ల విద్య నాణ్యత తగ్గిపోకుండా పర్యవేక్షణ తప్పనిసరి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. లేకపోతే ప్రైవేట్ సంస్థలు లాభాల కోసం నాణ్యతను పక్కన పెట్టే ప్రమాదం ఉందని విద్యార్థి సంఘాలు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
ఆరోగ్య సేవలపై ప్రభావం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ ప్రైవేటీకరణ నిర్ణయం రాష్ట్ర ఆరోగ్య సేవలపై కూడా గణనీయమైన ప్రభావం చూపవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రతి జిల్లా మెడికల్ కళాశాల ఒక “హబ్ ఆసుపత్రి”లా పనిచేసి ఆ జిల్లాలోని జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అనుసంధానించి ఒక సమగ్ర ఆరోగ్య సేవల వ్యవస్థను ఏర్పరచాలని గతంలో వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే సాధారణ ప్రజలకు కూడా ఆధునిక సూపర్-స్పెషాలిటీ చికిత్సలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండేది.
ప్రస్తుతం ఈ కళాశాలలు ప్రైవేట్ మేనేజ్‌మెంట్‌లోకి వెళ్ళిన తర్వాత అక్కడి ఆసుపత్రులు అధిక ఫీజులు, ఖరీదైన చికిత్సలు మాత్రమే అందించే కేంద్రాలుగా మారిపోతే, పేదలు, మధ్య తరగతి ప్రజలు వాటిని చేరుకోలేని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఫలితంగా వారు మళ్లీ తక్కువ సౌకర్యాలు కలిగిన ప్రభుత్వ ప్రాథమిక కేంద్రాలు లేదా ఖరీదైన ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులపై ఆధారపడాల్సి వస్తుంది. దీనివల్ల ఆరోగ్య సేవలలో సమానత్వం దెబ్బతిని, ఆరోగ్య అసమానతలు మరింతగా పెరిగే ప్రమాదం ఉందని విమర్శకులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రయోగం విజయవంతమైతే రాష్ట్రానికి ఒక కొత్త మోడల్ అవుతుంది. విఫలమైతే ఇది ఆరోగ్యరంగంలో అసమానతలను మరింత పెంచి దేశవ్యాప్తంగా పీపీపీ మోడల్‌పై అనుమానాలు రేకెత్తించే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రయోగం ఫలితం కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా దేశ ఆరోగ్య విధానాల దిశకు కూడా ఒక సూచనగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.