ఒకప్పుడు సమాజానికి సినిమా అద్దం పట్టేది. మనుషుల మధ్య సంబంధాలను, మానవత్వాన్ని, సామాజిక బాధ్యతను పెంపొందించే ఒక అద్భుత కళాఖండం. కార్మిక లోకం కష్టాలను కళ్లకు కట్టినా, మహిళా హక్కుల కోసం గళమెత్తినా అది వెండితెరకే సాధ్యమైంది.
సగటు మనిషిలో స్ఫూర్తిని నింపిన ఆనాటి సినిమా- నేటి డిజిటల్ యుగంలో తన దిశను, దశను పూర్తిగా మార్చుకుంది.
వ్యాపార దాహానికి, రాజకీయ లబ్ధికి కళ బలిపశువుగా మారుతున్న తీరు ఇప్పుడు మేధావి వర్గాన్ని, సామాజిక శాస్త్రవేత్తలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
సినిమా.. రాజకీయ అస్త్రం..
కళకు ఎజెండా తోడైతే అది ఎంత ప్రమాదకరమో నేటి రాజకీయ ప్రేరేపిత చిత్రాలే నిదర్శనం. ఒకప్పుడు రాజకీయ నాయకులు తమ ప్రచారాన్ని సభలకే పరిమితం చేసేవారు. కానీ ఇప్పుడు, కోట్ల మంది ప్రేక్షకుల మెదళ్లలోకి తమ సిద్ధాంతాలను చొప్పించడానికి సినిమాను ఒక బ్రహ్మాస్త్రంలా వాడుతున్నారు.
ఎన్నికల్లో లబ్ధి కోసం, ప్రత్యర్థులను కించపరచడం కోసం, ఒక వర్గాన్ని దోషులుగా మరో వర్గాన్ని దేశభక్తులుగా చిత్రీకరిస్తూ సెన్సేషన్ సృష్టిస్తున్నారు.
సున్నితమైన ఆర్మీ ఆపరేషన్స్, స్వాతంత్ర్య పోరాటాల నేపథ్యంతో వచ్చే సినిమాల్లో వాస్తవాలను వక్రీకరించి, కల్పితాలను చరిత్రగా భ్రమింపజేస్తున్నారు.
దేశభక్తి ముసుగులో విద్వేషాలను రగులుస్తూ, యువ భారతం ఆలోచనలను కలుషితం చేస్తున్నారు. ఇది సమాజంలో ఉన్న ఐక్యతను దెబ్బతీసే అత్యంత ప్రమాదకరమైన వెండితెర క్రీడ.
బాక్సాఫీస్ దగ్గర రక్తపాతం..
ఇక కమర్షియల్ సినిమాల విషయానికొస్తే- కత్తులు, తుపాకులు, తెగిన తలలు లేకపోతే సినిమా ఆడదు అనే దుస్థితికి ఇండస్ట్రీ చేరుకుంది.
కిల్లర్, దురంధర్, కేజీఎఫ్, సలార్ వంటి చిత్రాలు సాంకేతికంగా అద్భుతమైనవే కావచ్చు, కానీ అవి సమాజానికి ఇస్తున్న సందేశం ఏంటి? చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకునే ఒక అరాచక శక్తిని హీరోగా ఆరాధించే పరిస్థితికి ప్రేక్షకులను తీసుకొచ్చాయి.
తెరపై రక్తం ఎంతలా ఏరులై పారితే బాక్సాఫీస్ వద్ద కాసులు అంతలా కురుస్తాయనే ఒక వికృతమైన ట్రెండ్ నడుస్తోంది.
హీరోయిజం అంటే పది మందిని రక్షించడం కాదు, వంద మందిని అతి కిరాతకంగా నరకడం అనే నిర్వచనం స్థిరపడిపోయింది. దీనివల్ల సమాజంలో సున్నితత్వం చచ్చిపోయి, క్రూరత్వం అనేది అత్యంత సాధారణ విషయంగా మారుతోంది.
కనుమరుగవుతున్న కుటుంబ వినోదం..
సినిమా థియేటర్‌కు వెళ్లి కుటుంబంతో పాటు రెండున్నర గంటల పాటు కడుపుబ్బా నవ్వుకుని, మనసు తేలిక పరుచుకునే రోజులు కనుమరుగవుతున్నాయి.
అడపాదడపా ఆహ్లాదకరమైన కామెడీ చిత్రాలు వస్తున్నా- థియేటర్లలో వాటికి దక్కుతున్న ఆదరణ శూన్యం.
“పాన్ ఇండియా యాక్షన్” అనే భ్రమల్లో పడిన ప్రేక్షకులు, చిన్న సినిమాలను, క్లీన్ ఎంటర్టైనర్లను ఓటీటీలకే పరిమితం చేస్తున్నారు.
స్క్రీన్ మీద భారీ విస్ఫోటనాలు, చెవిటివాళ్లను చేసే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉంటేనే అది థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనే తప్పుడు అభిప్రాయం బలపడింది.
ఈ పరిణామం సినీ నిర్మాతలను సైతం భయపెట్టి, బతికి బట్టకట్టాలంటే రక్తపాతం సృష్టించాల్సిందే అన్న ఒత్తిడికి గురిచేస్తోంది.
యువత మెదళ్లపై విష ప్రభావం..
ఒకవైపు రాజకీయ లబ్ధి కోసం చరిత్రను వక్రీకరిస్తూ విషం చిమ్ముతున్న ప్రచార చిత్రాలు, మరోవైపు రక్తపుటేరులు పారిస్తున్న హింసాత్మక చిత్రాలు, ఈ రెండు సెగ్మెంట్లు నేరుగా యువత మెదళ్లపైనే దాడి చేస్తున్నాయి.
ఒక పక్క తప్పుడు చరిత్రతో బ్రెయిన్‌వాష్‌కు గురవుతూ యువతలో అసహనం పెరుగుతోంది. మరోపక్క హింసను చూసి చప్పట్లు కొడుతూ, నిజజీవితంలో చిన్న చిన్న కారణాలకే అగ్రెసివ్‌గా ప్రవర్తిస్తున్నారు.
డిప్రెషన్, యాంగ్జైటీలాంటి మానసిక సమస్యలకు ఇలాంటి డార్క్ సినిమాలు పరోక్షంగా కారణమవుతున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
మార్పు ప్రేక్షకుల నుంచే మొదలవ్వాలి..
సినిమా అనేది కోట్లాది మందిని ఏకకాలంలో ప్రభావితం చేయగల అత్యంత శక్తివంతమైన మాధ్యమం. దానిని విద్వేషాలు రెచ్చగొట్టడానికి, హింసను ప్రేరేపించడానికి వాడటం జాతి భవిష్యత్తుకే ప్రమాదకరం.
అటువంటి సినిమాలను నిలువరించే శక్తి సెన్సార్ బోర్డులకు లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు బంతి ప్రేక్షకుల కోర్టులోనే ఉంది. మనం ఎలాంటి సినిమాలను ఆదరిస్తే, ఫిల్మ్‌మేకర్స్ అలాంటి సినిమాలనే తీస్తారు.
విషాన్ని వినోదంగా అమ్ముతున్న ఈ వ్యాపారాన్ని మనం విచక్షణతో తిరస్కరించకపోతే- రాబోయే తరాలకు మనం ఒక హింసాత్మక, విద్వేషపూరిత సమాజాన్నే వారసత్వంగా ఇవ్వాల్సి వస్తుంది.
సినిమా మళ్లీ ఒక ఆరోగ్యకరమైన కళగా ఊపిరి పీల్చుకోవాలంటే- ప్రేక్షకుల ఆలోచనా విధానంలో మార్పు రావాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
