
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలతో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. మాజీ ఐఏఎస్ అధికారి, ‘లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ’ వ్యవస్థాపక అధ్యక్షులు జీఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.
విజయ్ కుమార్ తన పిటిషన్లో కీలకమైన ఆరోపణలు చేశారు. తాను నటించిన “హరి హర వీరమల్లు” సినిమా కోసం ప్రభుత్వ యంత్రాంగం, అధికార వనరులను పవన్ కళ్యాణ్ ఉపయోగించుకున్నారని ఆయన తెలియజేశారు. ప్రజాధనాన్ని, రాజ్యాంగ పదవిని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకోవడం ఇది స్పష్టంగా చూపిస్తుందని పిటిషన్లో పేర్కొన్నారు. సినిమా నిర్మాణం, ప్రమోషన్, విడుదలలో ప్రభుత్వ పరంగా అసాధారణమైన మద్దతు లభించిందని, ఇది అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని పిటిషన్లో చెప్పుకొచ్చారు.
టికెట్ రేట్ల పెంపు వెనుక అసలు కథ..
విజయ్ కుమార్ ఆరోపణలలో అత్యంత కీలకమైనది టికెట్ రేట్ల పెంపు వివాదం.
2025 జూలై 24న “హరి హర వీరమల్లు” సినిమా విడుదలైంది. ఈ సినిమా కోసం రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక రోజు లేదా రెండు రోజులు కాకుండా, ఏకంగా 10 రోజుల పాటు టికెట్ల ధరలను భారీగా పెంచుకోవడానికి అనుమతినిస్తూ అసాధారణమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఒక సాధారణ సినిమాకు ఎన్నడూ జరగని విషయం.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో టికెట్ల ధరలు ఆకాశాన్నంటాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సాధారణ ధరలకు అదనంగా రరూ 100 నుంచి రూ 150 వరకు పెంచుకోవడానికి అనుమతి లభించింది. అదే మల్టీప్లెక్స్‌లలో అయితే టికెట్‌కు అదనంగా రూ 200 పెంపును ప్రభుత్వం అనుమతించింది. అంతేకాదు, ప్రీమియర్ షోల కోసం ఏకంగా రూ 600 ప్లస్ జీఎస్టీ ధరలను నిర్ణయించడం విశేషం. విశాఖపట్నం వంటి నగరాలలో ఈ ధరలు రూ 700 వరకు చేరాయని పిటిషన్లో విజయ్ కుమార్ ప్రస్తావించారు.
ఒక సాధారణ ప్రైవేట్ సినిమా కోసం ఇలాంటి నిర్ణయాలు ప్రభుత్వం ఎందుకు తీసుకుంది? దీని వెనుక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష జోక్యం లేదా ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రభావితం చేయడమే కారణమని విజయ్ కుమార్ తన పిటిషన్లో నొక్కి చెప్పారు. ఈ చర్యను “పదవిని వ్యక్తిగత లాభాని”కి వాడుకోవడంగా ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.
ప్రభుత్వ కార్యక్రమం సినిమా హాల్లోనా?
ఈ వివాదం టికెట్ రేట్ల పెంపుతోనే ఆగలేదు. సినిమా విడుదలైన తర్వాత “మన ఊరు- మన మంత్రి” అనే అధికారిక ప్రభుత్వ కార్యక్రమాన్ని శ్రీకాకుళంలోని ఒక సినిమా థియేటర్లో నిర్వహించారని పిటిషన్లో ప్రస్తావించారు. ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం ఒక వాణిజ్యపరమైన కార్యక్రమం మధ్య ఉన్న తేడాను పూర్తిగా చెరిపేసిందని విజయ్ కుమార్ ఆరోపించారు.
ప్రభుత్వ ఖర్చుతో, అధికారిక సిబ్బందిని ఉపయోగించుకొని సినిమా ప్రమోషన్ చేయడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని ఆయన తెలియజేశారు.
అంతేకాకుండా సినిమా ప్రమోషన్, ఈవెంట్ల కోసం ప్రభుత్వ వాహనాలు, సిబ్బంది, భద్రతా సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి స్థాయిలో వాడుకున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఒక ప్రజాప్రతినిధి తన హోదాను ఇలా ఉపయోగించుకోవడం రాజ్యాంగ విరుద్ధమని, ఇది నైతిక విలువల ఉల్లంఘన అని విజయ్ కుమార్ అన్నారు. ఇది సమాజానికి తప్పుడు సంకేతాలు పంపుతుందని, రాజకీయాల్లో కొత్తగా వచ్చే వారికి ఇది తప్పుడు ఉదాహరణ అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్..
ఈ పిటిషన్ కేవలం రాజకీయ ఆరోపణలు మాత్రమే కాదు, దీనికి బలమైన న్యాయపరమైన ఆధారాలు ఉన్నాయని విజయ్ కుమార్ పేర్కొన్నారు. మంత్రుల కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం, ఒక మంత్రి తన పదవిలో ఉన్నంతకాలం ఏ వ్యాపారం లేదా వాణిజ్యపరమైన కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొనకూడదు. కానీ పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా ప్రభుత్వ పదవిలో ఉంటూనే, మరోవైపు ‘పీకే క్రియేటివ్ వర్క్స్’ వంటి ప్రైవేట్ సంస్థల్లో, సినిమాల్లో చురుకుగా ఉన్నారని పిటిషన్లో పేర్కొన్నారు. దీన్ని ఆయన ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్’గా అభివర్ణించారు.
ఒకవైపు ప్రజాసేవ, మరోవైపు వ్యక్తిగత వ్యాపారం- ఈ రెండూ ఒకే వ్యక్తిలో ఉండటం నైతికంగా, చట్టపరంగా తప్పు అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ చర్యలు ‘ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్- 1988’లోని సెక్షన్లు 7, 11, 13 కింద క్రిమినల్ మిస్కండక్ట్గా పరిగణించబడతాయని పిటిషన్లో స్పష్టం చేశారు. ఈ చట్టాలు ప్రజా సేవకులు తమ అధికారిక పదవిని దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవడానికి ఉద్దేశించినవి. ఒక మంత్రిపై ఈ సెక్షన్ల కింద ఆరోపణలు రావడం అత్యంత అరుదైన విషయం.
సినిమా వసూళ్లు, నిర్మాత వాదన..
ఈ వివాదాల మధ్య “హరి హర వీరమల్లు” సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్‌ను సాధించింది. జూలై 24న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు దేశవ్యాప్తంగా రూ 44.2 కోట్లు వసూలు చేసింది. ప్రీమియర్ షోలతో కలిపి మొదటి రోజు వసూళ్లు రూ 57 కోట్లు దాటాయి. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్గా రికార్డు సృష్టించింది. సినిమా టికెట్ల ధరల పెంపును సమర్థిస్తూ నిర్మాత ఏఎం రత్నం మీడియాతో మాట్లాడారు. “వందల కోట్ల ఖర్చుతో నిర్మించిన సినిమాకు సాధారణ రేటు పెట్టడం సాధ్యం కాదు. పెట్టిన పెట్టుబడి తిరిగి రాబట్టడానికి ఇలాంటి పెంపు అవసరం” అని ఆయన అన్నారు.
చరిత్ర పునరావృతం..
పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న ఈ న్యాయపరమైన సవాలు భారత రాజకీయ చరిత్రలో కొత్తది కాదు. మూడు దశాబ్దాల క్రితం, ఇదే ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి, సినీ నటుడు ఎన్టీ రామారావు కూడా ఇలాంటి వివాదాన్నే ఎదుర్కొన్నారు. 1989లో విడదల హరినాథబాబు వర్సెస్ ఎన్టీ రామారావు అనే కేసులో, ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ సినిమాలు నిర్మించారని, ఆ వసూళ్లను ఎన్టీఆర్ ట్రస్ట్‌కు మళ్లించి తన కుటుంబ, రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారని పిటిషన్ వేశారు.
ముఖ్యమంత్రి హోదాలో ఉండగానే ఎన్టీఆర్ “బ్రహ్మర్షి విశ్వామిత్ర” అనే చిత్రాన్ని నిర్మించి, అందులో నటించారు. అప్పట్లో దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే, అప్పటి చట్టాల్లో “ముఖ్యమంత్రి సినిమాల్లో నటించరాదు” అనే స్పష్టమైన నిబంధన లేకపోవడం వల్ల కోర్టు ఆయనను పదవి నుంచి తొలగించలేదు. ఎన్టీఆర్ తన వాదనలో “ఇది ఒక ఐడియాలాజికల్ సినిమా, దీని వసూళ్లు ట్రస్ట్‌కు వెళ్తాయి. అంతేకాకుండా నా సినిమా కార్యకలాపాలు ప్రభుత్వ పనులకు ఎలాంటి అడ్డంకులు కలిగించలేదు” అని అన్నారు.
కోర్టు ముందున్న ప్రశ్నలు..
హైకోర్టులో ఈ పిటిషన్ విచారణకు రాగా, న్యాయమూర్తి వెంకట జ్యోతిర్మయి ప్రతాప ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ), కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)లను కూడా ప్రతివాదులుగా చేర్చాలని ఆదేశించారు.
అయితే, నోటీసులు జారీ చేయడంపై తుది నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఇది ఈ కేసు ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. దీనిపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం కష్టమని న్యాయస్థానం భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
విజయ్ కుమార్ తన పిటిషన్లో మరో కీలకమైన డిమాండ్‌ను కోర్టు ముందుంచారు. పవన్ కళ్యాణ్ తన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నంతకాలం సినిమాల్లో నటించకుండా, వాటి నిర్మాణంలో, ప్రచారంలో పాల్గొనకుండా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. ఒకవేళ కోర్టు ఈ అభ్యర్థనను ఆమోదిస్తే, పవన్ కళ్యాణ్ సినీ కెరీర్‌పై ఇది తీవ్ర ప్రభావాన్న చూపిస్తుంది.
రాజకీయాల కోసం సినిమాలు వదులుకోవాల్సి వస్తుందా అనే ప్రశ్న ప్రస్తుతం ఆయన అభిమానులను, రాజకీయ వర్గాలను కలవరపెడుతోంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.