
తెలంగాణాలో ముఖ్యంగా హైదరాబాద్- సికింద్రాబాద్ జంట నగరాలలో ప్రజలు ప్రజారవాణా కంటే వ్యక్తిగత రవాణాకు ప్రాధాన్యతనిస్తున్నారు. దీనికి తార్కాణంగా, గడిచిన ఒకటిన్నర దశాబ్దకాలంలో వ్యక్తిగత రవాణా సౌకర్యాలు విపరీతంగా పెరిగాయి. దీంతో ప్రజారవాణా వ్యవస్థ వినియోగం బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 1,77 కోట్ల రిజిస్టర్ వాహనాలు ఉన్నాయి. ఇందులో ద్విచక్రవాహనాల, కారుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇవేకాకుండా, ప్రతీ ఏట కొత్తగా సుమారు 9.3 లక్షల వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయి.
హైదరాబాద్లో రోడ్ల దుస్థితి, రోడ్ల ప్రమాదాలు, వాహనాల విషయంలో భవిష్యత్తు మాస్టర్ ప్లాన్ కోసం ఇటీవల హెచ్ఎండీఏ ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. దీంతోపాటు సుప్రీంకోర్టు రోడ్డు భద్రతపై న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ కొద్దిరోజుల క్రితం రోడ్డు భద్రతపై రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించింది.
హెచ్ఎండీఏ అధ్యయనం, సుప్రీంకోర్టు కమిటీ సమావేశంలో- రోడ్డు భద్రతా, ప్రజా రవాణా సౌకర్యం, వ్యక్తిగత రవాణా విషయంలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
నగరంలో బస్సులు, ద్విచక్రవాహనాలు, కార్లువంటి రవాణా సౌకర్యలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 1,40,000 ఆటోలు రిజిస్టర్ కాగా, ఇతర జిల్లాల్లో రిజిస్టర్ చేసుకొని హైదరాబాద్లో తిరుగుతున్న మరో లక్ష ఆటోలు ప్రజలకు రవాణా సౌకర్యాన్ని అందిస్తున్నాయి.
అంతేకాకుండా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ హైదరాబాదుతో సహా తెలంగాణ వ్యాప్తంగా సుమారు 9,100 బస్సులను నడుపుతోంది. వీటిలో 6,368 ఆర్టీసీ బస్సులు కాగా, మిగితా 2,726 అద్దె బస్సులు ఉన్నాయి. ఈ బస్సులను ఆర్టీసీ 11 రీజన్లలో నడుపుతోంది. అయితే, ఆర్టీసీ సేవల వినియోగాన్ని ప్రజలు క్రమంగా తగ్గించుకుంటున్నారు. 2011లో 42శాతం మంది ప్రజలు ఆర్టీసీ బస్సులలో ప్రయాణించగా, 2016 నాటికి వారి సంఖ్య 33 శాతానికి తగ్గిపోయింది. అదేవిధంగా 2024 నాటికి 25శాతానికి పడిపోయింది.
పెరిగిన ద్విచక్ర వాహనాల వినియోగం..
తెలంగాణలో గత ఏడాది 25,0986 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అందులో 7,949 మరణాలు సంభవించాయి. ఇక హెచ్ఎండీఏ అధ్యాయాన్ని పరిశీలిస్తే, తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ప్రజలు ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించడాన్ని బాగా తగ్గించేశారు. గడిచిన ఒకటిన్నర దశాబ్దకాలంగా 2011 నుంచి 2024 వరకు ఆర్టీసీ సేవలను ప్రజలు బాగా తగ్గించుకున్నారు. 2011లో ఆర్టీసీ 40శాతం జనాభాకు సేవలందిచగా, 2016నాటికి ఈ సంఖ్య 33శాతానికి తగ్గిపోయింది. ఇది 2024 వచ్చేసరికి ఆర్టీసీ సేవలు 25శాతానికి పడిపోయాయి.
ఆర్టీసీ బస్సుల రోజువారి ట్రిప్పులు 2011లో 37.6 లక్షలు ఉండగా, 2024 వచ్చేసరికి ఈ సంఖ్య 38 లక్ష ట్రిప్పులకు పెరిగింది. 2016లో రోజు వారి వ్యక్తుల ట్రిప్పులు కొంతవరకు తగ్గిపోయాయి. కానీ, 2024 వచ్చేసరికి వ్యక్తిగత ట్రిప్ కొంతవరకు పెరిగింది. దీనికి మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం ప్రధాన కారణమని చెప్పవచ్చు.
ఇక కార్ల వినియోగాన్ని పరిశీలిస్తే, నగరంలో 2025 సెప్టెంబర్ 1 నాటికి 16 లక్షల కార్లు ఉన్నాయి. 2011లో 4 లక్షల వ్యక్తిగత ట్రిప్ రోజు వారి ఉండగా, ఈ సంఖ్య 2024 నాటికి 24.3లక్షల రోజువారి వ్యక్తిగత ట్రిప్ పెరిగింది. నగర రవాణా వ్యవస్థలో కార్ల శాతం 2011 నాటికి 4%, 2016లో 7%, 2024లో 16% పెరిగింది.
హైదరాబాదులో ద్విచక్ర వాహనాల వినియోగం బాగా పెరిగింది. ప్రస్తుతం నగరంలో 63 లక్షల ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. రవాణా వ్యవస్థలో వాటి శాతం 2011లో 38%, 2016లో 47%, 2024లో 45%గా ఉంది.
ఆటోలలో ప్రయాణించే ప్రజల సంఖ్య కూడా బాగా తగ్గిపోతుంది. ప్రజలు ఆటోలలో ప్రయాణించడం 2011లో 7% ఉండగా, 2024 వచ్చేసరికి అది 5 శాతానికి పడిపోయింది. ఎంఎంటీఎస్ ద్వారా నెలకు కేవలం 30 వేల మంది మాత్రమే ప్రయాణిస్తున్నారు.
మొదటిసారిగా నిజాం స్టేట్లో ప్రజా రోడ్డు రవాణా వ్యవస్థకు 1932లో పునాదులు పడ్డాయి. నిజాం స్టేట్ రైల్వేలో ఒక భాగంగా నిజాం రాష్ట్ర రైల్వే అండ్ రోడ్ రవాణా డిపార్ట్మెంట్ను ప్రారంభించారు. నిజాం నవాబు పరిపాలన కాలంలో కేవలం 27 బస్సులు 166 మంది సిబ్బందితో ఆర్టీసీ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఎన్నో కష్టనష్టాలను భరిస్తూ, తనకంటూ సొంత ఆస్తులను సృష్టించుకుంది.
ఆనాడు నిజాం రాజ్య ప్రజలకు ఆర్టీసి సేవలందించింది. ప్రస్తుతం తెలంగాణ ప్రజలకు సేవలందిస్తుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, సామాన్య ప్రజల అవసరాలను తీర్చడానికి ఆధునిక సౌకర్యాలతో సేవలందించినప్పుడే ఆర్టీసీ మనుగడ సాధించగలదు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.