రాజ్యాంగపరమైన ఉన్నత పదవులు నిర్వహిస్తున్న వ్యక్తులు మతం, కులం లేదా ప్రాంతం ఆధారంగా ఏ సమాజాన్ని లక్ష్యంగా చేసుకోకూడదు: సుప్రీంకోర్టు
రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రమాణం చేసిన మంత్రులలాంటి ఉన్నత రాజ్యాంగ పదవులు నిర్వహిస్తున్న ప్రముఖులు మతం, కులం, భాష లేదా ప్రాంతం ఆధారంగా ఏ సమాజాన్ని లక్ష్యంగా చేసుకోకూడదని, ఇది రాజ్యాంగబద్ధంగా తప్పు అని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది.
న్యూఢిల్లీ: ప్రసంగాలు, మీమ్స్, కార్టూన్లు లేదా దృశ్య కళల ద్వారా ఏదైనా సమాజాన్ని రాష్ట్ర ప్రతినిధి లేదా ప్రభుత్వేతర సంస్థ అయినా కించపరచడం లేదా అవమానించడం భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు పేర్కొంది.
లైవ్ లా కథనం ప్రకారం, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రమాణం చేసిన మంత్రులు, ఉన్నత రాజ్యాంగ పదవులు నిర్వహిస్తున్న ప్రముఖులు మతం, కులం, భాష లేదా ప్రాంతం ఆధారంగా ఏ సమాజాన్ని లక్ష్యంగా చేసుకోలేరని, ఎందుకంటే అది రాజ్యాంగబద్ధంగా తప్పు అవుతుందని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది.
‘ఘూస్ఖోర్ పండిట్’ సినిమా టైటిల్ వివాదం
‘ఘూస్ఖోర్ పండిట్'(లంచగొండి పండితుడు) చిత్రాన్ని ఓటీటీ(ఓటీటీ) ప్లాట్ఫామ్లో ప్రసారం చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఒక ప్రత్యేక తీర్పులో ఈ వ్యాఖ్య చేశారు.
చిత్రనిర్మాతలు టైటిల్ మార్చడానికి అంగీకరించడంతో న్యాయమూర్తులు బీవీ నాగరత్న, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసును ముగించింది.
అయితే, “చిత్రనిర్మాతలు టైటిల్‌ను ఉపసంహరించుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవలసిన అవసరం లేదు.
అయినప్పటికీ సోదరభావం, వాక్ స్వేచ్ఛల రాజ్యాంగ సూత్రాలను తిరిగి ధృవీకరించడం, నొక్కి చెప్పడం చాలా ముఖ్యమ”ని జస్టిస్ భుయాన్ అన్నారు.
“సోదరభావం అనే పదం రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరచబడింది.
అంతేకాకుండా భావ ప్రకటనా స్వేచ్ఛ ఒక ప్రాథమిక హక్కు. ఈ రెండింటి మధ్య సమతుల్యతను కాపాడుకోవడమే రాజ్యాంగ నిజమైన స్ఫూర్తి” అని పేర్కొన్నారు.
సోదరభావం
రాజ్యాంగం ప్రాథమిక లక్ష్యాలలో సోదరభావం ఒకటని, ప్రవేశికలోని మార్గదర్శక సూత్రాలలో ఇది ఒక ముఖ్యమైన భాగమని జస్టిస్ భుయాన్ తెలిపారు.
ఆర్టికల్ 51A(ఈ)ని ఉటంకిస్తూ, “మత, భాషా, ప్రాంతీయ వైవిధ్యాలను అధిగమించి సామరస్యం, సోదరభావాన్ని ప్రోత్సహించడం ప్రతి పౌరుడి ప్రాథమిక విధి” అని కోర్టు పేర్కొంది.
“ఇది తప్పనిసరిగా తోటి మానవుల పట్ల గౌరవం, హుందాతనంతో కూడిన వైఖరిని కలిగి ఉండాలి. కాబట్టి, కులం, మతం లేదా భాషతో సంబంధం లేకుండా పౌరుల మధ్య సోదరభావం, ఆదరాభిమానాలను పెంపొందించడం మనందరి రాజ్యాంగ విధి” అని చెప్పడం జరిగింది.
సమాజంలోని వ్యక్తులందరి మధ్య పరస్పర గౌరవం, ఐక్యత భావాన్ని పెంపొందించడానికే సోదరభావం అనే భావన సృష్టించబడిందని పేర్కొన్న పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6ఏకి సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పును కూడా ధర్మాసనం ప్రస్తావించింది.
‘ప్రభుత్వ- ప్రభుత్వేతర సంస్థలైనా- ప్రసంగం, మీమ్, కార్టూన్ లేదా విజువల్ ఆర్ట్స్ వంటి ఏ మాధ్యమం ద్వారానైనా ఏదైనా సమాజాన్ని కించపరచడం లేదా అవమానించడం రాజ్యాంగబద్ధంగా తప్పు’అని కోర్టు పేర్కొంది.
లైవ్ లా కథనం ప్రకారం, రాజ్యాంగపరమైన ఉన్నత పదవులు నిర్వహిస్తున్న వ్యక్తులు అలా చేసినప్పుడు ఈ సూత్రం మరింత ముఖ్యమైనదని కోర్టు నొక్కి చెప్పింది.
“మతం, భాష, కులం లేదా ప్రాంతం ఆధారంగా ఏదైనా సమాజాన్ని లక్ష్యంగా చేసుకోవడం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది- దీన్ని ఎవరు చేసినా, ముఖ్యంగా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రమాణం చేసిన ప్రభుత్వ అధికారులు చేసినా అది వర్తిస్తుంది”అని కోర్టు పేర్కొంది.
సినిమా టైటిల్ విషయంలో బెంచ్ గతంలో లేవనెత్తిన ఆందోళనలు “సహేతుకమైనవి, చెల్లుబాటు అయ్యేవి” అని కోర్టు వెల్లడించింది.
విచారణ సందర్భంగా, ఈ సినిమా టైటిల్(“అవినీతి పండిట్” అని అర్థం వచ్చేలా ఉన్నందుకు) సమాజంలోని ఒక వర్గాన్ని, అంటే బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచేలా ఉందని భావించిన కోర్టు ప్రశ్నించింది.
భావ ప్రకటనా స్వేచ్ఛ
రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) కింద భావ ప్రకటనా స్వేచ్ఛకు హామీ ఉందని కోర్టు స్పష్టం చేసింది.
కళాత్మక వ్యక్తీకరణ ప్రజాస్వామ్య చర్చలో కీలకమైన భాగమని, కొన్ని సమూహాల అభ్యంతరాల ఆధారంగా దానిని అణచివేయలేమని జస్టిస్ భుయాన్ పేర్కొన్నారు.
గతంలో వచ్చిన అనేక నిర్ణయాలను ఉటంకిస్తూ, నిరసన బెదిరింపులు లేదా ప్రజా అశాంతి బెదిరింపుల ద్వారా భావ ప్రకటనా స్వేచ్ఛను బందీగా ఉంచలేమని కోర్టు పునరుద్ఘాటించింది.
సినిమాలను అత్యంత సున్నితమైన వ్యక్తుల కోణం నుంచి కాకుండా, ‘సాధారణ- సహేతుకమైన ప్రేక్షకుడి’ కోణం నుంచి అంచనా వేయాలని కోర్టు పేర్కొంది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) నుంచి సర్టిఫికేషన్ పొందిన తర్వాత సినిమా ప్రదర్శనలో జోక్యం చేసుకునేటప్పుడు కోర్టులు జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా కోర్టు సూచించింది.
కోర్టులు భావ ప్రకటనా స్వేచ్ఛను నియంత్రించడం లేదా పరిమితం చేయడం వంటివి చేయకూడదని జస్టిస్ భుయాన్ పేర్కొన్నారు.
ఒక కవిత లేదా హాస్య కార్యక్రమం మన 75 ఏళ్ల గణతంత్రానికి ముప్పు కలిగించలేవని కూడా ఆయన పేర్కొన్నారు. “ఇది సినిమా టైటిల్‌కి కూడా సమానంగా వర్తిస్తుంది. నేను అంతకంటే ఎక్కువ ఏమీ చెప్పను” అని ఆయన ముగించారు.
సంబంధిత ఇతర పరిణామాలు
ద్వేషపూరిత ప్రసంగం చేశారనే ఆరోపణలపై ఆర్టికల్ 32 కింద అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
ముఖ్యమంత్రి ఇటీవలి ప్రకటనలు వివాదాలకు, నిరసనలకు దారితీశాయి. భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం పార్టీలను రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాలని ఆదేశించింది.
ఇదిలా ఉండగా, ఒక రోజు ముందు(సోమవారం, ఫిబ్రవరి 23న) గో రక్షణ పేరుతో జరిగే మూక దాడులను నిరోధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు 2018లో జారీ చేసిన ‘సాధారణ ఆదేశాల’ను అమలు చేయడంలో ఇబ్బందులు ఉన్నాయని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఉదహరించారని, వాటిని ఆచరణాత్మకంగా సంక్లిష్టమైనవిగా ఆయన పేర్కొన్నారని ది హిందూ నివేదించింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
