మన దేశ చరిత్రలో అఖిల భారత జనరల్ సమ్మెలు కొత్తవి కావు.
వేతనాల వెంపుదల, పని గంటలు, కార్మిక చట్టాల రక్షణ కోసం, శ్రామిక వర్గం ఎన్నోసార్లు సమ్మె బాటపట్టింది.
శ్రామిక వర్గపు చైతన్యాన్ని ముందుకు నడిపే ప్రాముఖ్యత గల పోరాటాలకు కీలక అడుగులై నిలిచింది. 2026 ఫిబ్రవరి 12న జరగబోయే అఖిల భారత జనరల్ సమ్మె ఆ పోరాటాల కొనసాగింపే.
అదే సమయంలో, ఆ కొనసాగింపులోనే ఒక నిర్ణయాత్మక మలుపు కూడా ఉంది. ఎందుకంటే ఈ సమ్మె జరుగుతున్నది ఒక సాధారణ కాలంలో కాదు.
నేడు దేశం తీవ్రమైన ఆర్థిక, సామాజిక, రాజకీయ సంక్షోభంలోకి కూరుకుపోయింది. ఈ సంక్షోభం సహజంగా వచ్చినది కాదు.
ప్రకృతి విపత్తుల వల్లనో, వనరుల కొరత వల్లనో అనుకోవడానికి లేదు.
ఈ సంక్షోభం పూర్తిగా పాలక వర్గాలు అనుసరించిన కార్పొరేట్–పక్షపాత విధానాల కారణంగానూ, మనువాద భావజాలంతో ముడిపడిన కమ్యూనల్ రాజకీయాలే అందుకు కారణాలు.
పాలన ద్విముఖ స్వభావం
ఉత్పత్తి వర్గాల శ్రమ పెరుగుదల ఈ సంక్షోభానికి అసలైన మూలం. వ్యవసాయం, పరిశ్రమలు అపార సంపదను సృష్టించాయి.
కానీ ఆ సంపద ప్రజల చేతుల్లోకి రావడం కాకుండా, దోపిడీకి గురై కొద్దిమంది కార్పొరేట్ల చేతుల్లోనే కేంద్రీకృతమైంది.
ఈ ఆర్థిక అసమానతను దాచిపెట్టేందుకు మోదీ ప్రభుత్వం మతం, కులం పేరుతో ప్రజలను చీల్చే కమ్యూనల్ విభజన చేస్తూ ప్రజలను తప్పుదారిపట్టిస్తోంది.
మనువాద భావజాలాన్ని రాజ్యాధికార సాధనంగా మలచి, సామాజిక న్యాయాన్ని బలహీనపరచి, ప్రజల అసలైన సమస్యల నుంచి దృష్టిని మళ్లించడం– ఇదే ఈ పాలన రాజకీయ ద్విముఖ స్వభావం.
సంస్కరణ కాదు- రాజకీయ ప్రాజెక్టు
గత సమ్మెల్లో ప్రధానంగా “ఈ విధానాన్ని మార్చండి” అనే డిమాండ్ ఉంది. కానీ నేడు ప్రశ్న అక్కడ ఆగడం లేదు.
ప్రశ్న దేశ దిశ మీద, రాజ్య స్వభావం మీద నిలబడింది.
మోదీ ప్రభుత్వం చేస్తున్నది సంస్కరణ కాదు. ఇది ఒక సంపూర్ణ రాజకీయ ప్రాజెక్టు.
కార్మికులు, రైతులు, గ్రామీణ పేదలు జాతీయ ఉద్యమ ఆకాంక్షల వారసత్వంగా త్యాగాలతో సాధించుకున్న హక్కులు, రక్షణలు, చట్టాలను ఒక్కొక్కటిగా కాదు.
మొత్తం వ్యవస్థగానే రద్దు చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.
కార్మిక చట్టాల రద్దుతో ప్రారంభమైన ఈ దాడి లేబర్ కోడ్స్, ఉపాధి హామీ చట్టం నిర్వీర్యం, విద్యుత్, విత్తన బిల్లులు, వ్యవసాయంపై కార్పొరేట్ ఆధిపత్యానికి దారి వేసే విధానాల వరకు విస్తరించింది.
ఇవి విడివిడిగా జరిగిన చర్యలు కావు. ఇవి సంక్షోభాన్ని ప్రజల మీద మోపే, కార్పొరేట్లను కాపాడే, మనువాద ఆధిపత్యాన్ని బలపరచే ఒకే రాజకీయ వ్యూహంలోని భాగాలు.
యుద్ధ ప్రకటనకు అధికారిక ముద్ర
ఈ సంక్షోభానికి సమాధానంగా ప్రజల సంక్షేమాన్ని విస్తరించాల్సిన చోట, మోదీ ప్రభుత్వం ప్రజల మీదే యుద్ధం ప్రకటించింది.
ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఈ యుద్ధ ప్రకటనకు అధికారిక ముద్ర వేసింది.
గ్రామీణ పేదలకు ఖర్చును “భారం”గా, కార్పొరేట్ లాభాల పరిరక్షణను “జాతీయ కర్తవ్యంగా” చూపించింది. అంటే విషయం స్పష్టం.
ఈ సంక్షోభానికి కారణం పాలక వర్గాల విధానాలైతే, దాని భారం మోయాల్సిందిగా నిర్ణయించబడింది ప్రజలేనని.
భవిష్యత్తు, రాజ్య స్వభావం కోసం పోరాటం
గత సమ్మెల్లో శ్రామిక వర్గం తన జీవన పరిస్థితులపై పోరాడింది. ఈ సమ్మెలో శ్రామిక వర్గం దేశ భవిష్యత్తు, రాజ్య స్వభావం కోసం పోరాడుతోంది.
లొంగిపోయి బతికే చవటలుగా మారాలా? లేదా సంక్షోభాన్ని సృష్టించిన విధానాలనే ఎదిరించి దేశాన్ని కాపాడుకోవాలా? ఈ ప్రశ్నకు శ్రామిక వర్గం సమిష్టిగా ఇచ్చే సమాధానమే ఫిబ్రవరి 12 అఖిల భారత జనరల్ సమ్మె.
ఇటీవలి పార్లమెంట్ సమావేశాలు ఈ దాడికి మరింత స్పష్టమైన ముద్ర వేశాయి.
చర్చ లేకుండా, ప్రజా వ్యతిరేక స్వరాలు వినిపించకుండా, వినాశనకారక విధానాలను ఒకటి తర్వాత ఒకటి ఆమోదింపజేశారు.
కార్మిక చట్టాల స్థానంలో లేబర్ కోడ్స్, వ్యవసాయంపై కార్పొరేట్ ఆధిపత్యాన్ని బలపరిచే నిబంధనలు, విద్యుత్, విత్తనాలపై ప్రజా నియంత్రణను బలహీనపరిచే బిల్లులు- ఇవన్నీ పార్లమెంట్‌ను ప్రజాస్వామ్య వేదికగా కాకుండా కార్పొరేట్ ఆదేశాలకు ముద్ర వేసే యంత్రంగా మార్చిన విధానాలే.
ఇవి దేశ అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలు కావు. దేశాన్ని దోపిడీకి అప్పగించే చట్టబద్ధ ప్రకటనలు.
సమాన వేతనం అందిన ఏకైక ప్రధాన ఉపాధి అవకాశం
2005లో అమలులోకి వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గ్రామీణ పేదలకు ఇచ్చిన చిన్న ఉపశమనం కాదు.
గ్రామీణ శ్రమపై శతాబ్దాలుగా సాగుతున్న దోపిడీకి ఇది ఒక పరిమిత రాజకీయ అడ్డుకట్ట.
ఈ చట్టం కింద ఇప్పటివరకు రూ 9.98 లక్షల కోట్లకు పైగా నిధులు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయాల్సి వచ్చింది. దాని ద్వారా 4700 కోట్ల పనిదినాలు గ్రామీణ ప్రాంతాల్లో కల్పించబడ్డాయి.
ఇవి సాధారణ గణాంకాలు కావు. ఇవి గ్రామీణ పేదల జీవితాల్లోకి వచ్చిన శ్వాస.
ఈ పనిదినాల్లో 52- 58 శాతం మహిళలే పనిచేశారు. 36 శాతం వరకు ఎస్సీ–ఎస్టీ వర్గాలు ఇందులో భాగస్వాములు అయ్యారు.
గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు పురుషులతో సమాన వేతనం అందిన ఏకైక ప్రధాన ఉపాధి అవకాశం ఇదే. ఇది కేవలం ఆదాయం కాదు.
ఇది మహిళలకు ఆత్మవిశ్వాసం. ఇది సామాజిక గౌరవం. ఇది కుల–లింగ వివక్షపై వేసిన చిన్న కానీ కీలక దెబ్బ.
ఇంకో ముఖ్యమైన అంశం ఏమిటంటే– ఈ పథకం కింద గ్రామీణ శ్రామిక వర్గం కొన్ని నెలలు ఒకే ప్రాంతంలో, ఒకే పనిలో కలిసి పనిచేసే పరిస్థితి ఏర్పడింది.
ఇది యాదృచ్ఛికం కాదు. ఇది గ్రామీణ శ్రామికుల మధ్య వర్గ ఐక్యతకు దారితీసిన సామాజిక స్థలం.
హక్కు నుంచి భిక్షగా మార్చే ప్రక్రియ..
కులం పేరుతో విడగొట్టబడిన చేతులు పనిలో కలిశాయి. ఒకే వేతనం, ఒకే కష్టంతో శ్రామికులు ఒకరినొకరు చూసుకున్నారు.
ఇదే మనువాద వ్యవస్థకు అత్యంత అసహ్యమైన విషయం. అందుకే ఈ చట్టం మోదీ ప్రభుత్వానికి శత్రువైంది.
2014 తరువాత ఈ చట్టాన్ని నేరుగా రద్దు చేయలేకపోయినా, అమలు చేయకుండా నిర్వీర్యం చేయడం ప్రారంభించారు. నిధులు కత్తిరించారు. పనిదినాలు తగ్గించారు. వేతనాలు ఆలస్యం చేశారు.
చివరికి 2025 నాటికి ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి, కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. 2005 చట్టం గ్రామీణ పేదలకు దయ కాదు– హక్కు. పని అడిగితే పని ఇవ్వాల్సిన చట్టబద్ధ బాధ్యతను ప్రభుత్వంపై మోపింది.
కొత్త చట్టంలో ఉపాధి హక్కు లేదు. పనిదినాల హామీ లేదు. వేతనానికి చట్టబద్ధ రక్షణ లేదు. అంటే, పని ఇవ్వకపోయినా ప్రభుత్వానికి బాధ్యత లేదు.
పేదలు ప్రశ్నించడానికి ఏ ఆయుధం మిగలదు.
ఇంకా ఒక కీలక మార్పు – ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ బాధ్యత నుంచి రాష్ట్రాలపై 40 శాతం భారం మోపే కేంద్ర స్పాన్సర్డ్ స్కీమ్‌గా మార్చారు.
అంటే, పేదల ఉపాధి భద్రతను రాష్ట్రాల ఆర్థిక స్థితిపై ఆధారపెట్టడం.
ఈ మార్పుల అసలైన లక్ష్యం స్పష్టం. గత కొన్ని దశాబ్దాల్లో గ్రామాల్లో ఒక నూతన ధనిక వర్గం ఎదిగింది.
మోదీ పాలనలో ఈ వర్గం ఆర్థికంగా, రాజకీయంగా పూర్తిగా బలపడింది. ఈ వర్గానికి ఉపాధి హామీ చట్టం ఒక అడ్డంకి.
ఎందుకంటే అది కార్మికులను పూర్తిగా వారి ఆధీనంలో ఉండనివ్వలేదు. అందుకే ఈ వర్గాన్ని సంతృప్తిపరచడానికే మోదీ ప్రభుత్వం ఉపాధి హామీని తుంగలో తొక్కింది.
ఈ ఆర్థిక దాడికి హిందుత్వాన్ని రాజకీయ కవచంగా వాడుతున్నారు. ఉపాధి ప్రశ్న రాకుండా చేయడానికి మతం, కులం పేరుతో గ్రామీణ పేదలను చీల్చుతున్నారు.
అంటే విషయం స్పష్టం..
ఉపాధి హామీ రద్దు – గ్రామీణ పేదలపై ఆర్థిక యుద్ధం
హిందుత్వం – ఆ యుద్ధాన్ని దాచే రాజకీయ ఆయుధం
గ్రామీణ ప్రాంతాల్లో నేడు కనిపిస్తున్న సంక్షోభం ఆదాయాలు పడిపోవడమే కాదు. ఇది జీవించడానికి అవసరమైన మౌలిక గౌరవాల సంక్షోభం. ఇల్లు, చదువు, వైద్యం– ఈ మూడింటి లేకపోవడమే గ్రామీణ పేదల జీవితాన్ని నిత్య అత్యవసర పరిస్థితిగా మార్చింది.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) ఇటీవలి గణాంకాలు ఈ వాస్తవాన్ని మరింత కఠినంగా చూపిస్తున్నాయి. మొదటిసారిగా రైతుల కన్నా గ్రామీణ పేదలు, వ్యవసాయ కూలీలు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
ఒక ఏడాదిలోనే సుమారు 5,600 మంది రైతులు, అదే సమయంలో 6,000 మందికి పైగా గ్రామీణ పేదలు, కూలీలు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. ఇవి వ్యక్తిగత వైఫల్యాల ఫలితాలు కావు. ఇవి వ్యవస్థాగత హింసకు గణాంకాల రూపం. గ్రామీణ పేదలు ఎందుకు ఇంత అంచుకు నెట్టబడ్డారు?
మొదట – నివాస భద్రత
గ్రామీణ ప్రాంతాల్లో కోట్లాది కుటుంబాలకు స్వంత ఇల్లు లేదు. ఉన్న చోట్ల ఇళ్లు అనేవి గదులు కాదు. చెదిరిన గోడలు, లీకుల పైకప్పులు, నీరు, పారిశుద్ధ్యం లేని స్థితి. కేంద్ర ప్రభుత్వం “ఇళ్లు ఇచ్చాం” అని సంఖ్యలు చూపుతుంది. కానీ ఆ ఇళ్లు ఉపాధి లేని ప్రాంతాల్లో, వైద్యం–చదువు లేని చోట్ల కేవలం కాంక్రీట్ పెట్టెలుగా మిగులుతున్నాయి.
ఐక్యరాజ్యసమితి చెప్పే “గౌరవనీయ నివాసం” అంటే కేవలం నాలుగు గోడలు కాదు. నీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, చదువు, వైద్యం, ఉపాధికి చేరువలో ఉండే ఇల్లు.
ఈ ప్రమాణాలను మోదీ ప్రభుత్వం మాటల్లో అంగీకరిస్తుంది. కానీ అమలులో మాత్రం అంగీకరించడం లేదు. ఎందుకంటే ఇవి గ్రామీణ పేదలకు హక్కులుగా కాకుండా, దయగా ఇవ్వబడుతున్న పథకాలుగా మారాయి.
రెండవది – వైద్యం
గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు ఖాళీగా ఉన్నాయి. డాక్టర్లు లేరు. ఔషధాలు లేవు. ప్రైవేట్ వైద్యం మాత్రం పేదలకు అప్పుల గోతిగా మారింది. ఒక అనారోగ్యం ఒక కుటుంబాన్ని పూర్తిగా అప్పుల్లోకి నెట్టే స్థితి.
మూడవది – చదువు
ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం చేయబడి, ప్రైవేట్ విద్యే “నాణ్యత” అని ప్రచారం చేస్తున్నారు. కానీ గ్రామీణ పేదలకు ఆ విద్య ఖర్చు భరించలేనిది. చదువు లేక ఉపాధి అవకాశాలు లేక గ్రామీణ యువతకు మిగిలేది ఒక్కటే – వలస.
ఈ వలసలు అభివృద్ధి సంకేతాలు కావు. ఇవి గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలను ఖాళీ చేయించే విధానం. పట్టణాలకు వెళ్లిన గ్రామీణ పేదలు చౌక కూలీలుగా మారుతున్నారు. తక్కువ వేతనాలు, అస్థిర పనులు, అనారోగ్య జీవితం – ఇదే వారి “నగర భవిష్యత్తు”.అంటే గ్రామాల్లో ఉపాధి, ఇల్లు, చదువు, వైద్యం నాశనం చేసి ప్రజలను పట్టణాలకు నెట్టడం ఈ పాలన యొక్క అసలైన సామాజిక విధానం.
ఆత్మహత్యలు, వలసలు, నివాస అస్థిరత – ఇవి విడివిడిగా జరిగిన సంఘటనలు కావు. ఇవి ఒకే విధానానికి విభిన్న రూపాలు.గ్రామీణ పేదల జీవితాలను నెమ్మదిగా కానీ నిర్దాక్షిణ్యంగా అసాధ్యంగా మారుస్తున్న విధానాలే ఈ సంక్షోభానికి మూలం.
అందుకే గ్రామీణ ప్రాంతాల్లో నివాస హక్కు, వైద్యం, చదువు సంక్షేమ పథకాలు కావు – ఇవి జీవన హక్కులో భాగం.
భారతీయ రైతులపై పెనుభారం
ఈ హక్కులపై జరుగుతున్న దాడికి ఎదిరే పోరాటమే నేడు గ్రామీణ శ్రామిక వర్గం ముందున్న అత్యవసర రాజకీయ కర్తవ్యం.
మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు – గ్రామీణ ప్రజలపై మరో విపత్తు ఇప్పటికే ఉపాధి సంక్షోభం, ఆహార భద్రతకు ముప్పు, భూములు–వనరుల దోపిడీతో గ్రామీణ పేదల జీవితం అంచుల మీద నడుస్తున్న వేళ మోదీ ప్రభుత్వం మరో విపత్తును తెచ్చింది.
అది – అమెరికాతో కుదుర్చుకున్న టారిఫ్ (వాణిజ్య) ఒప్పందం. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు, గ్రామీణ ప్రజల మీద ఇప్పుడు అంతర్జాతీయ దోపిడీ భారం కూడా పడబోతోంది.
ఈ ఒప్పందం పేరు వాణిజ్యం. దాని అసలు అర్థం మాత్రం – భారత గ్రామాల తలుపులు అమెరికా కార్పొరేట్ వ్యవసాయానికి తెరవడం. అమెరికా ప్రభుత్వం బహిరంగంగానే ప్రకటించింది: భారత మార్కెట్లోకి అమెరికన్ పంటలు, పాలు, పత్తి, సోయాబీన్ ఆయిల్ ఎక్కువగా ఎగుమతి చేస్తామని.
దీని అర్థం ఏమిటి?
1. భారత రైతుకు గిట్టుబాటు ధరలు పడిపోతాయి
2. ఎంఎస్పీ, ప్రభుత్వ కొనుగోళ్లు “వాణిజ్యానికి అడ్డంకి”గా మారతాయి
3. స్థానిక మార్కెట్లు విదేశీ సరుకులతో నిండిపోతాయి
4. గ్రామీణ ఉపాధి మరింత క్షీణిస్తుంది
ఇది కేవలం రైతుల సమస్య కాదు. ఇది వ్యవసాయ కార్మికులు, గ్రామీణ కూలీల జీవన ప్రశ్న. ధరలు పడిపోతే పంట సాగు తగ్గుతుంది. సాగు తగ్గితే పని దినాలు తగ్గుతాయి. పని దినాలు తగ్గితే ఆకలి పెరుగుతుంది.
అంటే, టారిఫ్ ఒప్పందం గ్రామీణ పేదల ప్లేట్లోని అన్నాన్ని నేరుగా తీసేసే విధానం. ఇదంతా జరుగుతున్న వేళ మోదీ ప్రభుత్వం మౌనం పాటిస్తోంది. సార్వభౌమాధికారంపై, ప్రజల జీవనాధారాలపై ఇంత పెద్ద దాడి జరుగుతున్నా పార్లమెంట్లో నిజాలు చెప్పే ధైర్యం లేదు. ఇది వాణిజ్య ఒప్పందం కాదు. ఇది నవీన వలస పాలనకు సంతకం.
విద్యుత్ బిల్లు – గ్రామీణ జీవితంపై మరో కత్తి
ఇదే సమయంలో పార్లమెంట్లో ఆమోదం కోసం తెచ్చిన విద్యుత్ బిల్లు గ్రామీణ ప్రజలపై మరో దాడి.
ఈ బిల్లు అమలులోకి వస్తే, ఉచిత కరెంట్ అనే భావనకు ముగింపు పలుకుతారు. సబ్సీడీలు “ఆర్థిక భారం”గా ప్రకటింపబడతాయి. విద్యుత్ పూర్తిగా మార్కెట్ సరుకుగా మారుతుంది.
వ్యవసాయానికి ఉచిత లేదా సబ్సిడీ కరెంట్ లేకపోతే పంట సాగు అసాధ్యమవుతుంది. సాగు లేకపోతే పని లేదు. పని లేకపోతే గ్రామాల్లో జీవితం లేదు. విద్యుత్ ప్రైవేటీకరణ అంటే గ్రామాలను చీకట్లోకి నెట్టడం. కార్పొరేట్ లాభాల కోసం గ్రామీణ భవిష్యత్తును తాకట్టు పెట్టడం.
ఇది అభివృద్ధి కాదు. ఇది గ్రామీణ సమాజాన్ని ఖాళీ చేసే విధానం.
ఐక్యం తప్ప మరో మార్గం లేదు. ఈ పరిస్థితులన్నింటిని కలిపి చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. ఇది విడివిడిగా వచ్చిన సంక్షోభాల సమాహారం కాదు. ఇది గ్రామీణ శ్రమపై ప్రకటించిన యుద్ధం. దేశాన్ని తినే కార్పొరేట్లకు సేవ చేయడానికి మోదీ ప్రభుత్వం గ్రామీణ పేదలను బలిచేస్తోంది. అందుకే ఫిబ్రవరి 12 అఖిల భారత జనరల్ సమ్మె కేవలం పట్టణాల పోరాటం కాదు. కేవలం కార్మికుల సమ్మె కాదు.
ఇది గ్రామాల పోరాటం. ఇది వ్యవసాయ కార్మికుల పోరాటం. ఇది ఉపాధి, భూమి, ఆహారం, విద్యుత్ కోసం పోరాటం. చరిత్ర ఒక విషయం స్పష్టంగా చెబుతుంది.
మోదీ లాంటి నియంతలు ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని కుట్రలు పన్నినా, ప్రజా ఐక్యత ముందు చివరికి చరిత్ర గర్భంలో కలిసిపోవాల్సిందే. భిన్నంగా ఉన్న చేతులు ఈ రోజు కలవాలి. చీల్చబడిన గ్రామాలు ఒకే స్వరంగా నిలబడాలి.
ఐక్యం అవుతాం, పోరాడుతాం, ఓడిస్తాం..
ఈ సమ్మెలో గ్రామీణ శ్రామిక వర్గం ఐక్యమై తమ వంతుగా నడుబించాలి. ఈ సమ్మె ఆర్థిక పోరాటం కాదు. ఇది మన కాలపు జీవన మార్గపు పిలుపు. ఇది మనందరి బాధ్యత.
నియంతపు పోకడలను, అంధకారంలోకి నెట్టే నిరంకుశపు చట్టాలను పూకటి వేల్ల నుంచి పెకిలించాల్సిన అవసరాన్ని చరిత్ర మనకు అందచేసిన అతి పెద్ద బాధ్యత.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
