
ఎంఎన్ఆర్ఈజీఏ మెటీరియల్ కాంపోనెంట్స్ కింద పెండింగ్లో ఉన్న చెల్లింపులపై గ్రామీణాభివృద్ధి శాఖ మీద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది.
రూ 12,219 కోట్ల వేతనాలు పెండింగ్లో ఉన్నాయని నివేదిక పేర్కొంది. సకాలంలో వేతనాలను చెల్లించాలని, రాష్ట్రాలతో సమన్వయాన్ని మెరుగుపరుచుకోవాలని కమిటీ సిఫార్సు చేసింది.
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంఎన్ఆర్ఈజీఏ) మెటీరియల్ కాంపోనెంట్ల కింద పెండింగ్ వేతనాల అంశాల మీద కమిటీ ఒక నిర్దిష్ట ప్రశ్నను అడిగింది.
ఈ విషయాన్ని “విస్మరించినందుకు” గ్రామీణాభివృద్ధిపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖను మందలించింది.
దక్కన్ హెరాల్డ్ నివేదిక ప్రకారం, 2025- 26 గ్రాంట్స్ డిమాండ్ మీద చేసిన సిఫార్సుల విషయంలో తీసుకున్న చర్యల నివేదికను, ఆగస్టు 11న కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలక నేతృత్వంలోని కమిటీ ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో “ఇంత కీలక విషయం మీద కమిటీ అడిగిన నిర్దిష్ట ప్రశ్నను ఎలా పక్కన పెట్టారో అర్థం చేసుకోలేనిద”ని పేర్కొన్నది.
ఆదేశాలు జారీ..
కార్మికులకు వేతనాలు చెల్లించడంలో జాప్యం జరగకుండా ఉండేందుకు, పెండింగ్లో ఉన్న అన్ని బిల్లులను క్లియర్ చేయాలని మంత్రిత్వ శాఖకు కమిటీ ఆదేశించింది.
2025- 26 సంవత్సరానికి బడ్జెట్ కేటాయింపులపై తన నివేదికలో, కమిటీ రూ 12,219.18 కోట్ల విలువైన వేతనాలు పెండింగ్లో ఉన్నాయని, ఎంఎన్ఆర్ఈజీఏ వంటి సంక్షేమ-ఆధారిత ప్రణాళికాబద్ధమైన జోక్యాలకు మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ 11,227.09 కోట్లు చెల్లించలేదని పేర్కొంది.
ఇది ప్రస్తుత బడ్జెట్లో 27.26% అని, అంటే కేటాయించిన నిధులలో పావు వంతు కంటే ఎక్కువ గత సంవత్సరాల నుంచి బకాయిలను క్లియర్ చేయడానికి ఉపయోగించబడుతుందని చెప్పుకొచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వాస్తవ పని బడ్జెట్ రూ 62,553.73 కోట్లకు తగ్గించబడిందని కూడా నివేదిక స్పష్టం చేసింది.
ఎంఎన్ఆర్ఈజీఏ రెండు అంశాలు- పథకం డిమాండ్ ఆధారిత స్వభావం, పథకం కింద ఆస్తుల సృష్టి – ఇటువంటి పెండింగ్ కేసుల కారణంగా తీవ్రంగా దెబ్బతింటున్నాయని కమిటీ భావించిందని నివేదిక తెలియజేసింది.
పెండింగ్లో ఉన్న కేసులపై ఆందోళన వ్యక్తం చేస్తూ, జీతాలు- సామగ్రి కింద కేంద్ర ప్రభుత్వ వాటా నిధులను సకాలంలో విడుదల చేయడానికి, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయాన్ని బలోపేతం చేయడానికి, చెల్లింపులో మరింత జాప్యాన్ని నివారించడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకోవడానికి గ్రామీణాభివృద్ధి శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫార్సు చేసింది.
అనువాదం: కృష్ణ నాయుడు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.