కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి రూపొందించిన నాలుగు లేబర్ కోడ్లను పార్లమెంటు ఆమోదించిన తదనంతరం రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా లభించింది.
అయితే వీటి అమలుకు మెజార్టీ రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలియజేయాల్సి ఉంది.
కారణం పారిశ్రామిక వివాదాల చట్టం, కనీస వేతనాల చట్టం, ఫ్యాక్టరీస్ యాక్ట్ తదితర అనేక చట్టాలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి మాత్రమే వస్తాయి.
రాష్ట్రాలతో సంప్రదించకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించింది. ఇంకా అనేక ఇతర చట్టాల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలను పక్కకునెట్టి కేంద్రమే రాష్ట్రాల నెత్తిన పెత్తనం చెలాయిస్తున్నది.
ఇది “దేశం రాష్ట్రాల సమాఖ్య” అనే రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పడటం తప్ప మరోటి కాదు.
ఈ నిరంకుశ చట్టాల నేపథ్యంలో భారత కార్మిక ఉద్యమ చరిత్రలో ఫిబ్రవరి 12 సమ్మె ఒక మైలురాయిగా నిలిచింది.
ఏవో కొన్ని రాష్ట్రాలు, ప్రాంతాలకు ఈ సమ్మె పరిమితం కాలేదు- కేరళ, బీహార్, త్రిపురలాంటి కొన్ని రాష్ట్రాలలో దాదాపు బంద్ వాతావరణం నెలకొన్నది.
రెండు దశాబ్దాలకుపైగా అధికారం చెలాయిస్తున్న బీజేపీ పాలిత గుజరాత్, మధ్యప్రదేశ్‌లాంటి రాష్ట్రాల మొదలు గోవాలాంటి చిన్న రాష్ట్రాల దాకా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలపై సమ్మె ప్రభావం స్పష్టంగా పడింది.
ఆవిధంగా పాన్ ఇండియా స్వభావాన్ని సమ్మె సంతరించుకున్నది.
ప్రజా జీవితాలపై ప్రభావం..
అనేక రాష్ట్రాలలో రవాణా స్తంభించడంతో ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలలో హాజరు పలుచబడింది.
అనేక ప్రధాన నగరాలలో అత్యవసరాల కోసం ఊబర్, ఓలా, రాపిడోలాంటి ప్లాట్ ఫామ్ సంస్థల ద్వారా బైక్, ఆటో, క్యాబ్ బుక్ చేసుకోలేక ప్రజలు నానా అవస్థలు పడ్డారు.
అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్విగ్గి, జొమాటో లాంటి సంస్థల వ్యాపారం తగ్గింది.
ఇన్సూరెన్స్ బ్యాంకింగ్ రంగాలు దాదాపుగా మూతపడ్డాయి. మెడికల్ రిప్రజెంటేటివ్స్ నూటికి నూరు శాతం సమ్మెలో పాల్గొన్నారు.
విద్యుత్తు గనులు ఓడరేవులు రవాణా ప్రభుత్వ రంగ పరిశ్రమల కార్మికులు ఉద్యోగులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొన్నారు.
సంఘటిత రంగాలు స్పెషల్ ఎకనామిక్ జోన్స్‌లోని పరిశ్రమలు, సిమెంటు, తేయాకు, మున్సిపల్, భవన నిర్మాణ రంగాల కార్మికులు దేశవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో సమ్మెలో పాల్గొన్నారు.
అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్నం భోజనంలాంటి స్కీములలో పనిచేసేవారు దాదాపు మొత్తం సమ్మెలో పాల్గొన్నారు.
రైల్వేలాంటి సంస్థలతో సహా దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో పనిచేసే నాన్ పర్మినెంట్ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.
పశ్చిమ బెంగాల్‌తో సహా కొన్ని రాష్ట్రాలలో ఉద్యమకారుల అరెస్టులు జరిగాయి. ప్రభుత్వ యాజమాన్యాల నిర్బంధాలు, బెదిరింపులు, ఒత్తిడిలను అధిగమించి సమ్మె విజయవంతం అయింది.
సుమారు 30 కోట్లకు పైగా సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు మధ్యతరగతి ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారని ది హిందూ పత్రిక కథనం వెల్లడించింది.
సమ్మె రోజున అనేక నగరాలు, పట్టణాలు, బ్లాకు స్థాయి ప్రాంతాలు లక్షల సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు, ప్రజల ప్రదర్శనలు, నినాదాలతో మారుమోగాయి.
ఆ విధంగా ఇప్పటివరకు జరిగిన 24 జాతీయ సమ్మెలలో ఇది ఒక మూలమలుపు.
జాతీయ ట్రేడ్ యూనియన్లకు అనుబంధం కానీ దేశంలోని పలు సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి.
ఇంకా అనేక సంఘాలు బ్యాడ్జెస్ ధరించి విధులకు హాజరు కావడం ద్వారా పరోక్షంగా మద్దతు తెలియజేశారు.
సమ్మె నేపథ్యం..
సాధారణ ప్రజల, కార్మికుల ఓట్లతో గెలిచి; అధికార పీఠాన్ని ఎక్కిన తర్వాత కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం భస్మాసుర హస్తంలా ప్రజల నెత్తిన చెయ్యి పెట్టింది. దేశ సంపదను కొద్దిమంది కార్పొరేట్ రాబందులకు కట్టబెడుతున్నది.
కార్పొరేట్ సంస్థల అపరిమిత లాభాల ఆరాటానికి లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్లు కార్మికులను బానిస యుగంలోకి నెట్టేందుకు దారితీస్తాయి.
పని గంటల పెంపుదల, ఇష్టారాజ్యంగా కార్మికుల తొలగింపు; ఎలాంటి భద్రతా, చట్టబద్ధ సదుపాయాలు లేని నాన్ పర్మినెంట్ కార్మికుల నియామకాలను లేబర్ కోడ్లు చట్టబద్ధం చేస్తాయి.
అదే సందర్భంలో 1955లో జరిగిన 15వ ఇండియన్ లేబర్ కాంగ్రెస్ ఏకగ్రీవంగా ఆమోదించిన కనీస వేతనాలను నిర్ణయించే పద్ధతి, రెక్టోపస్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును ప్రభుత్వం భూస్థాపితం చేసింది.
ఫ్లోర్ వేజ్ పేరుతో రోజుకు కూలి రూ 178 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇది కార్మికులను అవమానాల పాలు చేయడమే.
ప్రభుత్వ రంగ పరిశ్రమలను విచ్చలవిడిగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నది. ప్రజాధనంతో నిర్మితమైన రైల్వే, విద్యుత్తు, గ్యాస్ పైప్ లైన్లు, విమానాశ్రయాలు, ఓడ రేవులు, క్రీడా ప్రాంగణాలులాంటి మౌలిక సదుపాయాలన్నింటిని “నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్”(NMP)పేర కార్పొరేట్ సంస్థల పరం చేస్తున్నారు. రైతులకు ఉరి తాళ్లులాంటి మూడు చట్టాలను చేసింది.
అయితే రైతాంగం ఐక్యతతో వీరోచితంగా పోరాటం, 750 మంది రైతుల ప్రాణ త్యాగం అనంతరం ప్రభుత్వం ఆ చట్టాలను ఉపసంహరించుకుంది.
ఓ జుమ్లాలా మారిన మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ నినాాదాలు..
అయినా కుక్కతోక వంకరలాగా రకరకాల పద్ధతుల్లో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నది. తాను హామీ ఇచ్చిన డాక్టర్ స్వామినాథన్ ఫార్ములా ప్రకారం కనీసం మద్దతు ధర అన్ని పంటలకు నిర్ణయించడానికి అంగీకరించడం లేదు. రైతుల ఆత్మహత్యలను మరింతగా ప్రోత్సహిస్తున్నది.
వామపక్ష పార్టీల మద్దతుతో ఏర్పడిన యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్-1 ప్రభుత్వం రాజ్యాంగంలో చెప్పినట్లు అందరికీ ఉపాధిని చట్టబద్ధం చేస్తూ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి చట్టం చేసింది.
నేటి ప్రభుత్వం దాని పేరు మార్చడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ నిధులను భారీగా కోత పెట్టి ఆ భారాన్ని రాష్ట్రాలపై రుద్దింది. ఆ కార్మికులకు పని గ్యారంటీ లేకుండా చేసింది.
నూతన విద్య విధానం పేరుతో దళిత, గిరిజన, బలహీన వర్గాల పిల్లలను ఉన్నత చదువులకు దూరం చేసి నోట్లో మట్టి కొట్టింది. “చదువుకోవడం పోయి చదువు కొనుక్కోవడం” గా మార్చి వేసింది.
కేంద్ర ప్రభుత్వం, దాని అధీనంలోని వివిధ సంస్థలలో లక్షలాది ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకుండా ఆ ఖాళీలను రద్దు చేస్తున్నది. నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి కల్పిస్తానని చేసిన వాగ్దానాన్ని వమ్ము చేసింది. పైగా పకోడీలు అమ్ముకోవడం ఉపాధి అని అవమానకరంగా నిర్వచనం చెప్పింది.
మహిళా ఉద్ధరణ, బేటీ బచావో- బేటి పడావో అనే తన నినాదాన్ని ఓ జుమ్లాలా చేసింది. మహిళా రెజ్జర్లపై ఆ సంస్థ అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు, అయిన బీజేపీ నేత లైంగిక వేధింపులకు పాల్పడ్డా నేటికి ఎలాంటి చర్య లేదు.
గృహహింసలు, బాలికలపై అత్యాచారాలు రోజువారి ఘటనలుగా మారాయి.
ప్రజలపై విపరీతంగా భారాలు
ఇందు కలడందు లేడన్న సందేహంబు వలదు అన్నట్లుగా నేటి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అన్ని తరగతుల ప్రజలపై విపరీతంగా భారాలు మోపి నడ్డి విరుస్తున్నది. అసమ్మతి వ్యక్తం చేయడాన్ని నేరపూరితచర్యగా చేసింది.
వాస్తవాలను ప్రజలకు తెలియజేసే మీడియా సంస్థలు భారతదేశానికి నాలుగవ పిల్లర్‌గా ఉండేది. ఇప్పుడు తన భజన సంస్థలుగా మార్చుకుంది. వాస్తవాలను ప్రజలకు అందిస్తున్న కొన్ని సోషల్ మీడియా, నెట్ ఆధారిత మీడియాలపై తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది.
న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని నీరు గారుస్తున్నది. ఉన్నత విద్య, పరిశోధన సంస్థలలో పనిచేస్తున్న ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలపై నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నది.
కొన్న ప్రజా సంక్షేమ పథకాలకు నిధులను భారీగా కోత పెడుతున్నది. కొన్నింటిని ధరల పెరుగుదలకు అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు చేయడం లేదు.
అందుకే కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపుకు అన్ని తరగతుల ప్రజా సంఘాలు, ప్రత్యక్షంగా పరోక్షంగా పెద్ద ఎత్తున మద్దతు నిచ్చాయి.
తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే అనుబంధ సంఘాలు సమ్మెలో పాల్గొన్నారు. అరెస్టులు, లాఠీచార్జీలు లాంటి నిర్బంధ చర్యలు జరగలేదు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో తృణమూల్ గుండాలు కొంత దౌర్జన్యకర చర్యలకు పాల్పడ్డారు. కానీ అత్యధిక ప్రాంతాలలో అది జరగలేదు. కారణం త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు.
ఇప్పుడు నిర్బంధం విధిస్తే తమకు ఓట్లు పడవేమోనని, బీజేపీ అధికారానికి వస్తుందేమోననే భయంతో తృణమూల్ ప్రభుత్వం నిర్బంధ చర్యలకు పూనుకోలేదు.
కర్ణాటకలో ప్రదర్శనకు, మైకులకు అనుమతి ఇవ్వలేదని తెలిసింది.
తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులు బహిరంగానే సమ్మెలో క్రియాశీలకంగా పాల్గొన్నాయి.
“అంతం కాదు-ఇది ఆరంభం మాత్రమే” అని కార్మిక సంఘాలు ప్రకటించాయి. లేబర్ కోడ్ల రద్దుతో సహా ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వం ఉపసంహరించుకోక పోతే రానున్న కాలంలో ఉద్యమాలను మరింత తీవ్రతరం చేయాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.
సమ్మెలో పాల్గొన్న వారికి, ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు తెలిపిన అందరికీ ప్రత్యేకంగా అభినందనలను, ధన్యవాదాలను కార్మిక సంఘాలు తెలియజేశాయి. రానున్న కాలంలో జరగబోయే ఉన్నత స్థాయి ఉద్యమాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
