
ఆయన ఉద్యమపు అడుగుల
అగ్నిశిఖల ధగధగలు
దశాబ్దాల వివక్షత అసమానతలపై
అలుపెరగని ప్రకంపనాలనే సృష్టించాయి..
ఆయన ఆలోచనల అభ్యుదయపు
విప్లవాలు నాలుగు కోట్ల తెలంగాణ
ప్రజల ప్రత్యేక రాష్ట్రపు ఉషోదయపు
కిరణాలై ప్రభవించాయి..
ఆయన ఆశయాల విద్యాసంద్రాలు
అమాయకుల అజ్ఞానంపై
పాలకుల అరాచకంపై గట్టిగానే జ్ఞానపు
ప్రశ్నల అలల శబ్దాలతో గర్జించాయి
మార్పును సూచించాయి
పేదప్రజల బ్రతుకుల పాలిట ఆయన
స్వప్నాలు మన స్వరాష్ట్రంలో సంక్షేమ
పథకాలై వారి పెదాలపై చిరునవ్వుల
వెన్నెల దీపాలు కురిపిస్తున్నాయి..
అహింసా మార్గంలో
మానవీయ కోణంలో సాగిన ఆయన
జీవన మహాప్రస్థానపు అక్షరాల ప్రవాహాలు
భారతీయ భవిష్యత్తుకు దిశానిర్దేశపు
బాటలుగా మారుతున్నాయి..
తెలంగానం ఆయన నడవడిక
వ్యక్తిత్వపు జీవన రాగం
జై తెలంగాణ నినాదమే
ఆయన గుండె పలికిన ప్రాణపు సంతకం
(ప్రొఫేసర్ జయశంకర్ జయంతి సందర్భంగా)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.