అయిదు రూపాయల భోజనం నిజానికి అయిదు రూపాయలది కాదు.
ప్రతి భోజనానికి, తినే వాళ్లు తమ జేబు నుంచి 5 రూపాయలిస్తుంటే, దానికి ప్రభుత్వం మరో రూ 24.83 సబ్సిడీ చెల్లిస్తోంది.
అంటే, ప్రతి మీల్‌కు రూ 29.83(దాదాపు ముఫ్ఫై రూపాయలు) ఖర్చవుతోంది.
టిఫిన్ విషయంలోనూ అంతే- తినే వాళ్లు రూ 5 చెల్లిస్తుంటే ప్రభుత్వం దానికి మరో రూ 14 సబ్సిడీగా చెల్లిస్తోంది.
అంటే, ఒక్క టిఫిన్‌కు రూ 19 వ్యయమవుతున్నట్టు లెక్క. బయట ఇరవై రూపాయలకు మంచి రుచికరమైన టిఫిన్ పెట్టేవాళ్లున్నారు.
హైదరాబాద్ నగరంలో అనేక చోట్ల బండ్ల మీద, టీవీఎస్, సైకిళ్లపైన వచ్చి రోడ్డుపక్కన టిఫిన్లు అందించే వారు రకరకాల ఐటమ్స్ రూ 20కే ఇస్తున్న సందర్భాలు బోలెడుంటున్నాయి. కానీ, ఇందిరమ్మ క్యాంటీన్లలో ఇచ్చే ఆహారం రుచి మాత్రమే కాదు, ఏ ప్రమాణాలతో చూసినా నాణ్యతే ఉండట్లేదు.
భోజనంతో పోల్చి చూస్తే ‘టిఫిన్ కాస్త నయం’ అనే మాట ఒకటుంది.
అందులోనూ, రాగి ఇడ్లీ, రాగి ఉప్మా, మిల్లెట్ టిఫిన్ అని చెప్పారు. మెనూలోనూ పేర్కొన్నారు. కానీ, ఎక్కడా అవి ఇవ్వట్లేదు. మెనూను పాటించడమే లేదు. ఏ రోజు, ఏ ఐటమ్ వస్తుందో డబ్బాలు విప్పి చూస్తే కాని తెలియదు. వచ్చింది తినాల్సిందే! పూరి ఉన్నపుడు కాస్త ఎక్కువ మంది తింటున్నారు.
ఆ తర్వాత బోండాను, అటుపైన పొంగల్‌ను ఇష్టపడుతున్నారు. కొంతమంది తగినంత డబ్బు చెల్లించి టిఫిన్లను బాక్స్‌ల్లో తీసుకుపోతున్నారు.
ఇందిరమ్మ క్యాంటీన్లలో భోజనం విషయంలో ‘బగారా రైస్’ ఉండే గురువారం నాడు కొంచెం ఎక్కువ మంది వస్తుంటారు.
కొందరు రూ 5 ఇచ్చి అన్నం వరకు తీసుకుపోయి, బయట కర్రీలు కొనుక్కొని తిని సరిపెట్టుకుంటున్నారు.
‘అయిదు రూపాయలే ఎందుకు? కావాలంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకొని అయినా ఆహారం నాణ్యత పెంచండి, మంచి భోజనం పెట్టండి’ అని అత్యధికులు అడుగుతున్నారు.
టిఫిన్ అయినా, భోజనమయినా- ఈ మొత్తం వ్యవస్థ నిర్వహణకు పెద్ద మొత్తంలోనే ప్రజాధనం వ్యయమౌతోంది.
సర్కారు అధికారిక లెక్కల ప్రకారం చూసినా ఇప్పటివరకు ఈ పథకానికి రూ 253.87 కోట్లు వ్యయమైంది.
అన్ని సెంటర్లలో కలిసి, రోజూ సగటున 30 వేల మంది లంచ్ చేస్తున్నారని సర్కారు లెక్కలు.
తాజా గణాంకాల ప్రకారం ఏటా రూ 40 కోట్లు(సుమారుగా టిఫిన్‌కు 13 కోట్లు, లంచ్‌కు 27 కోట్లు) ఖర్చవుతోంది. ఇదంతా జీహెచ్ఎంసీ భరిస్తోంది.
సర్వేలో తేలిన ఆశ్చర్యకరమైన విషయమేమంటే, తింటున్న వారిలో 80 శాతం మందికి ప్రభుత్వం ప్రతి మీల్స్‌కి, టిఫిన్‌కి పెద్దమొత్తంలో సబ్సిడీ ఇస్తున్న సంగతే తెలియదు. తామిచ్చే అయిదు రూపాయలే లెక్క అన్న భావన వారిలో ఉంది.
నిఘా-నియంత్రణ నిల్.. నిర్వహణ డల్..
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఇందిరమ్మ క్యాంటీన్ల నిర్వహణ మొత్తం వ్యయాన్ని భరిస్తున్నప్పటికీ, వారికీ వ్యవస్థ నిర్వహణ మీద శ్రద్ధే లేదు.
నిఘాలు లేవు, నియంత్రణ లేదు, ఎటువంటి తనిఖీలు కూడా నిర్వహించడం లేదు. సచివాలయానికి, జీహెచ్ఎంసీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఇందిరమ్మ క్యాంటీన్ల తనిఖీకి కూడా ఏ ఒక్క అధికారీ వెళ్లరు.
ఫుడ్ ఇన్స్పెక్టర్లు ప్రైవేటు హోటళ్లు, ఫుడ్ సెంటర్లలో ఆహారం నాణ్యత తనిఖీలు జరిపినట్టు అప్పుడప్పుడు వార్తలు వస్తుంటాయి, మరి ఇందిరమ్మ క్యాంటీన్ల తనిఖీ ఎందుకు చేయరనే ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. జీహెచ్ఎంసీ వారు తనిఖీకే రారని 95 శాతం మంది చెప్పారు.
ఆహారం వండి, సరఫరా చేస్తున్న ‘హెచ్‌కేఎం’ వాళ్లు అప్పుడప్పుడు క్యాంటీన్ల తనిఖీలకు వస్తున్నారు. కానీ, అదీ నామమాత్రమే! దాంతో, క్యాంటీన్ల నిర్వహణ అద్వాన్నంగా ఉంటోంది. సమయపాలన ఎక్కడా ఉండదు.
టిఫిన్ ఉదయం 7 గంటల నుంచి 9.30 గంటల వరకు; లంచ్ మధ్యాహ్నం 12 గంటల నుంచి 2.30 గంటల మధ్య అందించాలి. కానీ, సమయపాలన నిల్! నాలుగో వంతు చోట్ల మాత్రమే ఈ స్పృహ ఉంటోంది తప్ప మిగతా చోట్ల ఎవరూ పట్టించుకోవడం లేదు.
ఈ వ్యవస్థ నిర్వహణలో భాగంగా వారు నియమించిన కాంట్రాక్టర్లు గానీ, క్యాంటీన్లలో పనిచేసే సిబ్బందికి గానీ శిక్షణ లేదు.
క్రమశిక్షణ లేదు. కొన్ని సెంటర్లలో వారి ప్రవర్తన గౌరవప్రదంగా ఉండదు. మరికొన్ని చోట్ల శుచి-శుభ్రత కూడా అంతంతే! యూనిఫామ్ నిబంధన లేకపోవడంతో ఎవరి ఇష్టం వచ్చినట్టు వారుంటున్నారు.
‘బట్టలు సరిగా ఉండవు, స్నానాలయినా చేస్తారో చేయరో? వాసన వస్తుంటుంది, ఆహారం పెట్టేప్పుడు నిమిషాలు కూడా వారి పక్కన నిలవలేకపోతాం’ అన్న ఒక నడివయస్కుని మాటలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి.
భోజనాలు పెట్టేవాళ్లు కనీస శుభ్రత పాటించకపోవడంతో తినడానికి వచ్చేవాళ్లు ఎంతో ఇబ్బంది ఫీలవుతుంటారు. మహిళలు సిబ్బందిగా ఉన్న చోట కొంత నయం.
పీపుల్స్‌పల్స్ సర్వే బృందం వెళ్లినపుడు, సదరు క్యాంటీన్ వాళ్లు మరో క్యాంటీన్ వాళ్లను అప్రమత్తం చేసిన సందర్భాల్లో వాళ్లు తమ పరిసరాలను క్లీన్‌గా ఉంచుకోవడానికి ప్రయత్నించేది.
అప్పటికప్పుడు కొన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టేది.
నిజంగా, బాధ్యులైన అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ ఉంటే అంతటా పరిస్థితులు తప్పనిసరిగా మెరుగయి ఉండేవని ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది.
మ్యాన్‌పవర్ సరఫరా చేసే కాంట్రాక్టర్లు సిబ్బంది ఒక్కరీతి జీతాలివ్వకపోవడం, అదీ సకాలంలో ఇవ్వకపోవడం వంటివి వారి పనితీరును ప్రభావితం చేస్తున్నాయి.
సిబ్బంది ఒక్కొక్కరికి నెలకు అయిదు వేలు, నాలుగు వేలు, మూడు వేల రూపాయలు, కొందరికి అమ్ముడుపోయే టిఫిన్, భోజనం యూనిట్లను బట్టి కమిషన్ రూపంలో ఇవ్వటం; ఏ లెక్కా-పత్రం లేకుండా జరుగుతోంది. ఆ కమిషన్ కూడా 2014 నుంచి స్థిరంగా ఉందని, పెంచనే లేదని వారు వాపోతున్నారు.
గిట్టుబాటు కాని వాళ్లు, సకాలంలో జీతం పడని వారు, ఇతరులతో పోల్చి చూస్తే తమకు తక్కువ వస్తోందనుకునే వారు; క్యాంటీన్ సిబ్బందిలో అత్యధికులు ఇలా నిత్యం అసంతృప్తితో పనిచేస్తున్నారు. అలా వారు తమ విధులకు సరైన న్యాయం చేయలేకపోతున్నారు.
ఈ అసమానతల్ని, తప్పిదాల్ని దిద్దుబాటు చేసేవారే లేరు. దీనిపై పెక్కు ఆరోపణలున్నాయి. ఒక్కో క్యాంటీన్‌కి ఎంత ఫుడ్ వస్తోంది? ఎంత మంది వచ్చి తింటున్నారు? ఎంత మిగులుతోంది? వెనక్కి పంపితే ఆ లెక్కలు-ఖర్చులేంటి? ఎవరు భరిస్తారు? ఎంత తరుగుతో అదనపు ఆహారం అవసరమవుతోంది? వీటికి లెక్కలే లేవు. ఎవరూ లెడ్జర్లు నిర్వహించరు. అసలు వారిని లెక్కలడిగే నాథుడే లేరు అన్నట్టుంది పరిస్థితి!
ఎవరికీ పట్టని వైనం.. అందుకే ఈ దైన్యం..
‘తిలా పాపం తలా పిడికెడు’ అన్న సామెత చందంగా, అయిదేసి రూపాయలకే టిఫిన్, భోజనం పెట్టే ఇందిరా క్యాంటీన్ల వ్యవస్థ సంపూర్ణ వైఫల్యంలో సంబంధీకులందరి పాత్రా ఉంది.
పేదల సంక్షేమం కోసం ఉదాత్త లక్ష్యంతో సబ్సిడీ భోజన పథకం చేపట్టిన ప్రభుత్వం ఈ వ్యవస్థ నడుస్తున్న తీరు-తెన్నులపైన, సాధకబాధకాలపైనా సమీక్షలే జరుపటం లేదు.
నివేదికలు లేవు. విధాన పత్రమే కాదు, సరైన నిర్వహణా రికార్డులు, లాగ్ బుక్స్ లేకున్నా యేటా నిధుల్ని మాత్రం విడుదల చేస్తోంది.
తన బడ్జెట్ నుంచి నిధులు వెచ్చించే హైదరాబాద్ మహానగర పాలకసంస్థ ఈ వ్యవస్థ పనితీరుపైన ఎటువంటి నిఘా, నియంత్రణ, తనిఖీలు ఏవీ నిర్వహించకపోవడం ఒక పెద్ద లోపంగా కనిపిస్తోంది. వారి నెలవారీ సమావేశాల్లోనూ ఇది చర్చకు రాదు.
జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య విభాగాన్ని క్యాంటీన్లతో అనుసంధానించి శుచి-శుభ్రత విషయంలో చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండీ వారు చేస్తున్నదీ లేదు.
నగరంలోని ఆరాంఘర్, ఎల్బీనగర్, హయత్‌నగర్ వంటి ప్రాంతాల్లోని క్యాంటీన్ల వద్ద టిఫిన్ కో, భోజనానికో వచ్చిన వారు ఏపీలో ఇటువంటి వ్యవస్థతో ఇక్కడి పరిస్థితుల్ని పోల్చి చేసిన వ్యాఖ్యలు దారుణాల్ని ఎత్తిచూపుతాయి.
“రెండు చోట్లా తాము తిని చూశామని, అక్కడి ‘అన్నా క్యాంటీన్లు’ ఇక్కడి ‘ఇందిరా క్యాంటీన్ల’ కన్నా వేయిరెట్లు నయమని వారు వ్యాఖ్యానించారు.
క్యాంటీన్లు, నిర్వహణ, పరిసరాలు, పరిశుభ్రత, ఆహారం, నాణ్యత- ఇలా ఏ అంశం పరంగా చూసినా అవి ఎన్నో రెట్లు గొప్పగా ఉన్నాయని వారు అభిప్రాయపడ్డారు.
సెంటర్ల ఏర్పాట్లలో, వాటిల్లో అందుబాటులో ఉంచే ఆహారం విషయంలో కూడా హేతుబద్ధత లేదు.
సిటీ సెంట్రల్ లైబ్రరీ, రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం వంటి నిరుద్యోగ యువత ప్రధానంగా వస్తుండే క్యాంటీన్లలో బ్రేక్‌ఫాస్ట్ సదుపాయం లేదు. తర్వాతయినా ఆలోచించి విస్తరించి ఉండాల్సిందనే అభిప్రాయం వ్యక్తమైంది.
ఈ మొత్తం ప్రక్రియలో సకాలంలో ఆహారం క్యాంటీన్లకు చేరుతుందా? ఆహారం వేడిగానే సర్వ్ చేస్తున్నారా? పరిమాణం సరిగా ఉంటుందా? లేదా? ఇవేవీ ఎవరికీ పట్టడం లేదు. జీహెచ్ఎంసీయే కాకుండా ‘హెచ్‌కేఎం’ వారు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు.
కాంట్రాక్టర్లు, సిబ్బంది కూడా ఏదో అసంతృప్తితో కొంత, అలసత్వంతో కొంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తుండటం సేవల వైఫల్యానికి కారణమవుతోంది.
దేశంలోని పలు రాష్ట్రాల్లో కొంచెం అటుఇటుగా ఇలాంటి సబ్సిడీ భోజన పథకాలు అమలవుతున్న చోట వారు స్థానిక డ్వాక్రా గ్రూపులకో, అంగన్వాడీలకో, మహిళా సంఘాలవారికో అప్పగించి నిర్వహిస్తున్నారు. దాంతో నాణ్యత, నిర్వహణ మెరుగ్గా ఉన్నట్టు వార్తలున్నాయి.
ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రజాధనంతో నడిచే ప్రజాహిత కార్యక్రమమే అయినప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా కార్పొరేటర్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. తమకు సంబంధమే లేని వ్యవహారంగా పరిగణిస్తున్నారు.
ప్రారంభోత్సవానికి వచ్చినపుడు రిబ్బన్ కట్ చేసి, ఫోటోదిగి వెళ్లిపోవటం తప్ప ఒక ముద్ద ఆహారం తిన్నది కూడా లేదు.
ఒకటి రెండు చోట్ల, ప్రారంభోత్సవమప్పుడు ‘ఇవాళ వచ్చిన వారందరికీ, మేం డబ్బులిస్తాం, మన భోజనం ఏర్పాటు చేయండ’ని చెప్పి తినిపించారే తప్ప ఆ డబ్బులు కూడా చెల్లించలేదనే విమర్శలున్నాయి. ఇదీ కొందరు స్థానిక నేతల పరిస్థితి!
బాగుచేస్తే తప్ప ప్రయోజనం లేదు..
పేదలకు నామమాత్రంగా 5 రూపాయలకే భోజనం పేరిట పెద్ద ఎత్తున ప్రజాధనం వ్యయమవుతోంది.
ఇదంతా కాయకష్టం చేసే పన్ను చెల్లింపుదారుల నుంచి (ప్రత్యక్ష-పరోక్ష పద్ధతుల్లో) వసూలు చేసిన సొమ్ము! కానీ, దానికి తగిన న్యాయం జరగటం లేదు.
ఖర్చు చేస్తున్న స్థాయి ప్రయోజనం నెరవేరటం లేదు. నిర్వాహకుల్లో నిర్లక్ష్యం తారాస్థాయిలో ఉంటే, తినేవారిలో సంతృప్తిస్థాయి అట్టడుగున ఉంది.
ఒక నిర్దిష్ట విధాన పత్రమే లేకుండా మొదలైన ఈ పథకం, ఒకప్పుడు ‘అన్నపూర్ణ’ ఇప్పుడు ‘ఇందిరమ్మ’ పేరిట క్యాంటీన్లు నిర్వహిస్తున్న ఈ వ్యవస్థపై ఏ స్థాయిలోనూ సమీక్షలు జరుగవు. ప్రజాభిప్రాయ (తినే వారి మనోగతం) సేకరణ లేదు. దిద్దుబాటు చర్యలుండవు. పాలకుల దృష్టిపడదు. మీడియా చూపు ఆనదు.
ప్రజాధనానికి ట్రస్టీలుగా ఉండాల్సిన ప్రభుత్వాలు తామే సంపూర్ణ యజమానులయినట్టు, ఇష్టానుసారం వ్యవహరించడమే తప్ప బాధ్యత-జవాబుదారితనంతో ఉన్నట్టు ఎక్కడా కనిపించదు.
దాతలెవరైనా ముందుకొస్తే వారిచ్చే సొమ్ముతో ఈ కార్యక్రమాన్ని మరింత మెరుగుపరచే ఆలోచన కూడా కనిపించదు.
కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్సార్) కింద కంపెనీలిచ్చే సొమ్ము సహకారంలో కొన్ని చోట్ల ఒకటి, రెండు రూపాయలకు కూడా ఇంతకన్నా మెరుగైన భోజనం అందిస్తున్న సంఘటనలున్నాయి. ఇక్కడ, ఇవేవీ పాలకులకు పట్టడం లేదు.
ఇందిరమ్మ క్యాంటీన్ల వ్యవస్థ-పనితీరును ప్రత్యక్షంగా గమనించి, అక్కడి లోపాలు, వైఫల్యాలను పరిశీలించి, భాగస్వాములైన అందరితో మాట్లాడి, వారి నుంచి సేకరించిన అభిప్రాయాలు-సూచనల ప్రకారం ‘ఏం చేస్తే బాగుంటుంది?’ అనే కోణంలో పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ కొన్ని సిఫారసులు చేస్తోంది.
సిఫారసులు..
1. ‘ఇందిరమ్మ క్యాంటీన్ల’ సబ్సిడీ భోజన పథకాన్ని సమూలంగా మారుస్తూ, ఒక విధాన పత్రం-నిర్దిష్ట విధివిధానాలు, పథకంలో భాగస్వాములయ్యే వారి విధులు-బాధ్యతల్ని నిర్దేశిస్తూ పునఃప్రారంభించడం మంచిది.
2. ఆహారం రుచి, నాణ్యత, పోషకాలు భారత ఆహార భద్రత – ప్రమాణాల ప్రాధికార సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) ప్రమాణాల మేరకు ఉండేలా చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్‌లో ఉన్న జాతీయ పౌష్టికాహార సంస్థ(ఎన్ఐఎన్)తో సంప్రదించి ఏ రోజు, ఏ పూట, ఏ రకమైన ఆహారం ఎంత పరిమాణంలో ఇవ్వాలో ‘మెనూ’ ఖరారు చేయాలి.
3. లక్షల రూపాయలు ఖర్చు చేసి రూపొందించిన ‘కంటెయినర్’లోని అన్ని సదుపాయాలు సవ్యంగా పనిచేసే విధంగా, తగు రిపేర్లతో వెంటనే చర్యలు తీసుకోవాలి. అవన్నీ పూర్తిస్థాయిలో పనిచేసేలా చూడాలి. ప్రతి క్యాంటీన్ నిర్వహణను కంటెయినర్లోకి మార్చాలి. ప్రతి చోట సీసీ కెమెరాలుండాలి. ఫిర్యాదు బాక్స్‌లు, టోల్‌ఫ్రీ నంబర్ స్పష్టంగా కనిపించే చోట ఏర్పాటు చేయాలి.
4. నగరంలో, శివారుల్లో (గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో)ని వివిధ చోట్ల క్యాంటీన్లు ఏర్పాటు చేసిన సెంటర్లను పునఃసమీక్ష చేసి- అవసరమైన, అందరికీ అనువైన చోట్ల వాటిని ఏర్పాటు చేసేలా చర్యలుండాలి.
5. ఆహారం తయారీ, పంపిణీ, క్యాంటీన్ల నిర్వహణను ముందు ప్రయోగాత్మకంగా(పైలట్ ప్రాజెక్ట్) కొన్ని చోట్ల ‘సెల్ఫ్ హెల్ప్ గ్రూప్’లకు ఇచ్చి, అవి విజయవంతం అవడాన్ని బట్టి ఇతర ప్రాంతాలకు విస్తరించాలి.
6. క్యాంటీన్లలో శుచి-శుభ్రతను పెంచి, ప్రమాణీకరించాలి. అక్కడ సిబ్బందిని పెంచాలి. వారికి తగిన శిక్షణ, డ్రెస్‌కోడ్, కనీస వేతనాలు లభించేలా తగు చర్యలు తీసుకోవాలి.
7. ఇందిరమ్మ క్యాంటీన్ల ఆహారసలహా సంఘాన్ని ఏర్పాటు చేసి, నెలలో కనీసం రెండుసార్లు(పక్షానికోసారైనా) సమీక్షా సమావేశం జరిపించాలి. ప్రతి సమావేశంలోనూ అంతకు ముందరి సమావేశ నిర్ణయాలపై చర్యల నివేదిక ఉండాలి. తక్కువ కాల వ్యవధితో నిరంతరం క్యాంటీన్ల తనిఖీలు ఉండేలా చూసుకోవాలి.
8. మంత్రుల నుంచి కార్పొరేటర్ల వరకు ప్రజాప్రతినిధులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, స్వయంగా వారక్కడ టిఫిన్/భోజనం చేయాలి. వారి దృష్టికి వచ్చిన అంశాలను వెంటనే ఆహార సలహాసంఘంకు తెలియజేయాలి. దానికి అనుగుణంగా తగు చర్యలకు సలహాసంఘం అవసరమైన సిఫారసులు అధికారులకు చేసి, అవి కచ్చితంగా అమలయ్యేట్టు చూడాలి.
9. పన్నెండేళ్లుగా నిర్వహిస్తున్న ఈ సబ్సిడీ భోజన పథకంపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారితో సమగ్ర సమీక్ష జరిపించి, రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి.
10. ‘ఆకలి’ లేని వ్యవస్థ కోసం, నిరుపేదలకు నామమాత్రపు ఖర్చు(రూ 5ల)కే టిఫిన్/భోజనం అందించే గొప్ప ఆశయంతో చేపట్టిన ఈ పథకం మంచి-చెడులను, విజయ-వైఫల్యాలను, సాధకబాధకాలను సంపూర్ణంగా తెలుసుకొని, తగు సవరణలతో తిరిగి చేపట్టడానికి వీలుగా ఒక లోతైన, సమగ్రమైన సర్వేను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలి. ఇందుకోసం ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.

